
A Jat Panchayat in U.P.
(Unreasonable demands శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.)
*********
గత యేడు గుజరాత్ పటిదార్లు గానీ, ఈ యేడు హర్యానా జాట్ లు గానీ… సాపేక్షికంగా సంపన్న కులాల నేతృత్వంలో రిజర్వేషన్ కోసం హింసాత్మక నిరసనల ద్వారా పదే పదే పునరావృతం అవుతున్న డిమాండ్లు విభ్రాంతిని కలిగిస్తున్నాయి. హర్యానాలో జాట్లు సాపేక్షికంగా భూములు కలిగి ఉన్న సంపన్నులు. ఈ ప్రాంతంలో సామాజిక నిచ్చెనపైన అందరికంటే ఎత్తున ఉన్నవారిగా పరిగణించబడుతున్నారు. రాష్ట్రంలో ఆధిక్యం కలిగిన రాజకీయ పార్టీలలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వారి ప్రభావశీలత బట్టి చూసినా వారి రాజకీయ సామాజిక శక్తి ఏపాటిదో మరింతగా ద్యోతకం అవుతుంది.
హర్యానా జాట్లను ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కిందికి తేవడానికి వ్యతిరేకంగా నిర్దిష్ట కారణాలు చూపుతూ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గతంలో ఒక నివేదికను వెలువరించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం ఈ నివేదికను తిరస్కరిస్తూ మార్చి 2014లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఓబిసిల 27 శాతం రిజర్వేషన్ కు అదనంగా, ఉద్యోగాలు ఉన్నత విద్యా సీట్లలో జాట్లకు అదనంగా ప్రత్యేక కోటా కల్పిస్తామని నోటిఫికేషన్ లో హామీ ఇచ్చింది.
వాస్తవాన్ని నొక్కి చెప్పాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుపై పడిన దరిమిలా మార్చి 2015లో తొమ్మిది రాష్ట్రాలలోని జాట్లను ఓబిసిలలో చేర్చేందుకు యూపిఏ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది. సామాజిక-ఆర్ధిక వెనుకబాటుతనం నిర్ధారించడానికి “కులం” ఒక్కటే ప్రామాణికం కాదని ఈ సందర్భంగా పేర్కొంది. తమ డిమాండ్లు రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన వివేకం పరిధిలోనివి కానప్పటికీ తమకు రిజర్వేషన్లు కల్పించడానికి ఇరు పక్షాలు (కాంగ్రెస్, బిజేపిలు) ఏకాభిప్రాయంతో ఉండడమే జాట్ లలోని ఆందోళనకారులకు ధైర్యాన్ని ఇస్తోందన్నది స్పష్టం. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మార్చి 2014 నాటి నోటిఫికేషన్ ను అమలు చేయడానికి మద్దతు పలికింది కదా మరి.
అవును, ఈ శక్తివంతమైన కులాల నుండి రిజర్వేషన్ల కోసం డిమాండ్లు తలెత్తడం రిజర్వేషన్ వ్యవస్ధ విజయవంతం అయినందువల్ల కూడా అనడంలో సందేహం లేదు. గత 65 యేళ్లుగా దళితులకు, ఆదివాసీలకు కల్పించిన రిజర్వేషన్లు కాకుండా గత 25 సం.లుగా (ఓబిసిలకు) అమలు చేస్తున్న రిజర్వేషన్లు మండల్ కమిషన్ సిఫార్సులలో అత్యంత ప్రాముఖ్యమైనవి. పెద్ద లక్ష్యం బలహీనవర్గాలను, చారిత్రకంగా వెనుకబడ్డవారిని ఉద్ధరించడంను మించి దాటిపోయింది; (ఇప్పుడు) “ఉన్నత స్ధాయి” మరియు “కింది స్ధాయి”ల మధ్య నెలకొని ఉన్న ఎడమను తగ్గించడం రిజర్వేషన్ల లక్ష్యం.
సమాజంలో తమను తాము ఉన్నత స్ధాయి కలిగినవారుగా గుర్తించుకునే కులాలు కూడా ఇప్పుడు “వెనుకబడిన” స్ధాయిని కోరుతుండడం బట్టి ప్రభుత్వరంగ ప్రాతినిధ్యం మరియు ఉన్నత విధ్య ప్రవేశాలను విస్తరించడం ద్వారా “ఆర్ధిక ఎడమ” ఇరుకు అయిందని (తగ్గిపోయిందని) భావించవచ్చు లేదా ఇరుకు అయినట్లు కనిపిస్తూనయినా అయి ఉండాలి. ప్రత్యేకంగా జాట్ల విషయాన్ని పరిశీలించినట్లయితే ఉన్నత ఆర్ధిక, సామాజిక స్ధాయి కలిగి ఉన్నప్పటికీ తరాల వెంట తరాలుగా భూమి యాజమాన్యం పంపిణీ (వివిధ యాజమాన్యాల కింద విభజన)కి గురవుతుండగా, వ్యవసాయ ఆర్ధిక వ్యవస్ధలో మందకొడితనం సుదీర్ఘకాలం కొనసాగుతూ గ్రామీణ ఆదాయాలు కుచించుకుపోతున్నాయి.
రిజర్వేషన్ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు ఈ వ్యవస్ధాగత సమస్యలు కాల క్రమంలో జాట్లు వివేకరహిత డిమాండ్లు లేవనెత్తడానికి ఆజ్యం పోశాయి. మరింత సంపన్నులు, వైవిధ్యపూరితులైన గుజరాత్ పటిదార్ ల విషయంలోనైతే రిజర్వేషన్ కోసం చేసిన డిమాండ్లు మొత్తంగా రిజర్వేషన్ వ్యవస్ధనే లేకుండా చేయడానికి ముందుకు తెచ్చిన బలహీన సాకు మాత్రమే. ఒక విధంగా చూస్తే, ఈ ఆందోళనలు, ఓబిసిలుగా లెక్కించే కులాల జాబితాను సమీక్షించవలసిన అవసరాన్నీ, క్రీమీ లేయర్ ను మరింత లోతుగా నిర్వచించ వలసిన అవసరాన్ని సూచిస్తున్నాయి. సామాజిక-ఆర్ధిక మరియు కుల జనాభా లెక్కింపు ద్వారా ఒక అవకాశం లభించింది కానీ అది దాటిపోయింది.
*********
(ఈ సంపాదకీయంపై విమర్శను తదుపరి టపాలో చూడగలరు.)