ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా ఉన్మాదపూరిత భావోద్వేగాలతో దేశంలో గాలిని నింపేశాక కన్హయ్య, ఉమర్ ఖలీద్, అనిర్బన్ లాంటి వాళ్ళకు రక్షణ ఎక్కడ ఉంటుంది?
దేశ రాజధానిలో కోర్టు ఆవరణలోనే న్యాయాన్ని రక్షిస్తామని పట్టా పుచ్చుకున్న న్యాయవాదులు పోలీసుల సాక్షంగా కన్హయ్యపై దాడి చేశారు. ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో తన వారి మధ్య భద్రంగా ఉన్నాడనుకున్న కన్హయ్యను దుండగుడు ఒకరు బూతులు తిట్టి, కొట్టారని వార్త వెలువడింది.
పిటిఐ వార్తా సంస్ధ ప్రకారం JNUSU అధ్యక్షుడు కన్హయ్యపై బైటి నుండి వచ్చిన వ్యక్తి ఒకరు దాడి చేసి కొట్టాడు. మాట్లాడాల్సిన పని ఉందని పక్కకు పిలిచి హఠాత్తుగా తిట్లకు లంకించుకుని కొట్టడం మొదలు పెట్టాడు.
యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ‘జాతీయవాదం’ అంశం పైన ఈ రోజు (గురువారం, మార్చి 10) ఒక ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయేందుకు కన్హయ్య అక్కడికి వచ్చారు. అనేకమంది ప్రొఫెసర్లు, విద్యార్ధులు కూడా అక్కడ ఉన్నారు. యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు.
ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కన్హయ్య దగ్గరికి వచ్చి “మీతో మాట్లాడే పనుంది” అని కోరాడు. అతన్ని నమ్మిన కన్హయ్య అతనితో కలిసి ఓ మూలకు వెళ్లారు. ఏమి మాటలు జరిగాయో ఇంకా వెల్లడి కాలేదు కానీ ఆ వ్యక్తి పెద్దగా తిడుతూ కన్హయ్య చెంపపై కొట్టాడు.
వెంటనే అక్కడ ఉన్న ప్రొఫెసర్లు, విద్యార్ధులు అప్రమత్తం అయ్యారు. అక్కడికి పరుగెత్తుకు వెళ్లారు. సెక్యూరిటీ గార్డులు కూడా పరుగెత్తుకుని వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్ధులు కన్హయ్య చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి రక్షణ కల్పించారు.
సదరు వ్యక్తిని అక్కడికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అప్పగించారు. పోలీసులు అతన్ని నిర్బంధం లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని సమాచారం. అతను ఎవరో, ఎందుకు అక్కడికి వచ్చాడో ఇంకా తెలియలేదని, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు చెప్పారు.
కన్హయ్య యూనివర్సిటీ క్యాంపస్ నుండి బైటికి వస్తే అతని కదలికల సమాచారం తమకు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీని ఇప్పటికే కోరి ఉన్నారు. బైటికి వస్తే దాడి జరగవచ్చని, కాబట్టి కోర్టు ఆదేశాలను అనుసరించి ఆయనకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని, అందుకోసమే ఆయన ఎక్కడికి వెళ్ళేదీ సమాచారం ఇవ్వాలని కోరారు.
యూనివర్సిటీ బైట మాత్రమే కాకుండా లోపల కూడా కన్హయ్యకు రక్షణ కల్పించాల్సిన అవసరం కోసమే దాడి జరిగిందా? ఈ వంకతో పోలీసులు యూనివర్సిటీలో తిష్ట వేయనున్నారా? వేచి చూడాలి.