ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలియని పరిస్ధితుల్లో వీడియోలు చూస్తే తప్ప నమ్మలేని పరిస్ధితి దాపురించింది.
శాస్త్ర పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సుఖమయం చేయడం ఏమో గానీ కుట్రదారులకు మాత్రం అది బాగా ఉపకరిస్తోంది. నేరుగా వాదించి నెగ్గలేని హిందూత్వ సంస్ధలు వీడియో మార్ఫింగ్ లకు దిగడంతో చివరికి వీడియోలను సైతం పట్టి పట్టి చూడవలసి వస్తోంది.
కన్హైయా కుమార్ ని ఎవరూ కొట్టలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ఆర్భాటంగా ప్రకటించారు. కాస్త తోపులాట జరిగితే జరిగి ఉండొచ్చు గానీ కన్హైయాని కొట్టిన మాట మాత్రం అవాస్తవం అని ఆయన బల్లగుద్ది చెప్పారు.
కానీ బి ఎస్ బస్సీ చెప్పినది అవాస్తవం అని కన్హైయా సాక్షం ద్వారా తెలుస్తోంది. పాటియాలా హౌస్ కోర్ట్ ప్రాంగణంలో లాయర్ గూండాలు విశృంఖల దాడికి దిగిన దరిమిలా సుప్రీం కోర్టు నియమించిన 6గురు సీనియర్ లాయర్ల కమిటీ ముందు కన్హైయా తనపై జరిగిన దాడి జరిగిన క్రమాన్ని వివరిస్తున్న వీడియో టైమ్స్ నౌ చానెల్ లో ప్రత్యక్షం అయింది.
సుప్రీం నియమించిన లాయర్ల కమిటీలో కపిల్ సిబాల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే, ఏడిఎన్ రావు, అజిత్ కుమార్ సిన్హా, హరీన్ రావన్ లు సభ్యులుగా ఉన్నారు. వారిలో దుష్యంత్ దవే సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అద్యక్షులుగా గత డిసెంబర్ లో ఎన్నికయ్యారు. కానీ కార్యదర్శి, ఇతర సభ్యులతో బేధాభిప్రాయాలు తలెత్తడంతో రాజీనామా చేశారు.
ఈ వీడియో లో కన్హైయా ఇలా చెప్పారు.
“పోలీసులు నన్ను కోర్టు గేటు లోపలికి తెచ్చినపుడు లాయర్ దుస్తుల్లో ఉన్న ఒక గుంపు నాపై దాడి చేసింది. నాపై దాడి చేసేందుకు వారు సిద్ధపడి ఉన్నట్లుగా నాకు అనిపించింది. వాళ్ళు ఇతర లాయర్లను కూడా పిలుస్తున్నారు.
“నాకు ఎస్కార్ట్ గా ఉన్న పోలీసులు నన్ను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ళు పోలీసు అధికారులను కూడా కొట్టారు” అని కన్హైయా చెప్పడంతో లాయర్ల కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు.
దీనితో కపిల్ సిబాల్ పోలీసు అధికారి డిసిపి జతిన్ నర్వాల్ ను అక్కడికి పిలిపించారు. సదరు అధికారిని అనంత్ దవే (లేదా కపిల్ సిబాల్) గట్టిగా నిలదీశారు.
“కోర్టు ప్రాంగణంలో దాడి జరిగడానికి మీరు ఎలా అనుమతించారు? మీ మనుషులు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? (జడ్జి గది గేటు బైట కన్హైయాపై దాడి చేసిన వ్యక్తిని లోపలికి ఎలా రానిచ్చారు?” అని అడిగారు.
మధ్య మధ్యలో “నాకు తెలియదు” అంటూ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. బహుశా అనంత్ దవే అనుకుంటాను, “వీళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానికా పోలీస్ అధికారి “లేదు సార్ కావాలని చేయలేదు. ఆయన ఎస్కార్ట్ పార్టీతో కలిసి వచ్చారు. కోర్టు గది పక్కన ఉన్న గదిలో నుండి వచ్చారు” అని వివరణ ఇచ్చారు. దానితో కమిటీ సభ్యులు ఇతర పోలీసు అధికారులను కూడా పిలిపించి వివరణ కోరారు. కన్హైయాపై కోర్టు గది బైట దాడి చేసిన వ్యక్తి తాను కన్హైయా తరపు లాయర్ ని అని చెప్పి వచ్చారని వెల్లడించారు.
అనంతరం తనను బాగా కొట్టారని, వాళ్ళు కొడుతుండగా కింద పడ్డానని చెప్పారు. కింద పడడం వల్ల పోలీసులు ఏమి చేస్తున్నదీ చూడలేకపోయానని చెప్పారు.
ఈ సమయంలో కపిల్ సిబాల్ డిసిపిని “అంటే పోలీసులు అక్కడే ఉన్నారన్నమాట. అక్కడే ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు” అని అన్నారు.
కన్హైయా తన అనుభవం ఇంకా వివరించారు. తనను బైట కొట్టిన వ్యక్తి కోర్టు గది పక్క గదిలో కనిపించడంతో ఆ సంగతి తమ ప్రొఫెసర్ కు చెప్పారు. “ఇతనే తనను కొట్టాడని నేను మా టీచర్ కి చెప్పాను. అది విని పోలీసు ఆయనను గుర్తింపు కార్డు చూపమని అడిగారు. అతను పోలీసునే ఆయన గుర్తింపు కార్డు చూపమని ఎదురు ప్రశ్నించాడు. అయినా పోలీసులు ఏమీ చేయలేదు. నేను చెప్పిన వెంటనే అతన్ని అక్కడే పట్టుకుని ఉండవచ్చు. అతనే నన్ను కొట్టాడని పోలీసుకు కూడా చెప్పాను” అని కన్హైయా తనను విచారించిన కమిటీకి వివరించారు.
దాడి చేసి కొట్టిన వ్యక్తిని, అక్కడ ఉన్న పోలీసులను గుర్తు పట్టగలవా అని అని కమిటీ సభ్యులు కన్హైయాని అడిగారు. “నేను గుర్తు పట్టగలను. ఆ వ్యక్తి నన్ను కొట్టాడని అతనిపై ఫిర్యాదు చేస్తానని పోలీసులకు చెప్పాను. నన్ను గేటు వద్ద మొదట కొట్టింది కూడా అతనే” అని కన్హైయా చెప్పారు.
దరిమిలా కమిటీ సభ్యులు డిసిపి ని ఉద్దేశిస్తూ ఇలా చెప్పారు “అతని భద్రత ఇక నుండి మీ భాధ్యత. ఏమీ సాకులు చూపవద్దు. ఇది నమ్మశక్యం కాకుండా ఉంది. మీరిప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాల పరిధిలో ఉన్నారు. బి ఎస్ బస్సీ ఆదేశాల పరిధిలో కాదు” అని దుష్యంత్ దవే చెప్పారు.
“నాపై దాడి చేసినవారు బాగా తీవ్రస్ధాయి రాజకీయ ఉద్దేశ్యాలు కలిగి ఉన్నారు” అని కన్హైయా కుమార్ చెప్పారు.
“మొదటిసారి కోర్టుకు నన్ను తెచ్చినప్పుడు నాపై దాడి ఏమీ జరగలేదని జడ్జిగారికి చెప్పాను. నేను పిహెచ్ డి విద్యార్ధిననీ, నన్ను దేశద్రోహిగా పిలుస్తున్నారనీ… చెప్పాను. నాకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పాను” అని కన్హైయా కుమార్ తనను విచారించిన కమిటీకి చెప్పారు.
(కన్హైయా తనపై దాడి గురించి చెబుతున్న వీడియోను నాగపూర్ టుడే వెబ్ సైట్ లో చూడవచ్చు.)
కన్హైయాపై దాడి వెనుక దేశభక్తి భావోద్వేగాలు ఏమీ లేవు. ఒట్టి రాజకీయాలు మాత్రమే ఉన్నాయి. అవి హిందూత్వ రాజకీయాలు. హిందూత్వ భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఉద్దేశించినవి. తద్వారా దేశ ప్రజలను రెండు పరస్పర విరుద్ధ శిబిరాలుగా విభజించి రాజకీయ లబ్ది పొందడమే ఉద్దేశ్యం. చందమామని దించి చేతుల్లో పెడతామని వాగ్దానాలు ఇచ్చిన నేతలు తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్దేశించినవి. జనం తమ రోజువారీ సమస్యలను మర్చిపోయి “ఆ, మా దుర్గామాతని అంటారా? మా దేశాన్ని అంటారా?” అన్న ఖాళీ భావోద్వేగాలతో ఊగిపోయేందుకు ప్రేరేపించడానికి ఉద్దేశించినవి.
కనుక ఇప్పుడు అడగవలసిన ప్రశ్నలు దుర్గామాతని అన్నారు, అఫ్జల్ గురుకి మద్దతు ఇచ్చారు అని కాదు. ఒక విద్యార్ధిని ఒక నేరంపై అరెస్టు చేశారు సరే, ఇక చట్టం తనపని తాను చేసుకుపోవాలి గదా, లాయర్లను, నల్లకోటు ముసుగులోని గూండాలను దించి ఎందుకు దాడి చేయించారు? అని.
కన్హైయా కుమార్ కి పూర్తి రక్షణ కల్పించండి అన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న లాయర్లను పోలీసులు షో చూసినట్లు చూస్తూ నిలబడిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడగాలి.
పోలీసుల ముందే విద్యార్ధిని కొడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి నేరుగా జవాబుదారీ అయిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ “దాడి జరగలేదు” అని ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చింది అని అడగాలి.
రోహిత్ తల్లి మాల. ఆమెను దత్తత తెచ్చుకున్న రోహిత్ అమ్మమ్మ కూడా మాలయే అని రోహిత్ తమ్ముడు నిన్న ఇచ్చిన ప్రకటన బట్టి స్పష్టం అయింది. కులాంతర వివాహం అయితే తల్లి దండ్రుల్లో ఎవరి కులాన్నైనా తెచ్చుకునే అవకాశాన్ని భారతీయ చట్టాలు కల్పించాయి. అయినప్పటికీ రోహిత్ ని “దళితుడు కాదు” అని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, సుష్మా స్వరాజ్, షానవాజ్ హుస్సేన్ తదితరులు ఎందుకు అబద్ధం ఆడారు అని అడగాలి. రోహిత్ కులాన్ని అతని తల్లే చెపుతుంటే తహసీల్దారు దగ్గర్నుండి ప్రత్యేకంగా అబద్ధపు సర్టిఫికేట్ ఎందుకు తెప్పించారో అడగాలి.
రోహిత్ తదితర ఐదుగురు దళిత విద్యార్ధులను విచారించడానికి నియమించిన యూనివర్సిటీ కమిటీలో దళిత సభ్యుడు లేరు. ఒక సభ్యుడిని అప్పటికప్పుడు కో-ఆప్ట్ చేసుకున్నప్పటికీ ఆయన కమిటీ నుండి తప్పుకున్నాడు. అయినా కమిటీలో దళిత సభ్యుడు ఉన్నాడు అని మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ సాక్షాత్తు పార్లమెంటులో ఎందుకు అబద్ధం ఆడారు అని అడగాలి.
రోహిత్ ఆత్మహత్య వార్త తెలిసిన 4 నిమిషాలకే శవం దగ్గరికి యూనివర్సిటీ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ వచ్చి పరీక్ష చేశారు. పోలీసులు వచ్చి శవ పంచనామా నిర్వహించారు. అయినా రోహిత్ మరణించిన తర్వాత రాత్రంతా ఎవరినీ దగ్గరిని రానివ్వలేదని కేంద్ర మంత్రి ఎందుకు దళిత వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టారో అడగాలి. రోహిత్ బతికి ఉండే అవకాశాన్ని తప్పించారని చెబుతూ రోహిత్ ఆత్మహత్య నేరాన్ని తిరిగి దళిత విద్యార్ధి సంఘం పైకే నెట్టడానికి సాక్షాత్తు కేంద్రమంత్రి గారే కుట్ర పూరిత ప్రయత్నాలు ఎందుకు చేశారు అని అడగాలి.
మహిషాసుర అమరదినం రోజు నిర్వహించింది ఎస్‌సి ఎస్‌టి ఓబిసి విద్యార్ధులే. ఈ దేశంలో మహిషాసురుడుని కొలిచే ప్రజలు కూడా కోట్లలో ఉన్నారు. రావణుడిని కొలిచే ప్రజలు ఉన్నారు. ఈ వాస్తవవాలని మరుగుపరిచి కేవలం హిందువుల నమ్మకాలే గొప్పవి అయినట్లుగా, హిందూ నమ్మకాలే దేశభక్తి అయినట్లుగా విభజన పూరిత భావజాలాన్ని సాక్షాత్తు పార్లమెంటులోనే మంత్రి ఎందుకు రెచ్చగొడుతున్నారో ప్రశ్నించాలి.
పదే పదే అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడ్డ వ్యక్తులు అత్యున్నత కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడానికి అర్హులా అని కూడా అడగాలి.
కిడ్నాపర్లు కూడ కొంతమందికి ఆరాధ్యలు. దావూద్ ఇబ్రహిం ను కొలిచె జనాలు ఉన్నారు. అప్పుడు అతనిని దెవుడని వారిని భక్తులని అనలెం కదా. మీ విష్లెషణకు ఒక దణ్ణం