ముందు మాల్యాని పట్టుకోండి! -రైలు టికెట్ కొనని మహిళ


Ticket less travel

భారత పాలకుల ధనికవర్గ తత్వాన్ని ఒక మహిళ ఎండగట్టిన ఉదంతం చోటు చేసుకుంది. సహజంగా వివాదాలకు దూరంగా ఉండాలని భావించే ధనిక కుటుంబాలకు చెందిన మహిళ ఈ సాహసానికి పూనుకోవడం విశేషం.

44 సం.ల మహిళ ఆదివారం రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడింది. బహుశా ‘పట్టుబడింది’ అనడం సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఆమె టికెట్ కొనలేనంత పేదరాలు కాదు.

‘పట్టుబడిన అనంతరం’ ఆమె టికెట్ కలెక్టర్ విధించిన జరిమానా చెల్లించడం కంటే జైలుకు వెళ్లడానికే సిద్ధపడడాన్ని బట్టి ఆమె ఉద్దేశ్యపూర్వకంగా టికెట్ కొనలేదని భావించవచ్చు. తనకిది పేదల తరపున పోరాడే పద్ధతుల్లో ఒకటని చెప్పారు కూడా.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ప్రేమలత భన్సాలి దక్షిణ ముంబై లోని భూలేశ్వర్ ప్రాంతంలో నివసిస్తారు. ఈ ప్రాంతంలో సంపన్నులు నివసిస్తారు. ప్రేమ లత నివసించే టోనీ టవర్ (అపార్టుమెంట్) లో ఒక్కో అపార్టుమెంటూ రు 5 కోట్ల నుండి రు 7 కోట్ల వరకు ఖరీదు చేస్తుందని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది.

ది హిందు ప్రకారం సబర్బన్ నెట్ వర్క్ రైలులో ప్రయాణిస్తుండగా మహాలక్ష్మి/ఎఫిన్సన్ స్టేషన్ వద్ద ఒక మహిళా టికెట్ కలెక్టర్ ఆమెను టికెట్ కోసం తనిఖీ చేశారు. తాను టికెట్ కొనలేదని ప్రేమలత చెప్పడంతో రు 260 లు జరిమానా చెల్లించాలని టి‌సి కోరారు.

Premlata Bhansaali

జరిమానా చెల్లింపుకు ప్రేమ లత నిరాకరించారు. తనను స్టేషన్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాలని కోరారు. అక్కడికి వెళ్ళాక ఆమె విజయ్ మాల్యాను ఉదహరించడం ప్రారంభించారు. 9,000 కోట్ల రూపాయల అప్పు ఎగవేసిన విజయ్ మాల్యాను ఎంచక్కా విదేశాలు వెళ్లనిచ్చి తనను జరిమానా చెల్లించాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు.

జరిమానా చెల్లించకపోతే జైలుకు వెళ్లాలని రైల్వే పోలీసులు హెచ్చరించనా ఆమె వెనక్కి తగ్గలేదు. జరిమానా చెల్లించడం కంటే జైలుకు వెళ్లడానికే తాను సిద్ధం అని స్పష్టం చేశారు. తద్వారా భారత ప్రభుత్వ అధికారులకు చిన్న చిన్న నేరాలపై ఎక్కడ లేని ప్రతాపం అంతా చూపగలరు గానీ మాల్యా లాంటి బడా నేరగాళ్లను ముట్టుకునే సాహసం కూడా చేయలేరని ఆమె లోకానికి చెప్పదలిచారన్నది స్పష్టమే. అదే వాదనను ఆమె కోర్టులో సైతం వినిపించారు.

“నన్ను జైలుకైనా పంపండి. లేదా మేజిస్ట్రేట్ వద్దకైనా తీసుకెళ్ళండి” అని ఆమె డిమాండ్ చేశారు. జైలుకు వెళ్ళడం ద్వారా అన్నా హజారే తరహాలో తన వంతు నిరసన నమోదు చేయాలని ఆమె తలపోశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పి‌ఎఫ్) పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీస్ (జి‌ఆర్‌పి) అధికారులు, అగ్రిపద పోలీసు స్టేషన్ అధికారులు అందరూ కలిసి ఆమెకు నచ్చజెప్పడానికి, కొన్సిలింగ్ ఇవ్వడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆమె నుండే రివర్స్ కౌన్సిలింగ్ ని ఎదుర్కొన్నారు.

దానితో పోలీసులు చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఆమె భర్తను పిలిపించడానికి ప్రయత్నించారు. భర్త మాట  భార్య విని తీరాలని పోలీసుల నమ్మకం కావచ్చు.  కానీ ఆమె భర్త కాదు కదా తన కుటుంబానికి చెందిన ఎవరి ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇవ్వలేదు. తన సంగతి తాను చూసుకోగలనని పోలీసులకు ఖరాఖండిగా చెప్పేశారు. ఆ భర్తగారు వ్యాపారి అని తెలుస్తున్నది.

“ఆమె 12 గంటల పాటు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. మాల్యా పట్ల అధికారులు ఎందుకు మెతకగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మాల్యాలాంటి బడా వ్యక్తుల పట్ల మెతక వైఖరి అవలంబిస్తూ సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు” అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి ఒకరు చెప్పారు. ఇంతకీ ప్రేమ లత కొనవలసిన టికెట్ ఖరీదు రు 10 లు మాత్రమే.

అప్పటికే రాత్రి 11 దాటింది. అదీ కాక అరెస్టు చేయవలసిన వారిని పోలీసులు మొదట డాక్టర్ల వద్దకి తీసుకెళ్ల వలసి ఉంటుంది. డాక్టర్ సర్టిఫై చేయకుండా పౌరులను నిర్బంధం లోకి తీసుకోవడం చట్ట విరుద్ధం. (ఈ సంగతి చాలా మందికి తెలియదు. ఈ నిబంధనను ఉల్లంఘించడం పోలీసులకు నిత్య కృత్యం కూడా.) మాల్యా దేశం వదిలి పోరిపోవడాన్ని ఆమె పదే పదే గుర్తు చేయడం పోలీసులను ముల్లులా పొడిచింది. మాల్యాని కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని డిమాండ్ చేయడంతో పోలీసులకు పాలు పోని పరిస్ధితి. పైగా ఆదివారం మేజిస్ట్రేట్ ఉండరు.

విసిగిపోయిన అధికారులు అప్పటికి ఇంటికి పంపేశారని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది. ఆమెను రాత్రి 11:40 ప్రాంతంలో పోలీసులు అధికారికంగా నిర్బంధం లోకి తీసుకున్నారని డి‌ఎన్‌ఏ వెబ్ సైట్ తెలిపింది.

మంగళవారం ప్రేమ లతను పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారని ది హిందు తెలిపింది. “ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జి ముందు ప్రవేశ పెట్టాము. జడ్జి ఆమెను జరిమానా చెల్లించమని ఆదేశించారు. అక్కడ కూడా ఆమె జరిమానాకు ఒప్పుకోలేదు. 7 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించడానికే మొగ్గు చూపారు” అని ముంబై రైల్వే డివిజన్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ ఆనంద్ విజయ్ ఝా పత్రికలకు తెలిపారు. ప్రేమలతను జైలు పంపారా లేదా అన్నది ఏ పత్రికా చెప్పలేదు.

ప్రేమ లత భన్సాలి తాను సొంతగా, వ్యక్తిగా ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని చేపట్టారన్నమాట! రాజకీయ పార్టీలు అడపా దడపా ‘జైల్ భరో’ కార్యక్రమానికి పిలుపు ఇస్తాయి. కానీ వాస్తవంగా జైళ్ళు నిండేది లేనిదీ ఎవరికి తెలియదు. జైల్ భరో పేరుతో మూకుమ్మడిగా అరెస్టు కావడం, వ్యక్తిగత పూజీకత్తుతో నిమిషాల్లో వెనక్కి రావడం మామూలు సంగతే.

ఇందుకు భిన్నంగా ప్రేమ లత భన్సాలి ఒంటరిగా, ధైర్యంగా, తను మహిళను అన్న వెరపు లేకుండా ఒక నిరసన పోరాటానికి తెగించారు. నిజమైన దేశభక్తి అంటే ఇదే తప్ప ‘భారత్ మాతా కీ జై’, ‘వందే మాతరం’ అంటూ ఉత్తుత్తి ఖాళీ నినాదాలు ఇవ్వడం, అలా ఇవ్వనివారిపై నకిలీ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం దేశభక్తి కానే కాదు.

8 thoughts on “ముందు మాల్యాని పట్టుకోండి! -రైలు టికెట్ కొనని మహిళ

 1. తమిళనాడులో తంజావూరులో ఒక రైతు అప్పు కట్టలేదని, ట్రాక్టర్ ను జప్తు చేయబోతే , ముందు విజయ్ మాల్యా సంగతి చూసి రండని అక్కడ రైతులు పోలీసులను నిలదీశారు.
  విజయ్ మాల్యా పేరుతో ఇలాగే చేసుకుంటూ పోతే ఏమవుతుందన్నది కూడా ఆలోచించనవసరం లేదా అన్న ప్రశ్నవస్తుంది.

 2. మీకా భయం అవసరం లేదు. విజయ్ మాల్యాని వదిలి పెడతారు గానీ రైతులని వదలరు. ట్రాక్టర్ ను జప్తు చేసినందుకు మరో తమిళ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కూడా.

  మన దేశంలో ప్రజా ధనం కొద్ది మంది చేతుల్లో ఎలా కేంద్రీకృతం అవుతున్నదో మాల్యా ఉదాహరణ చెబుతుంది. అంతే తప్ప మాల్యా నుండి వసూలు జరిగి తీరుతుందన్న నమ్మకమూ లేదు; మాల్యాని చూపుతున్న సామాన్యులను వదిలి పెడుతున్నదీ లేదు.

  జనానికి వాస్తవాలు అర్ధం అవుతున్నాయనడానికి ఇవి చెదురు ముదురు ఉదాహరణలు మాత్రమే.

 3. ఇటువంటి వ్యక్తులు చేస్తున్న వాదనని ఆంగ్లంలో specious argument అంటారు.

  పైన moola2016 గారు “విజయ్ మాల్యా పేరుతో ఇలాగే చేసుకుంటూ పోతే ఏమవుతుందన్నది కూడా ఆలోచించనవసరం లేదా అన్న ప్రశ్నవస్తుంది” అన్నది కరక్ట్.

  ఋణాలివ్వడం బ్యాంకులు చేసే ముఖ్యమైన వ్యాపారం. ఇచ్చిన ఋణాన్ని వసూలు చేసుకోవడం కూడా బ్యాంకుల కర్తవ్యమే. వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. అది విజయ్ మాల్యా ఋణం కావచ్చు, రైతు ఋణం కావచ్చు, మీకూ నాకు ఇచ్చే కార్ లోన్ / పర్సనల్ లోన్ కావచ్చు. దేని వసూలు దానిదే. చట్టాల ప్రొసీజర్ల వల్ల, యంత్రాంగాల పనితీరుని బట్టి కొన్ని వసూళ్ళకి ఎక్కువ టైము పట్టచ్చు. వదిలిపెట్టేస్తారు అనేది ఓ అపోహ. అసలు ఋణమాఫీ అన్నది సన్నకారు ఋణాల విషయంలోనే ఎక్కువ జరుగుతుంది. అంతేకానీ, అల్లదిగో అతనికిచ్చిన అప్పు ముందు వసూలు చేసి తర్వాతే నా బాకీ సంగతి అడగండి అని వంతులు పోవడం కొత్తగా మొదలయిన ధోరణి, వితండ వాదన / జరుగుతున్న రాజకీయ రగడని అదనుగా తీసుకుని మన బాకీ తప్పించుకోవడానికి వీలవుతుందేమో ప్రయత్నించి చూస్తే పోయేదేముంది అనే మనస్తత్వం అయ్యుండే అవకాశం కూడా కావచ్చు / దేశంలో ముఖ్య అర్ధిక సంస్ధలయిన బ్యాంకుల వ్యవహారాలు ముందుకి సాగనీయకుండా నిర్వీర్యం చేయడమే.

 4. నరసింహరావు గారూ, బహుశా మీరు చేస్తున్నదే specious argument కావచ్చు. ఈ ఆర్టికల్ తర్వాత పబ్లిష్ అయిన ఆర్టికల్ ని వీలయితే చూడండి.

 5. విజయ్ మాల్యా తీరుపై ప్రజలలో నిరసన పెల్లుబుకుతోంది.ముంబైలోని బిడిడి చాల్ ప్రాంత ప్రజలు కొత్త తరహాలో నిరసన వ్యక్తం చేశారు. ఏభై అడుగుల ఎత్తైన మాల్యా దిష్టిబొమ్మనువారు తయారు చేశారు.విమానంపై అతను కూర్చున్నట్లు దానిని రూపొందించారు.మాల్యా కు నిరసనగా తయారు చేసిన ఈ దిష్టిబొమ్మను హోలీ పండగ రోజున దహనం చేస్తారు.ప్రజలలో ఈ చైతన్యం ఉంటే బ్యాంకులకు రుణాలు ఎగవేసేవారు కొంత అయినా సిగ్గు పడతారు.

 6. నా మొదటి వ్యాఖ్యకి ముక్తాయింపుగా వ్రాసిన concluding వాక్యం టైపింగ్లో కొంత మిస్సయిన కారణాన అసంపూర్తిగా పడిందని అర్ధం తప్పుతోందనీ గమనించి, నేను వ్రాయాలనుకున్న వాక్యం ఈ క్రిందిస్తున్నాను.
  వ్యాఖ్యలో కనబడుతున్న –
  “/ దేశంలో ముఖ్య అర్ధిక సంస్ధలయిన బ్యాంకుల వ్యవహారాలు ముందుకి సాగనీయకుండా నిర్వీర్యం చేయడమే.”
  అనే వాక్యం
  ” వెరసి అన్ని రకాల ఎగవేతలూ దేశంలో ముఖ్య ఆర్ధిక సంస్ధలయిన బ్యాంకుల వ్యవహారాలు ముందుకి సాగనీయకుండా నిర్వీర్యం చేయడమే.”
  అని ఉండాలి.

 7. సర్,మీరు చెప్పిందే సరైనదని తేలింది–
  రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తి చేసింది. రుణ ఎగవేతదారుల వివరాలు వెల్లడించలేమన్న ఆర్‌బీఐ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుప్రీకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకొని వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్నారు. వ్యాపార సామ్రాజ్యాలు నడిపేవారే దివాళా పేరుతో చేతులు ఎత్తేస్తున్నారు. వేల కోట్లు ఎగవేసిన వారిని బ్యాంకులు ఏమీ చేయలేకపోతున్నాయి. చిన్న మొత్తాల్లో వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులను బ్యాంకు పీడిస్తున్నాయి. రుణాలు చెల్లించకపోతే రైతుల ఆస్తులను జప్తు చేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానిచింది. ఆర్‌బీఐ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్‌బీఐ ఇటీవల రూ.500కోట్లకు పైగా బకాయిలు ఉన్న వ్యక్తులు, సంస్థల వివరాలతో సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసింది. కానీ వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరింది. నిరర్థక ఆస్తుల వివరాలు వెల్లడిస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆర్‌బీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. రూ.500కోట్లకు పైగా బకాయిలు వారి పేర్లు వెల్లడించాలని ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రుణ ఎగవేత దారుల అంశంపై వివరణ ఇవ్వాలని ఐబీఏ, ఆర్థిక మంత్రిత్వశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 26కు వాయిదా వేసింది.
  28 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2013 నుంచి 2015 ఆర్థిక సంవత్సరాల మధ్య దాదాపు రూ.1.14లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని గతంలో వెల్లడించాయి.
  (పై వివరాలను “ఈనాడు ఆన్ లైన్” నుండి సంపాదించడమైనది)

 8. మూల గారు నేను చెప్పినవి గతంలో జరిగినవే. ఇప్పుడు కోర్టు జోక్యంతో మళ్ళీ జరుగుతున్నాయంతే.

  ఇప్పుడు కూడా సాధ్యమైనంత కప్పి ఉంచడానికి పాలకులు చివరిదాకా ప్రతిఘటిస్తారు. వారి ప్రతిఘటన ఎంత బలహీనంగా ఉంటే అన్ని నిజాలు జనానికి తెలుస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s