కన్హైయాపై సాక్షాలు లేవుట!


SEDITION

“JNUSU అధ్యక్షుడు కన్హైయా కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే మేము వ్యతిరేకించం” అంటూ నిన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎంతో ఔదార్యంతో ప్రకటించారు. ఎందుకని అడిగితే “వెల్ ఒక యువకుడి జీవితం” అని జవాబిచ్చారాయన.

విద్యార్ధులను అరెస్టు చేసి కేసు పెట్టడంలోనూ, విలేఖరులను, విద్యార్ధులనూ చావబాదుతున్న వీడియోలు ఉన్నా హిందూత్వ గూండాలను వెనకేసుకు రావడంలోనూ ఎంతో ఉత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి హఠాత్తుగా కన్హైయా యువ విద్యార్ధి అన్న సంగతి ఎందుకు గుర్తుకు వచ్చిందో పరిశీలకులకు అర్ధం కాలేదు.

నిన్న బాగా పొద్దు పోయాక వివిధ వార్తా సంస్ధలు ప్రచురించిన వార్త కమిషనర్ బస్సీ ఔదార్యానికి అర్ధం ఏమిటో చెప్పింది. కన్హైయా పైన గానీ ఆయనతో పాటు కేసు పెట్టిన ఇతర ఐదుగురు విద్యార్ధులపై గానీ దేశద్రోహం (సెడిషన్) కేసును రుజువు చేసేందుకు ప్రాధమిక సాక్షాలు కూడా బస్సీ గారి వద్ద లేకపోవడమే ఆయన ఔదార్యానికి కారణం.

కేసులో నిందితుల బెయిల్ ని వ్యతిరేకించడానికి తగిన కారణాలు పోలీసులు చెప్పాలి/చూపాలి. అసలు కేసుకే సాక్షాలు లేనప్పుడు బెయిల్ నిరాకరణకు కారణాలు ఎక్కడి నుండి వస్తాయి. అందుకే బస్సీ గారు అంత ఔదార్యం ప్రకటించారు.

ఐ‌బి‌ఎన్ లైవ్, ది హిందు, టి‌ఓ‌ఐ పత్రికల ప్రకారం కన్హైయా కుమార్ తదితరులపై సెడిషన్ నేరం మోపడానికి (చార్జి షీటు దాఖలు చేయడానికి) తగిన ప్రాధమిక సాక్షాలు కూడా పోలీసుల వద్ద లేవని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ణయానికి వచ్చింది. ఫలితంగా వారిపై నేరారోపణలు ఉపసంహరించుకునే ఆలోచనలో హోమ్ శాఖ ఉన్నది.

ఈ మేరకు హోమ్ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారని పత్రికలు తెలిపాయి. ఆరుగురు విద్యార్ధులు జాతీయ-వ్యతిరేక నినాదాలు ఇస్తున్నట్లు వీడియోలో సాక్షం వారికి కనపడలేదు. నినాదాలైతే వినిపిస్తున్నాయి గాని ఆ నినాదాలను కన్హైయా కుమార్ ఇస్తున్నట్లు ఆధారాలు లేవు.

విచిత్రం ఏమిటంటే పోలీసులు జి టి.వి ప్రసారం చేసిన వీడియో ఫుటేజీ పైనే నమ్మకం పెట్టుకోవడం. వాస్తవానికి యూనివర్సిటీలో అఫ్జల్ గురు కార్యక్రమం జరగబోతున్న సంగతి యూనివర్సిటీ అధికారులు ముందే పోలీసులకు చెప్పారు. దరిమిలా ముగ్గురు పోలీసులను సివిల్ దుస్తుల్లో అక్కడికి పంపారు. వారు అక్కడ జరిగిన ఘటనలను ఆద్యంతం తిలకించారు.

కానీ ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐ‌ఆర్ లో మాత్రం ఆ ముగ్గురు పోలీసుల ప్రసక్తి లేదు. వారు సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు గనక వారి నివేదికనే ఎఫ్‌ఐ‌ఆర్ గా చేయాలి. కానీ వారికి బదులుగా జిటి.వి ప్రసారం చేసిన వీడియోను సాక్షంగా ఎఫ్‌ఐ‌ఆర్ లో పేర్కొన్నారు.

అంటే పోలీసుల సమాచారం సెడిషన్ కేసుకు అనుకూలంగా లేనట్లే భావించవలసి వస్తోంది. అందుకే కన్హైయాయే నినాదాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోపైన పోలీసులు నమ్మకం పెట్టుకున్నారు. ఆజాదీ చాహియే అంటూ కన్హైయా నినాదాలు ఇచ్చింది నిజమే గానీ ఆయన ఆజాదీ కోరింది కాశ్మీర్ కి కాదు. కులతత్వం, మతోన్మాదం, పూర్వ భావనల (prejudices) నుండి మాత్రమే.

ఆంగ్ల చానెళ్లు తెంపు లేకుండా హోరెత్తించిన కాశ్మీరీ విద్యార్ధి ఉమర్ ఖలీద్ కూడా ఇండియా వ్యతిరేక నినాదాలు ఇచ్చిన దాఖలాలు వీడియోలో లేవు. ఉమర్ ఖలీద్ ఏవో నినాదం ఇస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వినిపిస్తున్న నినాదానికి ఆయన పెదాల కదలికలకీ పొంతన లేదు.

జి న్యూస్ చానల్ తమ వార్త కోసం తయారు చేసుకున్న ప్రోమో వీడియోని పోలీసులు గుడ్డిగా స్వీకరించారు. రా ఫుటేజీ మొత్తాన్ని ఇవ్వాలని జీ న్యూస్ చానెల్ ను పోలీసులు అడిగి తీసుకున్నారు. అందులోనూ వారికి తమకు కావలసిన సాక్షాలు దొరకలేదని ఎన్‌డి‌టి‌వి తెలిపింది.

ప్రధానంగా నాలుగు వీడియోలు ఇంటర్నెట్ లో వ్యాప్తి చెందాయి. ఫిబ్రవరి 9 తేదీన అఫ్జల్ గురు సంస్మరణలో జరిగిన కార్యక్రమం వద్ద కార్యక్రమ నిర్వాహకులు, ఏ‌బి‌వి‌పి విద్యార్ధుల మధ్య ఘర్షణ జరుగుతుండగా వారిని నివారించడానికి కన్హైయా అక్కడ ఉన్నాడు తప్పితే కార్యక్రమంలో ఆయన భాగం కాదు. ఈ సంగతి ఆయన ముందు నుండీ చెబుతున్నాడు. బి‌జే‌పి నేతలు, వారి ప్రభుత్వ పెద్దలే వినలేదు.

రెండు వీడియోలు ఫిబ్రవరి 10 తేదీన యూనివర్సిటీ పాలనా భవనం ముందు మెట్లపై నిలబడి కన్హైయా కుమార్ ఇచ్చిన ప్రసంగాలకు సంబంధించినవి. ‘భారత రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉన్నాము తప్ప నాగపూర్ (ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉన్నది) లో రాసిన రాజ్యాంగానికి కట్టుబడి ఉండం’ అంటూ కన్హైయా ప్రసంగించిన ఈ వీడియోలు ఇంటర్నెట్ లో బహుళ చూపులకు నోచుకుంది.

మరొక వీడియోలో ఎవరు ఉన్నదీ కనపడలేదు. మసక మసకగా ఉన్న ఈ వీడియో నుండే ‘భారత్ ను ముక్కలు చేస్తాం’ అనీ, ఇంకా ఇతర ఇండియా వ్యతిరేక నినాదాలు వినిపించాయి. కానీ వ్యక్తులు ఎవరో కనపడలేదు. ఈ ఆడియోను కన్హైయా కనిపిస్తున్న వీడియోకు మిక్స్ చేశారని అది హిందూత్వ పనే అని కొందరు ఆరోపిస్తున్నారు. నిజం ఏమిటన్నది పోలీసులు దృష్టి పెడితే తేలుతుంది. కానీ పోలీసులకు అందులో ఆసక్తి లేదు. ఎందుకంటే దానివల్ల వారి ప్రభుత్వ మాస్టర్లకు ప్రయోజనం లేకపోగా నష్టం కలుగుతుంది.

చీకటి వీడియోలో వినిపిస్తున్న ఇండియా వ్యతిరేక నినాదాలు ఎవరు ఇచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో గత ఆర్టికల్ (పాక్ అనుకూల నినాదాలు చేసింది ఏ‌బి‌వి‌పి?) రేఖా మాత్రంగా చూసాము. తాము రెచ్చిపోవడానికి తగిన వాతావరణాన్ని తామే కల్పించుకునే ఎత్తుగడలకు దిగడం హిందూత్వ సంస్ధలకు అలవాటు. 2012లో హైద్రాబాద్ మాదన్నపేట ఆలయంలో ఆవు కాళ్ళు పడేసిన ఉదంతం, మాలెగావ్ పేలుళ్ళు, మక్కా మసీదు పేలుళ్లు వారి అలవాటు ఫలితాల్లో కొన్ని.

కనుక అఫ్జల్ గురు కార్యక్రమంలో వారే వెనక ఉండి నినాదాలు ఇచ్చి ఉన్నా ఆశ్చర్యం లేదు. ఏ‌బి‌వి‌పి నేతలు ఫేక్ గా అభివర్ణించిన ఈ వీడియోను సాక్షంగా తీసుకోవడానికి పోలీసులు ఇచ్చగించరు. జరగని ఘటన కోసం అదే వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తున్న పోలీసులు జరిగిన ఘటన చూపే వీడియోపై దృష్టి పెట్టకపోవడం ఎటువంటి పౌర సంరక్షణ?

ఈ వీడియోలు వేటినీ సాక్షాలుగా పోలీసులు పరిగణించలేదు. జీ న్యూస్ చానెల్ తయారు చేసుకున్న ప్రోమో వీడియో పైనే దృష్టి పెట్టారు. అందులో వారికి మద్దతు వచ్చే అంశాలు దొరకలేదు. ఫలితమే హోమ్ మంత్రిత్వ శాఖ పునరాలోచన.

ఎన్‌డి‌టి‌వి ప్రకారం “Bharat Tere Tukde Honge” అంటూ నినాదాలు ఇస్తున్న వాళ్ళు స్పష్టంగా కనిపించిన వీడియో ఒకటుంది. కానీ వారెవరూ యూనివర్సిటీ లోని వాళ్ళు కాదు. వాళ్ళు పోలీసులకు కూడా దొరక్కపోవచ్చు. కాశ్మీరీ స్వతంత్రం మద్దతు దారులు తమకు ఆజాదీ కావాలని నినాదాలు ఇస్తారు కానీ భారత్ ని ముక్కలు చేస్తాం అని ఇవ్వరు.

ఇండియాలోని యూనివర్సిటీలో పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదం ఎవరు ఇస్తారు? అంత తెలివి తక్కువ పనికి పాకిస్తాన్ మద్దతుదారులైనా పూనుకుంటారా? పూనుకోరని సాధారణ పరిజ్ఞానం చెబుతుంది. ఒక పధకం, ఒక డిజైన్ ఉన్నప్పుడే ఇలాంటి నినాదాలు ఉద్దేశ పూర్వకంగా ఇవ్వడం సాధ్యం అవుతుంది.

నిజానికి భారత్ ని ముక్కలు చేయడం అన్న భావన,  ఏ‌బి‌వి‌పి వాళ్ళే తరచుగా వ్యక్తం చేస్తుంటారు. గోడలపై రాస్తుంటారు. “మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వం” అన్నది వారికి ఇష్టమైన నినాదం. ఈ మాటల నుండి ‘టుకడే హోంగే’ అన్న మాటలు వచ్చాయా?

పనిగట్టుకుని ఒక దేశాన్ని ముక్కలు చేసేది ప్రజలు కాదు, ప్రజా సంఘాలు కాదు. ఆ పనిని చేసింది ఒకప్పటి బ్రిటిష్ వలస సామ్రాజ్యం. ఈ నాటి అమెరికా సామ్రాజ్యవాదం కూడా ఆ పని చేస్తోంది. యుగోస్లోవియాను ముక్కలు చేసిన పుణ్యం అమెరికాదే. ఈ రోజు సిరియా, ఇరాక్ లను ఉమ్మడిగా మూడు ముక్కలు చేసే పధకాన్ని అమలు చేస్తున్నది అమెరికాయే. మహా సామ్రాజ్యాలు తలచుకుంటే దేశాలు ముక్కలు అవుతాయి గానీ యూనివర్సిటీలో విద్యార్ధులు తలచుకుంటే అవుతాయా?

దేశ సమగ్రత అంటే భూభాగాలు కలిసి ఉండడం మాత్రమే కాదు. అందులో నివసించే ప్రజలు ఎటువంటి ఎక్కువ తక్కువలు లేకుండా కలిసి మెలిసి జీవిస్తే అదే అత్యున్నతమైన దేశ సమగ్రత. ఓట్ల కోసం హిందువులు, ముస్లింల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ దేశ సమగ్రత గురించి వాపోవడం బూటకం అవుతుంది గానీ దేశభక్తి ఎలా అవుతుంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s