“కంట్రోల్ టవర్ నుండి.. ‘భారత్ మాతా కీ జై’ అనకపోతే ఇండియా మీదుగా వెళ్లనివ్వరట!”
*********
‘భారత్ మాతా’ జ్వరం బిజేపి నేతలను ఇంకా వదల్లేదు.
ఎందుకు వదులుతుంది, ఎలా వదులుతుంది? ఆ జ్వరాన్ని తెచ్చుకున్న కారణమే వేరాయే!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్, యోగా వీరుడు బాబా రాందేవ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు, బిజేపి అధ్యక్షుడు అమిత్ షా… అంతే లేని జాబితా!
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న పాడు కాలం మరి!
ఒకానొక ఆర్‌ఎస్‌ఎస్ సభలో కాషాయ ధారి రామ్ దేవ్ మాట్లాడుతూ “ఈ దేశ చట్టాలు, రాజ్యాంగంను మనం గౌరవిస్తాము కాబట్టి గానీ లేనట్లయితే ఒక్కరేమిటి, వేలు, లక్షల మంది తలల్ని తెగనరికే సామర్ధ్యం మనకుంది” అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు. ఆయన మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్ సభ పేరు ‘సద్భావనా సమ్మేళన్’!
“భారత మాతకు జై కొట్టని వాళ్ళు పాకిస్తాన్ కి వెళ్లిపోవడం మంచిది” అని మహా రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించేశాడు. తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని ఆయన సిగ్గు లేకుండా మర్చిపోయాడు.
కాదు, కాదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గనకనే ఆయన జనాన్ని విభజించి జనం మధ్య వైరం రగిలించే నినాదాన్ని అందుకున్నాడు. బాధ్యతగల పదవిలో ఉన్నవారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. వాళ్ళు అలా మాట్లాడాలని జనం కూడా కోరుకుంటారు.
కానీ హిందూత్వ బిజేపి నేతలకు అటువంటి మర్యాదలు ఉండవు. అటువంటి నాజూకుతనాలు ఉండవు. జనం కోసం కనీసం నటిద్దామన్న ధ్యాసే వారికి అనవసరం.
*********
వ్యవస్ధ తీరు తెన్నుల పట్లా, వాటి వల్ల తమ జీవితాలు సజావుగా సాగకపోవడం పట్లా సాధారణ జనానికి నిరంతరం అసంతృప్తి రగులుతూ ఉంటుంది. కానీ దానిని ఎవరిపై వ్యక్తం చేయాలో వారికి తెలియదు. ఆ క్రమంలో ఇంట్లో పిల్లల పైనా, భార్య పైనా, గేటు ముందు నిలబడే బిచ్చగాడి పైనా, ఆఫీసులో అటెండర్ పైనా… ఇలా ఎవరు బలహీనంగా కనపడితే వారి పైన చిరాకు, కోపం, అరుపు, దూషణలు ఏది అందితే అది రువ్వి తమ అసంతృప్తిని చల్లార్చుకుంటూ ఉంటారు.
ఇదంతా వారికి తెలిసి జరగవచ్చు, తెలియకా జరగవచ్చు.
కానీ తమ కంటే కిందివారు, బలహీనులు ఎవరూ లేకపోతే? నిజానికి దేశంలో అలాంటి వారే ఎక్కువ. సమస్యలకు పరిష్కారం కానరాక, ఆగ్రాహావేశాలు ఎవరి మీదా కక్కలేకా, తమలో తాము అణచిపెట్టుకుని ఉన్నవారు కుల, మత, లింగ, ప్రాంతాలకు సంబంధించిన భావోద్వేగాల మధ్య చీలి ఉన్నారు. తమ అసంతృప్తిని ఆగ్రహంగా వెళ్లగక్కే అవకాశం ఏ రూపంలో దక్కినా వారు దానిని అందిపుచ్చుకుంటారు.
అలాంటి అసంతృప్తిని సరైన దారికి మళ్లిస్తే ప్రజలకు ఉపయోగకరమైన ఉద్యమాలు పుడతాయి. వారి సమస్యల పరిష్కారం దిశలో ఏదో ఒక చిన్న అడుగైనా పడుతుంది.
కానీ అదే అసంతృప్తి జనాన్ని విభజించి లబ్ది పొందే వాళ్ళ చేతుల్లో పడితే? జనంలో అక్కరలేని భావోద్వేగాలు రగులుతాయి. తమవి కాని సమస్యలు నెత్తిపైకి వచ్చి కూర్చుంటాయి. అర్జెంటుగా తేల్చిపారేయాల్సినవిగా కనపడే ప్రశ్నలు కళ్ల ముందు నిలబడతాయి.
భారత మాత, వివిధ మతాల వివిధ దేవుళ్ళు, ఆవు, భారత మాత నుదుటి బొట్టు కాశ్మీరు… ఈ సమస్యలన్నీ అలాంటివే. సాధారణ జనంలో పేరుకు పోయి ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కడానికి ఇవన్నీ ఇప్పుడు వేదికలుగా అవతరించాయి. కాదు, పనిగట్టుకుని ఆ వేదికలను నిర్మించిపెట్టారు.
ఇప్పుడు ఆ వేదికల పైన అందరికీ ప్రవేశం ఉన్నది. పైగా వారికి చట్టాల నుండి రక్షణ ఉంటుందని భరోసా ఇవ్వబడుతోంది. నిత్యజీవితం లోని వివిధ అసంతృప్తుల నుండి జనించిన ఎలాంటి ఆగ్రహాన్నైనా హిందూత్వ కాలవ లోకి మళ్లించి చిత్తం వచ్చినట్లు అరిచి, చిందులు వేసి, కొట్టి, నరికి వెళ్లగక్కే అవకాశం లభిస్తోంది.
గుజరాత్ నరమేధం, ముజఫర్ నగర్ మారణ కాండ, అఖ్లక్ దారుణ హత్య, పన్సారే-ఖల్బుర్గి-దభోల్కర్ ల ఊచకోత, రోహిత్ తదితరుల రస్టికేషన్, కన్హైయాపై దాడులు, పాటియాల్ హౌస్ కోర్ట్ లో లాయర్ల వీరంగం… ఇవన్నీ ఒకానొక పరిశీలనలో ప్రజల అసంతృప్తిని హిందూత్వ ప్రవాహంలోకి మళ్లించిన ఫలితాలే.
అసలు భారత్ మాతా కీ జై అనడమూ అనకపోవడమూ ఒక సమస్యా!?
సమస్య కానిదాన్ని పెను సమస్యగా మలిచి అసలు సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించడమే ఇందులో ఉన్న కిటుకు.
కాంగ్రెస్ నేతృత్వం లోని లిబరల్ రాజకీయ ధార ప్రజల అసంతృప్తిని అణచివేసేందుకు ఎమర్జెన్సీ విధించే వరకు వెళ్లింది. అనగా పోలీసులు, పారా మిలటరీ బలగాల ఉక్కు అణచివేతను కరకు అస్త్రంగా లిబరల్ రాజకీయులు ప్రయోగించారు.
హిందూత్వ రూపంలో ఉన్న మితవాద తీవ్రవాదానికి (right extremism) అంతవరకు వెళ్లవలసిన అవసరం లేకపోయింది.
ఎమర్జెన్సీ విధింపు ఆధిపత్య వర్గాలకు చివరి అస్త్రం అన్నమాట నిజమే గానీ ఎమర్జెన్సీకి మించిన కరకు ఆయుధం నిత్య రాజకీయ వ్యవహారంలోనే కలిగి ఉండడం హిందూత్వకు పుట్టుకతో వచ్చిన పల్లేరు ముళ్ళు.
ముస్లిం వ్యతిరేకత, పాక్ వ్యతిరేకత, మతోన్మాదం, సో కాల్డ్ హిందూ జాతీయవాదం… ఇవన్నీ ఆర్‌ఎస్‌ఎస్/బిజేపి కింద సమకూడే కార్యకర్తలకు రెడీ మేడ్ ఆయుధాలుగా పని చేస్తున్నాయి. ఒక మత్తు, మాంఛి కిక్కు అవి ఇస్తున్నాయి.
ఆ ధైర్యంతో ఫడ్నవీస్, రాందేవ్ లాంటి వాళ్ళు నోటికి వచ్చినట్లు కారు కూతలు కూయగలుగుతున్నారు.
రామ్ జాదే, హరామ్ జాదే నినాదం ద్వారా ఢిల్లీని దొరకబుచ్చుకోవాలని పన్నాగం పన్నిన బిజేపి ఇప్పుడు అదే తరహా నినాదాలతో జనం ముందుకు వస్తున్నారు. అస్సాం ప్రచారానికి వెళ్ళి “నేను అస్సాం టీనే అమ్మాను” అని ప్రకటించుకుంటున్న ప్రధాని మోడి తన అనుచరులకు అఖ్లక్, భారత్ మాత, దేశ ద్రోహం లాంటి ఆయుధాలను చేతికిచ్చారు.
చుక్క నీరు లేక అల్లాడుతున్న జనానికి సమాధానం చెప్పలేని మహారాష్ట్ర ముఖ్యమంత్రి “భారత్ మాతా కీ జై” నినాదాన్ని ఆశ్రయించాడు. అక్కడికి తాగడానికి నీరు లేని వారు భారత మాత నినాదం నీరు ఇస్తున్నట్లు!
బెంగాల్ ప్రచారానికి వెళ్ళిన అమిత్ షా జేఎన్‌యూ విద్యార్ధుల జాతీయతా వ్యతిరేక తత్వాన్ని విమర్శించే పనిలో ఉన్నారు. మరో పక్క భారత మాతకు జై కొట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జై కొట్టకపోతే వేలు, లక్షల సంఖ్యలో తలలు నరికెసే ఉబలాటం ప్రదర్శిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన తోడనే విదేశాల్లో నల్లధనాన్ని తెప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి, అధికారం వచ్చి రావడంతోనే అందుకు కమిటీ వేసినట్లు చెప్పారు.
ఆ కమిటీ అతీ గతీ ఏమిటో ఇప్పుడు తెలియడం లేదు. స్విస్ బ్యాంకు భద్రంగా అప్పగించిన 1100 మంది అక్రమ ఖాతాదారుల అక్రమ డబ్బునైనా విచారించారా అంటే లేదు. ‘పనామా పేపర్స్’ పేరుతో 500 మంది భారతీయ అక్రమ ఖాతాదారుల పేర్లు కూడా మోడి ప్రభుత్వ చేతికి వచ్చాయి. అది కూడా విచారించి నిగ్గు తేల్చుతారట! స్విస్ ఖాతాలపై విచారణకే దిక్కు లేదు గానీ ‘పనామా పేపర్స్’ లీక్ లని విచారిస్తారట! వినేవారు ఉండాలే గానీ….
చివరికి తేలిందేమిటి?
బిజేపి/మోడి కి నల్లడబ్బు వెనక్కి తెచ్చే ఆలోచన ఏ కోశానా లేదు. స్విస్ ఖాతాలు కలిగి ఉన్న 1100 మంది భారతీయుల నల్లడబ్బు వెనక్కి తెప్పించే ఉద్దేశ్యమూ లేదు. ‘పనామా పేపర్స్’ పైన కూడా విచారణ అంటూ ఏమీ ఉండదు.
జనానికి మిగిలింది ‘భారత్ మాతా జై’ లు, అఖ్లక్ ల హత్యలు, రోహిత్ ఆత్మహత్యలు, కన్హయ్యాలపై దాడులు, పాకిస్తాన్ వెళ్ళిపొమ్మంటూ బెదిరింపులు…! గట్టిగా అడిగితే ‘స్వచ్ఛ భారత్’!
చేతకాదు అంటే మాత్రం ఎవరు అడిగారు గనక!
వాళ్ళుచేస్తే సంసారం ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం.
రాం దేవ్ సోములోరిని సిరియాకి తోలేసి ఇసిస్ లో జాయిన్ చేయిస్తే సరి. అక్కడ నచ్చనోల్ల తలల్ని ఎంచక్కా నరుక్కోవచ్చు. కానీ ఈ దేశభక్తులు ఇండియాని సిరియాలా మార్చేసే వరకూ వదిలేలా లేరు. వీరి బారి నుండి భారత మాతను ఆ దేవుడే కాపాడాలి.