చక్రవర్తిగారి కొత్త జాతీయవాదం -ది హిందు


Nationalism

“The Emperor’s new nationalism” శీర్షికతో ఫిబ్రవరి 20 వ తేదీ ది హిందూ సంపాదకీయానికి యధాతధ అనువాదం.

*********

హైదారాబాద్ నుండి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వరకూ, రోహిత్ వేముల మరణం నుండి కన్హైయా కుమార్ అరెస్టు వరకు పాలక భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రాజకీయ ఎజెండాను స్పష్టంగా గుర్తించవచ్చు. మొదటి ఊపులో ఇది అత్యున్నత నాయకత్వం అంతా -యూనియన్ కేబినెట్ మంత్రులతో సహా- విద్యార్ధి నాయకులతో తగువు పెట్టుకోవడానికీ సంఘ్ విద్యార్ధి విభాగం అఖిల్ భారతీయ విద్యార్ధి పరిషత్ కి ప్రభుత్వ దన్ను కల్పించడానికీ సిద్ధంగా ఉన్న రాజకీయ పార్టీ. కానీ ఆ తర్వాత గత వారం రోజులుగా ఆవిష్కృతం అయిన వరుస ఘటనలను, భారత దేశ యూనివర్శిటీలపై సైద్ధాంతిక నియంత్రణ సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంగా –అటువంటి ప్రయత్నం ఎంత నిజమో అంతే ఖండనార్హం- చూడకపోయినట్లయితే విషయ తీవ్రతను సరిగ్గా గ్రహించనట్లే అర్ధం.

జే‌ఎన్‌యూ విద్యార్ధులకు వ్యతిరేకంగా కేసును నిర్మించడానికి కేంద్ర హోమ్ మంత్రిగారే పాకిస్తానీ టెర్రరిస్టులు నిర్వహించే అనుకరణ (ప్యారడీ) ట్విట్టర్ ఖాతాలకు విలువ కల్పించారు. అదే సమయంలో కోర్టు ప్రాంగణంలోనూ ప్రాంగణం చుట్టు పక్కలా విద్యార్ధులపై దాడి చేసి కొడుతున్న “జాతీయవాద” లాయర్లను పార్టీ ఎం‌ఎల్‌ఏనీ అరెస్టు చేయడానికి తన అధికార పరిధిలో పని చేసే నగర పోలీసు బలగాలు అడ్డంగా తిరస్కరించినప్పటికీ ఆయన ఎంత మాత్రం నోరు మెదపలేదు. బి‌జే‌పి ప్రతినిధులు ఆ హింసను ఖండిస్తూనే మరోవైపు 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో దోషిగా 2013లో ఉరి తీయబడిన అఫ్జల్ గురు స్మృతిలో జే‌ఎన్‌యూ క్యాంపస్ లో జరిగిన సమావేశంలో వ్యక్తం అయినట్లు చెబుతున్న దేశద్రోహ ఉద్వేగాల పట్ల ఆగ్రహావేశాలు విరజిమ్మారు.

చట్టాన్ని, తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకోవడానికి భారతీయులకు గల హక్కునూ అమలు చేయాలన్నది రాజ్యము-పౌరుల మధ్య ఉన్న అత్యవసర ఒప్పందం. ఆ ఒప్పందాన్ని గౌరవించేందుకు అడ్డంగా నిరాకరిస్తున్న ఒక కేంద్ర ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఇటువంటి తప్పుడు సమానీకరణ పెట్టడం -అది కూడా అందుకోసమే స్వేచ్చా ప్రదేశాలుగా ఉద్దేశించబడిన యూనివర్సిటీ క్యాంపస్ లలో- స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నడూ ఎరుగనిది. పాలనా నిర్వాహకులు ముందుకు తెస్తున్న “జాతీయవాదం” భావనతో ఏకీభవిస్తున్నారా లేక తిరస్కరిస్తున్నారా అన్నదే రాజకీయ మరియు కార్యనిర్వాహక గీటురాయిగా చెప్పబడుతున్న నేపధ్యంలో అటువంటి పలుకులు కలుగజేసే ఆందోళనకు ప్రధాన మంత్రి ఖచ్చితంగా స్పందించి తీరాలి.

దేశ క్యాంపస్ లలో వామపక్ష రాజకీయాలకు గుర్తింపు పొందిన క్యాంపస్ కు యుద్ధాన్ని కొనిపోవడంతో పాటుగా, హైదారాబాద్ లో పాల్పడిన అతి చేష్టల (ప్రతికూల ప్రభావం) నుండి బైటపడడానికి జే‌ఎన్‌యూ పరిణామాలు ఒక అవకాశంగా అంది వచ్చాయి. ఆ దన్నుతో సంఘ్ పరివారం వర్సెస్ దళితుల ఘర్షణకు “జాతీయవాద ఆగ్రహావేశాల” ముసుగు తగిలించిన ఏ‌బి‌వి‌పి విధానాన్ని, “జాతీయవాద వ్యతిరేకుల” గుర్తింపులను వ్యంగ్య దూషణలతో ముంచేత్తే ఎత్తుగడకు పార్టీ అభివృద్ధి చేసింది, బహిరంగంగా నిర్దిష్టంగా చెప్పనప్పటికీ. కనుక అన్ని కేంద్ర విశ్వ విద్యాలయాలూ జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న నిబంధన ఇప్పుడు విధించడం జే‌ఎన్‌యూ ఘటనలపై వెల్లువెత్తుతున్న ఆందోళనలపైన కప్పిన ఒక వింతయిన పరదా.

జాతీయవాద భావనలకు సరికొత్త రూపం ఇచ్చేందుకు సాగుతున్న మితవాద ప్రయత్నాలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే చురుకుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కనిపిస్తున్న నేటి పరిస్ధితి ఈ దేశ చరిత్రలో ఒక ప్రమాదకరమైన దశ. ఇందుకే దేశద్రోహం విషయమై రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124-A ప్రయోగం గత ఉదాహరణల కంటే మరింత భయానకంగా మారింది. తమపై వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు మాత్రమే కొందరు తొందరపాటు రాజకీయ నాయకులు గతంలో ఈ సెక్షన్ ను ప్రయోగించారు. అటువంటి సెక్షన్ ను ఇప్పుడు జే‌ఎన్‌యూ విద్యార్ధులపై ప్రయోగించడం, ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టుల వద్ద విద్యార్ధులు, కార్యకర్తలపై అడ్డూ అదుపూ లేకుండా విశృంఖల దమనకాండను జరగడం… ఇవి, చట్ట పాలన ఎంచుకున్నవారికి మాత్రమే అమలు చేయవచ్చన్న సందేశాన్ని పంపుతోంది. ఘటనల గురించిన ఈ చీకటి అవగాహనతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విభేదిస్తున్నట్లయితే ఆయన మాట్లాడాలి.

********

వాస్తవ విశ్లేషణ ఈ సంపాదకీయం. బి‌జే‌పి పార్టీ, ఆ పార్టీ నేతృత్వం లోని కేంద్ర మంత్రులు ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, ఒక పధకం రూపొందించుకున్నట్లుగా జే‌ఎన్‌యూ ఘటనల పట్ల స్పందించారు. జే‌ఎన్‌యూ విద్యార్ధులపై జాతీయ-వ్యతిరేక, దేశ ద్రోహ ముద్ర తగిలించేందుకు కట్ట గట్టుకుని కృషి చేశారు. ఈ కృషిలో పార్టీ, ప్రభుత్వము రెండూ కలిసి ఒకదానినొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ పనిచేశాయి.

ఆరంభంలో జే‌ఎన్‌యూ విద్యార్ధుల కార్యక్రమానికి పాకిస్తాన్ టెర్రరిస్టు సంస్ధలు డైరెక్షన్ ఇచ్చాయని కూడా హోమ్ మంత్రి ఆరోపించారు. ఆయన ఆరోపణకు ఆధారం ఏమిటయ్యా అంటే ఒక ప్యారడీ ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ అయిన ట్వీట్ లు. అవి వాస్తవంగా పాక్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్ ప్రచురించిన ట్వీట్ లు కాదని కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు చెప్పిన తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. వివరణ అసలే ఇవ్వలేదు.

అసలు కన్హైయా కుమార్ అరెస్టే తప్పుడు ఆరోపణల ఆధారంగా జరిగింది. హోమ్ మంత్రి స్వయంగా ఈ ఆరోపణలు సృష్టించారు. కానీ తన ఆరోపణలకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేదు. వీడియో ఆధారాలు తయారు చేసినవని వెల్లడి అయినప్పటికీ, వీడియోలలో హోమ్ మంత్రి ఆరోపణలకు ఆధారాలు లేవని ఇంటలిజెన్స్ వర్గాలే చెప్పినప్పటికీ ఆయన తన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

ఏ‌ఏ‌పి నాయకుడు అశుతోష్ చెప్పినట్లుగా ఇదొక డిజైన్. ఒక పధకం. జాతీయవాదాన్ని హిందూత్వ రంగు పులిమే కుట్ర. హిందూత్వయే అసలైన జాతీయవాదం అని జనం మెదళ్ళలో కూరేందుకు జరిగిన ప్రయత్నం. ఈ ప్రయత్నాలను భారత ప్రజలు తిప్పికొట్టవలసి ఉన్నది. —విశేఖర్

7 thoughts on “చక్రవర్తిగారి కొత్త జాతీయవాదం -ది హిందు

 1. Hi Hellolearner,

  Thank you for contacting me on this blog.

  First of all, congratulations to your team. As you are well aware there is an atmosphere in Telugu blog-sphere because of which I’m forced to suspect the intentions behind establishing a blog aggregator. So..,

  Mi I know who you are? Before attempting to spread news about your aggregator, I have to know something about you. It seems you did not provide any details on your aggregator. Sorry for asking in this way. But I can’t help it, you know.

 2. Thanks for reply,
  I am sravan , i am a telugu blogger since 2008 , my blog is http://mythoughtsmyway.wordpress.com , i am not active since few years , recently i planned to write in my blog but shocked to see koodali.com exit. thought of creating a new aggregator which suits for mobile reading too , created readandblog.com , you blog very frequently .. so thought of contacting you to spread about us.

 3. ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌?

  Tue 23 Feb 03:42:22.945318 2016

  ప్రియమైన జీ న్యూస్‌,
  సంవత్సరం పైగా పని చేసిన తర్వాత మీ నుండి విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేనీ పని ఇదివరకే చేయాల్సింది. ఇప్పటికైనా చేయకపోతే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. ఇప్పుడు నేను రాయబోతున్నది ఆవేశం, కోపం లేదా ఉక్రోశం ఫలితంగా ఏ మాత్రం కాదు. బాగా ఆలోచించి చేస్తున్న ప్రకటన ఇది. నేనొక పాత్రికేయుడినే కాకుండా, ప్రస్తుతం జాతీయ దురహంకారం అనే విషం ఎగజిమ్ముతున్న ఈ దేశంలో ఒక పౌరుణ్ని కూడా. పౌరుడిగా నా బాధ్యతలు, నా వృత్తి ధర్మం ఈ విషం ఇంకా వ్యాపించకుండా ఆడ్డుకోవాలని నాకు చెబుతున్నాయి. ఇది చిన్న పడవతో సముద్రాన్ని దాటెయ్యడం లాంటి ప్రయత్నమే అయినా ప్రారం భించాలనుకుంటున్నాను. అందుకే నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ పేరిట మొదలైన జాతీయ దురహంకారం, దాన్ని ఎగదోయ డంలో మన సంస్థ పాత్రను వ్యతిరేకిస్తూ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను.
  నిజానికి ఇది వృత్తిపరమైన బాధ్యతకు సంబంధించినది. సామాజిక బాధ్యత గ్రహింపునకు సంబంధించినది. ఇది దేశభక్తికి సంబంధించినది కూడా. ఈ మూడు ప్రమాణాల్లోనూ గత సంవత్సర కాలంగా మీతో కలిసి పని చేస్తున్న కాలంలో నేను ఒక పాత్రికేయుడిగా విఫలమయ్యాను.
  2014 మే తర్వాత నుంచి, అంటే నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, దాదాపు దేశంలోని ప్రతి న్యూస్‌ రూం మతతత్వ ప్రభావానికి లోనైంది. కానీ మన దగ్గరి పరిస్థితి మాత్రం మరింత భయంకరమైంది. ఇక్కడ ప్రతి వార్తను మోడీ కోణంలోనే, మోడీ ప్రభుత్వ అజెండాకు ఎంత ఊపు లభిస్తుందనే అంచనాతోనే రాయిస్తున్నారు.
  అసలు మనం పాత్రికేయులమేనా అనే అనుమానం నాలో మొదలైంది. మనం ప్రభుత్వ ప్రతినిధుల లాగా లేదా ‘సుపారీ హంతకుల’ లాగా అనిపించసాగింది… ఒక పాత్రికేయుడిగా ఇంత ‘మోడీ భక్తి’ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా అంతరాత్మ నాపై తిరుగుబాటు చేయసాగింది.. ప్రతి వార్త వెనుక ఒక అజెండా. ప్రతి న్యూస్‌ షో వెనుక మోడీ ప్రభుత్వాన్ని గొప్పగా కీర్తించే ప్రయత్నం. ప్రతి చర్చ వెనుక మోడీ వ్యతిరేకులను ‘కాల్చి పడేసే’ ప్రయత్నం. ఇదంతా ఏమిటసలు?
  అసలు మమ్మల్ని ఇంత దీనంగా, హీనంగా, అనైతికంగా, పతనశీలంగా ఎందుకు తయారు చేశారు? దేశంలోని అత్యున్నత మీడియా సంస్థలో చదువుకొని, ఆజ్‌ తక్‌, బీబీసీ, డాయిచే వెలే జర్మనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పని చేసిన తర్వాత నేను ఆర్జించిన వృత్తిపరమైన గుర్తింపు ‘ఛీ’ న్యూస్‌ జర్నలిస్టు అనే ఛీదరింపే. మన నిజాయితీ బజారు పాలైంది. ఇందుకు ఎవరిది బాధ్యత?
  ఎన్నని చెప్పాలి? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎడతెగని ప్రచారం ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎందుకు? కరెంటు, నీళ్లు, చదువు, సరి-బేసి వంటి ప్రజలకు ఉపయోగపడే మౌలిక విధానాలను సైతం దుమ్మెత్తి పోశాం. కేజ్రీవాల్‌తో విభేదించేం దుకు, విమర్శించేందుకు పూర్తి హక్కుంది. కానీ కేజ్రీవాల్‌ ‘సుపారీ హత్య’ హక్కు మాత్రం ఒక పాత్రికేయుడిగా ఎవరికీ ఉండదు. కేజ్రీవాల్‌పై చేసిన నెగెటివ్‌ స్టోరీల జాబితా తయారు చేస్తే పేజీలు నిండిపోతాయి. అసలు జర్నలిజం మౌలిక సిద్ధాంతమైన ‘తటస్థత’, పాఠకుల/వీక్షకుల పట్ల నిజాయితీ మనకు వర్తిస్తాయా, వర్తించవా?
  దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల విషయంలోనూ ఇలాగే జరిగింది. మొదట్లో మనం దళిత స్కాలర్‌ అని రాశాం. ఆ తర్వాత దళిత విద్యార్థి అని రాయ సాగాం. సరే, కనీసం వార్తలైనా సరిగా రాయాలి కదా! రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పడం వెనుక ఏబీవీపీ, బీజేపీ మంత్రి బండారు దత్తాత్రేయల పాత్రలు స్పష్టంగా ముందుకొచ్చాయి. కానీ ఒక మీడి యా సంస్థగా మనం విషయాన్ని పలుచన చేసేలా, కారకులను కాపాడేలా వ్యవహరించాం.
  అసహనం అంశంపై ఉదరు ప్రకాశ్‌తో మొదలై దేశంలోని అన్ని భాషలకు చెందిన ప్రఖ్యాత రచయితలు అకాడమీ పురస్కా రాలు వెనక్కి ఇచ్చెయ్యసాగారు. కానీ మనం మాత్రం వారినే ప్రశ్నించే వైఖరిని చేపట్టాం. కేవలం ఉదరు ప్రకాశ్‌నే తీసుకున్నా ఆయన సాహిత్యం లక్షల మంది చదువుతారు. మనం మాట్లాడే భాష, మనకు ఉపాధి మార్గంగా ఉన్న భాష (హిందీ)లో గౌరవప్రదమైన స్థానం ఆయనది. ఆయన రచనల్లో మన జీవితం, మన స్వప్నాలు, పోరాటాలు ప్రతిబింబిస్తాయి. కానీ మనం ఇవన్నీ ప్రాయోజితమై నవని రుజువు చేయడంలో నిమగమయ్యాం. అప్పుడు కూడా బాధ కలిగింది. కానీ భరించాను. కానీ ఎప్పటి దాకా భరించాలి? ఎందుకు భరించాలి?
  నాకు అశాంతితో నిద్ర పట్టడం లేదు.. తప్పు చేశానన్న భావన నన్ను దహించివేయసాగింది. ఒక వ్యక్తి జీవితంలో అన్నింటికన్నా పెద్ద కళంకం దేశద్రోహం. కానీ పాత్రికేయులుగా మనకు ఎవరిపైనైనా దేశద్రోహి అనే ముద్రవేసే హక్కుందా? దీన్ని నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు కదా! కన్నయ్య సహా పలువురు విద్యార్థులను మనం ప్రజల దృష్టిలో ‘దేశద్రోహులు’గా నిలబెట్టాం. రేపు వీరిలో ఎవరైనా హత్యకు గురైతే బాధ్యత ఎవరిదవుతుంది? అల్లర్లు, అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితుల్ని మనం సృష్టించాం. ఇది ఏ రకమైన దేశభక్తి? ఏ రకమైన జర్నలిజం? మనం బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ గొంతుకలమా? వాళ్లేది చెబితే అదే చేస్తామా? ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అనే నినాదమే లేని వీడియోను పదే పదే చూపించి మనం ఉన్మాదాన్ని వ్యాపింపజేశాం. చీకట్లో వినిపిస్తున్న గొంతుకలను మనం కన్నయ్య, ఆయన సహచరులవేనని ఎలా గుర్తించాం? కేవలం దురభిప్రాయాల కారణంగా ‘భారతీరు కోర్ట్‌ జిందాబాద్‌’ అన్న నినాదాన్ని ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’గా మార్చేసి ప్రచారం చేశాం. ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తూ విద్యార్థుల కెరియర్‌ను, వారి ఆశలను, కుటుంబాలను వినాశనం వైపు నెట్టేశాం…
  ఉమర్‌ ఖాలిద్‌ చెల్లెను రేప్‌ చేస్తామని, ఆమెపై యాసిడ్‌ దాడి చేస్తామని కొంత మంది బెదిరిస్తు న్నారు. ఆమెను దేశద్రోహి చెల్లెలు అని అంటున్నారు. కాస్త ఆలోచించండి. నిజంగానే అలాంటిదేమైనా జరిగితే ఇందుకు బాధ్యత మనది కాదా? తాను దేశ వ్యతిరేక నినాదాలను సమర్థించనని కన్నయ్య ఒకసారి కాదు, వెయ్యి సార్లన్నాడు. అయినా మనం ఆయన మాటను వినం. ఎందుకంటే మనం వ్యాపింపజేసిన ఉన్మాదం ఎన్‌డీయే ప్రభుత్వానికి అనుగుణమైంది. మనం అసలు కన్నయ్య ఇంటినైనా జాగ్రత్తగా చూశామా? అది ఇల్లు కాదు, దేశంలోని రైతుల, సామాన్యుల దుస్థితికి ప్రతీక! దేశంలో అనుక్షణం భూస్థాపితమవుతున్న ఆకాంక్షల స్మశానం అది. కానీ మనం గుడ్డివాళ్లమైపోయాం! భారతీయ గ్రామీణ జీవన యదార్థ చిత్రం ఇదే. ఆ కూలిపోయిన గోడలలో, చిక్కి శల్యమైన జీవితాల్లో మనం జాతీయవాదం అనే ఇంజ ెక్షన్‌ ఇచ్చాం. తుది ఫలితం ఏమవుతుందనే ఆలోచనే లేకుండానే. పక్షవాతంతో బాధపడుతున్న కన్నయ్య తండ్రి ఈ వేదన మూలంగా చనిపోతే దానికి బాధ్యు లెవరు? ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో స్టోరీ వచ్చే దాకా, అసలు కన్నయ్యకు పీడితుల పక్షంలో మాట్లా డేందుకు ప్రేరణ ఏమిటనేది దేశానికి తెలియనే లేదు.
  రామా నాగా, తదితరులది కూడా ఇదే పరిస్థితి. చాలా బలహీనమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువతీయువకులు జేఎన్‌యూలో సబ్సి డీతో ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. ముందుకు వెళ్లగలిగే ధైర్యాన్ని పొందుతున్నారు. కాని టీఆర్‌పీ అనే బజారు వాంఛ, అమ్ముడుపోయిన మన వివేకం వీరి కెరియర్‌లను దాదాపు నాశనం చేసేశాయి. మనం వీరి రాజకీయాలతో ఏకీభవించకపోవచ్చు. వీరి భావాల్లో అతివాదం ఉండొచ్చు. కానీ వీళ్లు దేశద్రోహులెట్లా అవుతారు? ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో జీ న్యూస్‌ను రిఫరెన్స్‌గా పేర్కొనడం కేవలం యాదృచ్ఛికమని అనగలరా? మనం ఢిల్లీ పోలీసులతో కుమ్మక్కయ్యామని అంటున్న వారికి ఏం జవాబు చెప్పాలో చెప్పండి.
  అసలు జేఎన్‌యూతో గానీ, జేఎన్‌యూ విద్యార్థులతో గానీ మనకున్న వైరమేమిటి? నా అభిప్రాయంలో ఆధునిక జీవన విలువలకు, ప్రజాస్వామ్యానికి, వైవిధ్యానికి, పరస్పర విరుద్ధ భావాల సహ అస్తిత్వానికి దేశంలో ఉన్న అత్యంత సుందరమైన నందనవనం జేఎన్‌యూనే. కానీ దీన్నిప్పుడు చట్టవ్యతిరేక, దేశద్రోహ కార్యకలాపాలకు కేంద్రంగా వక్రీకరిస్తున్నారు.
  అసలు చట్టాన్ని ఉల్లంఘించింది జేఎన్‌యూనా లేక కోర్టులోకి చొరబడి లెఫ్ట్‌ కార్యకర్తను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేనా? కింద పడ్డ సీపీఐ కార్యకర్త అమీక్‌ జమైను ఎమ్మెల్యే, అతని అనుచరులు బూట్లతో తొక్కు తుంటే పక్కనే ఉన్న పోలీసులు చూస్తూ ఉండి పోయారు. కొడుతున్న దృశ్యాలు తెరపై కనబడు తుంటే మనం మాత్రం ‘ఒ.పి. శర్మపై కొట్టారన్న ఆరో పణలు’ అని రాశాం. ‘ఆరోపణ’ ఎందుకు అని నేనడి గితే, పై నుంచి వచ్చిన ‘ఆదేశం’ అని మీరు చెప్పారు. కానీ మనం ఇంత కిందకు ఎలా దిగజారాం? మోడీ వరకైనా అర్థం చేసుకోవచ్చు కానీ స్టోరీ రాసేటప్పుడు ఒ.పి. శర్మ వంటి బీజేపీ నేతల, ఏబీవీపీ కార్యకర్తలను కూడా కాపాడడం ఏమిటి?
  నాకు నా ఉనికిపై, వృత్తిపై అసహ్యం వేయసాగింది. ఇందుకేనా నేను మిగతా పనులన్నీ వదిలి పాత్రికేయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుంది? బహుశా కాదు. ఇప్పుడు నా ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి జర్నలిజాన్ని వదిలెయ్యడం లేదా ఈ పరిస్థితులను నాకు దూరంగా నెట్టెయ్యడం. నేను రెండో మార్గం చేపడు తున్నాను. నేనేమీ తీర్పు చెప్పడం లేదు. నా వృత్తి, గుర్తింపులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మాత్రమే లేవనెత్తాను. చిన్నదే అయినా నాకూ బాధ్యత ఉంది ఇందులో. నాకిప్పుడు వేరే చోట్లలో ఉద్యోగం లభించదని స్పష్టంగా తెలుసు. నేను ఇందులోనే కొనసాగితే రెండేండ్లలో లక్ష రూపాయల వేతన స్థాయికి చేరుకోగలుగుతాను. కానీ ఈ సౌలభ్యం నా నుంచి చాలా త్యాగాలు కోరుతోంది. నేను వాటికి సిద్ధంగా లేను. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, వేతనం లేకపోతే పడే కష్టాలేమిటో తెలుసు. అయినా నేను నా అంతరాత్మ ప్రబోధాన్ని అణచిపెట్ట దల్చుకోలేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏ ఫిర్యాదూ లేదని నేను మరోసారి చెబుతున్నాను. సంస్థాగతమైన, సంపాదకీయమైన వ్యవహారాలకు సంబంధిం చినది గానే దీనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక మీడియా సంస్థకు తన మితవాద వైఖరులను, అభిరుచులను ప్రకటించే, ప్రశంసించే హక్కుంటే, వ్యక్తిగా మా లాంటి వాళ్లకు మా రాజకీయ వైఖరిని స్పష్టం చేసేందుకు పూర్తి హక్కుంది.
  2014 మే తర్వాత నుంచి, అంటే నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, దాదాపు దేశంలోని ప్రతి న్యూస్‌ రూం మతతత్వ ప్రభావానికి లోనైంది.

  యువ జర్నలిస్టు విశ్వదీపక్‌ ‘జీ న్యూస్‌’లో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ రాసిన బహిరంగ లేఖ ఇది. జేఎన్‌యూ పరిణామాల నేపథ్యంలో మీడియాలో ఒక భాగం ప్రభుత్వానికి తొత్తుగా మారి వామపక్ష విద్యార్థులపై ఉద్దేశపూరితంగా, విద్వేషపూరితంగా ఆరోపణలు, నిర్ధారణలు చేస్తోందనే విమర్శలు బలంగా వస్తున్నాయి. నేర విచారణ ప్రక్రియను మీడియా సంస్థలు హైజాక్‌ చేయడాన్ని తప్పు పడుతూ విశ్వదీపక్‌ ఈ లేఖ రాశారు. ఇది ఆ లేఖకు దాదాపు పూర్తి పాఠం.
  – సంపాదకులు
  అసలు జేఎన్‌యూతో గానీ, జేఎన్‌యూ విద్యార్థులతో గానీ మనకున్న వైరమేమిటి? నా అభిప్రాయంలో ఆధునిక జీవన విలువలకు, ప్రజాస్వా మ్యానికి, వైవిధ్యానికి, పరస్పర విరుద్ధ భావాల సహ అస్తిత్వానికి దేశంలో ఉన్న అత్యంత సుందరమైన నందనవనం జేఎన్‌యూనే.
  ఉమర్‌ ఖాలిద్‌ చెల్లెను రేప్‌ చేస్తామని, ఆమెపై యాసిడ్‌ దాడి చేస్తామని కొంత మంది బెదిరిస్తున్నారు. ఆమెను దేశద్రోహి చెల్లెలు అని అంటున్నారు. కాస్త ఆలోచించండి. నిజంగానే అలాంటిదేమైనా జరిగితే ఇందుకు బాధ్యత మనది కాదా?

  మనం అసలు కన్నయ్య ఇంటినైనా జాగ్రత్తగా చూశామా? అది ఇల్లు కాదు, దేశంలోని రైతుల, సామాన్యుల దుస్థితికి ప్రతీక! దేశంలో అనుక్షణం భూస్థాపితమవుతున్న ఆకాంక్షల స్మశానం అది. కానీ మనం గుడ్డివాళ్లమైపోయాం!

  పాత్రికేయులుగా మనకు ఎవరిపైనైనా దేశద్రోహి అనే ముద్రవేసే హక్కుందా? దీన్ని నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు కదా! కన్నయ్య సహా పలువురు విద్యార్థులను మనం ప్రజల దృష్టిలో ‘దేశద్రోహులు’గా నిలబెట్టాం. రేపు వీరిలో ఎవరైనా హత్యకు గురైతే బాధ్యత ఎవరిదవుతుంది?

  ఆ వాస్తవాలేంటో పార్లమెంట్‌లో చెప్పాలి
  న్యూఢిల్లీ: జేఎన్‌యూలో జరిగిన ఘటనలకు సంబంధించి వాస్తవాలేంటో కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించాలని డిమాండ్‌ చేసినట్టు సీపీఐ(ఎం)ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. అఖిలపక్ష సమావేశం నుంచి బయటకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జేఎన్‌యూ ఘటనలో కీలకమైన వీడియో టేపును మార్చిన ఆ దోషులెవరు.. ఎవరు వెనుకుండి అలా చేయించారు. ఆ టేపును అడ్డంగా పెట్టుకుని దుష్ప్రచారం చేయించిం దెవరు..? జేఎన్‌యూలో జరిగిన వాస్తవాలేంటో పార్లమెంట్‌లోనే బహిర్గతం చేయాలన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను జర్మనీలో ఫాసిజం నెలకొన్న నాటి పరిస్థితులతో ఏచూరి పోల్చారు.
  సీతారాం ఏచూరి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s