“కన్హైయా కుమార్ ఎన్నికల ప్రచారంలో సిపిఐ, సిపిఎం పార్టీల తరపున పాల్గొంటారు” అని ఇరు పార్టీలు పుత్రోత్సాహంతో ప్రకటించేశాయి. తద్వారా జేఎన్‌యూ విద్యార్ధుల పోరాటాన్ని తీసుకెళ్లి పార్లమెంటు/అసెంబ్లీ ఎన్నికల రొంపిలోకి దింపి స్వప్రయోజనాలకు వినియోగించడానికి ఆ పార్టీలు తలపెట్టాయి.
సిపిఎం నేత సీతారాం యేచూరి, సిపిఐ నేత డి రాజాలు ఇద్దరూ ఈ మేరకు టివి ఛానెళ్లలో కనపడి ప్రకటన చేశారు. కన్హైయా బెయిల్ పై విధించబడ్డ షరతుల రీత్యా ఆయన కేరళ, బెంగాల్ కు ప్రయాణించబోరని ఆ తర్వాత సీతారాం చెప్పారు.
విద్యార్ధులు పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంలో తప్పేమీ లేదు. కానీ అది స్వతంత్ర ఆలోచనతో జరగాలి తప్ప ఉద్యమ ప్రభావాన్ని సొమ్ము చేసుకునేందుకు జరగకూడదు. అలా చేస్తే కాంగ్రెస్, బిజేపి తదితర పార్టీలకు సిపిఐ, సిపిఎం లకూ తేడా ఏముంటుంది?
కన్హైయా కుమార్ కి పేరు, ప్రతిష్టలు రావడంలో ఆయన కట్టుబడిన కమ్యూనిస్టు రాజకీయాలు గణనీయమైన పాత్ర పోషించాయడంలో సందేహం లేదు. కానీ అవి కేవలం సిపిఐ, సిపిఎం ల రాజకీయాల వల్లనే వచ్చాయని భావిస్తే మాత్రం అభ్యంతరకరమే.
అఫ్జల్ గురు కార్యక్రమ నిర్వాహకులు ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలే గానీ కన్హైయా కుమార్ కాదు. అఫ్జల్ గురు ప్రాతినిధ్యం వహించిన కాశ్మీర్ స్వయం నిర్ణయాధికార రాజకీయాలు సిపిఐ, సిపిఎం లకు లేవు. కాశ్మీరీ మిలిటెంట్లను టెర్రరిస్టులుగా నిందించడంలో పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు బూర్జువా పార్టీల కంటే వెనకబడి ఏమీ లేవు.
కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును గుర్తిస్తూ, ప్రజాభిప్రాయ సేకరణ (ఫ్లెబిసైట్) జరిపిస్తానని ప్రధమ ప్రధాని నెహ్రూ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఐ, సిపిఎం లు ఎన్నడూ డిమాండ్ చేయలేదు. కనుక అఫ్జల్ గురు కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతిష్టను సొమ్ము చేసుకోవాలని చూడడం ఆ పార్టీలకు తగని పని.
ఒక రంగంలో పేరు ప్రతిష్టలు వస్తే వాటిని వెంటనే ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడంలో కాంగ్రెస్, బిజేపి లాంటి పార్టీలు ఎలాంటి తప్పూ చూడరు. సిపిఐ, సిపిఎం లు కూడా చూడవా?
కన్హైయా కుమార్ సంపాదించిన ప్రతిష్ట ప్రధానంగా జేఎన్‌యూ విద్యార్ధుల వల్ల వచ్చింది తప్ప ఏఐఎస్‌ఎఫ్ నాయకుడుగా రాలేదు. క్యాంపస్ వరకు ఆయన ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు కావచ్చు గానీ దేశానికి పరిచయం అయింది మాత్రం జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు గానే. అత్యంత ప్రజాస్వామిక వాతావరణానికి నిలయమైన జేఎన్‌యూ విద్యార్ధి నేతగా జేఎన్‌యూ విద్యార్ధుల నుండీ, ఉపాధ్యాయుల నుండీ పొందిన మద్దతు వల్లనే ఆయనకు క్యాంపస్ బయట కూడా ఆదరణ లభించింది.
కన్హైయా కుమార్ చేసిన ఉత్తేజపూరిత ప్రసంగాలు వాటంతట అవే ఆయనకు ప్రతిష్టను తేలేవు. ప్రసంగాలు ఒక సహాయకారి మాత్రమే. కన్హైయా అసలు పునాది జేఎన్‌యూలో ఉన్నది. ఆ పునాది ఆయన సంపాదించిన పేరుకు ప్రధాన కారణం.
జేఎన్‌యూలో ఆ పునాది లేకపోతే కన్హైయాకు అసలు ఆ యూనివర్సిటీలో సీటు వచ్చి ఉండేది కాదని ఆయన ప్రసంగాల ద్వారానే మనకు అర్ధం అవుతుంది. దశాబ్దాల ఆచరణ ద్వారా జేఎన్‌యూ స్ధాపించిన ప్రజాస్వామిక, వైవిధ్య పూరిత ఎంపిక ప్రక్రియల ద్వారా అక్కడ చేరిన విద్యార్ధులు, ప్రొఫెసర్లు అందరూ కలిసి యూనివర్సిటీలో అఫ్జల్ గురు ‘జ్యుడీషియల్ మర్డర్’ పై నిరసన తెలియజేసే వాతావరణాన్ని సృష్టించారు.
అఫ్జల్ గురు కార్యక్రమంలో తన పాత్ర లేదు అంటూనే, కార్యక్రమం నిర్వహించడానికి వారికి గల హక్కుకు కన్హైయా మద్దతు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకించే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎవరికైనా ఉంటుందని, ఆ హక్కు రాజ్యాంగం కల్పించినదేననీ కన్హైయా చెప్పినట్లు పత్రికలు తెలిపాయి.
కానీ ఈ భావాలను సిపిఐ, సిపిఎంలు బహిరంగంగా వ్యక్తం చేయడం జరగలేదు. సైద్ధాంతికంగా ఆ అవగాహన వారికి ఉన్నదేమో తెలియదు గానీ పార్లమెంటు చర్చల్లో, ఎన్నికల ప్రచారంలో, సభల్లో, సమావేశాల్లో వారా అవగాహన తెలియజేయడం జరిగిందా? కాశ్మీర్ సమస్యపై వారు రాసిన పుస్తకాలు కూడా అలాంటి అవగాహన వ్యక్తం చేయలేదు.
కనుక జేఎన్‌యూ లో అఫ్జల్ గురు కార్యక్రమం దరిమిలా కన్హైయా కుమార్ కు వచ్చిన ప్రతిష్టకు సిపిఐ, సిపిఎం రాజకీయాలకూ సంబంధం చూడలేము. అందువల్ల కన్హైయాను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం రాజకీయంగా సరైన చర్య కాబోదు.
కాగా బెంగాల్ లో మమత బెనర్జీని ఓడించడానికి గత్యంతరం లేని పరిస్ధితుల్లో కన్హైయా కుమార్ వైపు ఆశగా చూస్తుంటే గనుక అంతకంటే దివాళాకోరుతనం ఆ పార్టీలకు ఉండదు. పేరు పొందిన మహా మహా నేతలు తమ రాజకీయాలు, తమ గత పాలన ఫలితాలు చెప్పుకుని ఓట్లు అడగడానికి బదులు విద్యార్ధి నాయకుడిని అరువు తెచ్చుకోవడం చిన్నతనం!
బండరాళ్లను పెళ్లగించడానికి చిన్న రాళ్ళు ఉపయోగపడవచ్చు గానీ పాతుకు పోయిన కొండలను పెళ్లగించడానికి అది పనికి రాదు. కొండల పరిమాణం లోని రాజకీయాలు, విధానాలు తమ వద్ద ఉన్నాయని ప్రజలకు చెప్పగలగడమే నిజమైన రాజకీయం కాగలదు.
పోనీ ఇప్పటికైనా మించిపోలేదనుకుని, జే ఎన్ యూ దారిలో ఈ పార్టీలు కూడా నడవాలనుకుంటే, వారి ఆ కొత్త అవగాహననూ, నిబద్ధతనూ ప్రజల ముందు ప్రకటించుకునే మార్గమేదైనా ఉందా అని నా ప్రశ్న.
అఫ్జాల్ గురు వల్ల కన్హయ్య కు పేరు రాలేదు సర్ అన్యాయంగా అరెస్ట్ అయినందుకు దానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు మద్దతు ఇచ్చారు.
కళ్యాణి గారు, కొత్త అవగాహనకు మనసే ఉంటే మార్గం మాత్రం ఎందుకుండదు! ఆ పార్టీల నిబద్ధత ఎన్నికల వరకు వచ్చి ఆగిపోతుంది. ఎన్ని వీరాలాపాలు పలికినా అంతిమంగా వాటిని ఎన్నికల వధ్యశిలపై బలి ఇచ్చేస్తారు. పార్లమెంటు రొంపిలోకి దిగాక బైట పడడం కల్ల.
శ్రీనివాస్ గారు, అఫ్జల్ గురు అనే వ్యక్తికి ప్రాధాన్యం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించే కాశ్మీరీల ఆకాంక్షలకే ప్రాధాన్యం.
అఫ్జల్ గురు ఒక లొంగిపోయిన మిలిటెంటు. జేకేఎల్‌ఎఫ్ లో పని చేశాక లొంగిపోయి తన బతుకేదో తాను బతుకుతున్నాడు. కానీ పోలీసులు/సైన్యం అతన్ని వదిలిపెట్టలేదు. వెంటపడి వేధించారు. అతన్ని నిలువునా దోచుకున్నారు. వారు చేయమన్నదల్లా చేసి పార్లమెంటు దాడి కుట్రలో ఇరుక్కుపోయాడు. ఆ విధంగా కూడా కాశ్మీరీలపై సాగుతున్న అణచివేతకు ఆయన ప్రతిబింబం.
అఫ్జల్ గురు కార్యక్రమం జరగడమే జేఎన్‌యూపై దాడికి ఆరంభం.
కన్హయ్య అన్యాయంగా అరెస్ట్ అయ్యాడు అన్నారు కదా? ఆ అన్యాయం ఏమిటి చెప్పండి! తాను ఇవ్వని స్లోగన్స్ ని ఇచ్చినట్లు చెప్పడమే కదా. ఆ స్లోగన్స్ ని ఉమర్ ఖలీద్, అనిర్బన్ లు కూడా ఇవ్వలేదు కదా. వాళ్ళ అరెస్టు అన్యాయం కాదా?