సమస్యలకు, చర్చకు సమాధానం ఇవ్వని ప్రధాని!


ప్రతిపక్షాలు ఆత్మ న్యూనత భావం (ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్) తో బాధపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తేల్చేశారు. అందుకే అవి పార్లమెంటులో (ముఖ్యంగా రాజ్య సభలో) చర్చ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని ఆయన నిర్ధారించారు.

కానీ చర్చ జరగకుండా నిరోధిస్తున్నది ఒక్క కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలేనా? పాలక పక్షం అందునా ప్రధాన మంత్రి గారే చర్చలు ముందుకు సాగనివ్వకుండా అడ్డుకోవడం లేదా?

ప్రజా సమస్యలు చర్చలోకి రాకుండా పాలక, ప్రతిపక్షాలు రెండూ ఆటంకాలు కలిగిస్తున్నాయి. కాకపోతే అందుకు అవి చెరొక పద్ధతిని అవలంబిస్తున్నాయి.

నిన్న, మార్చి 2వ తేదీన ప్రతిపక్ష ఎం‌పి రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగిస్తూ అనేక అంశాలపై ప్రశ్నలు సంధించారు. విమర్శలు గుప్పించారు. కేంద్రం బడ్జెట్ లో ప్రకటించిన పధకాలను హేళనతో కూడిన విమర్శ చేశారు.

కానీ వాటిలో వేటికీ ప్రధాన మంత్రి సమాధానం ఇవ్వలేదు. తన పధకాలను ప్రతిపక్ష నేత విమర్శిస్తే ఆ విమర్శకు సమాధానం ఇస్తూ తన పధకం గొప్పతనమో లేక సవరించుకుంటామనో చెప్పటం మానేసి “కొంత మంది వయసు వచ్చినా ఎదగరు” అంటూ వ్యక్తిగత దాడికి దిగడం ఏమిటి?

“సభలో చర్చలను సజావుగా సాగనివ్వండి” అని కోరుతూ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, తదితర కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రధానుల మాటలను వల్లించారు. చర్చలు సజావుగా సాగడంలో ఆసక్తి ఉన్నట్లయితే ప్రతిపక్ష నేతలు ప్రారంభించిన చర్చకు, అందులోని వివిధ అంశాలకు తన ప్రసంగంలో ఎందుకు చోటు కల్పించలేదు?

ప్రధాని మోడి ఎన్నికలకు ముందు, ఎన్నికల్లోనూ విదేశాల్లో దాచిన నల్ల డబ్బు వెనక్కి తేవడానికే ప్రధమ ప్రాధాన్యత అని చెప్పారు. ప్రజల డబ్బు అక్రమంగా తరలించిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అధికారం చేజిక్కాక ఆ ఊసే లేదు. ఆరంభంలో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారంతే.

తాజా బడ్జెట్ లో నల్ల డబ్బు విషయమై ఆర్ధిక మంత్రి ఒక పధకాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్ గాంధీ మాటల్లో చెప్పాలంటే దాని పేరు ‘ఫెయిర్ అండ్ లవ్ లీ యోజనా’. విదేశాల్లో దాచిన నల్ల డబ్బు వెనక్కి తెస్తే 45 శాతం పన్నుతో సరిపెడతామని, శిక్షలు ఏమీ ఉండవనీ జైట్లీ ప్రతిపాదించారు. అందుకు నాలుగు నెలల (ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు) గడువు విధించారు.

ఇది నల్ల డబ్బును తెలుపుగా మార్చుకునేందుకు ఇచ్చిన అవకాశమే అని తెలియడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదు. ఇలాంటి పధకాలను గతంలో కాంగ్రెస్ మంత్రులు కూడా ప్రకటించారు. వి పి సింగ్,  చిదంబరంలు ఆర్ధిక మంత్రి పదవులు నిర్వహించినప్పుడు ఇలాంటి స్కీమ్ నే తెచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో విమర్శలు గుప్పించినవారిలో బి‌జే‌పి నేతలూ ఉన్నారు.

ఫెయిర్ అండ్ లవ్ లీ క్రీమును నల్ల చర్మాన్ని తెల్ల చర్మంగా మార్చేస్తుందని కంపెనీ ప్రకటించుకునే సంగతి అందరికి తెలిసిందే. ఆ క్రీము తరహాలోనే నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చే పధకాన్ని జైట్లీ ప్రతిపాదించారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

ఇది విమర్శ. ప్రతిపక్ష ఎం‌పి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉపాధ్యక్షుడు చేసిన రాజకీయ-ఆర్ధిక పాలనాపరమైన విమర్శ. ప్రభుత్వ విధానం పైన విమర్శ. ఈ విమర్శకు సమాధానం ఇవ్వడం పాలక పార్టీ బాధ్యత. కానీ సమాధానం ఇచ్చేందుకు ప్రధాన మంత్రి ముందుకు రాలేదు.

చర్చలు సజావుగా జరగాలంటే గొడవ చేయకుండా ఉండడమే సరిపోదు. ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తేనే చర్చ సజావుగా సాగినట్లు! ప్రతిపక్షం విమర్శలను సాక్షాత్తు ప్రధాన మంత్రి గారే పట్టించుకోకపోతే చర్చ సజావుగా ఎలా సాగుతుంది?

ప్రధాని మోడి మేక్ ఇన్ ఇండియా పధకం ప్రకటించారు. ఈ పధకం ద్వారా కోట్ల ఉద్యోగాలు వచ్చాయని కూడా ప్రకటించారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పండి అని తాను ప్రజల్ని అడిగితే ‘మాకు రాలేదంటే మాకు రాలేదు’ అన్నారే గానీ ఉద్యోగం వచ్చినట్లు ఎవరూ చెప్పలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.

దీనికీ ప్రధాన మంత్రి నుండి సమాధానం లేదు. పైగా ‘మేక్ ఇన్ ఇండియా’ పధకాన్ని అవమానం చేస్తావా అంటూ అసందర్భంగా అడిగారు. ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు అని ప్రతిపక్ష ఎం‌పి ఒకరు నిర్మాణాత్మకమైన, ప్రజలకు నేరుగా సంబంధించిన ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఇవ్వకుండా దాటవేయడం చర్చలను సాగనివ్వడమా లేక నిరోధించడమా?

అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా సాక్షాలు లేకుండా ఉరి తీశారు అన్న అభిప్రాయం ప్రకటిస్తే అది దేశ ద్రోహం! కాశ్మీరీ ప్రజల భావోద్వేగాలకు, ప్రధమ భారత ప్రధాని హామీ ఇచ్చిన స్వయం నిర్ణయాధికార హక్కుకు మద్దతు ప్రకటిస్తే అదీ దేశ ద్రోహమే! ఉమర్ ఖలీద్ తదితర విద్యార్ధులపై సాక్షాలు లేకుండా సెడిషన్  కేసు పెట్టారు అని ఢిల్లీ పోలీసుల్ని విమర్శిస్తే అది దైవ దూషణ! ఇప్పుడు ‘మేక్ ఇన్ ఇండియా’ పధకం వల్ల వచ్చిన ఉద్యోగాలు ఏవి అని అడిగితే అది దేశ గౌరవానికే భంగకరం!

హిందూత్వకు సై అంటేనే దేశ భక్తి! ‘కాదు’ అని కూడా కాదు, కాస్త ఆలోచించండి అన్నా దేశ ద్రోహమేనా? హిందూత్వ ప్రభుత్వ విధానాలు విమర్శిస్తే దేశ గౌరవానికి ఎలా భంగం కలుగుతుంది? అధికారం ఇస్తే ఐదేళ్ల పాలనా కాలంలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం అని వాగ్దానం ఇచ్చిన ప్రధాన మంత్రి గారూ మొదటి రెండేళ్లలోని నాలుగు కోట్ల ఉద్యోగాలు ఏవి? అని అడిగితే దేశ గౌరవం ఎలా భంగపడుతుంది? మహా అయితే ప్రధాన మంత్రి గారి వాగ్దానాల గౌరవం భంగపడుతుందేమో గానీ!?

నిజానికి నెరవేర్చని వాగ్దానాలను విచ్చలవిడిగా చేసేసి ప్రజలను ఫూల్స్ చేయగల రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నందుకు దేశ గౌరవానికి భంగకరం. అలా కాదు వాగ్దానం నెరవేర్చాము అని చెప్పగలిగితే ఆ ఉద్యోగాలు ఎక్కడ, ఏ రంగంలో ఎన్ని ఇచ్చారో చెప్పగలిగితే దేశ గౌరవం భంగం కాకపోగా మరింతగా ఇనుమడిస్తుంది. ఇతర దేశాలు హిందూత్వ ప్రభుత్వం చేసిన మ్యాజిక్ ఏమిటో తెలుసుకోవాలని తహతహలాడుతాయి. ఆనక దేశ గౌరవంతో పాటు హిందూత్వ గౌరవం కూడా పెరుగుతుంది. అలాంటి గౌరవాన్ని కాలదన్నడం ఎందుకు?

నాగాలాండ్ ఒప్పందం గురించి కూడా రాహుల్ గాంధీ విమర్శ చేశారు. ఉన్నట్లుండి ప్రతిపక్ష నేతలందరిని పిలిచి నాగాలాండ్ ఉద్యమకారులతో ఒప్పందం చేసేసుకున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. అరవైయేళ్ల కాంగ్రెస్ పాలన చేయలేని ఒప్పందం తాము చేశామని మోడీ చెప్పారని కానీ ఆ ఒప్పందం సంగతి హోమ్ మంత్రికి కూడా తెలియదని రాహుల్ ఎత్తిపొడిచారు. రాహుల్ చెప్పడం కాదు, ఒప్పందం కుదిరిందని కేంద్రం ప్రకటించినప్పుడు ఆ ఒప్పందం ముందు వెనుక వ్యవహారాలు హోమ్ శాఖకు తెలియవని అనేక పత్రికలు చెప్పాయి.

Naga accord

Naga accord

అసలు ఒప్పందంలోని అంశాలు ఏమిటో పత్రికలకు చెప్పినవారు లేరు. నాగాల డిమాండ్ ప్రకారం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లలోని విశాలమైన ప్రాంతాలను విడదీసి స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. అనగా నాగాల డిమాండ్ నెరవేర్చాలంటే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ప్రభుత్వాలు) తప్పనిసరిగా తగిన పాత్ర వహించాలి. కనీసం పక్క రాష్ట్రాలకు కూండా ఒప్పందం గురించి ఎందుకు చెప్పలేదు అని రాహుల్ ప్రశ్నించారు. అట్టహాసంగా ప్రకటించిన ఒప్పందం ఇప్పుడు ఎక్కడ అని కూడా ప్రశ్నించారు. ‘Gone with the wind’ అని అపహాస్యం చేశారు.

ఈ ప్రశ్నకు ప్రధాన మంత్రి నుండి సమాధానం లేదు. ఒప్పందంలోని అంశాలు ఇవీ అని ప్రధాని చెప్పలేకపోయారు. పక్క రాష్ట్రాల అభిప్రాయాలూ తీసుకున్నాం అని చెప్పలేకపోయారు. ఆ ఒప్పందాన్ని మణిపూర్ ఎందుకు తిరస్కరించింది?  అరుణాచల్ ప్రదేశ్ ఒప్పందం పట్ల అనుమానంగా ఉన్నది? స్ధానిక కుకి జాతి ప్రజలు ఒప్పందాన్ని ఎందుకు తిరస్కరించారు? ముఖ్యంగా ఒప్పందం ఇప్పటికీ ఎందుకు రహస్యంగా ఉన్నట్లు?  మూడు నెలల్లో అంతిమ ఒప్పందం జరిగాక ఒప్పందంలోని అంశాలు వెల్లడి చేస్తామన్న కేంద్రం హామీ అలాగే ఉండిపోయింది.

ఎన్‌డి‌ఏ-1 ప్రభుత్వం హయాంలో (బ్యాంకాక్ లో) కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలోని అంశాలను కూడా అక్కడి రాష్ట్రాలు, ఇతర జాతుల ప్రజలు వ్యతిరేకించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవడం సముచితం. మణిపూర్ లోనైతే రాష్ట్ర అసెంబ్లీకి నిప్పు పెట్టారు (వాళ్ళు దేశ ద్రోహులు కాలేదెందుకనో). ముఖ్యమంత్రి కార్యాలయంపైనా దాడి జరిగింది.

ఒప్పందం నిజంగానే గాల్లో కొట్టుకుపోయింది అని అంగీకరించాల్సి వస్తుంది కనుకనే ప్రధాన మంత్రి తన ప్రసంగంలో నాగా ఒప్పందాన్ని వదిలిపెట్టి ఊరుకున్నారా?

అన్నింటికంటే ముఖ్యం రోహిత్ వేముల, జే‌ఎన్‌యూ అంశాలు. వారానికొకసారి ‘మనసులోని ముచ్చట్లు’ (మన్ కీ బాత్) దేశ ప్రజలకు చెప్పుకునే ప్రధాన మంత్రి అనేక వారాల తరబడి సాగిన హైద్రాబాద్ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళనలపై ఎందుకు ఒక్క ముక్కా మాట్లాడరు? న్యాయం కావాలి అని కోరుతున్న రోహిత్ తల్లితో ఎందుకు మాట్లాడలేకపోయారు? జే‌ఎన్‌యూ-కన్హైయా విషయంలో విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరులపై హిందూత్వ లాయర్ గూండాలు దాడి చేసి చావబాదినా ప్రధాన మంత్రి ఎందుకు ఆ విషయంపై మాట్లాడరు? …ఇవన్నీ రాహుల్ గాంధీ అడిగిన మామూలు ప్రశ్నలు. వీటికి కూడా ప్రధాన మంత్రి నుండి సమాధానం లేదు.

ప్రతిపక్షాలు ఆత్మ న్యూనతలో పడి చర్చలను అడ్డుకుంటున్నాయి సరే. ప్రధాన మంత్రి గారికి అలాంటి ఆత్మ న్యూనత ఏమీ లేదు కదా? తాము సాధించిన విజయాలను ప్రతిపక్షాలు భరించలేకపోతున్నాయని ఊరూరా చెబుతున్నారు కదా. ఆ విజయాల పైన అడిగిన ప్రశ్నలను ప్రధాన మంత్రి ఎందుకు తన ప్రసంగంలో పట్టించుకోలేదు?

దేశభక్తి గురించీ రాహుల్ మాట్లాడారు. హిందూత్వ దేశభక్తికి కౌంటర్ వాదన చేశారు. “నేను జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్నాను అంటే అది కేవలం పతాకానికి సెల్యూట్ చేయడం కాదు. దేశంలోని ప్రజల మధ్య సంబంధాలకు, వారి మధ్య జరిగే చర్చలకు, వారి ఆకాంక్షలకు అన్నింటికీ సెల్యూట్ చేస్తున్నానని అర్ధం” అని జెండా వందనం గురించి తన అభిప్రాయం రాహుల్ చెప్పారు. తద్వారా హిందూత్వ సంస్ధలు జే‌ఎన్‌యూ కార్యక్రమంపై పెడుతున్న పెడబొబ్బలు, చేస్తున్న హాహాకారాలు దేశభక్తి కాకపోగా ప్రజల మధ్య చిచ్చు పెట్టేవనీ, అది దేశభక్తి కాకపోగా దేశ ద్రోహం అనీ రాహుల్ చెప్పారు.

ఈ చర్చకూ ప్రధాన మంత్రి నుండి సమాధానం లేదు. విజయాల మేఘాల్లో తేలుతున్న ప్రధాన మంత్రికి ఈ చర్చలో పాల్గొనడం కష్టం అయితే కాదు కదా. మరెందుకు రోహిత్ వేముల, కన్హైయా, ఉమర్ ఖలీద్ లపై సాగిన అణచివేతపై చర్చను స్వీకరించరు?

“మా మాటలు కూడా వినండి. మేము మిమ్మల్ని ద్వేషించడం లేదు. కనీసం మీ మంత్రుల మాటలైనా వినండి. జనం మాటలు వినండి” అని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని కోరారు.

“మా ఒక్కళ్ళ వల్లే సమస్యల పరిష్కారం సాధ్యం కాదు. మీరు అనుభవజ్ఞులు. మీ సహకారం కూడా కావాలి. అందరం కలిసి భుజం భుజం కలిపి పని చేద్దాం” అని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో కోరారు.

ఇంతకీ చర్చలను ఎవరు అడ్డుకుంటున్నట్లు చెప్మా!

3 thoughts on “సమస్యలకు, చర్చకు సమాధానం ఇవ్వని ప్రధాని!

  1. thanks for analysing important issues in the country, i think you have given more importance to one of the incidents that regularly happened in HCU, and JNU. I think a series of stories on such issues is not required and those posts created dis interest to see your site.

    literally i didnt see the dialogues between Rahul, and P.M. but your analysis created some interest to think of PM attitude and unearthing some ground realities.

    Iam expecting some analysis even on budget and its impact on common man. As you know that iam a management faculty i would like to discuss that in your angle with my students.

  2. జనార్ధన్ గారు, మీ సమాచారం కోసం చెబుతున్నాను. కన్నయ్య సమాచారం కోసమే ఈ సైట్ ను చూస్తున్నవారు ఉన్నారు. కన్నయ్య ఘటన నుండి సైట్ కు పాఠకులు పెరిగారు కూడా.

    కానీ పాఠకులు తగ్గుతారని భయపడి వాస్తవాలు రాయకుండా ఉండడం చేయలేను. పెరగడం కోసం అబద్ధాలు రాయలేను. వాస్తవాల విశ్లేషణకే నేను ప్రాధాన్యం ఇస్తాను.

    కన్నయ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. ప్రతి రోజూ పరిణామాలు మారుతూ పోయాయి. అందుకే మళ్ళీ మళ్ళీ రాయవలసి వచ్చింది. కన్నయ్య వ్యవహారం ఈ దేశ రాజకీయాల్లో ఒక మలుపు. విద్యార్ధి ఉద్యమాలను ప్రేరేపించిన మలుపు అది. రాజకీయాలకు అతీతంగా విద్యార్ధులను ఐక్యం చేసిన మలుపు. మోడి ఆధారిటేరియన్ పాలనకు సవాలు విసిరిన మలుపు. దాని గురించి ఎంత ఎక్కువ వీలయితే అంత రాయడం నేటి అవసరం.

    ఆ మలుపును చూడలేకపోతే అది మీ యిష్టం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s