సమగ్రంగా: హిందూత్వపై జే‌ఎన్‌యూ పోరాటం -1


Umar Khalid & Anirban Bhattacharya

Umar Khalid & Anirban Bhattacharya

(జే‌ఎన్‌యూ విద్యార్ధుల తిరుగుబాటుపై ఇటీవలి రోజుల్లో జరిగిన పరిణామాలను జోడిస్తూ చేసిన సమగ్ర విశ్లేషణ ఇది. సాధ్యమైనంత సమగ్రంగా రాసేందుకు ప్రయత్నించాను. అందువల్ల పెద్ద ఆర్టికల్ అయింది. ఇందులో గత ఆర్టికల్స్ లోని కొన్ని అంశాలను కూడా జోడించాను. అందువలన ఇంతకు ముందు చదివిన భావన కొన్ని చోట్ల కలగవచ్చు. -విశేఖర్)

*********

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రోహిత్ ఆత్మహత్య, తదనంతర విద్యార్థి ఉద్యమం తెరిపిడి పడక ముందే హిందూత్వ పాలకులు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. అఫ్జల్ గురు స్మృతిలో సమావేశం జరిపినందుకు ఉమర్ ఖలీద్, కన్హైయా కుమార్, భట్టాచార్య మరో ముగ్గురు పైన దేశద్రోహం (సెడిషన్) కేసు మోపారు. కన్హైయా కుమార్ ని హుటాహుటిన అరెస్ట్ చేశారు. ఇతరుల కోసం దేశం అంతా గాలించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్ధుల స్నేహితులు, బంధువుల ఇళ్లను గాలించారు. వారి వెతుకులాటను అపహాస్యం చేస్తూ విద్యార్ధులు మళ్ళీ యూనివర్సిటీలో ప్రత్యక్షం అయ్యారు. వారినీ అరెస్ట్ చేసేందుకు యూనివర్సిటీ గేటు వద్ద పోలీసులు రెండు రోజులు కాపలా కాశారు. చివరికి ఉమర్ ఖలీద్, భట్టాచార్యలు తమ అరెస్టుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను ఢిల్లీ హై కోర్టు నిరాకరించడంతో ఫిబ్రవరి 24 తేదీ తెల్లవారు ఝామున స్వయంగా యూనివర్సిటీ బైటికి వచ్చి పోలీసులకు లొంగిపోయారు.

విశాల దృష్టితో చూస్తే, జే‌ఎన్‌యూ విద్యార్ధుల అరెస్టు హైదరాబాద్ యూనివర్సిటీ ఘటన పునరావృతంగా భావించవచ్చు. రోహిత్, ఇతర దళిత విద్యార్ధులను హైదరాబాద్ యూనివర్సిటీ హాస్టల్ నుండి రస్టికేట్ చేయడం ద్వారా హిందూత్వ వ్యతిరేక ప్రతిఘటనను నిలువరించాలని బి‌జే‌పి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ వారి ఎత్తులు పారలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో వారి చర్యలు వారికే ఎదురు తిరిగాయి. విద్యార్ధులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దేశ విదేశాల నుండి ప్రొఫెసర్లు, యూనివర్సిటీలు, విద్యార్ధులు, పరిశోధకులు, మేధావులు విద్యార్ధులకు మద్దతు పలికారు. కేంద్ర ప్రభుత్వానికి ఖండనమండనలు ఎదురయ్యాయి. విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా సమస్యను ఢిల్లీకి కొనిపోయేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే జే‌ఎన్‌యూ విద్యార్ధులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ ఫిబ్రవరి 11 తేదీన కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రకటన చేశారు.

“యూనివర్శిటీలలో ఉగ్రవాద కార్యక్రమాలను, దేశ వ్యతిరేక శక్తులను సహించేది లేదు” అంటూ హోమ్ మంత్రి ఆ ప్రకటనలో హుంకరించారు. ఆయన ప్రకటన వెలువడిన మరుసటి రోజే కేంద్ర హోమ్ శాఖ పరిధిలో పని చేసే ఢిల్లీ పోలీసులు జే‌ఎన్‌యూ క్యాంపస్ పై దాడి చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హైయా కుమార్ ని అరెస్టు చేసి పట్టుకెళ్లారు. వారితో పాటు ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ (డి‌ఎస్‌యూ) నాయకుడు ఉమర్ ఖలీద్ సహా మరో 5గురు విద్యార్ధులనూ అరెస్టు చేయడానికి హాస్టళ్లను జల్లెడ పట్టారు. ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్ర ప్రభుత్వం పాల్పడిన ఫాసిస్టు చర్యపై దేశవ్యాపితంగా నిరసన పెల్లుబుకింది. ముఖ్యంగా విద్యార్థి లోకం ఒక్క పెట్టున గొంతెత్తి నిరసించింది. దాదాపు ప్రధాన యూనివర్శిటీలన్నీ జే‌ఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలకు మద్దతుగా ప్రదర్శనలు, నిరసనలు చేపట్టారు. ఛలో ఢిల్లీ కార్యక్రమాలు నిర్వహించారు.

జే‌ఎన్‌యూ సమస్యకు తలకొక విధంగా భాష్యం చెప్పారు. హిందూత్వ బ్రిగేడ్ సంఘాలు ‘ఉగ్రవాదం’, ‘దేశద్రోహం’ లాంటి అలంకారాలతో పత్రికలు, ఛానెళ్లను నింపేశారు. వారి హాహాకారాలను తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికలు మెజారిటీ తలకెత్తుకుని మోశాయి. తమ వంతు దేశభక్తి ప్రకటించుకుని తరించాయి. లిబరల్ మేధావుల్లో అనేకులు రివిజనిస్టు విద్యార్థి సంఘాలకు అపాలజిస్టులుగా అవతరించి “దేశ వ్యతిరేక నినాదాలు చేయడం తప్పే. కానీ అది కేవలం క్రమశిక్షణ రాహిత్యమే గానీ దేశద్రోహం కాదు” అంటూ వివరణ ఇచ్చారు. రివిజనిస్టు పార్టీలు “నినాదాలు చేసింది మేము కాదు” అంటూ తప్పు జరిగింది వాస్తవమే అని చెప్పకుండా చెప్పారు. రోహిత్ ఆత్మహత్య దరిమిలా తలెత్తిన వ్యతిరేకత నుండి బయటపడేందుకు బి‌జే‌పి ప్రభుత్వం జే‌ఎన్‌యూలో సరికొత్త సమస్యకు అంకురార్పణ చేసిందని కొందరు వామపక్ష విమర్శకులు సైతం విశ్లేషణలు వెలువరించారు. వామపక్ష ఎం‌పిలు కేంద్ర ప్రభుత్వ మంత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ, వీడియోలు తమ విద్యార్ధులకు వ్యతిరేక సాక్షాలు ఎందుకు కావో వివరిస్తూ, నిజంగా నినాదాలు ఇచ్చినవారు బహిరంగంగా తిరుగుతున్నారని చెప్పుకుంటూ కన్హైయాను విడిపించడానికి శ్రమించారు. వాస్తవంగా జే‌ఎన్‌యూలో జరిగింది ఏమిటి? ఎందుకు జరిగింది? జే‌ఎన్‌యూ, హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనలకు సంబంధం ఏమిటి? ఈ ఘటనలను ప్రేరేపించడం ద్వారా హిందూత్వ పార్టీ సాధించదలచిన ప్రయోజనం ఏమిటి?

అఫ్జల్ గురు సంస్మరణ

విశ్లేషణలోకి వెళ్ళేముందు జే‌ఎన్‌యూ ఘటనల క్రమాన్ని పరిశీలించాలి. ఫిబ్రవరి 9వ తేదీన యూ‌పి‌ఏ ప్రభుత్వం ఉరితీసిన అఫ్జల్ గురును స్మరిస్తూ డి‌ఎస్‌యూ విద్యార్థి సంఘం ఒక కార్యక్రమం నిర్వహించింది. (ఈ సంఘం మావోయిస్టు పార్టీకి ఫ్రంట్ సంఘం అని పోలీసులు, ఇంటలిజెన్స్ సంస్థలు చెబుతున్నాయి.) “న్యాయ వ్యవస్థ చేసిన అఫ్జల్ గురు హత్యకు వ్యతిరేకంగా” ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమంగా ఉద్దేశించారు. ఔత్సాహికులు సమావేశం అంశం పైన చిత్రకళ, కవిత్వం తదితర సాంస్కృతిక రూపాలను సమర్పించాలి. వర్శిటీ వ్యాపితంగా అంటించిన పోస్టర్ల ద్వారా విద్యార్ధులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కర్త డి‌ఎస్‌యూ నాయకుడు ఉమర్ ఖలీద్. ఇలాంటి కార్యక్రమాలు జే‌ఎన్‌యూ లో సర్వసాధారణం. ఎంత సాధారణం అంటే అఫ్జల్ గురు కార్యక్రమం దరిమిలా జే‌ఎన్‌యూపై బి‌జే‌పి తదితర హిందూత్వ సంస్థలు, నేతలు విరజిమ్మిన హిందూత్వ విషాన్ని మింగలేక హిందూత్వ అనుబంధ విధార్ధి సంఘం ఏ‌బి‌వి‌పికి చెందిన ముగ్గురు నేతలు సైతం రాజీనామా చేసేటంతగా.

ఏ‌బి‌వి‌పి నేతలు తమ రాజీనామా లేఖను సోషల్ మీడియాలో ఉంచారు. జే‌ఎన్‌యూ విద్యార్ధులు తర్వాత కాలంలో దేశ విదేశాల మేధావులుగా, పరిశోధకులుగా, విదేశీ యూనివర్సిటీల ప్రొఫెసర్లుగా, సివిల్ సర్వీసెస్ అధికారులుగా, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లుగా తర్వాత కాలంలో మారారంటే జే‌ఎన్‌యూలో నెలకొన్న ఎల్లలు లేని ప్రజాస్వామిక వాతావరణమేనని తమ రాజీనామా లేఖలో చెప్పారు. ఎంత తీవ్ర అభిప్రాయమైనా వెల్లడించి ప్రజాస్వామికంగా చర్చించి తర్కించుకునే వాతావరణం ఉండడం వల్లనే అత్యంత ఇరుకైన భావజాలం కలిగినవారు కూడా విమర్శను స్వాగతించే ప్రజాస్వామ్య ప్రియులుగా మారుతారని అలాంటి జే‌ఎన్‌యూ పైన దేశద్రోహ ముద్ర వేయడం సహించలేక సంస్థ నాయకత్వం నుండి, సభ్యత్వం నుండి తప్పుకుంటున్నామని ఏ‌బి‌వి‌పి నాయకులు తెలిపారు. వాళ్ళే కాదు. గతంలో జే‌ఎన్‌యూలో ఏ‌బి‌వి‌పి నాయకులుగా పని చేసిన వాళ్ళు కూడా బి‌జే‌పి ప్రభుత్వ ధోరణిని నిరసిస్తూ, ది హిందు, ఎన్‌డి‌టి‌వి లాంటి పత్రికల్లో వ్యాసాలు రాశారు.

ఫిబ్రవరి 9 తేదీన డి‌ఎస్‌యూ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్ధులతో పాటు బైటివారు కూడా పాల్గొన్నారు. వారిలో కొందరు ఎవరో కూడా డి‌ఎస్‌యూ విద్యార్ధులకు తెలియదు. వారు ‘ఇండియాని ముక్కలు చేస్తాం, నాశనం చేస్తాం (ఇండియా కొ టుకడే కరేంగే. ఇండియా బర్బాదీ)’ అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ నినాదాలను బి‌జే‌పి కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశంగా చేజిక్కించుకుంది. వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకున్నారా లేక చేజిక్కించుకోవడానికే ఒక అవకాశాన్ని సృష్టించుకున్నారా అన్నది ఇంకా ఇదమిద్దంగా సమాధానం దొరకని ప్రశ్న. ఇలాంటి నినాదాలు ఇచ్చింది ఎవరు అన్న అంశంపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉన్నది. కానీ గత ఉదాహరణలను పరిశీలిస్తే తామే ఒక చర్యకు పాల్పడి ఆ నెపాన్ని అవతలి పక్షం మీదికి నెట్టడానికీ దానిని సాకుగా చూపిస్తూ విద్వేషపూరిత అల్లర్లకు పాల్పడడానికీ హిందూత్వకు ఎలాంటి తడబాటు ఉండదని తెలుస్తుంది. బాబ్రీ మసీదులో రామ్ లల్లా విగ్రహాలు నాటడం, శిలాన్యాస్ పేరుతో శిలల సేకరణ, అద్వానీ రధయాత్ర దగ్గర్నుండి ఇటీవలి హైదారాబాద్ మక్కా మసీదు పేలుళ్లు, మాలెగావ్ పేలుళ్లు, ముజఫర్ నగర్ అల్లర్ల వరకూ ఘర్షణలకు బీజం వేసింది హిందూత్వ శక్తులే. అవతలివాళ్ళు ఏదో ఘోరం చేసినట్లుగా తామే ముసుగులో చర్యలకు పాల్పడడం అదే అవకాశంగా అవతలి పక్షంపై దాడులకు, అల్లర్లకు పాల్పడడం హిందూత్వ సంస్ధలు అనుసరిస్తున్న కుట్రపూరిత ఎత్తుగడ. కనుక డి‌ఎస్‌యూ కార్యక్రమంలో దేశవ్యతిరేక నినాదాలు ఇవ్వడంలో హిందూత్వ పాత్ర ఉందని అనుమానిస్తున్నవారు లేకపోలేదు.

అఫ్జల్ గురు సంస్మరణ కార్యక్రమాన్ని ఆటంకపరచడానికి ఏ‌బి‌వి‌పి ఆది నుండి ప్రయత్నించింది. ఏ‌బి‌వి‌పి ఫిర్యాదుతోనే కార్యక్రమానికి ఇచ్చిన అనుమతిని వైస్ ఛాన్సలర్ రద్దు చేశాడు. అయినా కార్యక్రమం కొనసాగింది. ఫిబ్రవరి 11 తేదీన కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్ తదితరులు యూనివర్సిటీ పాలనా భవనం మెట్లపై నిలబడి విద్యార్ధులను ఉద్దేశిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా ‘ఆజాదీ చాహియే’ (స్వతంత్రం కావాలి) అంటూ కన్హైయా కొన్ని నినాదాలు ఇచ్చాడు. ఆర్‌ఎస్‌ఎస్, కులతత్వం, ఉగ్రవాదం, మతతత్వం ఇత్యాది శక్తుల నుండి స్వతంత్రం కావాలని ఆ నినాదాల సారాంశం. ఇవి కాకుండా యూనివర్సిటీ బైట అఫ్జల్ గురు సంస్మరణ లోనే మరో కార్యక్రమం జరిగింది. అఫ్జల్ గురు సహ నిందితుడుగా పేర్కొనబడి నిర్దోషిగా విడుదలైన ప్రొఫెసర్ ఎస్‌ఏ‌ఆర్ జిలానీ ఆ కార్యక్రమం వద్ద ఉన్నట్లు పత్రికలు చెప్పాయి. మోడి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జే‌ఎన్‌యూ పైన ఇంటలిజెన్స్ నిఘా పెట్టారు. ఫిబ్రవరి 9 తేదీన కూడా ముగ్గురు పోలీసులు హాజరై ఆద్యంతం కార్యక్రమాన్ని తిలకించారు.

ఫిబ్రవరి 12 తేదీన ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఉన్నట్లుండి జే‌ఎన్‌యూ పైన ఆరోపణలు చేశారు. “ఇండియాకు వ్యతిరేకంగా ఎవరైనా నినాదాలు చేసినా, దేశ సమగ్రతను ఎవరు ప్రశ్నించినా సహించేది లేదు. జే‌ఎన్‌యూ కార్యక్రమానికి సంబంధించి వీలైనంత కఠిన చర్య తీసుకొమ్మని పోలీసులను ఆదేశించాను” అని ఆయన చెప్పారు. ఆయన ఆదేశాన్ని అందిపుచ్చుకున్న పోలీసులు పేర్లు రాయకుండా ‘దేశద్రోహం’ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రోజే యూనివర్సిటీ పోలీసుల పదఘట్టనలతో నిండిపోయింది. హాస్టళ్లను, తరగతి గదులను పోలీసులు జల్లెడ పట్టారు. కన్హైయా కుమార్ ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. కన్హైయా, ఉమర్ ఖలీద్, రామా నాగాలతో పాటు ఆరుగురు విద్యార్ధులను కేసుకు జత చేశారు. హోమ్ మంత్రి ఆరోపణలు, అరెస్టులు చట్టబద్ధమే అని రుజువు చేయడానికా అన్నట్లుగా జీ టీవి ఒక వీడియో ప్రసారం చేసింది. కన్హైయా కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు ఇస్తుంటే చుట్టూ ఉన్న విద్యార్ధులు ఆ నినాదాల్ని అందుకున్నట్లుగా ఒక అభిప్రాయం కల్పించే విధంగా ఆ వీడియో ఉన్నది. అతని పక్కన నిలబడ్డ ఉమర్ ఖలీద్ కన్హైయా నినాదాలకు వంత చెబుతున్నట్లు కనిపించాడు. అరెస్టులపై ఒక పక్క నిరసన పెల్లుబుకుతుండగానే మధ్యతరగతి జనం, మిడి మిడి మేధావులు యథావిధిగా ఆ వీడియో వెంట కొట్టుకుని పోయారు. అఫ్జల్ గురు టెర్రరిస్టు గనక ఆయనను సంస్మరించడం ఏమిటన్నది వారి ప్రశ్న. జే‌ఎన్‌యూ లెఫ్ట్ రాజకీయాలకు నిలయం కనుక వారు చేసేది ఏదైనా తప్పేనని భావించే హిందూత్వ అనుచరగణం చేసే వ్యతిరేక ప్రచారం వారి భావోద్వేగాలను మరింత రెచ్చగొట్టింది. ఏ కాస్త ప్రగతిశీలంగా ఆలోచించేవారైనా, చివరికి లిబరల్ (లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్) పార్టీ కాంగ్రెస్ కూడా, విద్యార్ధుల భావప్రకటనా స్వేచ్ఛకు సాధారణ మద్దతు ప్రకటించారు. అఫ్జల్ గురుకు మద్దతు తప్పే అయినా ఆ భావాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ వారికి ఉన్నది అని లిబరల్ మేధావులు వాదించారు. ఇంతకీ అఫ్జల్ గురుకు మద్దతు ఇవ్వడం అంత నేరమా? ఆయనను ఉరితీయడం ‘జ్యుడీషియల్ కిల్లింగ్’ గా పేర్కొనడమే దేశ ద్రోహమా?

సంస్మరణ సరైనదేనా?

అఫ్జల్ గురు 2001 డిసెంబర్ 13 నాటి పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు. ఆయనకు 2002లో ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. అన్ని దశల్నీ దాటుకున్నాక 2005లో సుప్రీం కోర్టు సైతం ఉరిశిక్షను ఖరారు చేసింది. కానీ ఆయనను ఉరితీయకుండా 2013 వరకు కాలయాపన చేశారు. చివరికి అఫ్జల్ గురు శిక్ష కాంగ్రెస్, బి‌జే‌పి ల మధ్య ఒక రాజకీయ యుద్ధ సమస్య అయింది.

అఫ్జల్ గురుకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు పాఠం ద్వారానే అఫ్జల్ గురు ఉరితీత ఎంత అన్యాయమూ తెలిపే అంశాలు ఇమిడి ఉండడం ఒక విచిత్రం. అఫ్జల్ గురుకు వ్యతిరేకంగా ఎలాంటి భౌతిక సాక్షాలు లేవని, కేవలం పరిస్ధితుల సాక్షాలు మాత్రమే ఉన్నాయని సుప్రీం కోర్టు అంగీకరించింది. కానీ “దేశం యొక్క ఉమ్మడి ఆత్మను శాంతింపజేయడానికి” అఫ్జల్ గురు ఉరిశిక్షను ఖరారు చేస్తున్నట్లు చెప్పింది. కేవలం పరిస్ధితుల సాక్షాల ఆధారంగా ఒక నేరస్థుడి నేరాన్ని నిర్ధారించడం సరికాదని, పరిస్ధితుల సాక్షాలకు మద్దతుగా భౌతిక సాక్షాలు ఉన్నప్పుడే నేర నిర్ధారణ జరగాలని సుప్రీం కోర్టు గతంలో అనేక తీర్పుల్లో చెప్పింది. అదే అంశాన్ని అఫ్జల్ గురు తీర్పులో కూడా చెబుతూనే ‘దేశం యొక్క ఉమ్మడి ఆత్మ’ అంటూ సాకులు వెతికింది. అఫ్జల్ గురును ఉరి తీయడానికి నిర్ణయించుకున్నాక అందుకు తగిన కారణాలను వెతికినట్లుగానే తీర్పులు ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం విశ్లేషించారు.

ఈ అంశాన్ని ఔట్ లుక్ పత్రికలో వ్యాసం ద్వారా అరుంధతీ రాయ్ (బుకర్ ప్రైజ్ విజేత) శక్తివంతంగా రుజువు చేశారు. అఫ్జల్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు చెప్పిన పరిస్ధితుల సాక్షాలు కూడా పోలీసులు, సైన్యం సృష్టించినవేనని ఆమె రుజువు చేశారు. దాడి చేసినవారు ప్రయాణించిన కారును వారికి ఇప్పించింది అఫ్జల్ గురు అని పోలీసులు ఆరోపించారు. కానీ వారికి కారు ఇవ్వడానికి అఫ్జల్ ను పురమాయించింది పోలీసులే. పార్లమెంటుపై జరిగిన దాడి కూడా దేశంలో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు జరిగిన ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అన్న అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. కాశ్మీర్ లోయలో దాదాపు ప్రజలందరూ ఇదే అభిప్రాయంతో ఉంటే అది సహజం. పార్లమెంటుపై దాడి ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అయితే ఈ ఆపరేషన్ లబ్దిదారులు భారత పాలకవర్గాలు. బాధితులు కాశ్మీరు ప్రజలు, వారి స్వతంత్ర ఆకాంక్షలు. దాడి ద్వారా కాశ్మీర్ ప్రజలంటేనే ఉగ్రవాదులన్న ముద్రను పాలకులు సుస్థిరం చేయడానికి తలపెట్టారు.

ఈ నేపధ్యంలో అఫ్జల్ గురు శవాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు కూడా యూ‌పి‌ఏ ప్రభుత్వం సాహసం చేయలేకపోయింది. శవాన్ని ఇచ్చినట్లయితే ఆయన్ని ఖననం చేసిన చోటు కాశ్మీరీ ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చే యాత్రాస్ధలంగా మారిపోతుందని భద్రతా బలగాలు సలహా ఇవ్వడంతో మన్మోహన్ ప్రభుత్వం ఆ దురాగతానికి పాల్పడింది. వాజ్ పేయి/ఎన్‌డి‌ఏ కాలంలో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ జరిగితే యూ‌పి‌ఏ-2 ప్రభుత్వం అఫ్జల్ గురును ఉరి తీసింది. ఉరి శిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేసి దాదాపు 7 సంవత్సరాలు గడిచాక ఫిబ్రవరి 9, 2013 తేదీన అఫ్జల్ గురును చడి చప్పుడు లేకుండా ఉరితీశారు. ఉరి తీయబోతున్న సంగతి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. వారికి ఉత్తరం రాశామని హోమ్ సెక్రటరీ తీరిగ్గా ప్రకటించాడు. (ఆయన ఇప్పుడు బి‌జే‌పి నాయకులు.) నేటి సెల్ ఫోన్ ల యుగంలో ఉరితీస్తున్న సమాచారాన్ని ఉత్తరం ద్వారా కుటుంబానికి చెప్పడం! ఒక జాతి జాతంతా ఆగ్రహంతో, అవమానంతో, నిస్సహాయతతో రగిలి పోవడానికి ఇంతకంటే కారణం కావాలా?

ఇలాంటి దురన్యాయాన్ని, ఆధిపత్యాన్ని, అహంకారాన్ని ప్రజాస్వామ్య ప్రియులు ఎవరూ సహించలేరు. జే‌ఎన్‌యూ విద్యార్ధులు కూడా సహించలేదు. అఫ్జల్ గురు ఉరితీతను ఖండిస్తూ గతంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. 2016లో కూడా నిర్వహించడానికి నడుం బిగించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్ లో రోహిత్ తదితరులపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసి వారు రస్టికెట్ అయేందుకు దోహదపడిన ఏ‌బి‌వి‌పి జే‌ఎన్‌యూలో కూడా రంగంలోకి దిగింది. దరిమిలా హోమ్ మంత్రి ప్రకటన వెలువడడం, కన్హైయాను అరెస్టు చేయడం జరిగిపోయింది. హిందూత్వ ఫాసిస్టు దమనకాండకు ఏ‌బి‌వి‌పి ఆ విధంగా విద్యార్థి సాధనంగా ఉపయోగపడుతోంది.

వీడియో మార్ఫింగ్

కేంద్ర ప్రభుత్వ (రాజ్ నాధ్ సింగ్) హుంకారాలకు నిజానికి ప్రాతిపదిక లేదు. ఆయన దేశ సమగ్రత కోసం హాహాకారాలు చేసేంత దుష్కార్యం ఏదీ జే‌ఎన్‌యూలో చోటు చేసుకోలేదు. జే‌ఎన్‌యూ కార్యక్రమాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపితే భావోద్వేగాలు రగిలే అవకాశం లేదు. మంత్రుల హుంకారాలకు, హిందూత్వ హాహాకారాలకు, విద్యార్ధుల అరెస్టులకు అవకాశం లేదు. దేశ ప్రజల నుండి కూడా మద్దతు లభించదు. వారి సమస్యలు వారికి ఉన్నాయి. కానీ తమ చేష్టలకు ప్రజల నుండి మద్దతు ఉప్పొంగడం కేంద్రం లోని బి‌జే‌పి ప్రభుత్వానికి కావాలి. ఆ పనిని చీకటి మనుషులకు అప్పగించబడింది. ఫిబ్రవరి 13 తేదీన జీ న్యూస్ ఒక వీడియో ప్రసారం చేసింది. ఆ వీడియోలో ముందు చెప్పినట్లుగా ఉమర్ ఖలీద్, కన్హైయా తదితరులు కాశ్మీర్ స్వాతంత్రం కోసం నినదిస్తున్నట్లుగా చూపబడింది. ఈ వీడియో పైననే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల కేసు, బి‌జే‌పి ఎం‌పి ఫిర్యాదు అన్నీ ఆధారపడి ఉన్నాయి. జే‌ఎన్‌యూ విద్యార్ధులు దేశద్రోహులు అని చెప్పడానికి బి‌జే‌పి ఎం‌పిలు ఈ వీడియోనే తమ ఐప్యాడ్ లలో పెట్టుకుని చానెళ్ల స్టూడియోలు తిరిగారు. టైమ్స్ నౌ చానెల్ ఎడిటర్ గోస్వామి ఈ వీడియో ఆధారంగానే కేకలు పెడబొబ్బలు పెట్టాడు. వివిధ తెలుగు పత్రికలు కూడా ఈ వీడియో ఆధారంగా జే‌ఎన్‌యూ విద్యార్థులపై విషాన్ని చిమ్మారు. బి‌జే‌పి అనుకూల పత్రికలు, ఆ పార్టీ అధికారంలో ఉన్నది కనుక వారి అనుగ్రహానికై తపిస్తున్న పత్రికలు, ఛానెళ్లు అన్నీ కలిసి జే‌ఎన్‌యూపైన దేశ ద్రోహ ముద్ర వేయడానికి రేయింబవళ్లు శ్రమించారు. అనేక హిందీ పత్రికలు, చానెళ్లయితే ఈ కార్యక్రమంలో ఒకరికొకరు పోటీ పడ్డాయి.

అయితే ఈ వీడియో అసలైనది కాదని, రెండు వీడియోలని మార్ఫింగ్ చేసి మూడో వీడియో రూపొందించారని ఇండియా టుడే చానెల్ ససాక్షంగా రుజువు చేసింది. ఫిబ్రవరి 9 తేదీ నాటి ఒక వీడియోలో వ్యక్తులు ఎవరో కనిపించడం లేదు. అంతా చీకటిగా ఉన్నది. మనుషులు ఎవరో స్పష్టత లేదు. కానీ నినాదాలు మాత్రం వినిపించాయి, ‘ముక్కలు చేస్తాం, నాశనం చేస్తాం’ అని. ఫిబ్రవరి 11 తేదీన కన్హైయా, ఉమర్ లు నినాదాలు ఇస్తున్న వీడియో స్పష్టంగా ఉన్నది. నినాదాలు, మనుషులు, స్పందన అంతా స్పష్టంగా ఉన్నది. విద్యార్ధులు దేశవ్యతిరేక నినాదాలు తర్వాత, కనీసం కాశ్మీర్ అనుకూల నినాదాలు కూడా చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 9 వీడియోలోని ఆడియోను ఫిబ్రవరి 11 తేదీ నాటి వీడియోపై సూపర్ ఇంపోజ్ చేయడం ద్వారా ఇండియా వ్యతిరేక నినాదాలను కన్హైయా, ఉమర్ లు ఇచ్చినట్లుగా ఒక వాతావరణాన్ని కుట్రదారులు సృష్టించారు. దానితో పాటు పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాన్ని అదనంగా చొప్పించారు. ఈ సంగతిని మూడు వీడియోలు చూపడం ద్వారా ఇండియా టుడే స్పష్టంగా రుజువు చేసింది. దానితో నినాదాలు చేసింది జే‌ఎన్‌యూ విద్యార్ధులు కాదని రుజువైపోయింది. బైటినుండి వచ్చినవారు ఎవరో ‘ముక్కలు, నాశనం’ నినాదాలు ఇచ్చారని జే‌ఎన్‌యూ విద్యార్ధులు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. ఇండియా టుడే వెల్లడి తర్వాతనే ఆ సంగతి గ్రహించడం సాధ్యపడింది. అప్పటివరకూ హిందూత్వ సంస్థల హాహాకారాలతోనే పత్రికలు, చానెళ్ళు నిండిపోవడంతో జే‌ఎన్‌యూ విద్యార్ధులు చెప్పేది ఎవరికీ వినపడలేదు.

విచిత్రం ఏమిటంటే తర్వాత రోజుల్లో జి టీవి మరో వీడియో ప్రసారం చేసింది. ఏ‌బి‌వి‌పికి చెందిన జే‌ఎన్‌యూ విద్యార్ధులే పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోపై చర్య తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు, కేంద్ర మంత్రులు ఆసక్తి చూపలేదని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ వీడియో నకిలీది అని ఏ‌బి‌వి‌పి విద్యార్ధులు వెంటనే ప్రకటించారు. ‘మేము ఆ నినాదాలు చేయలేదు, బైటివారు చేశారు’ అని లెఫ్ట్ విద్యార్ధులు కూడా చెప్పారు. కానీ హిందూత్వ ప్రభుత్వం మొదటి వీడియోపైనే దృష్టి పెట్టింది, అది తమ పధకానికి అనువుగా ఉన్నది కనుక. రెండో వీడియోను తలచుకోను కూడా లేదు, అది తమకు ఎందుకూ ఉపయోగపడదు కనుక.

హిందూత్వ పధకం (డిజైన్)

ఏ‌ఏ‌పి నాయకుడు, సి‌ఎన్‌ఎన్-ఐ‌బి‌ఎన్ చానెల్ మాజీ ఎడిటర్ అశుతోష్ గుప్తా “ఇదంతా ఒక డిజైన్ ప్రకారం జరుగుతోంది” అని మొదటి నుండి ఛానెళ్ల చర్చల్లో మొత్తుకున్నాడు. ఆయన మొత్తుకోలు ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ఆ డిజైన్ ఏమిటో చెప్పే అవకాశం ఆయనకు దొరకలేదు. పాటియాలా హౌస్ కోర్ట్ ప్రాంగణంలో ఫిబ్రవరి 15, 17 తేదీల్లో లాయర్ గూండాలు విచ్చలవిడిగా సాగించిన దమనకాండతో హిందూత్వ డిజైన్ ఏమిటో మరింతగా స్పష్టమయింది. జే‌ఎన్‌యూ విద్యార్ధుల దేశభక్తి/దేశద్రోహం గురించి చెలరేగిన రగడను మరింతగా రెచ్చగొట్టడానికే బి‌జే‌పి, హిందూత్వ సిద్ధపడి ఉన్నారని పరిశీలకులకు లాయర్ల దుర్మార్గం ద్వారా అర్ధం అయింది. విద్యార్ధులు, ప్రొఫెసర్లను కొడుతూ వారన్న మాటలు, తిట్లు హిందూత్వ డిజైన్ ను స్పష్టంగా పట్టిచ్చాయి.

ఫిబ్రవరి 15 తేదీన కన్హైయాను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున కోర్టు ప్రాంగణంలో గుమికూడారు. విలేఖరులు కూడా పెద్ద సంఖ్యలో కన్హైయా రాక కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో కొందరు లాయర్లు, నల్ల కోట్లు తొడుక్కున్న దుండగులు హఠాత్తుగా వారిపై దాడి చేశారు. విద్యార్థి అన్నవాడు కనపడితే కొట్టారు. విద్యార్థి అనిపించినా కొట్టారు. ప్రొఫెసర్లను నువ్వు జే‌ఎన్‌యూ నుండి వచ్చావా అని అడిగి మరీ కొట్టారు. విలేఖరులను కూడా వారు వదల్లేదు. విలేఖరులు అంతా జే‌ఎన్‌యూ విద్యార్ధుల పక్షమే అని వాదిస్తూ కొట్టారు. కెమెరాలు లాక్కున్నారు. వ్యాన్ లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కోర్టు బైటి నుండి, లోపల నుండీ రాళ్లు విసిరారు. అంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిలబడ్డారు. ఆపడానికి ఏ సమయం లోనూ ప్రయత్నించలేదు. పోలీసుల ధోరణిని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సిగ్గు లేకుండా సమర్ధించుకున్నాడు. “రెండు విరుద్ధ తత్వ చింతనల మధ్య జరుగుతున్న ఘర్షణ కనుక మేము గట్టిగా జోక్యం చేసుకోలేము” అని ఆయన తమ క్రియా రాహిత్యాన్ని బహిరంగంగా సమర్ధించుకున్నాడు. అంతేనా, “విద్యార్థులపై సెడిషన్ కేసు (సెక్షన్ 124 ఎ) పెట్టినందుకు పోలీసుల్ని విమర్శిస్తే అది ‘దైవ దూషణ’ తో సమానం” అని ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇస్తూ అన్నాడు ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఢిల్లీ బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ ఓ పి శర్మ లాయర్లతో కలిసి విద్యార్థులపై దాడి చేయడంలో చురుకుగా వ్యవహరించాడు. తాను స్వయంగా కొంతమందిని కింద పడేసి బూటు కాళ్లతో కొట్టాడు. ఆయన వీరంగం దృశ్యాలు వీడియోల్లో, ఫొటోల్లో రికార్డ్ అయ్యాయి. కానీ ఆయనపై కేసు పెట్టేందుకు కమిషనర్ నిరాకరించాడు. ఆయనే తనపై దాడి జరిగిందని చెబుతున్నారు అంటూ గూండా ఎం‌ఎల్‌ఏను వెనకేసుకు వచ్చారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తారు. అనంతరం సమాచార హక్కు విభాగం సెంట్రల్ కమిషనర్ పదవి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. దానితో ఆయన బి‌జే‌పి ఏలికలను ప్రసన్నం చేసుకునేందుకు కృషి చేస్తున్నాడని పత్రికలు భాష్యం చెప్పాయి. బస్సీ తన పదవి కోసం కృషి చేస్తూ ఉండవచ్చు గానీ అసలు కుట్ర అంతకంటే పెద్దది. బస్సీ పదవీ ప్రయోజనాలకు మించిన ప్రయోజనాలు హిందూత్వ దృష్టిలో ఉన్నాయి. బస్సీ అందుకు ఒక సాధనం మాత్రమే. పోలీసుల నిష్క్రియను వదిలి బస్సీ పదవీ యోగంపై చర్చించడం రామాయణంలో పిడకల వేట సాగించడమే.

పాటియాలా హౌస్ కోర్టు వద్ద లాయర్ గూండాల దాడి జరుగుతున్న వార్త సుప్రీం కోర్టును చేరింది. అప్పటికే విద్యార్ధుల భావ ప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘనకు గురైన సంగతిని కొందరు సీనియర్ లాయర్లు సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ లోపు మేజిస్ట్రేటు తన కోర్టు గదిని వదిలి వేరే చోట కన్హైయాను కలిసి విచారణ ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక విద్యార్థిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం పోలీసులకు దక్కకుండా లాయర్లు నిరోధించారు. ఆ లాయర్లు పాలకపార్టీ మద్దతుదారులు. పాలకుల భావజాలాన్ని మోస్తున్న గూండాలు న్యాయ ప్రక్రియలను నిలిపివేసే పరిస్ధితి వచ్చినా కోర్టులు సిగ్గుపడలేదు. వారికి రావలసిన ఆగ్రహం కూడా రాలేదు. తర్వాత రోజు కన్హైయా బెయిల్ పిటిషన్ విచారిస్తానన్న సుప్రీం కోర్టు మరుసటి రోజు అందుకు తిరస్కరించింది. “కన్హైయా బెయిల్ పిటిషన్ మేము వింటే దేశంలో ఉన్న నేర నిందితులంతా మా దగ్గరికే వస్తారు” అని తప్పుకుంది. మరుసటి రోజు హై కోర్టుకు వెళ్లమంది. కోర్టు ప్రొసీడింగ్స్ లో భాగంగా కన్హైయా మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు హాజరు కావలసి ఉన్నది. అందువల్ల పలు హామీలు సుప్రీం కోర్టు ఇచ్చింది. పలు ఆదేశాలు జారీ చేసింది. కన్హైయా లాయర్లు, ప్రభుత్వ లాయర్లు, ఒకరిద్దరు కన్హైయా మిత్రులు, విలేఖరులు ఇద్దరు తప్ప ఎవరినీ కోర్టులోకి అనుమతించవద్దని ఢిల్లీ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కన్హైయాకు పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించింది.

………….ఇంకా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s