“ఏ ఫ్లోర్ టెస్టూ?! వాళ్ళు అసలు ఫ్లోరే లేకుండా చేస్తిరాయే…!”
*********
కాంగ్రెస్ ధరించిన అప్రజాస్వామిక కీర్తి కిరీటంలోని కలికితురాళ్లను బిజేపి ఒక్కొటొక్కటిగా దొంగిలిస్తోంది.
జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే ప్రారంభమై ఇందిరా గాంధీ హయాంలో ఊపందుకున్న విచక్షణారహిత ‘ఆర్టికల్ 356 ప్రయోగం’ ప్రస్తుతం ప్రధాని మోడి నేతృత్వం లోని బిజేపి ప్రభుత్వం ప్రతిపక్షాలపై ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించిన బిజేపి (కేంద్ర) ప్రభుత్వం పరిస్ధితులు అనుకూలంగా మారినాక రాష్ట్రపతి పాలన ఎత్తివేసి తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పరుచుకుంది. 60 సీట్ల అసెంబ్లీలో 47 సీట్లు గెలుచుకుని కూడా బిజేపి ఎత్తుల ముందు చిత్తయింది.
ఉత్తరాఖండ్ లోనూ కాంగ్రెస్ కి ఇదే పరిస్ధితి ఎదురయింది. ముఖ్యమంత్రి పదవి నుండి కాంగ్రెస్ తొలగించిన బహుగుణ కుటుంబాన్ని చేరదీసిన బిజేపి, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎంఎల్‌ఏల చేత తిరుగుబాటు చేయించి రావత్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. స్పీకర్ ద్వారా అసెంబ్లీని తిరిగి అదుపులోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సఫలం అవుతున్న పరిస్ధితుల్లో హఠాత్తుగా రాష్ట్రపతి పాలన విధించింది.
కేంద్ర ప్రభుత్వ నేత మోడి తదుపరి లక్ష్యం హిమాచల్ ప్రదేశ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ తర్వాత ఢిల్లీ పనికూడా పట్టవచ్చని అభిజ్ఞ వర్గాల పేరుతో వార్తలు షికారు చేస్తున్నాయి. పైసా కూడా సంపాదించుకోనివ్వని కేజ్రీవాల్ పంచ నుండి రోగ్ ఎంఎల్‌ఏ లను ఆకర్షించడం కష్టం కాబోదని ఆశితులకు భరోసా ఇస్తోంది కామోసు!
హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను కూడా అస్ధిరం కావించెందుకు కేంద్రం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆరోపించారు.
ప్రస్తుతం బిజేపి అనుసరిస్తున్న ఎత్తుగడలన్నీ పైన చెప్పినట్లు గతంలో కాంగ్రెస్ అనుసరించినవే. కేరళలో శుభ్రమైన మెజారిటీ ఉన్న నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం ద్వారా నెహ్రూ ప్రారంభించిన ఈ ‘రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే’ ఆచారాన్ని బిజేపి చక్కగా తలకెత్తుకుని తరిస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు. ఏ బిల్లు తెద్దామన్నా రాజ్యసభ అడ్డంగా ఉంటోంది. భారత ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పే ‘ఆధార్ బిల్లు’ ను కూడా ‘ద్రవ్య బిల్లు’ (money bill) గా పేర్కొంటూ రాజ్యసభకు రానివ్వకుండా చేసుకున్న పరిస్ధితి.
రాజ్య సభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసన సభ, శాసన మండలిల సభ్యులు ఎన్నుకుంటారు. కనుక రాష్ట్రాల శాసన సభలను తనవైపు తిప్పుకుని రాజ్యసభలో మెజారిటీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది.
అరుణాచల్, ఉత్తరాఖండ్ లాంటి చిన్న రాష్ట్రాల వల్ల రాజ్యసభలో సభ్యుల సంఖ్యను మెజారిటీకి చేర్చుకోగలరా అన్నది ఒక ప్రశ్న.
ఎందుకు చేసినా భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 356 గురించి రాజ్యాంగ రచయిత బి ఆర్ అంబేద్కర్ ప్రకటించిన లక్ష్యానికి కాంగ్రెస్, బిజేపి లు రెండూ విరుద్ధంగా పని చేస్తున్నాయన్నది వాస్తవం.
ఆర్టికల్ 356 దుర్వినియోగం కావచ్చన్న రాజ్యాంగ ప్రతినిధుల సభ సభ్యుల అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ అంబేద్కర్ ఇలా అన్నారు.
అటువంటి ఆర్టికల్ ను ప్రయోగించవలసిన అవసరం ఎన్నడూ రాకూడదన్న సభ్యుల భావోద్వేగాలను నేనూ పంచుకుంటున్నాను. అవన్నీ మృత అక్షరాలుగానే మిగిలి ఉంటాయని ఆశిద్దాం. ఒకవేళ వాటిని ప్రయోగిస్తే ఈ ఆర్టికల్ ద్వారా అధికారాలు సంక్రమించుకునే రాష్ట్రపతి రాష్ట్రాల పాలనాధికారాలను సస్పెండ్ చేసేముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తాను. మొదట ఆయన చేయవలసింది ఏమిటంటే తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒక హెచ్చరిక జారీ చేయడం. రాజ్యాంగం ఆశించిన విధంగా జరగడం లేదన్న సందేశాన్ని హెచ్చరిక ద్వారా ఇవ్వడం. ఆ హెచ్చరిక పని చేయకపోతే రెండో చర్యగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి ప్రజలే తమ రాష్ట్రం సంగతి తేల్చుకునే అవకాశం కల్పించడం. ఈ రెండు చర్యలు విఫలం అయిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి ఈ ఆర్టికల్ ను ప్రయోగించాలి.
అంబేద్కర్ ఆశించిన రెండు చర్యల్లో మొదటిదానిని కాంగ్రెస్ ప్రభుత్వాలు పాటించలేదు. ఇప్పుడు బిజేపి ప్రభుత్వమూ పాటించలేదు. ‘ఇది కాంగ్రెస్ ముఠా కుమ్ములాటల ఫలితం’ అని బిజేపి నేతల చెబుతున్నది సమర్ధన కోసమే తప్ప రాజ్యాంగాన్ని అనుసరించే ఆరాటం వారికి ఏ కోశానా లేదు.
అంబేద్కర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి అటు జాతీయ పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తి పురిట్లోనే సంధి కొట్టిన సంగతి ప్రజలు గ్రహించవలసే ఉన్నది.
ఇరు పార్టీలూ వివిధ సందర్భాల్లో అనేక మార్లు రాజ్యాంగాన్ని వివిధ స్ధాయిల్లో ఉల్లంఘించినవే. ప్రజల నుండి సమస్యలు వచ్చినప్పుడల్లా వారిపై సెడిషన్ కేసులు ఓ పక్క మోపుతూనే ఈ పార్టీలు దేశ ద్రోహం, జాతీయతలు గురించి ఉపన్యాసాలు దంచడం పెద్ద మోసం. అంతా ట్రాష్!
కేరళలో శుభ్రమైన మెజారిటీ ఉన్న నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం ద్వారా నెహ్రూ ప్రారంభించిన ఈ ‘రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే’ ఆచారాన్ని బిజేపి చక్కగా తలకెత్తుకుని తరిస్తోంది.
అప్పుడు కాంగ్రేస్ కు ఇందిరా గాంధి అధ్యక్షురాలుగా ఉన్నారు.ఈ తతంగంలో ఆవిడదే ప్రధానపాత్ర! తండ్రి(నెహ్రు) ద్రుతరాష్ట్రుడైనాడు!విద్యారంగంలో నంబూద్రిపాద్ తెచ్చిన సంస్కరణలను అక్కడి ప్రతిపక్షం(బహుషా కాంగ్రేస్) ఆందోళనలను ఆధరంగా చేసుకొని రాష్ట్రపతి పాలనవిధించారు. ఆవిడ ప్రధాని అయినతర్వాత జరిగిన 1967 వివిద రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రేస్ పరాభవానికి ప్రతిగా ఆయా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనను విధించారు.
ఆ తరువాత జరిగిన ఎన్నికలలో ఆవిడ లోక్ సభ అభ్యర్దత్వం రద్దుకావడం,ఎమెర్జెన్సీని విధించడం,ప్రతిగా జనతాప్రభుత్వం ఏర్పాటుకావడం వీళ్ళుకూడా ఆయారాష్ట్రాలలోని కాంగ్రేస్ ప్రభుత్వాలను రద్దుపరచడం పనిలో పనిగా తొలిసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతి(నీలం సంజీవరెడ్డి) ఎన్నికకావడం వీటన్నిటిలో మధ్య గవర్నర్ గిరీ ల చర్చ ఇవన్నీ తెలిసినవే!
అసలు సంగతి నంబూద్రిపద్ దేశంలోని తొలి కమ్యునిస్ట్ పార్టీకి చెందిన సి.యం!