కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో


కన్హైయా కుమార్, ఉమర్ ఖలీద్, రామ నామ, అశుతోష్ మరో ఇద్దరు జే‌ఎన్‌యూ విద్యార్ధులు ఫిబ్రవరి 9 తేదీ కార్యక్రమంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కేంద్ర హోమ్ మంత్రి, బి‌జే‌పి అధ్యక్షుడు, ఇతర కేంద్ర మంత్రులు, బి‌జే‌పి నేతలు, ఎం‌పిలు, ఎం‌ఎల్‌ఏలు ఏకబిగిన ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ పోలీసుల్ని పురమాయించి దేశద్రోహం కేసు కూడా విద్యార్ధులపై బనాయించారు. కన్హైయాను అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తుంటే హిందూత్వ లాయర్ గూండాలు ఆయన్ని కొట్టారు. కోర్టుకు వచ్చిన జే‌ఎన్‌యూ విద్యార్ధుల్ని, టీచింగ్ స్టాఫ్ నీ కొట్టారు. విలేఖరుల్నీ కొట్టారు. లాయర్ గూండాల లీడర్ చౌహాన్ ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్ లో అంగీకరించినదాని ప్రకారం బైటి నుండి అనేకమంది వచ్చి విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరులని కొట్టారు.

ఫిబ్రవరి 9 తేదీన అఫ్జల్ గురును ఉరి తీసిన తేదీ. పార్లమెంటు దాడికి పధకం వేసిన వారిలో ఆయన ఒకరని కోర్టులు నిర్ధారించాయి. ఆయనపై భౌతిక సాక్షాలు లేకపోయినా, పరిస్ధితుల సాక్షాలపై ఆధారపడి ఉరి శిక్షను సుప్రీం కోర్టు కూడా ఖరారు చేసింది. కనుక అఫ్జల్ గురు స్మృతిలో సమావేశం పెట్టడమే దేశద్రోహం అని బి‌జే‌పి నేతల నిశ్చితాభిప్రాయం. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి ఎస్ బస్సీ దృష్టిలోనైతే పోలీసులు దేశద్రోహం కేసు పెట్టడాన్ని విమర్శించడం అంటే దైవ దూషణతో సమానం. వీళ్ళు మన పాలకులు, మన రక్షకులు!

ఉమర్ ఖలీద్, కన్హైయా తదితర విద్యార్ధులపై సాక్ష్యాలు ఏమిటి అంటే జి టీవి ప్రసారం చేసిన ఒక వీడియో. అందులో కూడా కన్హైయా దేశ వ్యతిరేక నినాదాలు ఇస్తున్నట్లు స్పష్టత లేదు. ఏవో నినాదాలు ఇస్తున్నట్లు మాత్రం తెలుస్తోంది. శబ్దం స్పష్టంగా లేదు. అంతా రణగొణ ధ్వని.

ఈ వీడియో వాస్తవానికి ఫేక్ అని ఇండియా టుడే చానెల్ ఫిబ్రవరి 18 తేదీన వెల్లడి చేసింది. ఫిబ్రవరి 9 తేదీన జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఆడియోనీ, ఫిబ్రవరి 11 తేదీన కన్హైయా ఇస్తున్న ప్రసంగం వీడియోని మిక్స్ చేసి జీ చానల్ ప్రసారం చేసింది. ఈ వీడియోనే బి‌జే‌పి నేతలు తమ ఐ ప్యాడ్ లలో లోడ్ చేసుకుని చానెల్ స్టూడియోల వెంట తిరుగుతూ ప్రదర్శించారు. ఈ వీడియోనే ఢిల్లీ పోలీసులు తమ సెడిషన్ కేసుకు సాక్షంగా పేర్కొన్నారు.

కానీ ఈ వీడియోను ఎలా తయారు చేశారో ఇండియా టుడే ఒక కార్యక్రమంలో వెల్లడి చేసింది. ఆ కార్యక్రమాన్ని కింద చూడవచ్చు. వీడియోపై ఆధారపడి గొంతు చించుకున్న బి‌జే‌పి నేతలు ఎలా గొంతు మార్చి తప్పుని మరొకరిపై నెట్టగలరో కూడా వీడియోలో చూడవచ్చు.

హోమ్ మంత్రి ఆరోపణలకీ, బి‌జే‌పి నేతల హాహాకారాలకీ, ఏ‌బి‌వి‌పి విద్యార్ధుల ఫిర్యాదులకీ ఆధారం ఒక ఫేక్ వీడియో అన్నమాట! ఈ నేతలు సిగ్గు పడాల్సిన విషయం కాదా?

జీ న్యూస్ చానెల్ కి ఉన్న ఘన చరిత్రను కాస్త చెప్పుకోవడం సందర్భోచితం కాగలదు. జీ న్యూస్ చానెల్ వాళ్ళు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీ అధినేత నవీన్ జిందాల్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ 2012లో అడ్డంగా దొరికిపోయారు.

యూ‌పి‌ఏ పాలన కాలంలో 1.8 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం వెల్లడి అయిన దరిమిలా బొగ్గు గనుల కేటాయింపులపై రగడ చెలరేగిన రోజులవి. మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు ఇష్టారీతిన ప్రైవేటు కంపెనీలకు బొగ్గు గనుల్ని కేటాయించినట్లు కాగ్ బైటపెట్టడంతో విద్యుత్, ఉక్కు కంపెనీలకు కేటాయించిన బొగ్గు గనులపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది.

ఈ నేపధ్యంలో జిందాల్ స్టీల్ కంపెనీకి కేటాయించబడిన బొగ్గు గనుల విషయమై జీ చానెల్ ఒక స్టోరీ తయారు చేసింది. ఆ స్టోరీ ప్రసారం కాకుండా ఉండాలంటే 100 కోట్లు ఇవ్వాలని చానెల్ ఉన్నత స్ధాయి అధికారులు ఇద్దరు డిమాండ్ చేశారు. నవీన్ జిందాల్ ఇస్తానని చెప్పి బేరసారాల కోసం ఒక హోటల్ కి పిలిపించుకున్నాడు. అక్కడ 100 కోట్లు ఇస్తే తాము జిందాల్ స్టోరీని ఎలా బుట్ట దాఖలు చేసేదీ, జిందాల్ కంపెనీ నీతిమంతమేనని ఎలా స్టోరీని మార్చేదీ వివరించారు. అదంతా నవిన్ జిందాల్ రహస్య కెమెరాతో రికార్డ్ చేశాడు. ఆ మరునాడు వీడియోని పత్రికలకు ఇచ్చాడు.

జీ న్యూస్ చానెల్ యాజమాన్యం డబ్బు కోసం గడ్డి తినే రకమని జిందాల్ ద్వారా లోకానికి తెలిసి వచ్చింది. జీ న్యూస్ లాగానే డబ్బు కోసం పల్టీలు కొట్టే చానెళ్లు ఇంకా ఎన్ని ఉన్నాయో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

జిందాల్ స్టింగ్ వీడియోను కూడా చూడండి!

2 thoughts on “కన్హైయా వీడియో ఎలా ఫేక్? -వీడియో

 1. సామీ! ఓ మోడీ సామీ …..!
  నువ్వు నల్లధనం బిళ్ల కూడా తేవద్దు
  రామ మందిరానికి ఇటుక కూడా తడపొద్దు
  కానీ?, ఈ
  లుఛ్ఛా గాళ్ళని తొక్కెయ్
  ఆ బచ్చా గాణ్ణి లోపలెయ్
  ఏంది సామీ ఇది ???
  విద్యాలయాల్లో ఉద్యమాలు రావాలి
  ఉన్మాదం, ఉగ్రవాదం కాదు
  ఎవడా అఫ్జల్ గురు?
  దేశాన్ని కాపాడిన సైనికుడా ?
  అన్నం పెట్టిన కర్షకుడా ?
  కష్టాన్ని నమ్ముకున్న శ్రామికుడా ?
  వాడు
  గోడ దూకొచ్చిన గుంట నక్క !
  గాడి తప్పొచ్చిన పిచ్చి కుక్క !
  ఈ సలుపని అణచడానికి
  ఈ బలుపని ఆపడానికి
  ఏం ఆలోచిస్తున్నావ్?
  ఎవర్ని చూసి భయపడుతున్నావ్?
  నేను నీ పార్టీ కాదు
  నీకు ఓటూ వెయ్యలేదు
  కానీ
  వీళ్లనాపుతానంటే నీ వెనకుంట
  వాళ్ళెదురొస్తే నీ ముందుంట
  తోలు తీసి త్రివర్ణ పతాకం చెయ్
  నీకు జై జై అంట !!
  సియాచిన్ లో కాపలా కాయమను
  ఒక్కడన్నా పోతాడేమో?
  పెళ్ళాన్నో, ప్రేయసినో వదిలుండమను
  ఎవ్వడన్నా కదుల్తాడేమో?
  అంతెందుకు వీళ్లు సపోర్ట్ చేసే
  ఉగ్రవాదుల దగ్గరకి చర్చలకి పొమ్మను
  టాయిలెట్ దారి అడగని వాడెవడుంటాడో?
  ఈ పిచ్చి అరుపులు అరిచే వాళ్లు చాలా తక్కువ
  వీళ్ల పీచమణచడానికి నీ తోడు నిలిచేవాళ్ళు ఎక్కువ
  ప్రతివాడి తిక్క ప్రశ్నలకి సమాధానం
  చెప్పడానికి నువ్వు అష్ఠావధాని, శతావధాని కాదు
  నువ్వు దేశాన్ని కాపాడటానికి
  ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని.
  తొక్కెయ్ కొడుకుల్ని
  కలుసుకోవాలి తాత ముత్తాతల్ని.

  ఒక పెద్దాయన కలము నుండి జాలువారిన ఆవేదన యొక్క అక్షర రూపం.

 2. ఈ పోస్టు ఏం చెప్తుంది? ఎవరో పనిగట్టుకుని, లేని వీడియోల్ని సృష్టించి ఆ విధ్యార్థుల్ని ఇరికించారని ఆ వీడియో సాక్ష్యాధారాలతో వివరిస్తుంది.. ఇంతకీ ఆ ఎవరో -ఎవరు? ఇలా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? వీటికి సమాధానం పైన కామెంటులో ఉంది. ఈ కవితను జాలువార్చిన ఆ సోకాల్డ్ పెద్దమనిషి ఆలోచనా విధానాన్ని గమనిస్తే, ఈ మొత్తం తతంగం వల్ల ఎవరికి ఉపయోగమో ఇట్టే తెలిసిపోతుంది.
  నల్లధనం ఏమాత్రం తేకున్నా పర్లేదట, ఏ ఎన్నికల హామీ నెరవేర్చకున్నా పర్లేదట.. ఈ విధ్యార్థుల్ని తొక్కేస్తే అదే పెద్ద దేశసేవట.. జీవితాంతం మోడి భజన చేసుకుని బతికేయడానికి ఇది చాలట.. ఆహా.. చూశారా.. మతము, దేశభక్తి సమపాల్లలో కలిపి దట్టిస్తే.. నా సామిరంగా మరో పదేళ్ళ పాటు దేశభక్తులందరూ కిమ్మనకుండా పడుంటారు. ఎంతైనా మోడీ సూపరు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s