“ముందు మాల్యాని పట్టుకోండి…” ఆర్టికల్ కింద విన్న కోట నరసింహారావు గారి వ్యాఖ్యకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు.
*********
(బడా ఋణ గ్రహీతలను) “వదిలిపెట్టేస్తారు అనేది ఓ అపోహ. అసలు ఋణమాఫీ అన్నది సన్నకారు ఋణాల విషయంలోనే ఎక్కువ జరుగుతుంది.”
ఇది విన్నకోట నరసింహారావు గారి వ్యాఖ్యలోని ఓ భాగం. జరుగుతున్న రాజకీయ రగడని అవకాశంగా తీసుకుని బాకీలు ఎగవేసే ధోరణి వల్ల దేశంలో ముఖ్య ఆర్ధిక సంస్ధలైన బ్యాంకుల వ్యవహారాలు ముందుకు సాగకుండా నిర్వీర్యం అవుతాయని కూడా వ్యాఖ్యాత అన్నారు.
ఈ సమాచారం వ్యాఖ్యాతకు తెలిసిన వాస్తవాల నుండి వచ్చినదేనా అన్నది నా అనుమానం. ఎందుకంటే బ్యాంకులు, ఆర్‌బిఐ ఇస్తున్న సమాచారం వ్యాఖ్యాత చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఉన్నది.
ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఆర్‌టిఐ చట్టం కింద write off చేసిన రుణాల వివరాలను ఇవ్వాలని కోరింది. write off చేయడం అంటే తెలుగులో రద్దు చేయడమే.
ఇలాంటి సమాచారం ఇవ్వడానికి గతంలో బ్యాంకులు, ఆర్‌బిఐ నిరాకరించేవి. అదేమంటే నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి తప్పుకునేవి. కానీ సుప్రీం కోర్టు గత డిసెంబర్ లో ఆర్‌బిఐకి తలంటు పోసింది. ఆర్‌బిఐ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి గానీ బ్యాంకుల ప్రయోజనాలకు కాదని చీవాట్లు వేసింది. ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్తున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నదని కనుక ఆర్‌టిఐ చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. దరిమిలా ఆర్‌బిఐకి సమాచారం ఇవ్వక తప్పలేదు.
ఆర్‌బిఐ నుండి ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు అందిన సమాచారం ప్రకారం 2004 – 2015 మధ్య కాలంలో 2.11 లక్షల కోట్ల రుణాన్ని బ్యాంకులు write off చేసేశాయి. ఇందులో కూడా 2013-2015 కాలంలో రద్దు చేసిన మొత్తమే 1.14 లక్షల కోట్లు. బ్యాంకులు తమ బ్యాలన్స్ షీట్లను శుభ్రం చేసుకోవాలని ఆర్‌బిఐ గత రెండు, మూడేళ్లుగా ఒత్తిడి చేయడంతో 2013 – 2015 కాలంలో భారీగా రుణాలను రద్దు చేసేశారు.
ఈ రుణాల్లో 100 కోట్లకు పైబడిన ఋణ ఖాతాలు ఎంత మందివి అని అడిగితే ఆర్‌బిఐ ఆ సమాచారం తన వద్ద లేదని దాట వేసింది. నిజానికి బ్యాంకుల నుండి ఆ సమాచారం తెప్పించుకోవడం కష్టం ఏమీ కాదు. అయినా సమాచారం ఇవ్వకపోవడానికే మొగ్గు చూపారు.
write off అనేది టెక్నికల్ గా జరిగేది మాత్రమేనని write off జరిగాక కూడా వసూలుకు ప్రయత్నిస్తూనే ఉంటామని బ్యాంకులు చెబుతుంటాయి. కానీ అది 5 శాతం మాత్రమే వాస్తవం. ఇంకా తక్కువ కూడా కావచ్చు. write off జరిగాక పొరబాటున వసూలు అయ్యే రుణాలు చాలా చాలా తక్కువ. write off అంటేనే ఇక వాటి గురించి బెంగ అవసరం లేదని బ్యాంకులు తమకు తాము సర్టిఫై చేసుకోవడం. write off అంటూ జరిగాక ఇక ఆ రుణాలను వసూలు చేసే ఆసక్తి, ఓపిక బ్యాంకర్లకు ఉండవు. సిఫారసులతో write off అయ్యే రుణాలకు కొదవ లేదు.
write off అయిన రుణాలు వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్‌బిఐ నుండి వచ్చే ప్రోత్సాహకాలు ఏమీ ఉండవని 2013లో బ్యాంకర్ల సమావేశం జరిగిన సందర్భంగా అప్పటి ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ కే సి చక్రవర్తి చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం. అనగా write off రుణాలు వసూలు చేయాలని ఆర్‌బిఐ కూడా అడగదు. అత్యున్నత స్ధాయి రెగ్యులేటరీ సంస్ధ అయిన ఆర్‌బిఐ నుండే ఒత్తిడి లేకుండా పోయాక ఆ రుణాల వసూలుకి బ్యాంకులు ప్రయత్నిస్తాయా?
ఇంతకీ టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే ఏమిటి? బ్యాలన్స్ షీట్ల లో ఆస్తులుగా రుణాలను చూపకుండా ఉండడమే టెక్నికల్ రైట్ ఆఫ్! టెక్నికల్ రైట్ ఆఫ్ లో ఉన్న రుణాలు ఆస్తులుగా బ్యాలన్స్ షీట్ లో కనపడవు. ఇలా చేయడం ద్వారా బ్యాంకులు తమ లాభ శాతాన్ని కృత్రిమంగా పెంచి చూపిస్తాయి. ఒక బ్యాంక్ (లేక ఏ ఆర్ధిక సంస్ధ అయినా సరే) ఆర్ధిక పరిస్ధితి ఏమిటన్నది ఆ బ్యాంకు యొక్క బ్యాలన్స్ షీట్ చెబుతుంది. ఓ పక్క ఆస్తులు మరో పక్క ఖర్చులు, లయబలిటీస్ ను చూపించేది బ్యాలన్స్ షీట్.
రైట్ ఆఫ్ చేసిన రుణాలు భవిష్యత్తులో ఎప్పుడన్నా వసూలు అయితే వాటిని లాభాల్లో చూపిస్తామని కనుక రైట్ ఆఫ్ అనగానే మొత్తంగా రద్దు చేసినట్లు కాదని బ్యాంకులు చెబుతాయి. కానీ ఈ వాదనని కె సి చక్రవర్తి తిరస్కరించారు. కె సి చక్రవర్తి ఇచ్చిన సమాచారం ప్రకారం రైట్ ఆఫ్ చేసిన రుణాల్లో 95 శాతం భారీ కార్పొరేట్ రుణాలే. అనగా మధ్య తరహా మరియు భారీ కార్పొరేట్ సంస్ధలు తీసుకున్న రుణాలనే బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. ఆ మిగిలిన 5 శాతం కూడా చిన్న తరహా పరిశ్రమలకు ఇచ్చినవే గానీ వ్యవసాయ రుణాలు కావు.
“గత 13 సంవత్సరాల్లో బ్యాంకులు 1 లక్ష కోట్ల రుణాలను రద్దు చేశాయి. వాటిలో 95 శాతం భారీ రుణాలే. ప్రతి ఒక్కరూ వ్యవసాయ ఋణ మాఫీ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎన్‌పిఏ లలో సగం వాటా మధ్య తరహా మరియు భారీ కంపెనీలదే” అని 2013లో కె సి చక్రవర్తి చెప్పారు. (టైమ్స్ ఆఫ్ ఇండియా)
వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే ప్రభుత్వాలు దాచి పెట్టుకోవు. టాం టాం వేసి చెప్పుకుంటాయి. దేశంలో 70 శాతం జనాభా వ్యవసాయం పైనే బతుకుతున్నారు కదా మరి. రైతుల రుణాలు మాఫీ చేసిన విషయం టాం టాం చేస్తే ఓట్లు రాలతాయి. అదే కార్పొరేట్ రుణాలు మాఫీ చేసినట్లు టాం టాం వేస్తే ఓట్లు మూడతాయి. అందువల్ల కార్పొరేట్ రుణాల మాఫీని రహస్య కార్పెట్ల కిందా, జాతీయ భద్రతా పరదాల వెనకా దాచి పెట్టి రైతు రుణాల మాఫీని డప్పు కొట్టి చాటుతారు. దానితో రుణాల మాఫీ జరిగేది కేవలం సన్నకారు రైతులకు మాత్రమేనని కార్పొరేట్లు బుద్ధిగా రుణాలు చెల్లిస్తూ ఉంటారని అమాయక జనం భ్రమిస్తూ ఉంటారు.
2008లో యూపిఏ ప్రభుత్వం (2009 ఎన్నికల కోసం) 60,000 కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కార్పొరేట్ వర్గాలు తీవ్రంగా విమర్శించారు. ఎఫ్‌ఐఐ, ఫిక్కీ, ఆసోచాం లాంటి కార్పొరేట్ లాబీ సంస్ధలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మహా బాధ పడ్డాయి. వాస్తవం చూస్తేనేమో కె సి చక్రవర్తి చెప్పినట్లుగా ఉన్నది. యేటా 6 లక్షల కోట్లు పన్ను రాయితీలు పొందే కార్పొరేట్ వర్గాలు తమ రాయితీలో పదో వంతు ఉన్న రైతుల ఋణ మాఫీను అంతగా వ్యతిరేకించడం, దానికి ప్రభుత్వాలు సై అనడం దారుణం కాదా?
రైతులకు ప్రకటించే ఋణ మాఫీలో మెజారిటీ భాగం నిజంగా మాఫీ అవసరం అయినవారికి చేరదు. నాలుగైదు రుణాలు తీసుకునే మోతుబరి రైతులు, పొలాలు సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే పొలం యజమానులు, పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ ఇన్వెస్ట్ మెంట్ గా పొలాలు కొనే ధనిక ఉద్యోగస్తులు… వీళ్ళే అత్యధికంగా ఋణ మాఫీ నుండి లాభపడతారు. అసలు సాగుదారులైన కౌలు రైతులకు ఎలాంటి ఉపశమనము ఉండదు. ఒక్క ఆత్మహత్యలే వారికి ఉపశమనంగా కనపడుతుంది.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే సన్నకారు రైతుల రుణాలు మాఫీ చేసేది బ్యాంకులు కాదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము చేస్తాయి. అనగా మాఫీ చేసిన రుణాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు చెల్లిస్తాయి. రైతులకు బదులు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం రుణాలను బ్యాంకులకు చెల్లించినప్పుడు అది బ్యాంకులకు భారమేనా? కాదు కదా.
బ్యాంకుల ఆర్ధిక పరిస్ధితి తల్లకిందులు అవుతున్నది మొండి బకాయిల వల్ల. ఆ బకాయిలను క్రమానుగతంగా రద్దు చేయడం వల్ల. అలా రద్దు అవుతున్న బకాయిలు మధ్య తరహా, భారీ కార్పొరేట్లకు చెందినవి తప్ప సన్నకారు రైతులవి కాదు. కనుక బ్యాంకులను ముంచుతున్నది కార్పొరేట్లే.
మొన్న బడ్జెట్ సందర్భంగా అరుణ్ జైట్లీ ఒక సంగతి చెప్పారు. అనేకమంది ధనికులు వ్యవసాయ ఆదాయాన్ని చూపిస్తూ ఆదాయపన్ను రాయితీ పొందుతున్నారట. వ్యవసాయ ఆదాయంపై పన్ను ఉండదు కదా. ముంబై, ఢిల్లీ, హైద్రాబాద్ లాంటి మహా నగరాల్లో వ్యవసాయ ఆదాయం చూపించి ఆదాయ పన్ను నుండి మినహాయింపు తీసుకోవడం దారుణం అని ఆయన వాపోయారు. ఆ పేరుతో త్వరలో వ్యవసాయ ఆదాయం పైన కూడా ఆదాయ పన్ను వేయడానికి మోడి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయం పై ఆదాయ పన్ను వేయాలన్నది ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లు విధించిన షరతుల్లో ఒకటి. దాన్ని అమలు చేయడం యూపిఏ వల్ల కాలేదు. మోడి వల్ల అది సాధ్యపడనున్నదని జైట్లీ ఇస్తున్న సూచనలు చెబుతున్నాయి.
వాస్తవాలు ఇవీ. ఋణ మాఫీ జరిగేది కేవలం సన్నకారు రైతులకే అన్నది అపోహ మాత్రమే. పత్రికలు, ఛానెళ్లలో నోరు, నోటు గల వారి చప్పుళ్ళు గట్టిగా వినిపిస్తుంటాయి. ఆ హోరులో వినపడాల్సినవి వినపడకుండా పోతాయి. గట్టిగా వినిపించే మోతలు విని ఒక అభిప్రాయానికి రావడం వల్ల మనకు తెలియకుండానే తప్పుడు వార్తలకు వాహకాలు అవుతాము.
గత ఆర్టికల్ లో చెప్పిన ప్రేమ లత పేదరాలు కాదు, ధనికులు అని రాశాను. ఆమె కొనవలసిన టికెట్ కూడా కేవలం రు 10 మాత్రమే. కనుక ఆమె టికెట్ కోనకుండా ఎగవేసి సమర్ధనకు విజయ్ మాల్యాను ప్రస్తావించింది అన్నారంటే నమ్మశక్యం కావడం లేదు.
ప్రేమ లతను రైల్వేలు వదల లేదు. కోర్టుకి తీసుకెళ్లారు. జరిమానా చెల్లింపుకు తిరస్కరించడంతో కోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం ఆమె 7 రోజుల జైలు శిక్షను బైకుల్లా జైలులో అనుభవిస్తున్నారు. 5/7 కోట్ల ఖరీదు చేసే ఇంటిలో నివసించే వ్యాపారి భార్య రు 260/- పెనాల్టీ కట్టలేక జైలుకి వెళ్లడానికి సిద్ధపడతారా? ఆమె చెప్పినట్లు పేదల తరపున జరిగే పోరాటాల్లో తన వంతుగా చేసే పోరాటంగా జైలుకు వెళ్ళడం ద్వారా ప్రభుత్వాలు, కోర్టులు ధనికులకు పేదలకు మధ్య చూపుతున్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపడమే ప్రేమలత గారి లక్ష్యం. విషయం ఇంత స్పష్టంగా ఉంటే ఇంకేదో అర్ధం లాగ బూనడం అసంగతం.
ఇక తమిళనాడు రైతు ‘ముందు మాల్యా దగ్గర వసూలు చేయండి’ అంటే ఇక ఆయన రుణం చెల్లించనని చెప్పినట్లా? కాదండీ బాబు. ‘మీరు (ప్రభుత్వాలు) మాల్యా లాంటి ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులని (విల్ ఫుల్ డిఫాల్టర్) దేశం దాటి పోతున్నా సహిస్తారు గానీ మాలాంటి చిన్న వారిని శత్రువుల్లా చూస్తారు’ అని నిలదీసినట్లు అర్ధం. అలా నిలదీయడం చేతగాని మరో తమిళ రైతు ట్రాక్టర్ జప్తు చేయడం భరించలేక ఉరి పోసుకుని చనిపోయాడు. ఇలాంటి రైతుల వల్ల బ్యాంకుల వ్యవహారాలు ముందుకు సాగకుండా నిర్వీర్యం అవుతాయని గంభీరంగా చెప్పడం బొత్తిగా అర్ధం కాని విషయం. మాల్యా ఎగవేసిన 9,000 కోట్ల వల్ల కాకుండా ఓ రైతు తీసుకున్న 5 లక్షల వల్ల బ్యాంకులు నిర్వీర్యం అవుతాయా, చోద్యం కాకపోతే?!
ఒక బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా చెపుతున్నాను, నాకు తెలిసినంత వరకు ఏ రైతుల ఋణాలూ రద్దు అవ్వలేదు. రైతుల ఖాతాల్లో రెండువందలూ, మూడువందలూ అలా పడితేనే ఋణమాఫీ నిజంగా జరిగిందని కమ్మ పత్రికలు ప్రచారం చేసాయి. విజయ్ మాల్యా విషయానికి వద్దాం. ఒక బ్యాంక్ మేనేజర్ జీతం నెలకి యాభై వేలు ఉంటుంది. అతను జీవితంలో పది కోట్లు ఎన్నడూ చూసి ఉండడు. విజయ్ మాల్యా లాంటివాడు ఎవడో అతనికి పది కోట్లు లంచం ఇస్తే, అతను ఉద్యోగం పోతుందని తెలిసినా నిబంధనలకి విరుద్ధంగా ఋణం ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆర్థిక అసమానతలు ఉన్నంతవరకు డబ్బుల కోసం గడ్డి మేపేవాళ్ళూ, తినేవాళ్ళూ ఉంటారు.