
Viswajyothi Ghosh & Mir Suhail
ఫేస్ బుక్ ఒక కంపెనీ. లాభార్జనే ఫేస్ బుక్ కంపెనీ ధ్యేయం. కానీ ఒక వ్యాపార కంపెనీయే రాజ్యం అవతారం ఎత్తితే?!
అఫ్జల్ గురు కి వేసిన ఉరిశిక్ష సాక్షాలు బలంగా ఉండి నేరం రుజువు కావడం వల్ల కాదు. సాక్షాలు బలంగా లేకపోయినా న్యాయ స్ధానం సాక్షిగా ఉరితీయడం ద్వారా కాశ్మీర్ ప్రజలకు గట్టి సందేశం ఇవ్వాలని భారత రాజ్యం భావించినందుకు!
భావాలకు సంకెళ్లు వేయగలరా ఎవరైనా? ‘రాముడు ఆ బాబ్రీ మసీదు కట్టిన చోటనే పుట్టాడు. అది మా నమ్మకం’ అన్న భావనను ఎవరైనా అడ్డుకోగలరా? రుజువులు చూపండి అంటే ఆర్‌ఎస్‌ఎస్ పరివారం కయ్యిమంటుంది. ‘అది మా విశ్వాసం’ అని తెగేసి చెబుతుంది.
కానీ రాముడి పుట్టుక ఇప్పటిది కాదు. వేల యేళ్ళ క్రితం నాటిది. అఫ్జల్ గురు ఉరి తీత నిన్న మొన్నటిదే. కనుక ఆయన ఉరితీయడం వెనుక కోర్టు చెప్పిన కారణాలను ప్రజలు, ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు తర్కిస్తూనే ఉంటారు.
ఆ ఆలోచనలకు సంకెళ్లు వెయ్యడం, వాటికి ముద్రలు తగిలించి అణచివేయాలని చూడడం వృధా ప్రయాస. అది ప్రజాస్వామిక వ్యవస్ధల లక్షణం కాదు. ఫాసిస్టుల లక్షణం.
అఫ్జల్ గురును ఎవరికి హెచ్చరికగా అయితే ఉరి తీశారో ఆ ప్రజలు అతని గురించి ఆలోచించకుండా ఉండడం అస్సలు సాధ్యం కాదు.
భగత్ సింగ్ ని స్మరించడం బ్రిటన్ పాలకవర్గాలకు ఇష్టం ఉండదు. సుభాష్ చంద్రబోస్ ని తలచుకోవడం అంటే బ్రిటన్ పాలకులకు పుండు మీద కారం రాయడమే. కానీ వారిని తలచుకోకుండా భారతీయులు ఉండగలరా? ఆజాద్ చంద్ర శేఖర్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ లను ఉగ్రవాదులు అన్నారప్పుడు. మనం అంటున్నామా?
కాశ్మీర్ ప్రజలకు అఫ్జల్ గురు అలాంటి వ్యక్తి. వారి స్వతంత్ర ఆకాంక్షలు అణచివేయబడడానికి అఫ్జల్ గురు నేటి ప్రతీక. నిరంతరం సైనికుల కవాతుల మధ్య గడుపుతున్న కాశ్మీరీల పరిస్ధితిని ఎవరూ కోరుకోరు. ఒక వారం రోజులు కర్ఫ్యూ విధించి సిఆర్‌పిఎఫ్ జవాన్లతో మన చుట్టూ రోడ్లను నింపితే అల్లల్లాడిపోతాం. అలాంటిది అరవైయేళ్లకు పైగా స్వేచ్ఛ అనేది ఎరగని జాతి భావనలు ఎలా ఉంటాయి?
ఆ భవనాలు ఎలా ఉంటాయో కార్టూనిస్టు మిర్ సుహాయిల్ గీసిన ఈ కార్టూన్ చెబుతుంది. కార్టూన్ గురించి మిర్ మాటల్లో చెప్పాలంటే:
“కాశ్మీర్ అనబడే ఆ వృక్షం యొక్క వేళ్ళు అక్కడికి ఎంతో దూరంలో ఉన్న తీహార్ జైలు లోని అఫ్జల్ గురు సమాధి వేళ్ళతో కలిసి పోయాయని నేను చూపదలిచాను. ఆ రెండింటి మధ్య సూక్ష్మ సంబంధం ఉన్నదని నేను చెప్పదలిచాను. అక్కడ ఉన్న ఏదో ఒక భావన వల్ల ఈ సంబంధం పైకి ప్రత్యక్షంగా కనపడకుండా ఉన్నది. అఫ్జల్ గురు కుటుంబం నుంచి కూడా వ్యక్తం అయ్యే ఈ భావన ఎంత బలమైనదంటే ఎంతో దూరాన ఉన్న తీహార్ జైలును సైతం చేరగలదు.”
కాశ్మీర్ కేంద్రంగా హిందూత్వతో పాటు కాంగ్రెస్ పాలకవర్గాలు సైతం యేళ్ళ తరబడి రెచ్చగొట్టిన భావోద్వేగాల వల్ల ఆ నేలలో నివసించే ప్రజల స్ధితిగతులను ప్రజాస్వామిక వాతావరణంలో చర్చించే అవకాశం లేకుండా పోయింది.
ఈ భావోద్వేగాలు కలిగి ఉన్న జనమే ఫేస్ బుక్ కి మార్కెట్. ఆ మార్కెట్ ను సంతృప్తిపరచడం వ్యాపార లాభ లక్షణం, అది ప్రజాస్వామ్య వ్యతిరేకం అయినా సరే. ఫలితంగా ఫేస్ బుక్ స్వయంగా రాజ్యం అవతారం ఎత్తి ఒక కార్టూనిస్టు భావ వ్యక్తీకరణపై సంకెళ్లు వేసేందుకు పూనుకుంది. కార్టూన్ తమ సర్వర్ల నుండి బైటికి కనపడకుండా నిషేధం విధించింది.
మరొక కార్టూనిస్టు విశ్వజ్యోతి ఘోష్ (దేశ విభజనపై వెలువడిన ‘దిస్ సైడ్, దట్ సైడ్’ పుస్తకం ఎడిటర్) ఫేస్ బుక్ చర్యను విమర్శిస్తూ ఇలా అన్నారు:
“ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా వేదికల ఆగమనం వల్ల ప్రజాస్వామిక వ్యక్తీకరణకు చోటు పెరుగుతుందని నమ్మి ఉంటాము. కానీ అందుకు పూర్తి విరుద్ధమైన దూకుడు పెరిగినట్లు కనిపిస్తోంది.
“మమతా బెనర్జీ కార్టూన్ ను ఫార్వర్డ్ చేసిన విషయంలో అంబికేష్ మహాపాత్ర ఘటన జరిగినప్పుడు ప్రజల నుండి దూకుడుగా వచ్చిన స్పందన ఏమిటంటే అదే కార్టూన్ ను మరిన్నిసార్లు ఫార్వర్డ్ చేస్తూ రాజ్యానికి వ్యతిరేకంగా చప్పుళ్ళు చేయడం.
“ఇలాంటి వేదికల కారణంగా ఆర్ కె లక్ష్మణ్ గారి ‘కామన్ మేన్’ ఇప్పుడు మారిన వ్యక్తి అని నేను అప్పట్లో అన్నాను. అతనిక ఎంతమాత్రం మౌనంగా లేడన్నాను. అతనికి ఇప్పుడు చురుకైన అభిప్రాయం ఉన్నదని అతనికి మద్దతు వచ్చిందని ఇది ఆహ్వానించదగిన పరిణామం అనీ అన్నాను.
“కానీ ఆ తర్వాత మూడేళ్లలో తద్విరుద్ధంగా జరగడం నేను చూస్తున్నాను. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే స్ధానంలో రాజ్యమూ, చిల్లర గ్రూపులూ ఉండడం కాదు. ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా వేదికలు ఇప్పుడు సరికొత్త రాజ్యంగా అవతరిస్తున్నాయి. ఈ సత్యాన్ని ఎవరూ నిరాకరించలేరు. ఆశ్చర్యకరంగా రాజ్యం కంటే మరింత అసహనపూరితంగా అది తయారయింది”
మునుముందు మరిన్ని నిషేధాలకు ఫేస్ బుక్, గూగుల్, యాపిల్, మైక్రో సాఫ్ట్ తదితర సంస్ధలు తెగిస్తాయి. మొదట ప్రజల భావ వ్యక్తీకరణకు స్నేహశీలురుగా అవతరించడం, తద్వారా వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడం, ఆనక అంతా తన నియంత్రణలోకి వచ్చాక అసలు రంగు చూపడం… ఇది లాభార్జన ఏకైక లక్ష్యంగా కలిగిన వ్యాపార కంపెనీల లక్షణం. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈనాటి ఫేస్ బుక్ చర్విత చరణంగా రుజువు చేసిన, చేస్తున్న సత్యం ఇది!
రుజువులు చూపండి అంటే ఆర్‌ఎస్‌ఎస్ పరివారం కయ్యిమంటుంది
మీరన్నది నిజమే నండి. బాబ్రి మసీదును ముస్లింలు రామ మందిరం పై కట్టలేదు. దుర్మార్గులైన హిందువులు దౌర్జన్యంగా బాబ్రి మసీదు కింద గుడి కట్టారు.
కేసు జరిగినపుడు మార్క్సిస్ట్ చరిత్ర కారులు అందరు కోర్ట్ కి చెప్పిన అబద్దాలు కోర్ట్ వారు విని అవాకయ్యారు. మీకు ఆ విషయం తెలుసా.?