శని గుడి: కోర్టు తీర్పు అమలు చేయని బి‌జే‌పి ప్రభుత్వం


దేవాలయంలో మహిళలకు ప్రవేశం నిరాకరించే అధికారం ఎవరికి లేదని ఆలయాల్లో లింగ వివక్ష పాటించకుండా చూడడం మహారాష్ట్ర ప్రభుత్వానికి విధిగా బాధ్యత ఉన్నదని రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరాకరించింది.

కోర్టు తీర్పు ఇచ్చిన ధైర్యంతో తృప్తీ దేశాయ్ నేతృత్వం లోని రెండు డజన్ల మంది కార్యకర్తలు ఈ రోజు (శనివారం, ఏప్రిల్ 2) ప్రయత్నించారు. వారిని ఊరి జనం అడ్డుకున్నప్పటికీ పోలీసులు, జిల్లా యంత్రాంగం చోద్యం చూశారు. పైగా ‘లోపలికి వెళ్ళేవరకు ఇక్కడే ఉంటాం’ అని ధర్నాలో కూర్చున్న మహిళలనే నిర్బంధం లోకి తీసుకున్నారు.

మహారాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ డి హెచ్ వాఘేలా, జస్టిస్ ఎం ఎస్ సోనక్ ల నేతృత్వం లోని డివిజన్ బెంచి శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పి‌ఐ‌ఎల్) విచారిస్తూ ఈ రూలింగ్ ఇచ్చింది.

“మహిళల ప్రాధమిక హక్కులను పరిరక్షించవలసిన మౌలిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. రాష్ట్రం చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రభుత్వం ఒకవేళ తన విధిని నిర్వర్తించనట్లయితే మేము చర్య తీసుకోవలసి వస్తుంది” అని డివిజన్ బెంచి స్పష్టం చేసింది.

మహారాష్ట్ర హిందూ స్ధలాల బహిరంగ పూజా (ప్రవేశాధికారం) చట్టం – 1956 ప్రకారం, చట్టం లోని వివిధ అంశాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కనుక రాష్ట్రం, హోమ్ శాఖ, హోమ్ శాఖ కార్యదర్శి లు పూనుకుని సంబంధిత జిల్లా అధికార యంత్రాంగానికి చెప్పి చట్టాన్ని అమలు చేయించాలని హై కోర్టు తీర్పు పేర్కొంది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏ‌జి) రోహిత్ దేవ్ కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చాడు. “లింగ వివక్షకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం. చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది” అని ప్రమాణం చేశారు.

“ఈ ప్రమాణాలు, హామీలు ఆచరణ లోకి రావడం లేదేందుకని? మహిళలకు ప్రవేశం నిరాకరిస్తూనే ఉన్నారు కదా?” అని బెంచి ప్రశ్నించింది.

దానికి సమాధానం ఇస్తూ ఏ‌జి గర్భ గుడి లోకి మహిలలతో పాటు పురుషులను కూడా అనుమతించకపోతే అప్పుడు ఈ చట్టం ఆచరణలోకి వస్తుందని, ఆచారాల రీత్యా పురుషులు, స్త్రీలు ఇరువురిని ఆలయం గర్భగుడిలోకి అనుమతించకపోతే గనక చట్టం ఆచరణ లోకి రాదని బదులిచ్చారు.

“అయితే, గర్భ గుడి లోకి పురుషులను అనుమతిస్తూ మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లయితే గనక ఈ చట్టం ఆచరణ లోకి వస్తుంది” అని ఏ‌జి స్పష్టం చేశారు. “చట్టాన్ని ధిక్కరించినవారికి చట్టం ప్రకారం కనీసం 6 నెలల పాటు కారాగార శిక్ష విధించవచ్చు” అని కూడా ఏ‌జి స్పష్టం చేశారు.

ఈ స్పష్టత వచ్చిన దరిమిలా హై కోర్టు వివిధ ఆదేశాలు ఇచ్చింది. చట్టం గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. శని గుడికి సంబంధించి దేవత పవిత్రతకు భంగం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి బెంగగా ఉన్నట్లయితే ఆ విషయమై తగిన ప్రకటన చేయాలని కోరింది.

శని సింజ్ఞాపూర్ ఆలయం మహారాష్ట్రలో అహ్మద్ నగర్ పట్టణానికి 35 కి.మీ దూరంలోని గ్రామంలో నెలకొని ఉన్నది. ఈ గ్రామంలోని ఇళ్లకు తలుపులు ఉండవట. అయినా ఇక్కడ దొంగతనం అన్నది జరగలేదని చెబుతుంటారు. వాస్తవం ఏమిటంటే 2010, 2011, 2012 సం.ల్లో శనిగుడి అర్చకుల ఇళ్లలోనే దొంగలు పడి బంగారం, డబ్బు దోచుకున్నారు.

ఈ గుడిలోని విగ్రహంలో దేవత ఇప్పటికీ సజీవంగా నివసిస్తున్నదని స్ధానిక ప్రజల నమ్మకం. ఈ కారణం చేత గుడిని ‘జాగృత దేవస్ధానం’ అని కూడా చెబుతారు. దొంగతనానికి పాల్పడితే శని దేవత వెంటనే శిక్ష విధిస్తుందని నమ్ముతారు. ఇళ్లకు తలుపులు లేకపోవడానికి కారణం ఈ నమ్మకం. దొంగతనాలు జరిగినా ఈ నమ్మకం చావకుండా కొనసాగుతోంది.

ఇప్పటికీ విగ్రహంలో సజీవంగా నివశిస్తున్నదన్న నమ్మకం వల్లనే మహిళలకు ప్రవేశాన్ని నిరాకరిస్తారని తెలుస్తోంది. శని దేవత ఇక్కడ ‘స్వయంభవు’ (తనంతట తానే ఉద్భవించడం) అనీ, భూమి నుండి పుట్టి రాతి రూపం దాల్చిందని నమ్ముతారు. శని దేవత అనుగ్రహం కోసం రోజుకు 35 వేల నుండి 50 వేల వరకు భక్తులు వస్తారని అమావాస్య రోజు 3 లక్షల వరకు వస్తారని పత్రికలు చెబుతున్నాయి.

ఈ నేపధ్యంలో తృప్తీ దేశాయ్ నేతృత్వం లోని ‘భూమాత రణ్రాగిణి బ్రిగేడ్ సభ్యులు శని గుడి లో ప్రవేశించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత జనవరిలో వారు చేసిన ప్రయత్నాలను పోలీసులే అడ్డుకున్నారు. దరిమిలా విద్యా బాల్ అనే కార్యకర్త, నీలిమ వార్త అనే అడ్వకేట్ పి‌ఐ‌ఎల్ దాఖలు చేశారు.

పి‌ఐ‌ఎల్ ను విచారిస్తూ మహిళలకు శని ఆలయంలో గర్భ గుడి ప్రవేశం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని కోర్టు చెప్పినప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వం లోని బి‌జే‌పి ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపకపోగా కార్యకర్తలనే అరెస్టు చేసి అక్కడి నుండి తరలించింది.

గ్రామస్తులతో ఘర్షణ నివారించడానికి కార్యకర్తలను నిర్బంధం లోకి తీసుకున్నామని పోలీసులు, జిల్లా పాలనా యంత్రాంగం చెబుతున్నారు. కానీ మహిళలకు రాజ్యాంగం కల్పించిన సమానతా హక్కు గురించి మాత్రం వారు మాట్లాడడం లేదు.

హక్కు ఉండడం అంటే కాగితాలపై ఉండడం కాదు. అది ఆచరణలో అమలు అయితేనే హక్కు నిజంగా ఉన్నట్లు. ఘర్షణ నివారణ పేరుతో హక్కు కల్పించే బాధ్యత నుండి తప్పించుకోవడం గర్హనీయం.

శని ఆలయ ప్రవేశం చుట్టూ అల్లుకుని ఉన్న నమ్మకాలు, భావోద్వేగాలను ఉల్లంఘించడం బి‌జే‌పి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఒక్క బి‌జే‌పి అనే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా చేసేది అదే. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించడానికి బదులు మహిళలను అరెస్టు చేయడమే ఓట్ల రాజకీయాలు చేసే పని. ప్రజల నమ్మకాలు Vs చట్టం అమలు: ఈ రెండింటిలో ఎటువైపు ఓట్లు ఎక్కువ తూగితే అటువైపు రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతాయి. చట్టబద్ధ పాలన ఒట్టి ట్రాష్!

ఓ పక్క ‘చట్టాన్ని అమలు చేస్తాం’ అని కోర్టుకు చెప్పి, తీరా మహిళలు వచ్చాక తన హామీకి విరుద్ధంగా మహా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. అనగా తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల ముందు చట్టాల అమలు ఎందుకూ కొరగాదని ఫడ్నవీస్ ప్రభుత్వం తన వాస్తవ ఆచరణ ద్వారా చెప్పింది.

వివిధ దేవాలయాల్లో మహిళలపై ఉన్న నిషేధాలు ప్రధానంగా వారి రుతుక్రమానికి సంబంధించినది. అగ్రకులాల భూములలో, పశువుల కొట్టాలలో శారీరక శ్రమలు చేసుకునే దళితులు అంటరానివారు అయినట్లే, పురుషుల ఆధిపత్య కింద ఉన్న స్త్రీలు కూడా రుతుక్రమం కారణంగా ‘అంటు’ వారయ్యారు.

స్త్రీలకు ప్రకృతి ఆపాదించిన రుతుక్రమం మానవజాతి జన్మకు సంబంధించినదన్న శాస్త్రీయ అవగాహన ఆనాటి ఆచారాలు నిర్ణయించినవారికి లేదు. నెలవారీ రుతుక్రమం జరిగి అండం విడుదల అయితేనే స్త్రీ గర్భం దాల్చడానికి వీలవుతుందని, ఈ ప్రాకృతిక నియమం ఆగిపోతే మనిషికి పుట్టుకే ఉండదని వారికి తెలిసిన తర్వాత కూడా వారికి ఆచార సంప్రదాయాలే ఎక్కువ అవుతున్నాయి.

దానికి కారణం ఆధిపత్యం కొనసాగదన్న భయం. ఆచారం, సంప్రదాయాల ఆలంబనగా అగ్రకులాలు, పురుషులు… స్త్రీలపై ఆధిపత్యం చెలాయించగలిగారు. ఇంకా చలాయిస్తున్నారు.

అలాంటి ఆచారాలు రూపుమాసిపోతే ఆధిపత్యం చెలాయించే అవకాశం బలహీనపడుతుంది. ఈ ఆధిపత్యంలో ఆర్ధిక ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో దళితులపైనా, స్త్రీల పైనా రుద్దుతున్న ఫ్యూడల్ సాంప్రదాయాలను వదులుకోవడానికి ఆధిపత్య వర్గాలు, కులాలు, పురుషులు ససేమిరా అంటున్నారు.

ఈ వెలుగులోనే శని ఆలయం కేంద్రంగా జరుగుతున్న ఘర్షణను చూడాల్సి ఉంటుంది. శని ఆలయానికి ఉందని చెప్పే అపురూప, standalone శక్తులు ఇప్పటికీ ఉన్నాయని జనం నమ్మాలంటే పాత ఆచారాలు కొనసాగాలి. మార్పులు జరిగితే ‘మారదగింది ఏదో ఆచార సంప్రదాయాల్లో ఉన్నట్లే’  అన్న ఎరుక జనం అనుభవం లోకి వస్తుంది. ఇది రాకూడదు.

రోజుకి పదుల వేలమంది దర్శించుకునే ఆలయానికి జనం తాకిడి తగ్గకుండా ఉండాలన్నా, తద్వారా ఆదాయం కొనసాగాలన్నా ఆలయ ధర్మ కర్తలు పాత ఆచారాలను కొనసాగించాలి. తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం వాళ్ళు గ్రామాల జనాన్ని రెచ్చగొడతారు. తమ ఊరి, ప్రాంత, రాష్ట్ర ప్రతిష్టకు ఏదో అప్రతిష్ట రాబోతుతోందన్న భాగోద్వేగం రెచ్చగొట్టడం అంత కష్టం ఏమీ కాదు కదా.

రాజకీయాలకు వచ్చేసరికి ఈ జనం అంతా మనుషులు కాదు. స్త్రీలు, పురుషులు, పిల్లలు కాదు. కేవలం ఓట్లు మాత్రమే. రాజ్యాంగం తమకు శిరోధార్యం అని చెప్పుకునేందుకు కోర్టులో చట్టానికి మద్దతు ఇస్తారు. బైటికి వచ్చాక ఓట్ల కోసం ఆచారాలకు మద్దతు వస్తారు. అదేమని అడిగితే శాంతి భద్రతల సమస్య అన్న మసి పూసేస్తారు. అది మసి కాదు నిజమే అని చెప్పడానికి నిజంగానే శాంతి భద్రతల సమస్య తలెత్తెవరకు తెస్తారు కూడా.

కేంద్రంలో హిందూత్వ అధికారంలో ఉన్నందున మరో విధమైన పరిణామాలను ఆశించలేము. ఓట్ల బలాన్ని సుస్ధిరం కావించుకునేందుకు ఇలాంటి రగడలు హిందూత్వకు బాగా ఆచ్చివస్తాయి కూడా. చట్టం వైపు కన్నా సాంప్రదాయం వైపు నిలబడడానికే రాజకీయ పార్టీలు మొగ్గు చూపిస్తారు.

వెరసి భూస్వామ్య ఆచార, సాంప్రదాయాలు, రాజకీయాలు, ఆర్ధిక ప్రయోజనాలు కట్టగట్టుకుని పాలితులను చీకటిలో కొనసాగేలా చూస్తున్నాయి.

2 thoughts on “శని గుడి: కోర్టు తీర్పు అమలు చేయని బి‌జే‌పి ప్రభుత్వం

  1. అసలు దేవుడు, దైవత్వము అన్న మాటలలోనే మూఢనమ్మకాలు ఇమిడి ఉన్నాయి. దేవుడు కొనసాగాలంటే మూఢత్వం కొనసాగాలి. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. ఒక పక్క శాస్త్రీయ అవగాహన, మరో పక్క దైవత్వము పరస్పర విరుద్ద భావాలు కొనసాగటం ‘శని’ దేవతను చంకన పెట్టకొన్నట్లే! 🙂 ఎప్పుడో అంధయుగాల నుండి దళితులకు ఆలయ ప్రవేశ నిరాకరణ, స్త్రీలకు బహిష్టు సమయంలో ఆలయ బహిస్కరణ కొన్ని ప్రత్యేక పరిస్ధతుల్లో పూర్తి బహిష్కరణ- సాగుతూ ఉన్నది. మరిక రాజ్యాంగ అతీత శక్తి మను పరిపాలన కొనసాగుతున్నట్లీ కాదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s