బడ్జెట్ 2016: పాపులిస్టు ముసుగులో సంస్కరణలు -2


Budget 2016-17 -Jaitley

విద్య, ఆరోగ్యం, కుటుంబ, స్త్రీ శిశు సంక్షేమం

ఈ రంగాలకు కేటాయింపులు భారీగా పెంచినట్లు మోడి-జైట్లీ బడ్జెట్ చూపింది. బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపడం ఆనక చడీ చప్పుడు కాకుండా సవరించి కోత పెట్టడం మోడి మార్కు ‘బడ్జెట్ రాజకీయం’. వివిధ శాఖల్లోని అంకెలను కలిపి ఒకే హెడ్ కింద చూపుతూ భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పుకోవడం కూడా మోడి మార్కు మాయోపాయం. ఉదాహరణకి స్త్రీ, శిశు సంక్షేమం కింద బడ్జెట్ లో చూపినదంతా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ఇచ్చేస్తారని అర్ధం కాదు. వివిధ శాఖల్లో మహిళల పేరుతో జరిపిన కేటాయింపులని కూడా మహిళా సంక్షేమంగానే చూపిస్తున్నారు. 2014-15లో 2015-16 బడ్జెట్ లో ఈ విధంగా చూపిన మొత్తం రు 16,657 కోట్లు. ఆ తర్వాత ఇందులో 5,269 కోట్లు కోత పెట్టి 11,388 కోట్లకు సవరించారు. ఇది కూడా ఇవ్వలేదని అంతిమంగా 10,287 కొట్లే ఇచ్చారని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక తెలిపింది. చివరికి స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ సైతం ఈ ధోరణిపై విమర్శలు గుప్పించారు. తమ శాఖకు ప్రభుత్వం ఎంత ఇస్తుందో ఒక సస్పెన్స్ గా మారిందని ఆమె విమర్శించారు. ఈ నేపధ్యంలో 2016-17లో కేటాయించిన 17,412 కోట్లలో వాస్తవంగా ఎంత ఖర్చు చేస్తారో చెప్పలేము.

ఐ‌సి‌డి‌ఎస్ పధకానికి 2014-15 బడ్జెట్ లో 18,321 కోట్లు ప్రకటించి ఆ తర్వాత 16,590 కోట్లకు తగ్గించారు (బిజినెస్ స్టాండర్డ్) 2015-16 బడ్జెట్ లో 15,484 కోట్లు ప్రకటించి 8,335 కోట్లకు తగ్గించారు (ద హిందు). ఈ యేడు కేటాయింపులే 14,960 కోట్లకు తగ్గించారు. వాస్తవ ఖర్చు మరింత తగ్గిపోతుందని చెప్పనవసరం లేదు. ప్రధాని మోడి తరచుగా భారత జనాభాయే తరగని ఆస్తిగా చెబుతుంటారు. కానీ వారి అభివృద్ధికి చేసేది ఆయన దృష్టిలో వృధా ఖర్చు. 15 రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 5 సం.ల లోపు పిల్లల్లో 37 శాతం మందిలో ఎదుగుదల లేక గిడసబారి పోతున్నారు. 34 శాతం మంది సాధారణం కంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ పరిస్ధితి మారాలంటే ఐ‌సి‌డి‌ఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పధకం) కు, గర్భిణీ స్త్రీలకు మరిన్ని నిధులు కేటాయించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎలా తగ్గించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. గుజరాత్ ఆడ శిశువుల్లో పోషక లోపానికి కారణం అడిగితే ఆడ పిల్లలు సౌందర్య దృష్టితో పాలు తాగితే లావు అయిపోతామని భయపడుతుండమేనని చెప్పిన మోడికి శిశు సంక్షేమం ప్రాధాన్యత అర్ధం చేసుకోగలరని భావించడం అత్యాశే కావచ్చు.

మధ్యాహ్న భోజన పధకం కూడా ఇదే పరిస్ధితి ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ప్రాధమిక, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను కలుపుకుంటే ఈ పధకంపై 10.33 కోట్ల విద్యార్ధులు ఆధారపడి ఉన్నారు. వారి భవిష్యత్తు ఆగమ్య గోచరం చేస్తూ పధకం నిధులను మోడి ప్రభుత్వం తగ్గించి వేస్తోంది. 2014-15లో 13,215 కోట్లు కేటాయించగా అది 2015-16లో 9,236 కోట్లకు పడిపోయింది. 2016-17 బడ్జెట్ లో 9,700 కోట్లకు పెంచినట్లు చూపినప్పటికీ ఇందులో ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక కేటాయింపులు 924 కోట్లు కలిసి ఉంది. అనగా వాస్తవ కేటాయింపులు 8,776 కోట్లు మాత్రమే. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 36.86 శాతం పిల్లలే. ఒక సర్వే ప్రకారం వారి పోషకాహారం, విద్య తదితర అవసరాలకు ఖర్చు పెట్టిన మొత్తం గత 15 యేళ్లలో బడ్జెట్ లో ఎన్నడూ 5 శాతం మించలేదు. పేద పిల్లల పట్ల యూ‌పి‌ఏ చూపిన నిర్లక్ష్య ధోరణిని ఎన్‌డి‌ఏ కొనసాగించడమే కాదు, మరింత దిగజారింది.

ఆరోగ్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. జనాన్ని దరిద్రంలోకి నెడుతున్న కారణాల్లో ఆరోగ్య ఖర్చులు ఒకటి కాగా వైద్య భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కాస్మోటిక్ ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నాయి. వైద్య ఖర్చుల భారం వల్ల ఇండియాలో ప్రతి యెడూ 3.9 కోట్ల మంది దరిద్రం ఎదుర్కొంటున్నారని ప్రఖ్యాత బ్రిటిష్ వైద్య పత్రిక లాన్సెట్ తెలిపింది. లాన్సెట్ ప్రకారం ప్రతి లక్ష మంది భారతీయుల్లో ప్రతి సం. 683 మంది అంటు రోగాలు కానీ జబ్బుల వల్ల మరణిస్తున్నారు. WHO ప్రకారం ప్రపంచ సగటు 589. మృత శిశు జననాలు, ప్రసవ మరణాలు ఇండియాలోనే ఎక్కువ. పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు నానాటికీ దిగజారుతున్నాయి. ప్రజా ఆరోగ్యం పట్ల మోడి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని లాన్సెట్ పత్రిక తీవ్రంగా విమర్శించింది. “మోడి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యం అదృశ్యం అయింది. ఇండియా సంక్షోభం అంచున ఉన్నది. వృద్ధి చెందుతున్న జనాభా ఆరోగ్యం గురించి పట్టించుకోక పోతే భారత ఆర్ధిక వ్యవస్థ నిలబడడం కష్టం. కానీ మోడి ఇప్పటివరకు ఆరోగ్య రంగం కోసం ఏమీ చేయలేదు. ప్రపంచ వేదికల్లో నాయకత్వ పాత్ర పోషించాలని భావిస్తున్న ఇండియా తన పిల్లలు, తల్లులను ఇలా దరిద్రంలోకి నెడితే ఆ కల నెరవేరదు” అని లాన్సెట్ తూర్పారబట్టింది.

దేశంలో వైద్య సేవలు ప్రధానంగా ఉప, ప్రాధమిక మరియు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. అయితే ప్రాధమిక కేంద్రాల్లో 3,000కు పైగా డాక్టర్ల కొరత ఉన్నది. కమ్యూనిటీ కేంద్రాల్లో గైనకాలజిస్టులు, సర్జన్లు, ఫిజీషియన్లు లాంటి స్పెషలిస్టుల పోస్టులు 83 శాతం ఖాళీగా పడి ఉన్నాయి. 1000 మంది జనాభాకు 0.5 ఆసుపత్రి మంచాలు మాత్రమే ఉన్నాయి. (చైనాలో ఈ సంఖ్య 3 కాగా రష్యాలో 9). మొత్తం మౌలిక నిర్మాణ ఖర్చుల్లో ఎక్స్ ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు మొ.న వృధా ఖర్చులకు పోను 0.21 శాతమే వైద్యరంగంపై పెడుతున్నారు. మొత్తం మీద 6700 ప్రాధమిక వైద్య కేంద్రాలు, 2,350 కమ్యూనిటీ కేంద్రాల కొరత ఉన్నదని 2014లో రాజ్యసభలో ప్రకటించారు. ఈ నేపధ్యంలో ప్రజలు ప్రైవేటు వైద్యంపై భారీగా ఖర్చు పెడుతున్నారు. కొనుగోలు శక్తి కోల్పోయి దరిద్రులుగా మారుతున్నారు. టి.బి, మలేరియాల వల్లనే లక్షల మంది యేటా చనిపోతున్నారు. ఈ పరిస్ధితుల్లో మోడి-జైట్లీ బడ్జెట్ లో ప్రధాన ఆరోగ్య సేవ ‘స్వచ్చ భారత్’ మాత్రమే. ఈ పధకం ఇంతవరకు సాధించింది ఏమిటో ఇంతవరకు చెప్పినవారు లేరు. 2014-15 లో 30,645 కోట్లు, 2015-16లో 33,150 కోట్లు ఆరోగ్య సేవలకు కేటాయించిన ఎన్‌డి‌ఏ ప్రభుత్వం 2016-17 లో 39,532 కోట్లు కేటాయించింది. 2014-15 కేటాయింపుల్లో 6,000 కోట్ల మేర ఆ తర్వాత కోత పెట్టారు. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య సురక్ష యోజన, నేషనల్ హెల్త్ మిషన్, జాన్ ఔషధీ స్టోర్స్ మొ.న పధకాలు బడ్జెట్ లో ఉన్నాయి. ఇవన్నీ యూ‌పి‌ఏ ఇతర పేర్లతో ప్రవేశపెట్టినవే, ఒక్క స్వచ్ఛ భారత్ తప్ప. ఉప, ప్రాధమిక, కమ్యూనిటీ వైద్య కేంద్రాల కొరత, డాక్టర్లు, స్పెషలిస్టుల కొరత ఎలా తీర్చేదీ జైట్లీ బడ్జెట్ చెప్పలేదు. ఆరోగ్య సేవలకు 3 శాతం (జి‌డి‌పిలో) ఖర్చు చేస్తామని బి‌జే‌పి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది. ఇది సం.కి 3.5 లక్షల కోట్లకు పైనే. 2016-17 బడ్జెట్ కేటాయింపులు అందులో 10వ వంతు మాత్రమే.

రక్షణ రంగం

బడ్జెట్ లో అత్యధిక మొత్తం (17.24 శాతం) కాజేసింది రక్షణ రంగమే. 3,40,922 కోట్లను రక్షణ కోసం జైట్లీ కేటాయించారు. ఇందులో పెన్షన్ల మొత్తం 70,414 కోట్లుగా భావిస్తున్నారు. క్రితం సం వరకు, ప్రపంచ బ్యాంకు ఒత్తిడితో, డిఫెన్స్ బడ్జెట్ నుండి పెన్షన్ కేటాయింపులను ప్రత్యేకంగా చూపించగా ఈ యేడు కలిపి చూపించారు. 2014-15లో రక్షణ బడ్జెట్ 2,29,000 + 53,582 (డిఫెన్స్ పెన్షన్లు) -మొత్తం 2,82,582- కోట్లు కాగా, 2015-16లో 2,46,727 + 62,852 కోట్లు -మొత్తం 3,09,579 కోట్లు. 2015-16లో 7.74 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ ఈ యేడు 10 శాతం పైనే పెరిగింది.

గ్రామాలకు, రైతులకు భారీగా కేటాయించారని పొగడ్తలు కురిపిస్తున్నవారు రక్షణకు ఇన్ని నిధులు ఎందుకు, ఎక్కడివని అడిగిన పాపాన పోలేదు. బహుశా అడిగితే అదొక దేశద్రోహమేమో! రక్షణ బడ్జెట్ లో అత్యధిక భాగం పాత ఆయుధ కొనుగోళ్లకు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులకే పోతుంది. రక్షణ నిధులు పాలక వర్గాలకు బంగారు గుడ్లు పెట్టే బాతుతో సమానం. ఎందుకంటే విదేశీ బహుళజాతి ఆయుధ కంపెనీలకు చేసే చెల్లింపుల్లో మొత్తాన్ని కమిషన్ రూపంలో భారత పాలకులకు ముడుతుంది. ఎవరు ఎన్ని నీతి కబుర్లు చెప్పినా రక్షణ కొనుగోళ్లలో దళారీ కమిషన్ చెల్లింపులు ఖాయం.

పాకిస్తాన్, చైనాలను చూపిస్తూ భారత పాలకులు రక్షణ బడ్జెట్ ను పెంచుతూ పోతున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా చైనాను చూసి ఆయుధ కొనుగోళ్లు పెంచుతున్నారు. పొరుగు దేశాలతో ఇండియా పెట్టుకునే శతృత్వం ప్రధానంగా అమెరికా ఆయుధ అమ్మకాల అవసరాన్ని తీర్చుతోంది తప్ప భారత రక్షణ అవసరాలను కాదు. పాక్ తో చర్చలు చేసినందుకు యూ‌పి‌ఏను పడ దిట్టిన మోడి అధికారంలోకి వచ్చాక తన విదేశీ మంత్రికి కూడా తెలియకుండా పాక్ వెళ్ళి అక్కడి ప్రధానితో తేనీటి విందులో పాల్గొనడం వెనుక అమెరికా ఒత్తిడి పని చేసింది. భారత్-పాక్ ల మధ్య శతృత్వం తగ్గించి పాకిస్తాన్ ను చైనా వైపు మళ్లడాన్ని నివారించడం, పాక్-ఇండియా స్నేహం ద్వారా ఆఫ్ఘన్ లో పాక్-ఇండియాల మధ్య దూరం తగ్గించడం తద్వారా అక్కడ అమెరికా ఉనికికి భంగం కలగ కుండా చూసుకోవడం మొ.న అమెరికా భౌగోళిక రాజకీయ అవసరాలు తీర్చడానికి పాక్, భారత్ లు ప్రస్తుతం మిత్రత్వం పాటిస్తున్నాయి. అమెరికా ఆదేశిస్తే మళ్ళీ శతృత్వం పాటించడానికి భారత, పాక్ పాలకులకు అభ్యంతరం ఉండదు. బహుళ ధృవ ప్రపంచంలో ఏ ధృవాన్ని మంచి చేసుకోకుండా వదిలి పెట్టడం దళారీ ప్రభుత్వాల ప్రయోజనాలకు నష్టకరం. చైనా, రష్యా, అమెరికాలతో సత్సంబంధాలకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ విదేశీ విధానంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పాక్ అధికారి ఒకరు “ఫలాలను వివిధ బుట్టల్లో పెట్టడమే మా వ్యూహం” అని సమాధానం ఇవ్వడం ఈ కోణంలో చూడాలి. ఈ వ్యూహ ప్రతి వ్యూహాలు రక్షణ కేటాయింపులు పెంచుతుండగా ప్రజల సంక్షేమం కోసం కేటాయింపులలో కోత విధిస్తున్నాయి.

అందరికీ విద్యుత్! -ఓ జోక్!

మే 1, 2018 లోపల దేశంలోని దాదాపు గ్రామాలన్నింటిని విద్యుదీకరిస్తాం అని జైట్లీ ప్రకటించారు. అసలు 2016-17 బడ్జెట్ లో 2018 లక్ష్యాన్ని ప్రకటించడం ఏమిటి? 2018 లక్ష్యానికి బదులు 2016-17లో ఎన్ని గ్రామాలు విద్యుదీకరిస్తామో చెబితే సందర్భశుద్ధి ఉండేది. అది చెప్పలేదు గానీ గ్రామాల విద్యుదీకరణకి 8,500 కోట్లు ప్రకటించారు. గత సం. ఆగస్టు 15 తేదీన ‘అందరికీ విద్యుత్’ పధకాన్ని ప్రధాని ప్రకటించారు. 18,500 గ్రామాలు విద్యుత్ కి నోచుకోలేదని చెబుతూ వచ్చే 1000 రోజుల్లో ఆ గ్రామాలను విద్యుదీకరిస్తామని వరమిచ్చారు. దానినే “2018 నాటికి 100 శాతం గ్రామాల విద్యుదీకరణ”గా ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు.

“అందరికీ విద్యుత్” అనేది నిజానికి ఒక జోక్! ఈ మాట 1978 నుండి చెబుతూనే ఉన్నారు మరి. “1995 నాటికి అన్ని గ్రామాలకూ విద్యుత్; 2000 నాటికి అన్ని ఇళ్లకూ విద్యుత్” లక్ష్యాన్ని కాంగ్రెస్ ఏలికలు ఆనాడు ప్రకటించారు. 2002లో ఎన్‌డి‌ఏ-1 పాలనలో ఈ లక్ష్యాన్నే “2009 నాటికి అందరికీ విద్యుత్” అని తేదీ మార్చి పునరుద్ఖాటించారు. మరో రెండేళ్లకు యూ‌పి‌ఏ అధికారం చేపట్టి “2012 నాటికి అందరికీ విద్యుత్” ప్రకటించింది. అందుకోసం ‘రాజీవ్ గాంధీ గ్రామీణ్ విద్యుతీకరణ్ యోజన’ (RGGVY) ప్రకటించింది. ఇంతకీ అందరికీ విద్యుత్ అంటే ఏమిటి? ప్రతి గ్రామానికీ విద్యుత్ అంటే ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ విద్యుత్ అని అర్ధమేనా? దురదృష్టవశాత్తూ, కాదు.

‘అందరికీ విద్యుత్’ లక్ష్యం లాగే దాని నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. అక్టోబర్ 1997కు ముందు ఒక గ్రామ రెవిన్యూ ఏరియాలో దేనికైనా సరే విద్యుత్ వినియోగిస్తే -ఉదాహరణకి ఒక వీధి లైటు వెలిగినా- ఆ గ్రామం పూర్తిగా విద్యుదీకరణ చెందినట్లే. అక్టోబర్ 1997 తర్వాత ఈ నిర్వచనం మారింది. ఒక గ్రామ రెవిన్యూ పరిధిలోని నివాసాల్లో (ఒక్క ఇల్లైనా ఒకే) విద్యుత్ ప్రసారం అయితే ఆ గ్రామం విద్యుదీకరించబడిన గ్రామం అవుతుంది. 2004-05లో కేంద్ర విద్యుత్ శాఖ నిర్వచనాన్ని మళ్ళీ సవరించుకుంది. ట్రాన్ఫార్మర్, పంపిణీ లైన్లు లాంటి మౌలిక వసతులు ఊరిలో పాటు దళిత బస్తీలోనూ ఉండాలి; పాఠశాలలు, పంచాయితీ ఆఫీసు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్ లు తదితర పబ్లిక్ వసతుల్లో విద్యుత్ ఉండాలి; మొత్తం నివాసాల్లో కనీసం 10 శాతం విద్యుత్ వసతి ఉండాలి. ఈ మూడు షరతులు పూర్తయితే ఇక ఆ గ్రామం పూర్తిగా విద్యుదీకరణ చెందినట్లు. అనగా గ్రామంలో 90 శాతం ఇళ్లకు విద్యుత్ లేకపోయినా, గ్రామాలకు అనుబంధంగా ఉండే హామ్లెట్ లలో విద్యుత్ స్తంభాలు లేకపోయినా ఆ గ్రామం విద్యుదీకరణ అయినట్లే లెక్క. ఇప్పటికీ ఈ నిర్వచనం కొనసాగుతోంది. ఇప్పుడు RGGVY కాస్తా DDUGJY (దీన దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన) అయింది.

సెప్టెంబర్ 2015 నాటికి 97 శాతం గ్రామాలు విద్యుదీకరణ అయ్యాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆధారిటీ (సి‌ఈ‌ఏ) ప్రకటించింది ఈ నిర్వచనం ప్రకారమే. ఆచరణలో 30 కోట్ల మంది ఇప్పటికీ కిరోసిన్ దీపం వెలుతురులో బతుకుతున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. బీహార్ లో 73.5 శాతం కుటుంబాలు, ఉత్తర ప్రదేశ్ లో 58.5 శాతం కుటుంబాలు, అస్సాం లో 36.8 శాతం కుటుంబాలు విద్యుత్ వెలుగులు ఎరుగవు. ఈ కుటుంబాలు ఉన్నది ప్రధాని చెప్పిన 18,500 గ్రామాల్లో కాదు సుమా! పూర్తి విద్యుదీకరణ సాధించినట్లు చెప్పే గ్రామాల్లోనే. గ్రిడ్ కు సాంకేతికంగా అందుబాటులో లేని గ్రామాల ఇళ్ళు, గ్రిడ్ లో ఉన్న గ్రామాలకు అనుబంధంగా ఉన్న హామ్లెట్ లలోని ఇళ్ళు, విద్యుదీకరణ పూర్తయిన గ్రామాల్లో విద్యుత్ లేని ఇళ్ళు ఇందులో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం విద్యుత్ లేని ఒక కోటి ఇళ్ళు విద్యుత్ పూర్తిగా లేని గ్రామాల్లో ఉండగా 29 కోట్ల కుటుంబాలు విద్యుదీకరణ సాధించిన గ్రామాల్లోనే ఉన్నారు. తాహతు లేక కనెక్షన్ తీసుకోని కుటుంబాలే ఇవన్నీ. గ్రిడ్ కు దూరంగా ఉన్న ఇళ్లకు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఇచ్చే పద్ధతి కొన్ని చోట్ల పాటిస్తున్నారు. కానీ అలాంటి చోట్ల యూనిట్ వెల చాలా ఎక్కువ. పేదలు, దిగువ మధ్య తరగతి జనం భరించలేరు.

ఈ పరిస్ధితుల్లో సో-కాల్డ్ స్వాతంత్ర దినం రోజున మోడి, బడ్జెట్ లో జైట్లీ అట్టహాసంగా ప్రకటించిన ‘అందరికీ విద్యుత్’ నినాదం ఒట్టి డొల్ల మాత్రమే అని భావించవచ్చు. పాలకుల దృష్టిలో 30 కోట్ల మందికి విద్యుత్ అందకపోయినా ఫర్వాలేదు. వాళ్ళ ఓట్లయితే కావాలి గానీ వాళ్ళకి విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం మాత్రం లేదు. అది వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్న రాయితీ.

సబ్సిడీల్లో కోత

సంస్కరణ విధానాల్లో భాగంగా సబ్సిడీలను క్రమంగా తగ్గించేసే ప్రక్రియను మోడి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రధానంగా ఎరువులు, పెట్రోలియం, ఆహార భద్రత రంగాల్లో సబ్సిడీల పంపిణీ జరుగుతుంది. ఈ రంగాల మొత్తం సబ్సిడీ గత సం. సవరించిన అంచనాల ప్రకారం 2,41,857 కోట్లు కాగా అందులో 10,071 కోట్లు కోత పెట్టి ఈ సం. 2,31,781 కోట్లు మాత్రమే కేటాయించారు. అనగా 4 శాతం కోత పెట్టారు. 2014-15లో మొత్తం సబ్సిడీలకు 2.66 లక్షల కోట్లు కేటాయించి వాస్తవంగా 2,53,915 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఎరువులు, రసాయనాల సబ్సిడీల కేటాయింపులు 72,438 కోట్లు (2015-16) నుండి 70,000 కోట్లకు తగ్గించగా పెట్రోలియం సబ్సిడీని 30,000 కోట్ల నుండి 26,947 (2016-17) కోట్లకు తగ్గించేశారు.

పెట్రోలియం సబ్సిడీ నిమిత్తం 2014-15లో 60,270 కోట్లు కేటాయించడం ప్రత్యేకంగా గమనార్హం. 60,270 కోట్ల సబ్సిడీని రెండేళ్లలో 26,947 కోట్లకు తగ్గించడం సామాన్యమైన విషయం కాదు. ఈ తగ్గింపు సంస్కరణ చర్యల్లో భాగంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ దోపిడీ వల్ల జరగడమే అసలు విషయం. 2014లో ప్రపంచ మార్కెట్ లో బ్యారెల్ కు 110 డాలర్లుగా ఉన్న పెట్రోలియం రేటు ఇప్పుడు 35 డాలర్లకు పడిపోయింది. దాదాపు మూడో వంతుకు తగ్గిపోయినప్పటికీ ఆ తగ్గుదల ప్రజలకు చేరకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేబులో వేసుకున్నాయి. దాదాపు 33,000 కోట్ల సొమ్ము వాహన, వంట గ్యాస్ వినియోగదారులకు దక్కకుండా మోడి ప్రభుత్వం సైంధవునిలా అడ్డుపడింది. వినియోగదారులకు తగ్గింపు చేరవేయడం బదులు వివిధ పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా జనాన్ని ప్రభుత్వం నిలువునా దోచుకుంది. ధరలు పెరిగినప్పుడు ‘నష్టాలు వస్తున్నాయ్ బాబోయ్’ అంటూ నానా యాగీ చేసి పెట్రోల్, డీజెల్, గ్యాస్ రేట్లు పెంచిన ప్రభుత్వాలు ధరల తగ్గుదలను మాత్రం జనానికి చేరకుండా అది కూడా దోచేశారు. అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా ధరలు నిర్ణయించడం సంస్కరణగా పేర్కొనే పాలకులు కనీసం ఆ రూట్ లో వచ్చిన లబ్దిని కూడా ప్రజలకు చేరవేయడానికి మనసు రాకపోయింది. మోడి ప్రభుత్వం పచ్చి ప్రజా వ్యతిరేకం అని చెప్పడానికి ఇంతకంటే దృష్టాంతం ఉండబోదు.

‘వినియోగదారీ వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ’ పద్దు కింద 1,41,392 కోట్లు కొత్త బడ్జెట్ లో ప్రకటించారు. ఆహార భద్రత, ప్రజా పంపిణీ వ్యవస్థ పద్దుల కింద ప్రజలకు అందజేసే సబ్సిడీలు ఈ మొత్తం నుండే అందవలసి ఉంటుంది. FCI గోదాముల నిర్వహణ ఈ శాఖ పరిధిలోనిదే. ప్రజా పంపిణీ వ్యవస్ధలో ప్రజలకు చేరేలోపు బియ్యంలో 15 శాతం దారి మళ్లుతోందని గత యేడు ఆర్ధిక సర్వే పేర్కొంది. గోధుమల్లో 54 శాతం, పంచదారలో 48 శాతం ప్రజలకు చేరకుండా బొక్కేస్తున్నారని పేర్కొంది. ఈ దారి మళ్లింపును అరికట్టే బాధ్యత తీసుకోవడానికి బదులు ఆ వంకతో మొత్తం సబ్సిడీలోనే కోత పెట్టడం పాలకులు అనుసరిస్తున్న దగుల్బాజీ విధానం.

‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’ (గ్రామాల్లో రోడ్లు) పధకానికి 19,000 కోట్లు, గ్రామేతర రోడ్లకు 55,000 కోట్లు, నేషనల్ హైవే ఆధారిటీ బాండ్ల ద్వారా రోడ్లకు మరో 15,000 కోట్లు బడ్జెట్ లో ప్రకటించారు. మొత్తం మీద రోడ్ల మీద 92,000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు. బడా కంపెనీలకు మార్కెట్ కల్పించే ఉద్దేశంతోనే ఇంత భారీ మొత్తాన్ని రోడ్ల పాలు చేస్తున్నారు. రోడ్లు మెరుగుపరచడం అవసరమే గానీ అవసరం లేకుండానే ఆరు లేన్లు, 8 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేలు, ఎక్కడ పడితే అక్కడ వేల కిలో మీటర్ల పొడవునా వందలాది ఫ్లై ఓవర్లు నిర్మించవలసిన అవసరం మాత్రం ఖచ్చితంగా లేదు. బహుళజాతి కార్ల కంపెనీలకు, విదేశీ సరుకు రవాణాకు అనువుగా ఈ నిర్మాణాలు చేస్తున్నారు తప్ప ప్రజా జీవనం మెరుగుపరిచే లక్ష్యంతో కాదు. విదేశీ నిర్మాణ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న స్థానిక బడా నిర్మాణ కంపెనీలు వాల్ స్ట్రీట్ పెట్టుబడులను రుణాలుగా స్వీకరించి ఈ నిర్మాణాలు చేస్తున్నాయి. అనగా అంతిమ లబ్దిదారులు వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కాగా భారతీయ పెట్టుబడిదారులు కేవలం కమిషన్ లబ్దిదారులు మాత్రమే. సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవ చేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు పెంచుతున్నారు. పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్ మాటున నిర్మాణాల అనంతరం టోల్ రుసుము వసూలు చేసుకునే వసతిని వాల్ స్ట్రీట్ ఫైనాన్స్ కు కల్పిస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వ బడ్జెట్ వ్యయం కూడా అంతిమంగా బహుళజాతి ఫైనాన్స్ లాభాలకు కట్టబెడుతున్నారు.

ఇపిఎఫ్ టాక్స్

ఇపిఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. తెలుగులో ఉద్యోగుల భవిష్యనిధి. ఉద్యోగుల వేతనం నుండి నెలా నెలా నిర్దిష్ట మొత్తాన్ని (సాధారణంగా 10 శాతం ఉంటుంది) కత్తిరించి ఈ‌పి‌ఎఫ్ లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జత చేసి ఉద్యోగికి చెందిన ఈ‌పి‌ఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ రెండింటి మొత్తాన్ని తమ వద్ద ఉంచినందుకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. జి‌పి‌ఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), పి‌పి‌ఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లకూ ఈ‌పి‌ఎఫ్ కూ సంబంధం లేదు.

ఈ‌పి‌ఎఫ్ అనేది ఉద్యోగులు కూడబెట్టుకున్న డబ్బు. దశాబ్దాల పాటు ప్రభుత్వంలో సేవ చేసినందుకు ప్రతిఫలంగా రిటైర్ అయ్యాక అక్కరకు వస్తుందన్న ఉద్దేశ్యంతో చట్టాల నిర్దేశం మేరకు ప్రభుత్వం కొంత మొత్తాన్ని ఉద్యోగికి ఇస్తుంది. ఈ నిధిపైన కూడా ప్రభుత్వం కన్ను పడింది. ఇపిఎఫ్ నుండి అవసరాల కోసం ఎవరైనా డబ్బు తీసుకుంటే దానిపైన పన్ను వేస్తున్నట్లు జైట్లీ బడ్జెట్ ప్రకటించింది. సమాజం మొత్తాన్ని పెన్షన్డ్ స్థితి వైపుకి తీసుకెళ్లాడమే తమ లక్ష్యం అని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. కానీ అది కేవలం సాకు మాత్రమే. అదే లక్ష్యం అయితే ఎల్‌ఐ‌సి ఉద్యోగులు పెన్షన్ ఆప్షన్ మరొక్కసారి కల్పించాలని అనేక యేళ్లుగా డిమాండ్ చేస్తుంటే ఎందుకు ఒప్పుకోరు?

ఇపిఎఫ్ డబ్బుపై పన్ను వేయడం కాకతాళీయం కాదు. ఉద్యోగుల పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ నిధులపై ఎప్పటి నుండో బహుళజాతి కంపెనీల కన్ను పడింది. వందల బిలియన్ డాలర్ల మొత్తం భారత ప్రభుత్వం వద్ద వృధాగా మూలుగుతున్నదని బహుళజాతి కంపెనీల అభిప్రాయం. ఈ నిధులను కూడా ప్రైవేటీకరణకు అప్పజెప్పాలని అవి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేటీకరిస్తే పెన్షన్, పి‌ఎఫ్ నిధులు ప్రైవేటు కంపెనీల్లో పెట్టుబడులకు తరలిస్తారు. ఆ పెట్టుబడులపై వచ్చే లాభాలను ఉద్యోగులకు చెల్లిస్తారని కంపెనీలు, ప్రభుత్వాలు చెబుతాయి. మరి నష్టాలు వస్తేనో? ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టమే. నష్టాలను కూడా ఉద్యోగులు భరించాల్సి ఉంటుంది. ఉద్యోగుల భవిష్యనిధి కాస్తా బహుళజాతి ద్రవ్య కంపెనీల షేర్ మార్కెట్ ఆటలలో హరించుకుపోతుంది. భద్రత కలిగిన భవిష్య నిధి కాస్తా అబధ్రనిధి అవుతుంది. బహుళజాతి కంపెనీల డిమాండ్ మేరకు పెన్షన్, పి‌ఎఫ్ నిధులను ప్రైవేటీకరించే కృషిలో మొదటి అడుగుగా పి‌ఎఫ్ విత్ డ్రాయల్ లో 60 శాతంపై ఆదాయ పన్నును జైట్లీ ప్రతిపాదించారు. ప్రభుత్వ కంట్రిబ్యూషన్ పై రు 1,50,000 సీలింగ్ విధిస్తూ కూడా ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనలపై అన్ని వైపుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకంటే తిరోగమన చర్య ఉండబోదని విశ్లేషకులు విమర్శించారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విమర్శల నేపధ్యంలో బి‌జే‌పి సమర్ధకులు ఈ ప్రతిపాదనకు సొంత అర్ధాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పై కాకుండా ప్రభుత్వ కంట్రిబ్యూషన్ పై మాత్రమే పన్ను వేశామని చెప్పారు. ఆ తర్వాత ‘కాదు, కాదు. ప్రభుత్వ కంట్రిబ్యూషన్ పై ఇచ్చే వడ్డీ పైన మాత్రమే పన్ను’ అన్నారు. కానీ రెండు రోజుల తర్వాత ఆర్ధిక శాఖ ఇచ్చిన వివరణతో ఇవేవీ నిజం కాదని తేటతెల్లం అయింది.

విమర్శలు కొనసాగుతూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన నేపధ్యంలో బి‌జే‌పి ప్రభుత్వానికి 4 రాష్ట్రాల ఎన్నికలు గుర్తుకు వచ్చాయి. ఉద్యోగుల ఓట్లు గుర్తుకు వచ్చాయి. దానితో ప్రధాన మంత్రి మోడి రంగంలోకి దిగారు. ఇ‌పిఎఫ్ టాక్స్ విషయమై పునరాలోచన చేయాలని ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. దరిమిలా మార్చి 8 తేదీన పార్లమెంటులో ప్రకటన చేస్తూ ఈ‌పి‌ఎఫ్ పై చేసిన ప్రతిపాదనలన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు జైట్లీ ప్రకటించారు. ప్రభుత్వాలు దేశ ప్రజల ప్రయోజనాల కంటే బహుళజాతి కంపెనీల ఆదేశాలకే విలువ ఇస్తున్నందున ప్రస్తుతానికి ఊపంసహరించిన ఈ‌పి‌ఎఫ్ టాక్స్ మళ్ళీ మరో రూపంలో ఉద్యోగుల మెడ మీదికి రాదని గ్యారంటీ లేదు.

బడ్జెట్ లో 201-17 సం.కు గాను ప్రతిపాదించిన మొత్తం వ్యయం రు. 19,78,060 కోట్లు. ఇది గత సం సవరించిన అంచనాల (17,65,346 కోట్లు) కంటే 10.8 శాతం ఎక్కువ. మొత్తం రెవిన్యూ ఆదాయం 16,30,887 కోట్లుగా అంచనా వేయగా ఇందులో అత్యధిక భాగం -30.2 శాతం- కార్పొరేట్ పన్ను ద్వారా వస్తోంది. కార్పొరేట్ పన్నును ఐదేళ్లలో 30 శాతం నుండి 25 శాతానికి తగ్గిస్తానని జైట్లీ గత సం. వాగ్దానం చేశాడు. ఎన్నికల రీత్యా ఇది అమలు చేయడానికి ఆయన సాహసించలేదు. వచ్చే సం.లో ఏకంగా 2 శాతం తగ్గింపు చూపే అవకాశం లేకపోలేదు. కార్పొరేట్ పన్ను తగ్గించడం అంటే ఆదాయంలో పెద్ద మొత్తాన్ని వదులు కోవడమే. ప్రజల సబ్సిడీల మీద ఆక్రోశం వెళ్లగక్కే కార్పొరేట్లు తాము పొందే పన్ను రాయితీల గురించి నోరు మెదపరు. బడ్జెట్ లో కార్పొరేట్ లకు ప్రకటించిన వివిధ రాయితీల మొత్తం 2015-17 లో 6,11,128 కోట్లుగా తేలింది. ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వసూలు చేస్తే మొత్తం ఆదాయం 2016-17లో 16,30,887 కోట్లకు బదులు 22,42,015 కోట్లుగా తేలుతుంది. కాగా ప్రజల కోసం ఇస్తున్నట్లు చెప్పే సబ్సిడీ మొత్తం పైన చూసినట్లు 2,31,781 కోట్లు మాత్రమే. ఆహారం, పెట్రోలియం, ఎరువులకు ఇచ్చే ఈ సబ్సిడీలో కూడా భారీ మొత్తం దారి మళ్లి ధనికులకే చేరుతోందని ఆర్ధిక సర్వేయే చెబుతున్నందున ఇందులో కూడా ప్రజలకు వాస్తవంగా అందేదీ చాలా తక్కువ. ఇలాంటి సబ్సిడీలు తగ్గించేందుకు కూడా మోడి-జైట్లీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగా ఎరువుల సబ్సిడీలను కూడా నగదు బదిలీ పధకంలో చేర్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. అందుకోసం కేటాయింపులు కూడా చేశారు.

మోడి ప్రభుత్వం తలపెట్టిన మోసాల్లో ఆధార్ కు చట్టబద్ధత చేకూర్చడం. ఆధార్ కార్డును బి‌జే‌పి మొదటి నుండి వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ హఠాత్తుగా ఆధార్ కు చట్టపరమైన మద్దతు సమకూర్చుతూ బడ్జెట్ లో ప్రతిపాదన చేసింది. బిల్లు కూడా ప్రవేశ పెట్టింది. ఆధార్ కార్డు ద్వారా ప్రజల సమస్త వివరాలను గుప్పిట్లో పెట్టుకుకోవడానికి ప్రభుత్వాలు లక్ష్యం చేసుకున్నాయి. ఆధార్ డేటా ప్రైవేటు కంపెనీ ఆధ్వర్యంలో ఉండడంతో ప్రజల వివరాలకు తీవ్ర అబధ్రత పొంచి ఉంది. ఈ కారణంతోనే వివిధ పధకాలతో ఆధార్ కార్డు అనుసంధానాన్ని సుప్రీం కోర్టు నిలిపివేస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై సుప్రీం తుది తీర్పు వెలువడక ముందే మోడి ప్రభుత్వం చట్టాన్ని తెస్తున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ కి వ్యతిరేకంగా చెప్పిన కారణాలు ఇప్పుడు ఏమయ్యాయో వివరించివారు లేరు. మొబైల్ ఫోన్, గ్యాస్-ఎరువులు-విద్య-వైద్యం తదితర సౌకర్యాలకు ఆధార్ ను తప్పనిసరి చేస్తూ ప్రజల కదలికలను, ఆర్ధిక వ్యవహారాలను రాజ్యం పర్యవేక్షించనున్నది. కనుక ఆధార్ చట్టాన్ని ప్రజలు దృఢంగా తిరస్కరించాలి.

ప్రజలకు ఉద్దేశించిన సబ్సిడీలు ప్రజలకే చేర్చేందుకు నగదు బదిలీ పధకం అని చెబుతున్నారు. కానీ దీని అసలు లక్ష్యం సబ్సిడీల్లో కోత పెట్టడం. సబ్సిడీ రేటుకు సరుకును ప్రజల చేతుల్లో పెట్టడం, సబ్సిడీ మొత్తాన్ని నగదుగా ఇవ్వడం రెండూ ఒకటి కాదు. సరుకు ఇచ్చినప్పుడు సరుకు వినియోగం గ్యారంటీ అవుతుంది. సబ్సిడీ రహిత ధరకు సరిపోయిన డబ్బు పేదల దగ్గర ఉంటుందని ప్రభుత్వాలు భావించడమే ఒక అపభ్రంశం. సబ్సిడీ సరుకులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్ధితికి జనాన్ని నెట్టడం ప్రజా పాలకుల లక్షణం ఎంత మాత్రం కాదు. మరో వైపు అనేక దశాబ్దాలుగా ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రభుత్వ కంపెనీలను అమ్మివేసే లక్ష్యాన్ని తాజా బడ్జెట్ పునరుద్ఘాటించింది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో షేర్ల అమ్మకం ద్వారా ఈ యేడు 56,500 కోట్లు సంపాదించాలని బడ్జెట్ లక్ష్యం చేసుకుంది. ప్రభుత్వ కంపెనీల అమ్మకం ద్వారా స్థిర ఆదాయాన్ని ప్రైవేటుపరం చేయడమే ప్రభుత్వాల లక్ష్యం. తద్వారా విదేశీ బహుళజాతి కంపెనీలకు మార్కెట్ పెంచుతూ ప్రపంచ బ్యాంకు షరతులు పాలకులు నెరవేర్చుతున్నారు.

కొందరు విమర్శకులు, ప్రశంసకులు చెబుతున్నట్లుగా సంస్కరణలు ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో సంస్కరణలను పక్కన పెట్టారనడం నిజం కాదు. ఫిస్కల్ కన్సాలిడిడేషన్ (కోశాగార క్రమశిక్షణ) కు తాత్కాలిక విరామం ఇచ్చారన్నది కూడా వాస్తవం కాదు. ప్రకటిత ఫిస్కల్ లోటు 3.9 శాతం సాధిస్తామని బడ్జెట్ స్పష్టంగా పేర్కొంది. దానర్ధం సబ్సిడీ (వృధా) వ్యయం తగ్గించి పెట్టుబడిదారులకు కట్టబెట్టే సంస్కరణల లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పడమే. మాటలు మారాయి తప్ప సారం మారలేదు. బహుళజాతి కంపెనీలకు దూకుడుగా విధాన మద్దతు ప్రకటించడానికి బదులు పాపులిస్టు మోతలతో ఊదరగొడుతూ ప్రజా-వ్యతిరేక, కంపెనీ అనుకూలను చాప కింద నీరులా ప్రవేశపెట్టే కాంగ్రెస్ విద్యను జైట్లీ-మోడి బడ్జెట్ అలవారుచుకుంది. నకిలీ పాపులిస్టు ముసుగును అసలుగా చూపడంలో పత్రికలు సైతం తమ వంతు కృషి చేశాయి.

ఇవన్నీ మోడి-జైట్లీ బడ్జెట్ ప్రధాన ధోరణిని పట్టిచ్చే అంశాలు. ఆరంభంలో దూకుడుగా సంస్కరణలను అమలు చేసిన ఎన్‌డి‌ఏ/మోడి ప్రభుత్వం ఢిల్లీ, బీహార్ ఎన్నికలతో వెనక్కి తగ్గి సంస్కరణల చేదు మాత్రకు ‘గ్రామాలకు రైతులకు పెద్ద పీట’ అన్న తీపి పూత పూసారు. దానినే గ్రామాల-పేదల-రైతుల అనుకూలంగా నమ్మ బలుకుతున్నారు. తియ్యదనం పూత మాత్రమే అని గ్రహించినందునే షేర్ మార్కెట్లు మళ్ళీ 2,000 పాయింట్లు పుంజుకున్నాయి. కనుక అనేక మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ దురంధరులు, ఎన్‌జి‌ఓ నేతలు ప్రశంసలు కురిపిస్తున్న 2016-17 బడ్జెట్ నిజానికి 2016 ఎన్నికలే లక్ష్యంగా ప్రకటించిన మోసపూరిత బడ్జెట్ గా గ్రహించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s