ఓ హత్యాకాండ నుండి గుణపాఠాలు -ది హిందు ఎడ్


Philibhit fake encounter

Philibhit fake encounter

[Lessons from a massacre -The Hindu, April 6, 2016- కు యధాతధ అనువాదం.]

*********

అన్ని కేసుల్లోనూ ‘ఆలస్యంగా చేకూరిన న్యాయం’ను ‘నిరాకరించబడిన న్యాయం’తో సమానం చేసి చెప్పలేము. ఆలస్యంగా జరిగే దోష నిర్ధారణ సైతం “శిక్ష నుండి శాశ్వతంగా రక్షణ పొందడం” లాంటిది ఏమీ ఉండదన్న సందేశాన్ని పంపే సందర్భాలు కొన్ని ఉండవచ్చు. సాయుధ టెర్రరిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్ పేరుతో అత్యంత క్రూరమైన హత్యాకాండలో పాల్గొన్న 47 మంది పోలీసులకు జీవిత ఖైదు విధిస్తూ లక్నో లోని సి‌బి‌ఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు అలాంటి సందర్భాల్లో ఒకటి. ఈ తీర్పు ద్వారా ఒక మేరకు జవాబుదారీతనం నిర్ధారించబడింది. చట్టం నేరగాళ్లను పట్టుకోగలిగింది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ కు 125 కి.మీ దూరంలో సిక్కు యాత్రీకులతో నిండిన బస్సును జులై 12, 1991 తేదీన పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో ఉన్న పురుషులు అందరినీ ఒక వ్యాన్ లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు ఆ పురుషులందరూ టెర్రరిస్టులనీ, వారిలో 10 మంది అదే రాత్రి అడవిలో వివిధ చోట్ల జరిగిన ఎన్ కౌంటర్ కాల్పులలో చనిపోయారని ప్రకటించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సి‌బి‌ఐ) ఎన్ కౌంటర్ పై పరిశోధన నిర్వహించింది. మృతులంతా బూటకపు ఎన్ కౌంటర్ లలో కాల్చి చంపబడ్డారని సి‌బి‌ఐ నిర్ధారించింది.

కేంద్ర ఏజన్సీ (సి‌బి‌ఐ) 57 మంది నిందితులపై అభియోగాలు మోపింది. కానీ వారిలో 10 మంది విచారణ కాలంలో చనిపోయారు. ఆ సమయంలో పంజాబ్ లో మిలిటెన్సీ ఉన్నత స్ధాయిలో ఉన్నత స్ధాయిలో ఉన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవడం సముచితం. పంజాబ్ నుండి ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతానికి మిలిటెన్సీ ఒలికి పడిందని ఆనాడు భయాలు వ్యక్తం చేశారు. పంజాబ్ కి చెందిన కొందరు మిలిటెంట్లు తెరాయ్ లో కూడా చురుకుగా ఉన్నారని ఇరు రాష్ట్రాల పోలీసులు అనుమానించారు. సిక్కులు గణనీయ సంఖ్యలో నివసించే ఫిలిబిత్ జిల్లాను ఓ కంట కనిపెట్టుకుని ఉండేవారు. టెర్రరిస్టులుగా అనుమానించినవారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించదగిన ఎత్తుగడలతో మట్టు బెడుతున్నట్లుగా భావిస్తున్న దశ కూడా అది.

అప్పటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఫిలిబిత్ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులు ‘కొనియాడేందుకు’ అర్హులు అని కూడా వాదించింది. కానీ సి‌బి‌ఐ దానికి భిన్నమైన నిర్ధారణకు వచ్చింది. అయితే ఆనాటి ఉన్నత స్ధాయి పోలీసు అధికారులను, ముఖ్యంగా అప్పటి సూపర్ఇన్-టెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ డి త్రిపాఠి ని అభియోగ పత్రం నుండి తొలగించారని మానవ హక్కుల కార్యకర్తలు సి‌బి‌ఐ ని తప్పుబట్టారు.

వివిధ పోలీసు స్టేషన్ల నుండి సేకరించబడిన పోలీసులు రాత్రంతా జరిగిన ఆపరేషన్ లో పాల్గొనడం ఆ జిల్లా ఉన్నత పోలీసు అధికారికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా జరగదని అనేకమంది భావించారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అధికారులు కూడా కుట్రలో భాగం పంచుకుని ఉండవచ్చని ట్రయల్ జడ్జి సైతం గుర్తించారు. నేరంలో పాల్గొన్న వారిని విజయవంతంగా విచారించినందుకు సి‌బి‌ఐని అభినందించడం సాధ్యమే కావచ్చు గానీ వదలకుండా వెంటబడిన మృతుల బంధువులను వాస్తవానికి అభినందించాలి.

అయినప్పటికీ సుదీర్ఘమైన ఆలస్యం, ఉన్నతాధికారులను చట్టం ముందు నిలబెట్టడంలో వైఫల్యం… ఇవి రెండూ ఇలాంటి కేసుల్లోని గుణాత్మక న్యాయంపై నీలి నీడలు కమ్మడానికి దోహదపడతాయి. కల్లోలాల కాలంలో.. తమ సహోద్యోగులను పౌరులను టార్గెట్ చేసినందుకు గాను మిలిటెంట్లు లేదా తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా ప్రమోషన్లు, బహుమానాలు రాబట్టుకునేందుకు కూడా యూనిఫారంలోని ఉద్యోగులు తెగిస్తారు. జవాబుదారీతనాన్ని నిర్ధారించడం ద్వారా భద్రతా బలగాలు అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్న శిక్షలేమి సంస్కృతికి అంతం పలకవచ్చని, అలాంటి అతి చేష్టల సంఘటనలు ఇక ముగుస్తాయని ఆశించడం వరకు మాత్రమే చేయగలం.

*********

కేసును మళ్ళీ తెరిచి పునర్విచారణ చేయాలని తద్వారా ఎన్ కౌంటర్ కు బాధ్యులైన సీనియర్ పోలీసు అధికారులపై కూడా అభియోగాలు నమోదు చేయాలని ట్రయల్ జడ్జి తన 240 పేజీల తీర్పులో పేర్కొన్నారు.

“ఈ కేసు విచారించిన సి‌బి‌ఐ అధికారులు కూడా తమ సీనియర్ లకు రిపోర్ట్ చేసి వారి నుండి ఆదేశాలు తీసుకుంటారు. అటువంటి పరిస్ధితుల్లో ఈ కుట్రతో సంబంధం ఉన్న కొందరు ముఖ్యమైన వ్యక్తులను సి‌బి‌ఐ పరిశోధన నుండి మినహాయించారని అర్ధం అవుతోంది.

Wife of one of the victims (left)

Wife of one of the victims (left)

“హత్యాకాండ జరిగిన సమయంలో ఫిలిబిత్ లో విధులు నిర్వర్తించిన కొందరు సీనియర్ పోలీసు అధికారులు కూడా కుట్రలో భాగం పంచుకున్నారని నేను నిర్ధారణకు వచ్చాను. కనుక అటువంటి అధికారులపై కూడా విచారణ నిర్వహించే అంశాన్ని రాష్ట్రం ఖచ్చితంగా పరిగణించాలి” అని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.

ఎంత ఘోరం అంటే ఫిలిబిత్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు తమ్ముళ్లని పోగొట్టుకున్న ఒక అన్న కనపడకుండా పోయిన తమ్ముళ్ళ కోసం ఆ మరుసటి రోజే హుటాహుటిన భార్యతో ఫిలిబిత్ వస్తే, ఆయన్ని కూడా పోలీసులు చంపేశారు. అతని భార్య పైన ఉగ్రవాద చట్టం బనాయించి జైల్లో తోసేశారు. మూడేళ్ళ తర్వాత మాత్రమే ఆమెకు బెయిలు దొరికింది.

ఇంతటి రక్త పిపాస హత్యాకాండకు ప్రధాన కారకులు పోలీసు ఉన్నతాధికారులే. ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ముఖ్యంగా పోలీసు యంత్రాంగంలో తీవ్ర స్ధాయిలో నెలకొని ఉండే నిచ్చెన మెట్ల సబార్డినేటిజం వలన ఉన్నత స్ధాయి అధికారుల ఆజ్ఞ లేకుండా కింది స్ధాయి పోలీసులు అంత భారీ స్ధాయిలో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడడం దుస్సాధ్యం.

కానీ ఆ ఉన్నతాధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకుల ప్రయోజనాలకూ, వారు ప్రాతినిధ్యం వహించే ధనిక దోపిడి వర్గాల ప్రయోజనాలకూ కట్టుబడి పని చేసేవారే. ఒక ఉన్నత స్ధాయి పోలీసు అధికారిని పట్టుకుని శిక్షిస్తే గనక ఇక భవిష్యత్తులో ఏ సీనియర్ పోలీసు అధికారి మరియు పౌర అధికారి కూడా బూటకపు ఎన్ కౌంటర్ లకు పాల్పడాలని కింది స్ధాయి పోలీసులకు ఆదేశాలు ఇవ్వరు.

ఇది పాలకవర్గాలకు పెను ప్రమాదంగా పరిణమిస్తుంది. అందుకే బూటకపు ఎన్ కౌంటర్ ఆదేశాలకు పై కొసలో నిలబడి ఉండే అధికారులు ఎప్పుడూ కోర్టు విచారణ పరిధిలోకి రారు. తద్వారా భవిష్యత్తులో కూడా అవసరం ఐనప్పుడు బూటకపు ఎన్ కౌంటర్ లు జరపడానికి అవకాశాలను పాలకులు అట్టే పెట్టుకుంటారు. కాబట్టి ది హిందు సంపాదకీయం చివర్లో అనాసక్తంగా వ్యక్తం చేసిన ఆశలు నెరవేరే అవకాశం లేనే లేదు.

One thought on “ఓ హత్యాకాండ నుండి గుణపాఠాలు -ది హిందు ఎడ్

  1. సర్, ఇప్పుడీ సంపాదకీయానువాదాన్ని ఎందుకు ప్రచురించారు? ఇది ప్రధాన పత్రికలో ప్రచురించి 2 సం,, పైగా అవుతుంది.దాదాపుగా మీరు ప్రచురించే కధనాలన్నీ వర్తమానాంశాలకి సంభంధించినవైయుంటాయి, ఇటువంటి సిరియస్ అంశాన్ని ఇప్పుడు ఎందుకు ప్రచురించారో తెలియజేస్తారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s