అసురులు భ్రష్ట మనస్కులా స్మృతి గారూ!


రోహిత్ మరణం గురించిన వ్యాఖ్యానాల వల్లనే స్మృతి ఇరానీ మాటలను దళిత ద్వేషంగా చెప్పడం కాదు. జే‌ఎన్‌యూ లోని ఎస్‌సి, ఎస్‌టి విద్యార్ధుల సంఘం మహిషాసుర అమర దినం జరిపినందుకు కూడా సభలోనే చీదరించుకున్నారు. “ఈ పాంప్లెట్ రాసింది ఎవరు?” అని తనను తాను ప్రశ్నించుకుంటూ పాంప్లెట్ చివర “ఎస్‌సి ఎస్‌టి విద్యార్ధి సంఘం” ను పెద్దగా చదివి వినిపిస్తూ ఆమె “What is this depraved mentality?” అని చీదరగా ప్రశ్నించారు.

“And may my god forgive me for reading this, Durga Puja is the most controversial racial festival, where a fair skinned beautiful goddess Durga is depicted brutally killing a dark-skinned native called Mahishasura. Mahishasura, a brave self-respecting leader, tricked into marriage by Aryans. They hired a sex worker called Durga, who enticed Mahishasura into marriage and killed him after nine nights of honeymooning, during sleep.” (Pamplet)

“Freedom of speech, ladies and gentlemen, who wants to have this discussion in the streets of Kolkata? I want to know.”  

“What is this depraved mentality? I have no answers for it.”

స్మృతి ఇరానీ ఉద్దేశ్యం స్పష్టమే. హిందువులు దేవతగా కొలుచుకునే దుర్గ మాత చేత సంహరించ బడిన మహిషాసురిడిని ఎస్‌సి ఎస్‌టి విద్యార్ధుల సంఘం అమరుడిగా చిత్రిస్తూ పాంప్లెట్ వేశారని చదివి చెబుతూ వారి మానసికతను “భ్రష్ట మనస్తత్వం” గా చెప్పడమే ఆమె ఉద్దేశ్యం.

దుర్గా దేవిని అడ్డం పెట్టుకుని లేదా హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని హిందూత్వ మనస్తత్వంతో భావాలను జడ్జ్ చేస్తున్న స్మృతి ఇరానీకి ఎస్‌సి, ఎస్‌టి లు ‘భ్రష్ట మనస్కులు’ గా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

కానీ ఆమె పార్లమెంటు వేదికగా భారత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించేదని చెప్పే ప్రజాస్వామ్య దేవాలయంలో ఈ దేశంలో దాదాపు పాతిక శాతం మంది ప్రజలని చీదర చేస్తూ మాట్లాడడం.. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్ధులు మానసిక చింతనని తూలనాడడం.. నిజంగా ఆశ్చర్యమే.

సో కాల్డ్ ప్రజాస్వామ్య దేవాలయాన్ని తీసుకెళ్లి హిందూత్వకు అప్పగిస్తే ఏమి జరగాలో అదే జరుగుతోంది. ఇన్నాళ్లూ లేదని కాదు గానీ జరిగిందేదో నిగూఢంగా జరిగింది. చేదు మాత్రకు తీపి పూత తరహాలో జరిగింది. ఎన్నికల వాగ్దానాల మాటున, హరిజనులన్న కీర్తనల మాటున, ప్రజాస్వామ్య కబుర్ల మాటున జరిగింది.

హిందూత్వకు ఆ మర్యాద లేదు. హిందూత్వ విశృంఖలత్వానికి ఆ నాగరికత ముసుగు బరువైపోయింది. హిందూత్వ భూస్వామ్య అసంభావానికి ఆ నాజూకుతనం విసుగు పుట్టించింది. హిందూత్వ ఆధిక్యతకు ఆ ప్రజాస్వామికత లొంగుబాటుగా తోచింది. ఫలితంగా స్మృతి ఇరానీ ప్రసంగం రూపంలో జడలు విప్పి దుర్గామాతయై పార్లమెంటు వేదికపై విలయ నాట్యం చేసింది. మరి ఎన్నాళ్లు భరించాలి ఈ భ్రష్ట మనస్కుల డిమాండ్లని?

ఈ మానవ వనరుల మంత్రికి మానవ వనరుల ఔన్నత్యాన్ని ఎవరు నేర్పాలి? మనిషి విలువని, అది ఎస్‌సి అయినా ఎస్‌టి అయినా, ఓ‌సి అయినా, ఓ‌బి‌సి అయినా, తెలుపయినా, నలుపయినా.. ఒక మనిషి వనరుని ఎలా అభివృద్ధి చేయాలో, ముఖ్యంగా ఎలా చీత్కరించకూడదో ఎవరు నేర్పాలి?

ఇప్పటికీ కూడా పురాతన మనిషి మూలాలని తెలుసుకోవడానికి విశ్వ విద్యాలయాలు, పరిశోధకులు కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? ఏ కాస్త చిన్న ఎముక కనపడినా పట్టి పట్టి చూస్తూ ఇన్ని వేల సం.ల క్రితం నాటిదని సగర్వంగా చాటడం ఎందుకు? మనిషి మూలం శాస్త్ర సాంకేతిక పరిశోధనకే కాదు ఇప్పటి మనిషి మరింత నాగరిక ఉన్నతికి చేరుకోవడానికి కూడా అది ఉపకరిస్తుందని. మనిషి పుట్టిన మూలం తెలిస్తే ఇప్పటి మనుషుల అపసవ్యతల్ని సరి చేయవచ్చని.

మన మానవ వనరుల మంత్రి దేశంలోని పాతిక కోట్ల మంది మనుషులను పార్లమెంటు సాక్షిగా కించపరచడానికి పూనుకోవడం ఏ నాగరికతా భ్రష్టత్వానికి ప్రతీకయో తెలియవలసి ఉంది.

అసలు ఈ భూ మండలం పైన ఉన్న మనుషులందరికీ ఆఫ్రికాలోని చింపాంజీ ఆకారపు హోమో సెపియన్ మూలం అని తెలిస్తే స్మృతి ఇరానీ వారు ఏమైపోతారో?!

గమనిస్తే… ఎస్‌సి, ఎస్‌టి సంఘం కరపత్రం చదువుతూ ఆమె “భావ ప్రకటనా స్వేచ్ఛ మిత్రులారా! కోల్ కతా వీధుల్లో ఈ చర్చా స్వేచ్చ ఎవరికి కావాలో తెలుసుకోవాలని ఉంది” అని ప్రశ్నించడం ద్వారా రాజకీయంలోకి దిగిపోయారు. త్వరలో జరగనున్న బెంగాల్ ఎన్నికల్లో దుర్గా ద్వేషులైన వామపక్షాలకు, కాంగ్రెస్ కూ ఓట్లు వేయొద్దని కోల్ కతా వీధులు అనడం ద్వారా చెప్పేశారు. ఈమె రోహిత్ ఆత్మహత్య రాజకీయం చేయొద్దని విన్నపాలు చేస్తారు! కపటం కాదా?

అయితే మంత్రి గారు తెలుసుకోవాల్సిన చరిత్ర చాలానే ఉంది. హిందూ పురాణాలు చదువుకుని అదే చరిత్రగా భావిస్తున్న బావిలో కప్పలకు మనుషుల వాస్తవ చరిత్ర తెలియజేయాల్సిన అవసరం తరుముకొచ్చింది. పార్లమెంటు వేదికలపైనే పురాణ గాధల్ని చరిత్రగా చెబుతున్న రోజులు వచ్చి పడ్డాక………….?!

స్మృతి ఇరానీ గారిని అంతగా బాధపెట్టిన హిందు దుర్గా మాత కధ ప్రకారం ఆమె దేవతలందరి పుత్రిక. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు వివిధ దేవాధీశుల శక్తులు, ఆయుధాలు నింపుకుని జనించిన ఉమ్మడి శక్తి స్వరూపిణి. దేవతల కోరికతో కేవలం మహిషాసురిడిని చంపే లక్ష్యంతో పుట్టిన జగన్మాత. దేవతలని, ముల్లోకాలని నానా హింసలు పెడుతున్న మహిషారుడిని చంపాలని బ్రహ్మను వేడుకోగా ఆయన ఇతర పురుష, మహిళా దేవతలతో కలిసి ఒక ముని (పేరు గుర్తు లేదు) ఆశ్రమంలో ఆవిష్కరిస్తారు. ఆమె 10 రోజుల పాటు పొరాడి మహిషాసురిడిని సంహరిస్తుంది.

మహిషాసురుడి శక్తి గురించి మరో కధ. ఆయన తండ్రి తపస్సు వలనా, సొంత తపస్సు వలనా బ్రహ్మ నుండి వరం పొందుతాడు దేవతల వల్లా, పురుషుల వల్లా, జీవుల వల్లా మరణం ఉండకూడదని. కానీ మహిళలను మర్చిపోతాడు. (అందుకే మహిళా శక్తికి పని అప్పజెబుతారు.) తాను ఏ రూపంలోకైనా మారే వరాన్నీ, ఏ రూపంలో ఉన్నా ఎవరూ చంపలేని వరాన్నీ పొందుతాడు. ఈ సూక్ష్మం తెలుసు గనక మహిష రూపం నుండి మనిషి (రాక్షసుడు) రూపం లోకి మారుతుండగా దుర్గ సంహరిస్తుంది. తొమ్మిది రోజులు నవరాత్రులు గానూ, పదో రోజు దుర్గాపూజ రోజు గానూ హిందువులు జరుపుతారు. బెంగాల్ లో కాళికా మాత రూపంలో హిందువులు కొలుస్తారు. (అందుకే కలకత్తా వీధులు అని మంత్రి అనడం.)

ఇది హిందువుల కధగా ప్రచారంలో ఉన్నది మాత్రమే. కానీ ఈశాన్య భారతంలో అసుర జాతి ఇప్పటికీ ఉనికిలో ఉన్నది. వారు నాగరికత తెలియని గిరిజనులు. మహిషాసురుడు తమ దేవుడిగా వారు కొలుస్తారు.  ప్రస్తుతం 10,000 మంది మాత్రమే ఈ జాతి వాళ్ళు ఉనికిలో ఉన్నారు. బీహార్, జార్ఖండ్, బెంగాల్ ఇతర ఈశాన్య రాష్ట్రాలలో  నివసిస్తున్నారు.  అసుర జాతి అంతరించిపోతున్న జాతిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 7,000 మంది వరకు మాట్లాడే వారి సొంత భాష అంతరించడం ఖాయం అని యునెస్కో ప్రకటించింది. వాళ్ళు అసురుడు గురించి చెప్పే కధ వేరే ఉన్నది.

వాళ్ళ నమ్మకం ప్రకారం మార్కండేయ పురాణం చెప్పే దేవి మహత్యం కధ పక్షపాతంతో కూడుకున్నది. వారి దృష్టిలో బ్రహ్మ, విష్ణు శివుల ఉమ్మడి శక్తితో దుర్గ పుట్టిందన్న కధ కేవలం కల్పించబడిన కుట్ర మాత్రమే. వాస్తవానికి తమ రాజు మహిషాసురుడే బ్రహ్మకోసం తపస్సు చేసి ఏ పురుషుడు, దేవుడు చంపకుండా వరం పొందాడు. బిజినెస్ స్టాండర్ద్ పత్రికకు 2011 లో ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళు ఇలా చెప్పారు.

“దేవతలు దురాక్రమణదారులు. వాళ్ళు భూమి మీదకు వచ్చి మా పూర్వీకులను చంపేశారు. మేము దుర్గా పూజను చూసేందుకు ఇష్టపడం. మహాలయ, షష్ఠి, సప్తమి అష్టమి, నవమి, దశమి రోజుల్లో మా పూర్వీకులను స్మరిస్తూ, వారి సంస్మరణలో ప్రత్యేక పూజలు చేస్తాము.”

ఈ రెండింటిలో ఏది నిజం? కళ్లెదుట కనిపిస్తున్నది నిజం. అసుర జాతి ఇప్పటికీ మన కళ్ల ముందు ఉన్నది. వాళ్ళు రాక్షసులు కాదు, అందరిలా మనుషులు. వారు ఈ నేలపై పుట్టిన అసలైన ఇండియన్లు. దేవతలు పై నుండి దిగి వచ్చారన్నది వారి అవగాహన. ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు తెల్లతోలుతో ఉండడంతో దేవతలుగా భావించి ఉండవచ్చు. లేదా వారిని దేవత జాతిగా అసురుల పూరీకులు భావించి ఉండవచ్చు. పూర్వీకుల ఊహలు, ఆరాధనలు కాలక్రమంలో దివ్య గాధలుగా మారడం మన ‘సమ్మక్క సారక్క’ల కధను బట్టి అర్ధం చేసుకోవచ్చు.  

ఈ అసుర జాతిని ‘దుర్గామాత చంపేసిన’ మహిషాసుర రాక్షసుడిగా నమ్మేసిన మానవ వనరుల మంత్రి పార్లమెంటులో కూర్చొని “ఏమిటీ మానసిక భ్రష్టత?” అని ప్రశ్నిస్తున్నారు. దేశానికంతటికీ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతి ఒక్క పౌరుడి అభిప్రాయాన్నీ, నమ్మకాన్ని గౌరవించవలసిన కేంద్ర మంత్రి చీత్కరించుకోవడం ఎలా అర్ధం చేసుకోగలం, హిందూ ఆధిపత్య దురహంకార ఆధునిక రూపంగా తప్ప?

2011లో జే‌ఎన్‌యూ విద్యార్ధులు నవరాత్రి పూజలను మహిషాసుర అమరత్వ దినంగా జరిపారు. జరిపింది ఎస్‌సి, ఎస్‌టి విద్యార్ధులు. వారు హిందూత్వ కులాధిపత్యాన్ని నిరసనగానే కాకుండా అసుర జాతి మానవులే ననీ, బయటి నుండి వచ్చినవారి దండయాత్రల వల్లా, వారి విజయం వల్లా స్ధానిక అసుర జాతి ప్రజలను రాక్షసులుగా చిత్రించారని సమాజానికి తెలియజేప్పేందుకు  ఈ కార్యక్రమాలను నిర్వహించారు. తద్వారా ప్రధాన స్రవంతిలోని హిందూ పురాణాలకు ప్రత్యామ్నాయ గాధలు అనేకం ఉన్నాయని, భారత జాతుల, ప్రజల నిజమైన చరిత్ర అక్కడ ఉన్నదని చెప్పేందుకు నిర్వహించారు.

ఈ సంగతి ఎంత చెప్పినా ‘మను’స్మృతి పూజారులకు అర్ధం కాకపోవచ్చు. అర్ధం చేసుకోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ అసుర ప్రజలను, ఎస్‌సి ఎస్‌టి ప్రజలను దురహంకారంతో ప్రజా ప్రతినిధుల వేషం వేసుకుని ప్రజాస్వామ్యం పేరు చెప్పి దూషించే హక్కు గానీ, చీత్కరించే హక్కు గానీ లేదని గ్రహించవలసి ఉంది.

 

11 thoughts on “అసురులు భ్రష్ట మనస్కులా స్మృతి గారూ!

  1. ఆమె వ్యాఖ్యలు తలా తోకా లేకుండా ఉన్నాయనుకున్నాను కానీ – మీ విశ్లేషణ చదివేదాకా అందులోని కుతంత్రాలను గ్రహించ లేకపోయాను. ధన్యవాదాలు శేఖర్ గారూ …

  2. “వాళ్ళ నమ్మకం ప్రకారం మార్కండేయ పురాణం చెప్పే దేవి మహత్యం కధ పక్షపాతంతో కూడుకున్నది. వారి దృష్టిలో బ్రహ్మ, విష్ణు శివుల ఉమ్మడి శక్తితో దుర్గ పుట్టిందన్న కధ కేవలం కల్పించబడిన కుట్ర మాత్రమే.”
    అలాగే హిందువులు కూడా అనుకోవచ్చు కదా సార్..అసురులు చెప్పే కథలు కూడా కల్పించబడిన కథలు అని..

  3. BB గారూ అనుకోవచ్చు. అసురుల కధలు కల్పితం అని శుభ్రంగా అనుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ఉండాలనేగా జే‌ఎన్‌యూ విద్యార్ధులు కోరుతున్నది!

    కానీ అసురులు రాక్షసులు కాదని కదా చెబుతున్నది. అసురులు మనుషులు. ఇప్పటికీ మన మధ్య ఉన్న మానవులు వాళ్ళు. హిందు నమ్మకాలు అసురులను రాక్షసులుగా, భ్రష్ట మనస్కులుగా నమ్ముతుంటే అసురుల నమ్మకాలు దేవతలను కేవలం దండయాత్రీకులుగా, పక్షపాతులుగా మాత్రమే భావిస్తున్నాయి.

    రెండింటికీ తేడా చూడాలి మీరు.

    హిందూ పురాణాలు ప్రతిపక్షంలోని మనుషులని రాక్షసీకరిస్తే, అసురుల పురాణం మనిషిని మనిషిగా మాత్రమే చూసింది.

  4. మీ ఆర్టికల్ లోని కొన్ని(అసురుల తెగ గురించిన సమాచారం) వాక్యాలను యథాతథంగా, ‘అరుగు’ పత్రిక లో నా వ్యాసానికి సపోర్ట్ గా వాడుకున్నాను సర్, ముందు తెలియజేనందుకు మన్నించండి…

  5. కళ్యాణి గారు, అదే కాదు, ఇంకే సమాచారం అవసరం అయినా శుభ్రంగా వాడుకోవచ్చు. మీలాంటి కార్యకర్తలయితే నా పేరు కూడా చెప్పనవసరం లేదు.

    సమాచారం, విజ్ఞానం ఒకరి సొత్తు కాదు కదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s