ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లూటింగ్!


WCF

“మనల్ని మనమే విమర్శించుకుంటే ప్రపంచం ఇండియావైపు ఎందుకు చూడాలి?” యమునా తీరాన్ని ఖరాబు చేసే పనిలో నిమగ్నం అయిన పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ కు మద్దతు వస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అడిగిన ప్రశ్న ఇది. [పండిట్ బిరుదు ఆయనకు గతంలో ఉండేది. తర్వాత దానిని రద్దు చేసుకున్నారు. అందుకే రాసి కొట్టివేయడం.]

మూడు రోజుల పాటు జరగనున్న ‘ప్రపంచ సాంస్కృతి పండగ’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శుక్రవారం ఢిల్లీలో ప్రారంభిస్తూ ఈ మాటలు చెప్పారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా రవి శంకర్ గారే అని ప్రధాన మంత్రి తన మాటగా చెప్పారు.

భారతీయ సంస్కృతి అంటే ఏమిటి? హిందూత్వ దృష్టిలో హిందూత్వయే భారతీయ సంస్కృతి. ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, యూదులు… ఇలా అనేక మతాల ప్రజలు భారతీయులే అయినా వారందరి సంస్కృతి కూడా హిందూత్వయే అని హిందూత్వ నమ్మకం! హిందూత్వను ప్రగాఢంగా నమ్మే ప్రధాన మంత్రి కూడా ఆ అర్ధంతోనే శ్రీ శ్రీ రవి శంకర్ గారి సాంస్కృతిక నిబద్ధను ప్రశంసించారు.

ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, దాని అనుబంధ సంస్ధల నేతలు చెబుతూ ఉంటారు, “హిందూ మతం కేవలం మతం మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం” అని. ఏ మతం మాత్రం కాదు. ప్రతి మతమూ జీవన విధానమే. కాకపోతే ఏ మతంలోనూ లేనంతమంది దేవతలు, దేవుళ్ళు హిందూ మతంలో ఉన్నారు. ఏ మతానికి లేని కుల వ్యవస్ధ ఉన్నది కూడా మన హిందు మతానికే. నిజానికి, ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా, ఆచరణలో కులమే హిందు మత సారం.

2001 నాటి దర్బన్ సదస్సులో మన కుల వ్యవస్ధ గురించి లోకానికి చాటుదాం అని భారత హిందూ మతావలంబకులైన మాలలు, మాదిగలు, రెల్లి… ఇలా అనేక షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ప్రయత్నిస్తే దానిని అప్పటి బి‌జే‌పి ప్రభుత్వం (ఎన్‌డి‌ఏ-1), ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధలు ఎందుకు అడ్డుకున్నట్లు? “అది మా అంతర్గత సమస్య” అంటూ కేంద్ర ప్రభుత్వం కుల సమస్యను అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి అధికారికంగానే అడ్డుకుంది. బి‌జే‌పి ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ స్విట్జర్లాండ్ లాంటి దేశాల మద్దతుతో దళిత ఎన్‌జి‌ఓలు ఆనాటి సదస్సులో కుల సమస్యను అజెండాలో చర్చడంలో సఫలం కావడం వేరే విషయం.

ఇలాంటి కుల సమస్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడని శ్రీ శ్రీ రవి శంకర్ ప్రధాన మంత్రి దృష్టిలో భారతీయ సంస్కృతిని చాటిన గొప్ప దార్శనికుడుగా గుర్తించడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు. ఇంతకీ ఆయన ప్రచారం చేసిన సంస్కృతి ఏమిటీ అంటే -యోగా! బాబా రాందేవ్ కి కూడా దక్కని కీర్తి, ప్రతిష్టలను (లేదా అప్రతిష్టను) దక్కించుకున్న శ్రీ శ్రీ రవి శంకర్ ఎవరు?

Bhanu Didi (sister) with Guruji

Bhanu Didi (sister) with Guruji

శ్రీ శ్రీ రవి శంకర్ తమిళుడు. మే 13, 1956 ఆయన జన్మదినం. ఆదివారం పుట్టినందున రవి అనీ, ఆది శంకరాచార్యులు పుట్టిన రోజునే పుట్టినందున శంకర్ అనీ ఆయనకు పేరు పెట్టారుట. తాను చిన్నప్పటి నుండి తెలివి తేటలు ప్రదర్శించానని ఆయనే చెబుతుంటారు. 4 సం.ల వయసులోనే భగవద్గీత శ్లోకాలు వల్లించానని, ఎప్పుడూ ధ్యానంలో గడిపేవాడినని ఆయన తన గురించి చెబుతూ ఉంటారు. ఆయన చెల్లెలు (భానుమతి) గారయితే చిన్నప్పుడు తమ ఉపాధ్యాయులు కూడా స్వాంతన కోసం రవి శంకర్ తో కాసేపు మాట్లాడి సంతృప్తి పొందేవారని చెబుతారు. [రవి శంకర్ తన BSc (బ్యాచులర్ ఆఫ్ ‘సైన్స్) పట్టా పుచ్చుకుంది బెంగుళూరు లోని ఒక క్రైస్తవ కళాశాల.]

శ్రీ శ్రీ రవి శంకర్ మొదటి గురువు వేద పండితుడైన సుధాకర్ చతుర్వేది. ఆయన ఎవరూ అంటే మహాత్మా గాంధీ సన్నిహిత మిత్రులు అని చెప్పాల్సి ఉంటుంది. హిందూత్వ గురువు గారేమో వీర సావర్కార్! శ్రీ శ్రీ రవి శంకర్ గురువు గారేమో సావర్కర్ కుట్ర చేసి చంపించాడని చెబుతున్న మహాత్మా గాంధీ! గాడ్సేకి గుడి కూడా కట్టించబోయిన హిందూత్వను శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఎలా ఆమోదిస్తారు!

శ్రీ శ్రీ రవి శంకర్ పెద్ద గురువు పేరు మహర్షి మహేశ్ యోగి. నిజానికి యోగా గురించీ, ధ్యానం గురించి ప్రపంచ వ్యాపితంగా మొదట ప్రచారం చేసింది ఈయనే. ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ టెక్నిక్ ని అభివృద్ధి చేసి ప్రచారం చేసింది కూడా ఆయనే. 1960ల నుండే ఆయన ఈ టెక్నిక్ గురించి దేశ దేశాలూ ఒక ఉద్యమంలా ప్రచారం చేశారు. కానీ ఆయన మత ప్రచారం చేయలేదు. మతానికి అతీతంగా ‘ప్రపంచ శాంతి’ స్ధాపించడం లక్ష్యంగా ఆయన ప్రచారం చేశారు. (ఆచరణలో ఆయన కూడా హిందూత్వలో ఒదిగింపజేసుకున్నారనుకోండి!)

మహేశ్ యోగికి అనేక దేశాల్లో శిష్యులు ఏర్పడ్డారు. ముఖ్యంగా అమెరికాలో. ప్రపంచం అంతా దాదాపు 40,000 మంది టి‌ఎం శిక్షకులను ఆయన తయారు చేశారని ఒక అంచనా. ఆయన స్కూళ్ళు, కాలేజీలు సైతం స్ధాపించారు. మహేశ్ యోగి ప్రబోధించిన ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ పైన శిక్షణ ఇవ్వడానికి అమెరికా నుండి 6గురు అమెరికన్ యువకులు ఈ బ్లాగర్ చదువుకున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ కి 1980లలోనే రావడం విశేషం. భారత గురువు నేర్పిన విద్యను భారతీయ పాఠశాల విద్యార్ధులకు నేర్పడానికి ఖండాంతరాలు దాడి వచ్చేటంతగా మహేశ్ యోగి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆ రోజుల్లో టివిలు లేవు. ఆఫ్ కోర్స్! టి‌విలు వచ్చాక కూడా ఆయన ఉన్నారనుకోండి. మాట మాటకి నవ్వడం మహేశ్ యోగి అలవాటు. దానినే శ్రీ శ్రీ రవి శంకర్ అనుసరిస్తున్నారు కామోసు.

మహేశ్ యోగి వారసత్వాన్ని శ్రీ శ్రీ రవి శంకర్ మరో రూపంలో కొనసాగిస్తున్నారని ఒక అవగాహనకు రావచ్చు. కానీ కొనసాగిస్తున్నాను అని శ్రీ శ్రీ రవి శంకర్ ఎప్పుడూ చెప్పినట్లు లేదు. కనుక అధికారికంగా ‘కొనసాగింపు కాదు’ అనే భావిద్దాం. శ్రీ శ్రీ రవి శంకర్ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? పైన చెప్పినట్లు ఆయన చిన్నప్పటి నుండి ధ్యానముద్రులే. బుద్ధ భగవానుడికి బోధి వృక్షం లాగా గురువులకు ఏదో ఒక ఆరంభ రిఫరెన్స్, సాక్షాత్కారం లాంటిది, ఉంటుంది. శ్రీ శ్రీ రవి శంకర్ గారికి ఉన్నది కూడా.

1981లో శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఓ 10 రోజుల పాటు మౌన వ్రతం పాటించారుట. ఆ వ్రతం నుండి ‘సుదర్శన్ క్రియ’ అన్న సరికొత్త శ్వాస విద్య పుట్టిందిట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పే కోర్సుల్లో ఈ సుదర్శన్ క్రియ ప్రధాన భాగంగా ఉంటుంది. శ్వాస కోశ విద్యలను అనేకం బాబా రామ్ దేవ్ స్టేజీలపైనే ప్రదర్శిస్తుంటారు. సుదర్శన్ క్రియ బాబాకు తెలియనిదా అన్నది అనుమానమే. బహుశా గురువు అన్నాక ట్రేడ్ మార్క్ విద్య ఒకటంటూ ఉండాలనుకుంటాను.

Ravi Shankar Followers

Ravi Shankar Followers

ప్రస్తుతం ఆర్ట్ ఆఫ్ లివింగ్ 155 దేశాల్లో విస్తరించి ఉందని పత్రికలు చెబుతున్నాయి. ఈ సంగతి ఏ పత్రిక/చానెల్ చూసినా ‘reported to be’ అంటూ చెబుతున్నాయి గానీ నిజంగా ఉన్నట్లు రూఢిగా ఎవరూ చెప్పడం లేదు. “ఇదే మరో దేశంలో ఐతే రెడ్ కార్పెట్ పరిచి ఉండేవారు” అని శ్రీ శ్రీ రవి శంకర్ గారే చెప్పడం నిజమో కాదో ఎలా తెలియాలి!

“హింసా రహిత, ఒత్తిడి రహిత ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యం” అన్నది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు వారి బోధన. దానికి యోగా, సుదర్శన్ క్రియలు సాధనాలు! హింస చేసేది ఎవరు, ఒత్తిడి ఎందుకు పుడుతోంది లాంటి ప్రశ్నలు వాళ్ళకి అనవసరం.

ఇదంతా శ్రీ శ్రీ రవి శంకర్ గారి తాత్విక చింతనకు సంబంధించిన వ్యవహారం. అసలు సంగతి, మనకు కావలసిన సంగతి వేరే ఉన్నది.

2012లో శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఫేమస్ ప్రకటన ఒకటి కావించారు. “ప్రభుత్వ పాఠశాలలు నక్సలిజంను గర్భంలో మోస్తున్న కేంద్రాలు” అని ఆయన వాకృచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేది ఎవరు? పేద కుటుంబాల విద్యార్ధులు. ఈ దేశంలో అత్యంత పేదలు ఎవరు? దళితులు, గిరిజనులు. నక్సలిజం ప్రధానంగా ఎక్కడ ఉన్నది? అటవీ ప్రాంతాల్లో, పేదలు నివసించే ప్రాంతాల్లో. కనుక భారత దేశంలో దళితులు, గిరిజనుల పట్ల శ్రీ శ్రీ రవి శంకర్ గారికి ఉన్న అవగాహన ఇది.

భారత దేశాన్ని నిజంగా నిర్మిస్తున్నది ఎవరు? చాలా సింపుల్ ప్రశ్న. సమాధానం చాలా తేలిక. ఎవరైతే వొళ్ళు వంచి శ్రమ చేస్తున్నారో వారే దేశాల నిర్మాతలు. పల్లెల్లో, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, బడుల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, బ్యాంకుల్లో, ఆఫీసుల్లో, ఎవరైతే శారీరక, మేధో శ్రమ చేస్తున్నారో వారి శ్రమల వల్లనే సంపదల సృష్టి జరుగుతోంది. అనగా దేశం నిర్మితం అవుతోంది.

శ్రమ చేయకుండా ఒక్క రూపాయి/డాలర్/పౌండ్ స్టెర్లింగ్/ యెన్/యువాన్/యూరో కూడా పుట్టదు. భారత దేశంలో శ్రమలు చేసేవాళ్ళు ప్రధానంగా పేదలు, దళితులు, గిరిజనులు అని పైన చూశాం. కాబట్టి శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఎవరినైతే ‘నక్సలిజాన్ని గర్భంలో మోస్తున్నారు’ అని తీర్మానించారో ఆ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను ఏమి చేయతలిచారు?

ఈ పేదలకి శాంతి రహిత, ఒత్తిడి రహిత జీవనం అవసరం లేదా? 155 దేశాలకి వేల మంది శిక్షకులతో కోట్ల రూపాయల సొమ్ముతో ప్రచారం చేస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ‘నక్సలిజాన్ని గర్భాన మోస్తున్న పేదలకు, దళితులకు, గిరిజనులకు’ అవసరం లేదా?

“హింసా రహిత” శాంతి కోసం పరితపిస్తున్న శ్రీ శ్రీ రవి శంకర్ గారికి ఆదివాసీ స్కూల్ టీచర్ ‘సోనీ సోరి’ హిమ్తూత్వ రాజ్యం చేతుల్లో అనుభవిస్తున్న అంతులేని హింస కనపడుతోందా? ఢిల్లీ, బెంగుళూరు తదితర నగరాల నుండి నేరుగా ప్రభుత్వ పాఠశాలలోకి తొంగి చూడగలిగిన శ్రీ శ్రీ రవి శంకర్ గారు సోనీ సోరి గురించి తెలియకుండా పోవడం అసంభవం.

సోనీ సోరి నక్సలైట్ కాదు. నక్సల్ హింస వల్లనే తన తండ్రి మంచాన పడ్డాడని ఆమె చెబుతున్నారు. కానీ ఆమెను కూడా నక్సలైట్ అని చెబుతూ అత్యంత తీవ్రమైన, దారుణమైన, భరించలేని హింసలకు పోలీసులు ఆమెను గురి చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో యేళ్ళ తరబడి జైళ్ళలో ఆమెను నిర్బంధించిన పోలీసులు, సుప్రీం కోర్టు తీర్పుతో ఎలాగో బైటపడ్డాక కూడా వెంటాడి వేధిస్తున్నారు.

ఆమె ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే కూల్చిపారేశారు. పిల్లలు బడికి వెళ్తుంటే కొట్టి బెదిరించారు. అద్దెకు ఎవరూ ఇల్లు ఇవ్వకుండా ఊరి ప్రజలను బెదిరించారు. బెదిరింపు సందేశం రాని రోజన్నదే లేదు.  గిరిజనులపై పోలీసులు సాగిస్తున్న అకృత్యాలను ధైర్యంగా బైట పెట్టడమే ఆమె నేరం. చివరికి కోర్టుకు వెళ్తుంటే, పోలీసుల రక్షణ లోనే ఆమె మొఖంపై యాసిడ్ లాంటి ద్రావకాన్ని పోశారు. తీవ్రంగా గాయపడిన మొఖంతోనే ఆమె ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చి విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ “నా ఈ మొఖమే ఈ రాజ్యం అనుసరిస్తున్న అణచివేతకు ప్రతిబింబం” అని చాటారు. ఆ సంగతి శ్రీ శ్రీ రవి శంకర్ చూసే ఉండాలి. ఆమె మొఖాన్ని గాయపరుస్తుంటే పోలీసులు అక్కడే ఉండి అదుపు చేయలేదు. పైగా “ఆమే పూసుకుని ఉంటుంది” అని ప్రత్యారోపణకు పోలీసులు దిగారు.

సోనీ సోరి ఎదుర్కొంటున్న హింసకు శ్రీ శ్రీ రవి శంకర్ చూపే శాంతి పరిష్కారం ఏమిటి? ఆమె ఇంటి సమస్యకు ఏమిటి పరిష్కారం? ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజనుల దారిద్రం సమస్యకు ఏమిటి పరిష్కారం?

వాళ్ళు కూడా ధ్యానం చేస్తే సరిపోతుందా? వాళ్ళూ యోగా చేస్తే సరిపోతుందా? వాళ్ళూ కుప్పలు కుప్పలుగా యమునా తీరానికి వెళ్ళి 25 ఎకరాల స్ధలంపై ఆడి పాడి గెంతులు వేసి ఇంటికి తిరిగొస్తే వాళ్ళ జీవితాల్లో శాంతి వెల్లివిరుస్తుందా?

హింస, ఒత్తిడి అనుభవించేవారు ధ్యానం, యోగా చేస్తారు సరే! ఆ హింసకు పాల్పడే పోలీసులు, ఆ పోలీసులకు ఆదేశాలిస్తున్న ప్రభుత్వాలు, ముఖ్యంగా హిందూత్వ ప్రభుత్వాలు ధ్యానాలు, యోగాలు చేయనవసరం లేదా? హింస ఒడిగడుతున్నవాళ్ళను నిరోధించే మందులూ, టెక్నిక్కులూ శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఇంకా కనిపెట్టారా, లేదా?

సోనీ సోరి పైకి యాసిడ్/గ్రీజ్ విసిరేసిన పోలీసు మూకల హింసను నివారించే ఉపాయం లేకపోతే ప్రపంచం నలుమూలల నుండి 35 లక్షల మందిని పోగేసే వృధా ప్రయాసకు పాల్పడడం ఎందుకోసం? ఇప్పటికే కాలుష్యంతో గబ్బు పట్టిపోయిన యమునా నదిలో మరిన్ని టన్నుల చెత్తను నింపే కార్యక్రమం లోకి పదుల కోట్ల రూపాయల డబ్బును వృధాగా పోస్తే తప్ప ప్రపంచ శాంతి రాను పొమ్మన్నదా?

2010 సం.లో ఒక ఎన్‌ఆర్‌ఐ శ్రీ శ్రీ రవి శంకర్ పైన ఆరోపణ చేశారు. బెంగుళూరులో కనకపురా రోడ్డులోని తన 15 ఎకరాల పొలాన్ని శ్రీ శ్రీ రవి శంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ దురాక్రమించింది అని.

2001లో కర్ణాటక హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యమే దాఖలైంది. నీళ్ళు నిండి ఉండే విస్తారమైన ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్ధ భారీ నిర్మాణాలు సాగించిందని ఆ వ్యాజ్యం సారాంశం. వ్యాజ్యం దరిమిలా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నీటిపారుదల శాఖ ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసింది. చెరువుకు చెందిన 6.53 ఎకరాల భూమిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆక్రమించుకుందని ఆ తనిఖీలో వెల్లడి అయింది.

ఈ కేసులు ఏమయ్యాయో ఇప్పుడు ఎవరికీ తెలియదు.

యమునా తీరంలోని వరద భూముల్లో 25 ఎకరాల భూమిని దురాక్రమిస్తూ భారీ నిర్మాణాలు చేయడం ఈ కోవలోనిది కాదా? నదీ ప్రవాహం నగరాన్ని, ఊళ్లను ముంచెత్త కుండా వరద భూములు రక్షణగా ఉంటాయి. ఆ భూముల్లో పెరిగే చెట్లు, పొదలు ప్రవాహ వేగానికి నది తీరం, నేల కోసుకు పోకుండా నిరోధిస్తాయి. అక్కడ నివసించే పురుగు పుట్ర పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి.

ప్రపంచ శాంతి పేరుతో జీవించే కళ పేరుతో ఉనికిలో ఉన్న పచ్చటి జీవాన్ని నరికివేయడం, ఛిద్రం చేయడం వల్ల లైఫ్ (జీవం) ఉసురు తీయడం కాదా? జీవం ఉసురు తీయడమే జీవన కళా?

జీవన కళా కాదు, గాడిద గుడ్డూ కాదు. రాజధాని నగరంలో నదీ తీరంలో వందల ఎకరాల రియల్ ఎస్టేట్ భూములను ఆక్రమించడమే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ లక్ష్యం. ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’ కాదు, ఆర్ట్ ఆఫ్ ‘లూటింగ్’! కార్యక్రమం ముగిశాక ఆ స్ధలంలో పెద్ద పార్కు నిర్మిస్తామని శ్రీ శ్రీ రవి శంకర్ గారు చెప్పడం అంటే ఆ భూమి ఏదో ఒక పేరుతో శాశ్వతంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అదుపులోకి వెళుతుందన్నట్లే.

ఇన్నాళ్లూ కాంగ్రెస్ పరివారం, వారి అనుచరగణం, ఆ అనుచరగణ పరివారం భూములు, అనుమతులు, పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడిక బి‌జే‌పి/హిందూత్వ పరివారం, వారి అనుచరగణం, ఆ అనుచరగణ పరివారం, వారి….. వంతు వచ్చింది. అది సంస్కృతి పేరుతో, భారత దేశ ప్రతిష్ట పేరుతో దక్కడం హిందూత్వ మార్కు లూటీ!

అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండగ పైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం అత్యంత అవసరం. ఈ బహిరంగ భూ ఆక్రమణను ప్రజలు ఖచ్చితంగా తిరస్కరించాలి. ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడాలి. కానీ ఆ పోరాటం కూడా చివరికి ఒక ఎన్‌జి‌ఓయే చేయవలసి రావడమే విపత్కరం. ప్రజల ఆగ్రహాన్ని ఎన్‌జి‌ఓలు ఏ విధంగా భద్రంగా తీసుకెళ్లి కోర్టుల్లో ముగిస్తున్నది తెలియడానికి శ్రీ శ్రీ రవి శంకర్ గారి యమునా తీర పండగ తాజా ఉదాహరణ మాత్రమే.

దళితులకు, గిరిజనులకు, భూమిలేని పేదలకు భూములు ఇవ్వడానికి నానా యాతనలు పడే ప్రభుత్వాలు శ్రీ శ్రీ రవి శంకర్ లాంటి బహిరంగ భూ ఆక్రమణదారులకు మాత్రం వందల ఎకరాలు ఉదారంగా ధారాదత్తం చేస్తున్నాయి.

దశాబ్దాల తరబడి రైతులు, భూమిలేని పేదలు చేసిన పోరాటాల ఫలితంగా యూ‌పి‌ఏ హయాంలో భూసేకరణ చట్టం పరిమిత కొరలతో వచ్చింది. దీనిని సవరించి బడా బాబులకు భూములు మరింత సరళంగా దక్కేలా చేయడానికి మోడి ప్రభుత్వం పూనుకుంది. కాంగ్రెస్ సహాయ నిరాకరణతో విఫలం అయింది.

ఫలితంగా హిందూత్వ ప్రభుత్వం తనదైన సొంత పంధాలో భూముల స్వాధీనానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. బహుశా శ్రీ శ్రీ రవి శంకర్ స్ధాపించబోయే పార్కు అనంతర కాలంలో బడా బడా పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ కామందులకు విందు భోజనం అయినా ఆశ్చర్యం లేదు. శ్రీ శ్రీ రవి శంకర్ గారి సో కాల్డ్ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఒక ఫ్రంట్ మాత్రమే.

ఇది ప్రపంచ సాంస్కృతిక పండగ కాదు. బహిరంగ భూ దందా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లూటింగ్! కళాత్మక భూ దురాక్రమణ! భారతీయ సంస్కృతి పేరుతో హిందూత్వ తలపెట్టిన హిందూత్వ మార్కు భూముల పందేరం.

One thought on “ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లూటింగ్!

  1. హిందూ సంస్కృతి ముస్లింలకి కూడా వర్తిస్తుందా? యోగా గురువు ఉద్యోగాల కోసం ముస్లింలు పెట్టిన మూడు వేలకి పైగా అప్లికేషన్లని నరేంద్ర మోదీ ప్రభుత్వమే తిరస్కరించింది. భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి పెట్టిన ఆయుష్ శాఖలో ఒక్క ముస్లింకి కూడా ఉద్యోగం ఇవ్వలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s