కాశ్మీర్ లోయలో యువకులు ఉన్నట్లుండి మాయం కావడం సామాన్యమైన విషయం. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ 1990ల్లో అది ఉధృతంగా జరిగింది. ఉగ్రవాదులన్న వంకతో వేలాది యువకులను భారత సైన్యం మాయం చేసింది.
ఒమర్ అబ్దుల్లా పాలన కాలంలో సామూహిక సమాధులు బైట పడ్డాయి కూడా. సమాధుల చరిత్రను విచారించేందుకు నియమించిన కమిటీ నివేదిక ఇంతవరకు వెలుగు చూడలేదు.
బందిపురా, బారాముల్లా, కుప్వారా అనే మూడు జిల్లాల్లోని 55 గ్రామాల్లో సామూహిక సమాధులు బైటపడ్డాయి. 2,700 సమాధులు బైట పడగా అందులో 2,900 మంది సమాధి అయినట్లు ఇంటర్నేషనల్ పీపుల్స్ ట్రిబ్యునల్ ఆన్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ సంస్ధ 2010లో తెలిపింది. వారిలో 88 శాతం (2,373) సమాధులకు ఎలాంటి మార్కింగ్ లేవు.
ఘొరం ఏమిటంటే మార్కింగ్ లేని సమాధుల్లో 154 లో రెండు చొప్పున శవాలు ఉన్నాయి. 23 సమాధుల్లో 2 కంటే ఎక్కువ కంకాళాలు లభ్యం అయ్యాయి. ఈ 23 సమాధుల్లో సమాధి చేసిన వారి సంఖ్య 3 నుండి 17 వరకూ ఉన్నది.
కేవలం 3 జిల్లాల్లో సర్వే జరిపితేనే ఈ సమాధులు వెలుగు చూశాయి. 10 జిల్లాల్లోనూ సర్వే జరిపితే 1989 నుండి లెక్క తేలని 8,000 మంది బలవంతపు అదృశ్యాలకు లెక్క సరిపోతుందని పైన పేర్కొన్న సంస్ధ సభ్యులు పేర్కొనడం గమనార్హం.
సమాధులు వెల్లడి అయ్యాక కూడా భారత ప్రభుత్వం నుండి చలనం లేదు. ఆ నాలుగు రోజులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తాటాకు చప్పుళ్ళు చేశాయి. ఆ తర్వాత ఆ చప్పుళ్ళు ఆటోమేటిక్ గా అదృశ్యం అయ్యాయి.
ఇప్పుడు ఫేస్ బుక్ నుండి మిర్ సుహాయిల్ కార్టూన్ బలవంతంగా అదృశ్యం కావించబడింది.