స్మృతి మళ్ళీ అబద్ధం చెప్పారు!


Masishaasuramardini!

నోరు తెరిస్తే అబద్ధమేనా? బాధ్యతగల కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కూడా! తన ప్రసంగానికి భావోద్వేగాలను అద్దడం కోసం జరగనివి జరిగినట్లుగా, జరిగినవి జరగనట్లుగా చెప్పడం ఎవరికైనా తగునా? లేక దేశాన్ని ఏలుతున్నారు గనుక కేంద్ర మంత్రులకు తగుతుందా?

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాల పర్వం కొనసాగుతోంది. అత్యున్నత ప్రజాస్వామిక దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటులోనే ఆమె అబద్ధాలు చెప్పేస్తున్నారు.

అది కూడా ఒక చనిపోయిన విద్యార్ధి కుటుంబం లక్ష్యంగా!

రోహిత్ వేముల ఆత్మహత్యను, ఆయన విగత శరీరాన్ని రాజకీయ ఉపకరణంగా వాడుకుంటున్నారని చెప్పిన మానవ వనరుల శాఖ మంత్రి తన అబద్ధపు ప్రకటనల ద్వారా, దళిత సంఘాల భావాలను హీనపరచడం ద్వారా హిందూత్వ రాజకీయాల లక్ష్యాలను నెరవేర్చడం మానుకోరు. తాను చెబితే, అది అబద్ధమైనా, వాస్తవం. మరొకరు చెబితే రాజకీయం. వీళ్లూ మనల్ని ఏలుతున్న మంత్రులు!

లోక్ సభలో స్మృతి ఇరానీ చేసిన భావోద్వేగపూరిత ప్రసంగం దేశాన్ని ఊపేస్తున్నదని కొన్ని చానెళ్లు చెప్పుకుంటున్నాయి. ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోందని, ఫేస్ బుక్ లో వేలాది లైక్ లు వస్తున్నాయని ఇంటర్నెట్ కొడై కూస్తోంది. ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్ లు, ఫేస్ బుక్ లైక్ లే అన్నింటికీ కొలబద్దలు కదా మరి! దేశ ప్రజల అభిప్రాయాలు కూడా ఏవి సరైనవో ట్విట్టర్, ఫేస్ బుక్ లే చెప్పడం మన భావ దరిద్రం కాకపోతే ఏమిటి?

పిల్లాడు రోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఒక రోజంతా అతని దేహం దగ్గరికి వెళ్లడానికి ఎవరినీ అనుమతించలేదని స్మృతి ఇరానీ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులపై ఆరోపించారు. చివరికి పోలీసులను, డాక్టర్లను కూడా అనుమతించలేదని ఆరోపించారు.

డాక్టర్లను అనుమతించినట్లయితే రోహిత్ బతికి ఉండేవాడని కూడా ఆమె ఆవేదన వెలిబుచ్చారు. “అసలు రోహిత్ చనిపోయారని చెప్పింది ఎవరు? డాక్టరే అతని దగ్గరకి వెళ్లలేనప్పుడు ఆయన చనిపోయారని ఎలా చెప్పగలరు? రాత్రంతా ఎవరినీ రోహిత్ దేహం దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారు” అని  స్మృతి ఇరానీ వాపోయారు.

“ఏమో ఆ బిడ్డడు (child) కొస ప్రాణంతో ఉండి ఉండవచ్చు. వెంటనే డాక్టర్ ని అనుమతించి ఉంటే అతని పల్స్ ని రివైవ్ చేయడానికి ప్రయత్నించేవారు. (అతను బతికి ఉండేవాడు) రోజంతా శవాన్ని దాచి పెట్టారు. అసలక్కడ ఏమి జరిగిందో ఎలా తెలుస్తుంది?” స్మృతి ఇరానీ అన్నారని ఇండియా టుడే తెలిపింది. బహుశా ఆమెకు కన్నీళ్లు ఒక్కటే తక్కువ కావచ్చు.

“ఆ బిడ్డడి పైన, అతని శవం పైనా రాజకీయాలు ప్రయోగించిన విధానం ఇదీ. అతని దగ్గరికి డాక్టర్ వెళ్లడానికి ఎవరూ అనుమతించలేదు. పోలీసులు చెప్పారు… ఆ బిడ్డని రివైవ్ చేయడానికి ఒక్క ప్రయత్నమూ జరగలేదని. అతన్ని డాక్టర్ వద్దకి తీసుకెళ్లడానికి ఒక్కరూ ప్రయత్నించలేదు. దానికి బదులుగా అతని శరీరాన్ని రాజకీయ సాధనంగా వాడుకున్నారు” అన్నారు స్మృతి ఇరానీ.

“మరుసటి రోజు 6:30 ని.ల వరకూ ఒక్క పోలీసునీ అనుమతించలేదు. నేను కాదు, తెలంగాణ పోలీసులే చెబుతున్నారు ఈ విషయాన్ని” అని స్మృతి ఇరానీ లోక్ సభలో ఆరోపించారు.

రోహిత్ వేములను బతికించడానికి బదులు అతను చనిపోయేలా ప్రేరేపించి, చనిపోయేవరకూ ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుని చనిపోయాక ఆ విగత దేహాన్ని రాజకీయ పరికరంగా ఉపయోగించారని స్మృతి ఇరానీ చెప్పదలిచారు. ఆమె చెప్పదలచడం కాదు, బి‌జే‌పి వాదనలని మోస్తున్న చానెళ్లు, పత్రికలు ఆమె అంతరార్ధం అదేనని చెప్పాయి కూడా.

నిజానికి రోహిత్ శరీరం పరికరంగా వాడుకున్నారని చెప్పడం ద్వారా అతను చనిపోయిన 40 రోజుల తర్వాత కూడా పచ్చి, నీచ రాజకీయం చేస్తున్నది స్మృతి ఇరాన్ గారే. రోహిత్ వేముల తదితరులను సస్పెండ్ చేసేలా ఒత్తిడి తెచ్చి, సస్పెండ్ చేశాక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతే అతను దళితుడు కాదు అని ఢిల్లీ ప్రెస్ మీట్ లో చెప్పడానికి సాహసించారు స్మృతి ఇరానీ. ఇప్పుడు ఆ అబద్ధం అబద్ధమే అని తేలిపోయింది. మళ్ళీ కొత్త అబద్ధంతో ముందుకు వస్తూ మళ్ళీ రాజకీయానికి ఒడిగట్టారు ‘మను’ స్మృతి ఇరానీ.

లేదా అబద్ధం అని తెలిసీ వాస్తవాన్ని మెలిపెట్టి సరికొత్త అర్ధం తేవడానికి విఫలయత్నం చేశారా స్మృతి ఇరానీ?

స్మృతి ఇరానీ చెప్పింది శుద్ధ అబద్ధమని ఎంతో ఘోరాతి ఘోరం జరిగిపోయిందన్న ఆమె ఆవేదన ఒట్టి మొసలి కన్నీరేనని తెలియడానికి అట్టేసేపు పట్టలేదు.

రోహిత్ ఉరి వేసుకున్నాడన్న వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన యూనివర్సిటీ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కి (డాక్టర్ కి) సమాచారం ఇచ్చిన జికృల్లా నిషా అబద్ధం చెబుతున్నారని తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడి చేశాడు. ఆయన ఏమి రాశాడో చూడండి.

Liar..Liar..
I was the person who called health center immediately after learning that Rohith Hanged in NRS hostel.

Within 5 minutes CMO Health center Dr. Rajashree P has reached the spot and she checked the pulses and declared him dead. There were Telangana police also present there.

Today MHRD minister lied to entire nation that no doctor and police were allowed to check the dead body till 6:30 AM of next day.

స్మృతి ఇరానీని అబద్ధాల కోరుగా అభివర్ణించిన జిక్రుల్లా యూనివర్సిటీ హెల్త్ సెంటర్ కి తాను వెంటనే ఫోన్ చేసానని, ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ లో రోహిత్ ఉరి వేసుకున్నాడని చెప్పానని తన స్టేటస్ లో జిక్రుల్లా చెప్పాడు.

01 Zikrullah Nisha on facebook

“5 నిమిషాల్లోనే సి‌ఎం‌ఓ హెల్త్ సెంటర్ డాక్టర్ రాజశ్రీ పి గారు అక్కడికి చేరుకున్నారు. పల్స్ చెక్ చేశారు. అనంతరం అతను చనిపోయాడని ప్రకటించారు. ఆ సమయంలో అక్కడ తెలంగాణ పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు రోహిత్ ఉన్న గదికి చేరుకున్న వీడియో కూడా ఫేస్ బుక్ లో మరొకరు పోస్ట్ చేశారు.

ఈ రోజు ఎం‌హెచ్‌ఆర్‌డి (మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డవలప్ మెంట్) మంత్రి గారు దేశానికంతటికీ డాక్టర్ నీ, పోలీసుల్నీ మృత శరీరాన్ని తనిఖీ చేసేందుకు మరుసటి రోజు ఉదయం గం. 6:30 ని.ల వరకు అనుమతించలేదని చెప్పారు” అని పై ఫేస్ బుక్ స్టేటస్ చెబుతోంది.

Dr Rajashri and Police in Rohith room

Dr Rajasri and TG police in hostel room where Rohith killed himself

జిక్రుల్లా నిషా మాత్రమే కాదు. డాక్టర్ రాజశ్రీ కూడా ఈ మేరకు తాను రోహిత్ ను చెక్ చేశానని చెప్పారు. ఎన్‌డి‌టి‌వి, ఇండియా టుడే చానెళ్లపై కనిపించి ఆ సంగతి చెప్పారామె.

“అతని శరీరం చల్లగా ఉంది. బిగుసుకు పోయి కదలకుండా ఉంది. అతను చనిపోయాడని నాకు తెలుసు. కానీ నా డ్యూటీ నేను చేశాను. అతనికి పల్స్ లేదు” అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ చెప్పారని ఇండియా టుడే తెలిపింది.

డాక్టర్ రాజశ్రీ గారు అక్కడికి వెళ్ళిన సమయంలో తెలంగాణ పోలీసులు కూడా ఉన్నారని రాజశ్రీ గారు చెప్పారు. “బైట పరిస్ధితి ఏమిటో నాకు తెలియదు గానీ నేను అక్కడికి వెళ్లడానికి ఎవరూ నన్ను ఆటంకపరచలేదు” అని ఎన్‌డి‌టి‌వి తో మాట్లాడుతూ చెప్పారామె. ఈ విధంగా…

Around 7.30 pm I got a call from the hostel. I reached within 4 minutes. The body was already put on the cot. I examined for pulse and BP, despite knowing he is probably dead. There was no pulse or BP. His body was cold, stiff and rigid. His tongue was protruding and rigor mortis had set in.

(rigor mortis = stiffness of death occuring after 3 to 4 hours after death)

“సాయంత్రం దాదాపు గం. 7:30 ని.ల సమయంలో నాకు హాస్టల్ నుండి కాల్ వచ్చింది. 4 ని.ల్లో నేను అక్కడికి చేరాను. దేహాన్ని అప్పటికే మంచంపై పెట్టారు. అతను బహుశా చనిపోయి ఉండవచ్చని నాకు తెలుస్తున్నప్పటికీ పల్స్ కోసం, బి‌పి కోసం నేను పరీక్ష చేశాను. అతని శరీరం చల్లగా ఉంది. బిగుసుకుని కదలకుండా ఉంది. నాలుక బైటికి వచ్చి ఉంది. రిగర్ మార్టిస్ ప్రారంభం అయింది” అని రాజశ్రీ చెప్పారని ఎన్‌డి‌టి‌వి తెలిపింది. ఈ మాటలను ఎన్‌డి‌టి‌వి చానెల్ ప్రసారం చేసింది.

యూనివర్సిటీ హెల్త్ బుక్ లో కూడా రోహిత్ మరణం గురించి రాజశ్రీ రాశారు. జులై 17 రాత్రి 7:30 ని.లకు రాసిన ఎంట్రీలో ఆమె వివరాలు రాశారు. హెల్త్ బుక్ ఎంట్రీని ఫోటో తీసి విద్యార్ధులు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు. ఆ ఫోటోను కింద చూడవచ్చు.

Health note book

రోహిత్ చనిపోయినట్లు తెలిసిన తర్వాత రూమ్ లోని ఘటనలను అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోలో పోలీసులు వచ్చి బాడీని పరిశీలిస్తున్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. వీడియోను ఎన్‌డి‌టి‌వి చానెల్ ప్రసారం చేసింది కూడా.

కనుక రోహిత్ దేహం దగ్గరికి మరుసటి రోజు ఉదయం ఆరున్నర వరకు పోలీసులను గానీ, డాక్టర్ ని గానీ అనుమతించలేదని స్మృతి ఇరానీ దేశానికి చెప్పడం శుద్ధ అబద్ధం. అబద్ధాన్ని అడ్డం పెట్టుకుని ఆమె చూపిన హావభావాలు, భావోద్వేగాలు కూడా ఒట్టి అబద్ధమే అని వేరే చెప్పనవసరం లేదు.

రోహిత్ ని రివైవ్ చేయడానికి ఒక్కరూ ప్రయత్నం చేయలేదని స్మృతి ఇరానీ చెప్పింది అబద్ధమేనని తేలింది. డాక్టర్ వద్దకి తీసుకెళ్లడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదని ఆమె చెప్పారు. పైగా డాక్టర్ వచ్చినా రోహిత్ దగ్గరికి వెళ్లనివ్వలేదని చెప్పారు. ఒక్కటి కూడా నిజం కాదు. అబద్ధం, అబద్ధం, అబద్ధం!

స్మృతి ఇరానీ భావోద్వేగాల లక్ష్యం ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు. అంబేడ్కర్ విద్యార్ధి సంఘం సభ్యులే లక్ష్యంగా ఆమె ఆరోపణలు గుప్పించారు. తద్వారా ఆమె తన దళిత ద్వేషాన్ని పచ్చిగా వెళ్ళబుచ్చారు. దళిత విద్యార్ధులు తమ సోదరుడి చావుకు పరోక్ష కారకులని, బహుశా ప్రత్యక్ష కారకులు కూడా అనీ, డాక్టర్ నీ పోలీసులనీ వెళ్లనివ్వకుండా అడ్డుకుని శవ రాజకీయాలు చేశారని, ప్రయోజనం పొందాలని చూశారని ఆమె ఆరోపించారు. ఇది ఎస్‌సి, ఎస్‌టి లు వేసిన కరపత్రం అని ప్రత్యేకంగా చాటి మరీ చీత్కరించడం వెనుక ఆ జనాలకి వ్యతిరేకంగా అగ్రకులాలను ఆకర్షించే ప్రయత్నం లేకపోతే ఆశ్చర్యమే. ఓట్ల కోసం వెనుకబడిన హిందూత్వ అంధ విశ్వాసాలను వినియోగించగా లేనిది ఇదెంతసేపని.

కులం అంతరించింది, లేదా అంతరిస్తోంది అని కొందరు విప్లవకారులుగా చెప్పుకుంటున్నవారు కూడా చెబుతున్న భారత సమాజంలో కుల విద్వేషం ఈ విధంగా రూపం సవరించుకుని ప్రజాస్వామ్య రక్షకుల ముసుగు వేసుకుని, ప్రజాస్వామ్య దేవాలయంలోకి ప్రవేశించి దళిత విద్యార్ధులపై విషాన్ని చిమ్ముతోంది.

ఈ కుల మృత వాదులకు స్మృతి ఇరానీలను చూశాకైనా కులం కనిపిస్తుందా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s