“ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే ఇండియా మాత్రం అద్భుతమైన ప్రగతి (ఆర్ధిక వృద్ధి) నమోదు చేస్తుంది. ఇది మా విధానాల వల్లనే సాధ్యపడింది….” ఇది ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి మోడి తరచుగా చెబుతున్న మాట!
ప్రధాని మాటలు వాస్తవమేనా? కాదు అని ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాచారం చెబుతోంది. రాజ్య సభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు -మొదటి 9 నెలల్లోనే- బ్యాంకులలో రు. 94,966 కోట్లు నిరర్ధక ఆస్తులు (Non-Performing Assets -ఎన్‌పిఏలు) గా సమకూడాయి.
నిరర్ధక ఆస్తులు అంటే బ్యాంకులు ఇచ్చిన రుణాలు చెల్లింపులు లేక మూలపడడం. రుణాలు మంజూరు చేశాక వాటికి క్రమం తప్ప కుండా చెల్లింపులు జరగాలి. అవి మౌలిక నిర్మాణాల కోసం తీసుకున్నవి కావచ్చు. కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం కోసం, ఉన్న పరిశ్రమ విస్తరణ కోసం, సరుకుల ఎగుమతుల కోసం, పెట్టుబడి సరుకుల (capital goods) దిగుమతుల కోసం… ఇలా అనేక అవసరాల కోసం కంపెనీలు రుణాలు తీసుకుంటాయి.
ఈ రుణాలు వందల కోట్ల నుండి వేల కోట్ల వరకు ఉంటాయి. రుణాలకు చెల్లింపులు జరగకపోతే అవి బ్యాంకులకు భారంగా పరిణమిస్తాయి. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోతే భారమే కదా. బ్యాంకుల బ్యాలన్స్ షీట్లలో ఈ రుణాలు ఆస్తులుగా ఉంటాయి. కానీ వాటి పైన ఆదాయం మాత్రం ఉండదు. అందుకే వాటిని నిరర్ధక ఆస్తులుగా నిర్ధారిస్తారు.
ఉదాహరణకు విజయ్ మాల్యానే తీసుకోవచ్చు. యునైటెడ్ బ్రూవరీస్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తదితర కంపెనీల అధిపతి అయిన విజయ్ మాల్యా ప్రస్తుతం పత్రికలకు, ఛానెళ్లకు ఆహారంగా ఉన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఆయన తీసుకున్న వేల కోట్ల రుణం నిరర్ధక ఆస్తిగా వివిధ బ్యాంకుల బ్యాలన్స్ షీట్లలో వెక్కిరిస్తోంది.
2015 మార్చి చివరి నాటికి ప్రభుత్వ బ్యాంకుల వద్ద నిరర్ధక ఆస్తుల మొత్తం రు. 2,67,065 కోట్లు. అది డిసెంబర్ నెల చివరి నాటికి రు. 3,61,731 కోట్లకు చేరుకుంది. వెరసి 9 నెలల కాలంలోనే 94,666 కోట్ల నిరర్ధక ఆస్తులు ప్రభుత్వ బ్యాంకుల వద్ద జమ కూడాయి.
నిరర్ధక ఆస్తులు భారంగా పరిణమించడం భారత ఆర్ధిక వ్యవస్ధకు కొత్త కాదు. విచిత్రం ఏమిటంటే నిరర్ధక ఆస్తులు ప్రభుత్వ బ్యాంకుల వద్ద ఎక్కువగా పేరుకుపోతూ ఉండడం, అవి పెరుగుతూ పోవడం. దానికి కారణం కూడా రహస్యం ఏమీ కాదు. ప్రభుత్వరంగ బ్యాంకులు మంత్రులు, బ్యూరోక్రట్ల చేతుల్లో ఉంటాయి. వాళ్ళు ఉదారంగా రికమెండ్ చేస్తూ తమకు ఇష్టులైన వాళ్ళకి రుణాలు ఇప్పిస్తుంటారు. వాళ్ళ అండ చూసుకునే ఋణ గ్రహీతలు ధైర్యంగా వాటిని ఎగవేస్తారు.
రుణాల ఎగవేత వల్ల లాభం ఏమిటంటే ఎప్పుడోకప్పుడు వాటిని ప్రభుత్వాలు రద్దు చేసేస్తాయి. ఈ విధంగా అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాలు మొండి బాకీలుగా నిర్ధారించి రద్దు చేశాయి. ఎగవేసిన వాడికి శిక్షలు ఏవీ ఉండవు. వాళ్ళకు మళ్ళీ వందల, వేల కోట్ల రుణం ఇవ్వడం కొనసాగుతూనే ఉంటుంది.
ఎగవేసిన రుణాలను కోర్టుల ద్వారా వసూలు చేసుకునేందుకు బ్యాంకులు ఎప్పుడన్నా ప్రయత్నించవచ్చు. అలాంటి దుష్కృత్యాల(!) నుండి తప్పించుకోవడానికి ధనిక వర్గాలకు బోలెడు ఉపాయాలు అందుబాటులో ఉన్నాయి.
ఉదాహరణకి మళ్ళీ విజయ్ మాల్యానే తీసుకోవచ్చు. తమ ఛైర్మన్ విజయ్ మాల్యాతో సంబంధాలు తెంచుకుంటున్నామని చెబుతూ యూబి కంపెనీ ఈ మధ్య ప్రకటన చేసింది. తెగతెంపులు చేసుకున్నందుకు గాను ఆయనకు 515 కోట్లు ఇస్తున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది. (ఈ మొత్తాన్ని బాకీ కింద వసూలు చేసుకోవడం కోసం బ్యాంకులు ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి.)
తెగతెంపులు చేసుకోకపోతే యూబి కంపెనీ విజయ్ మాల్యా కిందనే ఉంటుంది కనుక బాకీ కింద యూబి కంపెనీ ఆస్తులను కూడా జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం బ్యాంకులకు దక్కకుండా తెగతెంపులు ప్రకటన చేశారు. తద్వారా విజయ్ మాల్యా తన కుటుంబ ఆస్తులను భద్రంగా కాపాడుకున్నారు. తెగతెంపులు ప్రకటనతో తండ్రీ కొడుకులు ఆస్తి తగాదాలతో విడిపోయినట్లు కొన్ని పత్రికలు భాష్యం చెప్పాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఆస్తులు కాపాడుకునే అవగాహనతోటే తెగతెంపులు జరిగాయి తప్ప ఆస్తి తగాదా కాదు.
విజయ్ మాల్యాకు తెగతెంపుల ద్వారా సమకూరిన 515 కోట్ల పైన మొదటి స్వాధీన హక్కు తమదే అని ఎస్‌బిఐ పిటిషన్ వేసి అనుమతి పొందింది. ఆయన విదేశాలు వెళ్లకుండా ఆపాలని బ్యాంకుల కన్సార్టీయమ్ పిటిషన్ వేసింది కూడా. విదేశాలు వెళితే బాకీ వసూలు కాదన్న భయంతో బ్యాంకులు కఠిన చర్య తీసుకుంటున్నాయి అన్న అభిప్రాయాన్ని ఈ ఎపిసోడ్ జనానికి కలిగిస్తోంది.
కానీ అసలు తెగతెంపులు జరిగేదాకా బ్యాంకులు ఎందుకు ఊరుకున్నాయనేది అసలు ప్రశ్న. విజయ్ మాల్యా/కింగ్ ఫిషర్ దివాళా వ్యవహారం ఈ రోజుది కాదు. అనేక యేళ్లుగా అది నలుగుతోంది. సిబ్బందికి జీతాలు సైతం ఇవ్వలేదని మూడేళ్ళ క్రితమే ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది సమ్మెలు కూడా చేశారు. ఈ పటికే యూబి ఆస్తులపై బ్యాంకులు క్లైమ్ చేసి ఉండాల్సింది కదా. తెగతెంపుల వరకూ ఆగి ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం బట్టి ఇరు పక్షాల మధ్య అవగాహన ఉన్నట్లు స్పష్టం కావడం లేదా?
బ్యాంకులు రుణాల ఎగవేతదారుల పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తాయి. వాళ్ళకు రుణాలు ఇప్పించేదే అధికార పెద్దలు కదా మరి. సూపర్ ధనిక వర్గాలంటే బ్యాంకులకు వల్లమాలిన ప్రేమ. ప్రజలు కూడబెట్టిన డబ్బును రుణాల రూపంలో సూపర్ ధనిక వర్గాలకు పందేరం పెడుతూ తగిన మొత్తాన్ని కమిషన్ గా బ్యాంకర్లు పొందుతారు. అందుకే వందలు, వేల కోట్లు రుణం ఇవ్వడం వారికి ఎంతో ప్రీతిపాత్రం.
అప్పులు తీసుకున్న కంపెనీలు చెల్లింపులు ఎగవేయడానికీ, మోడి/బిజేపి చెబుతున్న ‘అభివృద్ధి’ గొప్పలకూ సంబంధం ఏమిటని అడుగుతున్నారా? ఇండియా వృద్ధి రేటు అన్ని దేశాల కంటే అధికంగా ఉన్నది నిజమే కదా. ఉన్నది చెప్పుకుంటే మీకు అభ్యంతరం ఏమిటి? అని ఎవరికైనా అనుమానాలు రావచ్చు.
ఈ ప్రశ్నలకు సమాధానం కూడా అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలోనే ఉన్నది. నిరర్ధక ఆస్తులు పేరుకు పోవడానికి కారణం ఏమిటో జైట్లీ గారు తన సమాధానంలో పేర్కొన్నారు. “ఎన్‌పిఏలు పెరగడానికి కారణాలలో కొన్ని, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కోలుకోవడం నెమ్మదించడం, ప్రపంచ మార్కెట్లలో అనిర్ధిష్టత కొనసాగుతుండడం వల్ల టెక్స్ టైల్స్, ఇంజనీరింగ్ సరుకులు, తోలు ఉత్పత్తులు, జెమ్ లు తదితర సరుకుల ఎగుమతులు పడిపోవడం, ముడి సరుకుల ధరల్లో హెచ్చు తగ్గులు తీవ్రంగా ఉండడం, కొన్ని రంగాలకు విద్యుత్ లభ్యతలో కొరత ఏర్పడడం…”
ఇవన్నీ ఆర్ధిక వ్యవస్ధలోని అంశాలు. ప్రధాన మంత్రి గారు “అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది” అని చెబుతున్న జిడిపి వృద్ధికి సంబంధించిన అంశాలు. “ప్రపంచం అంతా తక్కువ జిడిపి వృద్ధితో మాంద్యం ఎదుర్కొంటుంటే ఇండియా మాత్రం వేగంగా వృద్ధి చెందుతోంది” అని ప్రధాని చెబుతుంటే ఆర్ధిక మంత్రి గారేమో “ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో మాంద్యం వల్ల దేశంలో ఎన్‌పిఏలు పెరుగుతున్నాయి” అని చెబుతున్నారు.
ఈ రెండు ప్రకటనలు పరస్పర విరుద్ధమైనవి. ప్రధాని ప్రకటన ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ లోని మాంద్యం వల్ల ఇండియాపై ప్రభావం లేదు అని చెబుతోంది. ఆర్ధిక మంత్రి ప్రకటన ప్రపంచ మాంద్యం వల్ల ఇండియా బ్యాంకులు సమస్యలు ఎదుర్కొంటున్నాయి అని చెబుతోంది. రెండూ విరుద్ధమైనవి కాదా?
ఈ రెండింటిలో నిజం ఏమిటి? ఆర్ధిక మంత్రి సమాధానమే నిజం. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న సమస్యల ప్రభావం ఇండియాపై లేకుండా పోదు. లిబరలైజేషన్, ప్రైవెటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాల వల్ల భారత ఆర్ధిక వ్యవస్ధ పశ్చిమ ఆర్ధిక వ్యవస్ధలతో మరింత విస్తృతంగా అనుబంధం అయిపోయింది.
ఎంత తీవ్రంగా అంటే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధల (పశ్చిమ ఆర్ధిక వ్యవస్ధలు అని చదువుకోవాలి) సమస్యలు మన దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రభావితం చేసేటంతగా. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి ఇండియా సాపేక్షికంగా తక్కువ ప్రభావితానికి గురయిందంటే కారణం ఇక్కడ ద్రవ్య వనరులు ప్రధానంగా ప్రభుత్వ రంగ కంపెనీల (బ్యాంకులు, ఎల్‌ఐసి, జిఐసి, యూటిఐ మొ.వి) ఆధీనంలో ఉండడమే. చైనాలో కూడా ద్రవ్య వనరులు ప్రభుత్వ నియంరణలో ఉండడం వల్ల 2008 సంక్షోభం నుండి త్వరగా కోలుకుంది.
కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి మారిపోయిందని ఆర్ధిక మంత్రి గారి ప్రకటన స్పష్టం చేస్తోంది. ఇతర దేశాల్లోని బలహీన ఆర్ధిక పరిస్ధితులు మన బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తుల్ని ఎందుకు పెంచుతున్నాయి? దీనర్ధం మన బ్యాంకులు ఇచ్చే రుణాలకూ ఇతర దేశాల (ముఖ్యంగా పశ్చిమ దేశాల) ఆర్ధిక వ్యవస్ధలకు నేరుగా సంబంధం ఉన్నట్లే. బ్యాంకులు మన దేశంలో ఆస్తులు, మౌలిక నిర్మాణాలు సృష్టించేందుకు కాకుండా విదేశీ కంపెనీలతో వ్యాపారాలకు వేల కోట్ల రుణాలు ఇవ్వడం తెలివైన ద్రవ్య నిర్వహణ కాబోదు. పదుల కోట్ల మంది ఉపాధి లేక, కొనుగోలు శక్తి పడిపోయి, వినియోగం తగ్గిపోయి దరిద్రంలో మగ్గుతుంటే నిరర్ధక ఆస్తులు పెరిగే రుణాలు ఇవ్వడం క్షమార్హం కాజాలదు.
విజయ్ మాల్యాకు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణంలో 7,000 కోట్లు నిరర్ధక ఆస్తులుగా తేలాయని పత్రికలు చెబుతున్నాయి. ఈ రుణాలన్నీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఇచ్చినవే. ఈ సొమ్ముతో విజయ్ మాల్యా విచ్చలవిడిగా స్వర్గ భోగాలు అనుభవించాడని ఆయన జీవన విధానం తెలిసినవారికి అర్ధం అవుతుంది. సిబ్బందికి జీతాలు సైతం సరిగ్గా ఇవ్వకుండా సంస్ధను బొంద పెట్టించిన మాల్యా రుణాలను ఇతర సొంత కంపెనీలకు తరలించుకుని వాటిని కాపాడుకోవడానికి తెగతెంపులు నాటకానికి తెర తీశాడు.
ఈ రుణాలు వసూలు అయ్యేవి కావు. కొన్నాళ్ళ తర్వాత మొండి బకాయిలుగా రద్దయిపోతాయి. ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ 2015 వరకు రు 8,033 కోట్ల నిరర్ధక ఆస్తులను మొండి బకాయిలుగా నిర్ధారించి రద్దు చేశామని ఆర్ధిక మంత్రి రాజ్య సభలో చేసిన ప్రకటనలో తెలిపారు. కనుక అంతిమంగా రుణాల ద్వారా పెరిగిన ఆస్తులతో మాల్యా దివ్యంగా ఉంటాడు. బ్యాంకులు ఆ విధంగా ముందుకు పోతుంటాయి.
“భారీ మొత్తాలను ఎగవేస్తున్న అంబానీలను వదిలేసి ఏదో చిన్న చిన్న ఎగవేతలతో సరిపుచ్చుకుంటున్న నా వెంట పడతారేమిటి?” అని విజయ్ మాల్యా మీడియాపై కోపం వ్యక్తం చేశాడు. ఆయన కోపంతో మనకు అనవసరం. కానీ భారీ మొత్తాలను అంబానీలు ఎగవేస్తున్నారని ఆయన చెప్పిన వాస్తవం మనకు కావాలి.
అనగా ప్రభుత్వ బ్యాంకుల వద్ద పేరుకు పోయిన నిరర్ధక ఆస్తుల్లో అంబానీ లాంటి సూపర్ ధనిక కుటుంబాలు భారీ వాటా కలిగి ఉన్నాయని మాల్యా తేటతెల్లం చేశారు. అరుణ్ జైట్లీ ప్రకటన ప్రకారం బ్యాంకుల్లో పేరుకు పోయిన ఎన్‌పిఏ లలో టాప్ 30 ఎన్‌పిఏ ఖాతాదారులే 51.79 శాతం భాగాన్ని సొంతం చేసుకుని ఉన్నారు. అనగా మాల్యా వాస్తవం చెబుతున్నారు. సూపర్ ధనికులకు చెందిన 30 కంపెనీల వల్ల పేరుకు పోయిన నిరర్ధక ఆస్తుల వాటా మొత్తం ఎన్‌పిఏ లలో దాదాపు 52 శాతం ఉన్నదన్నమాట! కొద్ది మంది ధనిక వర్గాలు బ్యాంకుల తలరాతల్ని, భారత దేశ ఆర్ధిక వృద్ధి చరిత్రను తిరగరాస్తుంటే వారికి పాలకులే దన్నుగా నిలబడ్డారు.
ఎన్‌పిఏ లు ఎవరి వల్ల పేరుకు పోతున్నాయి, ఆ రుణాల సొంతదారులు ఎవరు అన్నది ప్రభుత్వాలు రహస్యంగా ఉంచుతాయి. పార్లమెంటులో ఎవరన్నా గట్టిగా అడిగితే ‘దేశ భద్రతకు ప్రమాదం’ అని ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి. ఎన్‌డిఏ 1 కాలంలోనూ ఇదే సమాధానం ఎదురైంది. యూపిఏ 1, 2 ప్రభుత్వాల హయాంలోనూ ఇదే సమాధానం ఎదురైంది. కనుక పార్లమెంటు కూడా ఋణ ఎగవేతదారుల పక్షమే.
‘వాళ్ళ పేర్లను మాకు ఇవ్వండి’ అని సుప్రీం కోర్టు కొన్ని రోజుల క్రితం కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ఆదేశాలనే సుప్రీం కోర్టు విదేశీ ఖాతాల వ్యవహారంలో కూడా ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక స్విస్ బ్యాంకు అందజేసిన ఖాతాదారుల వివరాలను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్ లో పెట్టి ఇచ్చింది కూడా. దానిపై కోర్టు నుండి ఇంతవరకు చర్యలు లేవు. కనుక కోర్టులు కూడా ఋణ ఎగవేతదారులను, నల్లడబ్బు తరలింపుదార్లను ఏమీ చేయవు.
ప్రజలే ఏదో ఒకటి చేయాలి.
excellent analysis about NPA