గత ఆర్టికల్ –మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?– కింద వెంకట్ గారి చర్చకు సమాధానంగా ఈ వ్యాసాన్ని చూడగలరు -విశేఖర్)
—————–
ఒకటి: సెక్స్ వర్కర్స్ కూడా మనుషులే. వాళ్లేమీ ఇష్టం ఉండి ఆ పని చేయరు. వారి శరీరాలతో వ్యాపారం చేసే వాళ్ళు అధికార వ్యవస్ధలోనే తిష్ట వేసుకుని ఉంటారు. లేదా అధికారంలోని పెద్దల అండదండలతోనే స్త్రీల శరీరాలతో వ్యాపారం జరుగుతోంది. అక్రమ సంపాదనలు, సంపదలు పెరగడం కోసం యువతుల్ని, బాలికల్ని పలు రకాలుగా మోసం చేయడం వల్లనే సెక్స్ వర్కర్లు సమాజంలో ఉంటున్నారు తప్ప ఇష్టంతో ఉండడం లేదు. సెక్స్ వర్కర్ ల ఉనికి కొనసాగడానికి అనుమతించే సమాజానికి తాను తయారు చేసే సెక్స్ వర్కర్లని తప్పు పట్టే అర్హత లేదు.
సెక్స్ వర్కర్లు ఎందుకు తయారవుతున్నారో, ఏ దరిద్రం, పేదరికం, మోసం, అణచివేతలు వారిని తయారు చేస్తున్నాయో ఆ చెడుగుల్నీ వాటి మూలాల్నీ ప్రశ్నించకుండా పరిమిత పరిధిలో మన ఆలోచనల్ని (imaginations) ముగించేసుకుని ఆ పరిమిత పరిధికి లోబడి సెక్స్ వర్కర్లను తప్పు పట్టడం, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ గా నిర్ధారించడం అసంబద్ధం.
మీ దృష్టిలో సెక్స్ వర్కర్ తో పోల్చడమే అవమానం. దేవతలు నడయాడిన ఈ నేలపైన వేశ్యరికాన్ని వృత్తిగా మార్చిన వ్యవస్ధ కూడా అవమానకరమైనదే కాదా?
రెండు: వాళ్ళు ఇంద్రుడి ఆస్ధానంలోని వేశ్యలని మీకు తెలియదని అనుకోవాలా? హిందూ స్వర్గాలలోని వేశ్యలకు లేని అవమానం భూమి మీద మనుషులకు మాత్రం ఎందుకు అన్నది నా ప్రశ్న. ఓ వంక స్వర్గ లోక వేశ్యల్ని మరో వంక భూలోక దేవతా శక్తులనీ సృజించగల పురాణాల లక్ష్యం ఏమిటి? ఆది శక్తి అంటూనే భర్తల అదుపాజ్ఞల్లో పడి ఉండమని ఆదేశించే నీతి సూత్రాలు తప్పొప్పుల్ని ఎంచే కొలమానం కాగలవా?
*********
వేశ్యరికాన్ని నిర్మూలించడం లేదు గనక ఆ పదాలు వాడడంలో తప్పు లేదన్నది నా అర్ధం కాదు.
పవిత్ర పురాణాల్లో పుణ్యమూర్తులకు స్వర్గంలో వేశ్యల పొందు బహుమానంగా లభిస్తుందని చెబుతూ ఆ వేశ్యలతో పోలికను అవమానంగా చెప్పడం ఎందుకు?
వేశ్యలు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ కారు. అవమానానికి వారు ప్రతినిధులు కారు. వేశ్యలు తయారు కావడం వెనుక ఉన్న సామాజిక ఆర్ధిక పరిస్ధితులను అర్ధం చేసుకోలేని అవగాహనారాహిత్యం నుండే వేశ్యలతో పోల్చడాన్ని అవమానంగా చూడడం జరుగుతుంది.
*********
ఈ వాదన అర్ధం దుర్గాదేవిని వేశ్యగా నిర్ధారించడం కాదు. ఆ వాదనలోకే నేను వెళ్ళడం లేదు. అసలు దేవత-దెయ్యం అన్న కాన్సెప్ట్ కే నేను వ్యతిరేకం.
స్ధానిక అసుర జాతీయులు విదేశీ ఇండో-ఆర్యన్ భాషీయుల వలసల నుండి ఉనికి సమస్యను ఎదుర్కొన్నారు. ఇరువురి మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరు విజేత అయ్యారు. ఆ విజేతలు విజయ గాధలు రాసుకున్నారు. పరాజితులు కూడా తమ కధలు తాము రాసుకున్నారు.
విజేతల గాధలు పురాణాలు అయ్యాయి. పురాణాలు మత గ్రంధాలు అయ్యాయి. పరాజితుల కధలు మరుగున పడిపోయాయి. ఎందుకంటే వారు పరాజితులు కనుక. పరాజితుల కధలు ప్రచారానికి నోచుకోవు. ప్రచారానికి తగిన వనరులు (అధికారం, సంపద) పరాజితులకు ఉండవు కదా.
బహుశాఅధికారిక గాధలకు ప్రతిఘటన ఇచ్చే లక్ష్యంతో ఇన్నాళ్ళు అణచివేతకు గురయిన కధలు ఇప్పుడు సరికొత్త సవరణలతో ముందుకు వస్తుండవచ్చు. గీతతో సహా పురాణాలు కూడా అనేకసార్లు అనేక మార్పులకు గురయ్యాయి మరి. భగవద్గీత సవరణలకు, ముఖ్యంగా చేర్పులకు గురయిందని అంబేడ్కర్ నిరూపించారు కూడాను.
ఇది భావజాలాల ఘర్షణ. సరిగ్గా చెప్పాలంటే వేల యేళ్లుగా భౌతిక అణచివేతకు గురయిన కులాలు భౌతిక ప్రతిఘటన ఇస్తున్నట్లే భావజాల ప్రతిఘటన ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నారు. వారు తమ సొంత కధలతో తమను అణచివేసిన శక్తులకు ప్రతిఘటన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అణచివేత – ప్రతిఘటనలలో ఎవరి పక్షం అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏమిటి?
నేనయితే ఈ నిర్దిష్ట ఉదాహరణలో ఎవరి పక్షమూ వహించను. ఈ నిర్దిష్ట ఉదాహరణలో ప్రతిఘటనకు మహా అయితే సానుభూతి చూపగలను. మద్దతు మాత్రం ఇవ్వలేను. ఎందుకంటే ఒక గుడ్డి నమ్మకానికి మరో గుడ్డి నమ్మకం సమాధానం కాజాలదు కనుక. అలా చేయడం వల్ల ఉన్న సమస్య (కుల అణచివేత) పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
మనుషులతో కూడిన వ్యవస్ధల గమనాన్ని వాస్తవాల ఆధారంగా బేరీజు వేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవడమే ఇప్పుడు కావాలి. గతంలో నివసిస్తూ గతాన్ని పునరావృతం చేయాలని సామాజిక (కుల, మత) మరియు రాజకీయార్ధిక రంగాల్లో ఇన్నాళ్లూ ఆధిపత్యం వహించిన శక్తులు కృషి చేస్తున్నాయి. దానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాడుకుంటున్నాయి.
కానీ అణచివేతలో ఉన్నవారికి అధికారం లేదు. సంపదలు లేవు. కనుక తమకు తోచిన ప్రతిఘటన ఇస్తున్నారు.
ఇందులోకి భావోద్వేగాలను చొప్పించి ఆవేశపడిపోవడం, అమ్మను దూషిస్తారా అంటూ తీర్పులు కోరడం అసంగతం. అణచివేతలో ఉన్న వర్గాలు తమ విముక్తికి నిజంగా మార్గం చూపే దారిని ఎన్నుకోవాలి. ఆధిపత్య శక్తులు ప్రజల చర్చలను అనుమతించడం మాని మళ్ళీ అవే అవే అణచివేత పద్ధతులను ప్రయోగిస్తే మరింత హింస, విధ్వంసం చెలరేగే ప్రమాదం ఉన్నది.
మీరు చేసిన విశ్లేషణ చాలా చాలా బావుంది సర్ !!
-మనుష్యులతో కూడిన వ్యవస్థల గమనాన్ని వాస్తవాల ఆధారంగా బేరీజు వేసి
తదనుగుణంగా చర్యలు తీసుకోవడమే ఇప్పుడుకావాలి.” వంటి వాక్యాలతో చక్కటి పరిష్కారమార్గాన్ని సూచించారు. అణిచివేత-ప్రతిఘటనలో నేనైతే ఎవరి పక్షం వహించను .మహా అయితే సానుభూతి చూపగలను వంటి మాటలు చాలా హుందాగా ఉన్నాయి.మీ ఆర్టికల్స్ చదువుతున్న కొద్దీ నా ఆలోచనలు మరింత విశాలమవుతున్నాయి.అనేక విషయాలు మీ ఆర్టికల్స్ ద్వారా తెలుసుకుంటున్నాను.ధన్యవాదాలు సర్ !!