ఆర్ట్ ఆఫ్ "లివింగ్ ఇట్ అప్"


Living it up

“మనదేం బోయింది!” ఈ మాట అప్పుడప్పుడూ అంటుంటాం. మనది కాని సొమ్ముని అదుపు లేకుండా ఖర్చు చేసేసే అవకాశం వచ్చినప్పుడు ‘ఎక్కువ ఖర్చు పెడుతున్నాం’ అన్న వివేకం ఎక్కడో పని చేస్తూ ఉంటుంది, కానీ ఊరక వచ్చింది ఖర్చు పెట్టకుండా ఉండలేక నిభాయించుకోలేని బలహీనతలో పడిపోతాం.

శ్రీ శ్రీ రవి శంకర్ గారి వ్యవహారం అలాగే ఉన్నట్లుంది చూడబోతే.

“జీవించే కళ” అంటూ శ్రీ శ్రీ రవి శంకర్ గారూ మహా సామ్రాజ్యాన్నే నిర్మించారు. “ఒత్తిడి లేని మనిషి, హింస లేని సమాజం లేకుండా ప్రపంచ శాంతిని సాధించలేము” అన్నది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ సిద్ధాంతం. యోగా సాధనంగా మానవ జీవితాన్ని శాంతిమయం చేసుకోవచ్చు అన్నది ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ చూపే పరిష్కారం.

అసలు మనిషి ఒత్తిడి ఎందుకు ఎదుర్కొంటున్నాడు? సమాజంలో హింస ఎందుకు ఉంటోంది? అన్న మౌలిక ప్రశ్నలకు AOL ఫౌండేషన్ ఇచ్చే సమాధానం ఏమిటో మనకు తెలియదు. అసలు ఆ ప్రశ్నలు వారు వేసుకున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఒత్తిడి, హింసలకు పరిష్కారం మాత్రం ఇచ్చేశారు. రోగానికి కాకుండా రోగ లక్షణానికి మందు వేసినట్లు!

ఒత్తిడి, హింసల నిర్మూలనకో ఏమో తెలియదు గానీ ఏ‌ఓ‌ఎల్ ఫౌండేషన్ వాళ్ళు యమునా నదీ తీరాన ఓ పేద్ధ పండుగను తలపెట్టారు. అలాంటిలాంటి పండగ కాదు. దాదాపు 150 వరకు దేశాల నుండి, భారత దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు, ఇతరులు ఈ పండుగకు హాజరవుతున్నారు. ఈ పండగ పేరు “వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్”.

లిట్ ఫెస్టివల్ పేరుతో ఇలాంటి సాంస్కృతిక పండగలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి. ఎవరి శక్తి వారు చూపించుకోవడానికీ, ఎవరి తీర్ధం వాళ్ళు పంచుకోవడానికీ, ఎవరి నిధులు వాళ్ళు పెంచుకోవడానికీ!

ఏ‌ఓ‌ఎల్ ఫౌండేషన్ ఒక ప్రభుత్వేతర సంస్ధ. Non-Governmental Organisation! విదేశాల నుండి వచ్చే నిధులు ఈ NGO లకి ప్రధాన తైలం. తమ కార్యక్రమాలకి ఎంత ప్రచారం వస్తే NGO లకి అన్ని నిధులు వస్తుంటాయి. 156 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాల ద్వారా దాదాపు 7.7 మిలియన్ల (దాదాపు 51 కోట్లకి సమానం) ఆస్తులు AOL కూడబెట్టిందని ఒక అంచనా.

యమునా నది ఒడ్డున తలపెట్టిన ‘ప్రపంచ సాంస్కృతిక పండుగ’ వల్ల నదీమ తల్లి పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే పరిస్ధితి వచ్చింది. ఒక ఔత్సాహికుని పిటిషన్ చొరవతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జి‌టి) రంగంలోకి దిగింది. ఈ ప్రభుత్వ సంస్ధ దేశ పర్యావరణ వ్యవస్ధ పరిరక్షణకు కట్టుబడి పని చేస్తుంది. ఐరాస ఒప్పందాల దరిమిలా ఇలాంటి వ్యవస్ధలను ప్రపంచ దేశాలు తమ తమ దేశాల్లో ఏర్పాటు చేశాయి.

రంగంలో దిగిందే తడవుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ ఎన్‌జి‌టి తలంటు పోసింది. కార్యక్రమానికి అవసరమైన అనుమతులు తీసుకున్నారా అని ఆరా తీసింది. యమున నది వరద భూముల్లో (flood plains) ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరుపుతుంటే ఢిల్లీ డవలప్ మెంట్ ఆధారిటీ ఏం చేస్తోంది అని ప్రశ్నించింది. కార్యక్రమం ఇంత పెద్దది అని మాకూ తెలియదు అని వాళ్ళు నీళ్ళు నమిలారు. సైన్యాన్ని సైతం రంగంలోకి దించి నది పైన రెండు తాత్కాలిక వంతెనలు నిర్మించినంత పెద్దది ఈ కార్యక్రమం!

రోజుకి రెండు లక్షల చొప్పున మూడు రోజులలో 6 లక్షల మంది వస్తారని చెప్పిన పండగకి చివరికి 25 లక్షల మంది వరకు రావచ్చని నిర్వాహకులు చెప్పడం మొదలు పెట్టారు. అంతమందికి తగిన వసతులు అక్కడ లేవు. పైగా వాళ్ళంతా వదిలేసిన చెత్త యమునకు పెద్ద భారం అవుతుంది. ఓ పక్క లక్షలాది మంది వల్ల సమకూరే చెత్త కాలుష్యం, మరో పక్క స్వాభావిక వరద భూములలో పచ్చదనాన్ని నిర్మూలించినందువల్ల వచ్చి పడే పర్యావరణ ముప్పు.

ఎన్‌జి‌టి అడిగిన వివిధ ప్రశ్నలకు, లేవనెత్తిన అనుమానాలకు కేంద్రం నుండి గానీ, ఢిల్లీ నుండి గానీ, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి గానీ సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు. [వివాదాల నేపధ్యంలో రాష్ట్రపతి నేను రావడం లేదని చెప్పేశారు. ప్రధాని వస్తారా రారా అని కూడా అనుకున్నారు. వస్తామని హామీ ఇచ్చిన ఇతర దేశాల ప్రభుత్వ నేతలు కూడా రావడం లేదని చెప్పారు. కొందరికైతే AOL నిర్వాహకులే “మీరు వస్తే కష్టమేనేమో” అన్నట్లుగా సందేశం పంపడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు.]

దానితో ఎన్‌జి‌టి కార్యక్రమానికి అనుమతి ఇస్తూనే ప్రారంభ అపరాధ రుసుము కింద 5 కోట్లు డిపాజిట్ చేయమని చెప్పింది. కార్యక్రమం మొదలయ్యే లోపు 5 కోట్లు కట్టాలని స్పష్టం చేసింది. కార్యక్రమం ముగిశాక జరిగిన నష్టాన్ని బట్టి పెనాల్టీ మొత్తం పెరుగుతుంది. కొన్ని పత్రికల ప్రకారం నష్టం భర్తీ చేయడానికి 100 కోట్ల వరకు అవసరం రావచ్చు. ఎన్‌జి‌టి ముందు కార్యక్రమం నిర్వాహకులు చెప్పిన వివరాల ప్రకారం ఫౌండేషన్ వాళ్ళు పండుగ కోసం ఇప్పటి వరకు 25.63 కోట్లు ఖర్చు పెట్టారు.

ఈ తీర్పుని శ్రీ శ్రీ రవి శంకర్ గారు తిరస్కరించారు. అవును! తిరస్కరించారు. కోర్టు తీర్పును, కోర్టు విధించిన జరిమానాను కట్టను అని బహిరంగంగా, పత్రికలకే చెప్పారు. (ఎన్‌జి‌టి న్యాయాధికారాలు కలిగిన సంస్ధ. సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తులు దానికి అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రస్తుత ఛైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్.)

“పెనాల్టీ నేను కట్టను. కావాలంటే జైల్లో కూర్చోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు” అని ఆయన స్పష్టంగా చెప్పారు. పైగా “ఇదే ఇంకో దేశంలో అయితే పండగ జరపడానికి రెడ్ కార్పెట్ పరిచి ఉండేవారు” అంటూ గొప్పలు పోయారు.

లెక్క ప్రకారం అత్యున్నత న్యాయస్ధానం (పర్యావరణానికి సంబంధించి ఎన్‌జి‌టి యే అత్యున్నత కోర్టు) తీర్పును తిరస్కరించినందుకు శ్రీ శ్రీ రవి శంకర్ గారు జాతీయ వ్యతిరేకి (Anti-national) అయి ఉండాలి. కానీ హిందూత్వ సంస్ధలు ఏవీ నోరు తెరవలేదు. పైగా హిందూత్వను ఆవాహన చేసుకున్న కేంద్ర ప్రభుత్వం (పెనాల్టీ విధించిన) తక్షణం 2.5 కోట్లను గ్రాంటుగా మంజూరు చేసింది.

అత్యున్నత న్యాయ స్ధానం సుప్రీం కోర్టు తీర్పు మేరకు అఫ్జల్ గురుని ఉరి తీయడం అన్యాయం అన్నందుకు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, కన్హయ్య కుమార్ తదితరులు ‘జాతీయ-వ్యతిరేకులు’ అయ్యారు కదా, మరి శ్రీ శ్రీ రవి శంకర్ ఎందుకు కారు? పైగా ప్రజలు చెల్లించిన పన్నులను ఒక ప్రైవేటు కార్యక్రమానికి గ్రాంటుగా ఇవ్వడం ఏమిటి?

ఓ పక్క విదేశీ నిధులతో నడుస్తున్నాయి అని ఆరోపిస్తూ 15,000 ఎన్‌జి‌ఓ సంస్ధలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అదే విదేశీ నిధులతో నడిచే మరో ఎన్‌జి‌ఓ అయిన ఏ‌ఓ‌ఎల్ ఫౌండేషన్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఎలా అర్ధం చేసుకోవాలి?

ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్, అనిర్బన్ తదితరులపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వీడియోలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేసి ఆనక వాళ్లపై పెట్టే ఖర్చు పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేయడంగా అభివర్ణించిన దేశభక్తి పుంగవులు శ్రీ శ్రీ రవి శంకర్ కి 2.5 కోట్లు ఇస్తున్నా ఎందుకు మాట్లాడరు? దేశ రక్షణకి వినియోగించాల్సిన సైన్యాన్ని ఒక ప్రైవేటు కార్యక్రమానికి నియోగిస్తుంటే ఈ అరివీర దేశభక్తులు, జాతీయవాదులు మిన్నకున్నారేమి?!

“ఆర్ట్ ఆఫ్ లివింగ్” ను “ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇట్ అప్” గా శ్రీ శ్రీ రవి శంకర్ అభివృద్ధి చేశారని కార్టూనిస్టు చెప్పడం ఇందుకే. శ్రీ శ్రీ రవి శంకర్ గారు ఒక్క పైసా తెచ్చి ఇవ్వరు. ఒక్క పూచిక పుల్ల ఇక్కడ తీసి అక్కడ పెట్టరు. కానీ వాళ్ళూ వీళ్లూ ఇచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్న కోట్ల రూపాయల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టేస్తారు.

ఆయన బోధిస్తున్నది ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అవునో కాదో గానీ, తాజా పండగా ద్వారా ఆయన చేస్తున్నది మాత్రం ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్ ఇట్ అప్!’ ఆంగ్లంలో లివ్ ఇట్ అప్ అన్నది సామెత. (పరుల) డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టెయ్యడం అని దాని అర్ధం! ‘అనుభవించు రాజా’ అని అన్న గారు పాడినట్లు!

‘పర్యావరణానికి నష్టం కదా’ అని చట్టబద్ధ న్యాయ సంస్ధ అడుగుతుంటే ‘నేను కట్టను, కావాలంటే జైల్లో పెట్టు!’ అని అనడం ఏమిటి? 2.5 కోట్లు గ్రాంటుగా ఇచ్చే కేంద్రం తన చెంత ఉండగా కోర్టులు ఏం చేస్తాయన్న ధైర్యమా?

ఆ ధైర్యంతోనేగా కన్హైయా వీడియోల మార్ఫింగ్ జరిగింది! ఆ ధైర్యంతోనేగా పోలీసుల ముందే విద్యార్ధులను, ప్రొఫెసర్లను, విలేఖరులను లాయర్ గూండాలు కొట్టింది! ఆ ధైర్యంతోనేగా పార్లమెంటులో మానవ వనరుల శాఖ మంత్రి తన సబ్జెక్ట్స్ (పాలితులు) పైనే వరసబెట్టి అబద్ధాలు చెప్పింది! ఈ నేరాలపై ఇంతవరకు సరైన కేసులు లేవు మరి!

అభిమాన గణాలు తమ బుర్రలకు నిజాయితీగా పని పెట్టాల్సిన తరుణం ఇది.

5 thoughts on “ఆర్ట్ ఆఫ్ "లివింగ్ ఇట్ అప్"

  1. చాలా విషయాల్లో ప్రజల పక్షాన నిలబడే కేజ్రీవాల్ ఈ విషయంలో మాత్రం ఎందుకు రవిశంకర్ కు వంత పాడుతున్నాడోఝ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s