ఢిల్లీ కోర్టులో సుప్రీం కోర్టు ఆదేశాలకు దిక్కు లేదు!


O P Sharma hitting Ameeq Jamai -The Hindu

O P Sharma hitting Ameeq Jamai -The Hindu

నిన్నటి సుప్రీం కోర్టు గాండ్రింపులు పిల్లి కూతల కంటే అధ్వాన్నంగా మారిపోయాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. హిందూత్వ లాయర్ల వీరంగం ముందు భారత పార్లమెంటు, భారత న్యాయ చట్టాలు, పోలీసు వ్యవస్ధ… చేష్టలుడిగి నిలబడిపోయాయి.

కన్హైయా కుమార్ ను హాజరుపరచవలసిన పాటియాలా కోర్టు ఆవరణలోకి చొచ్చుకు వచ్చిన హిందూత్వ గూండాలు -వారిలో కొందరు లాయర్లూ ఉండవచ్చు- జే‌ఎన్‌యూ విద్యార్ధులు, ప్రొఫెసర్లు, విలేఖరుల మీద మంగళవారం దాడి చేసిన నేపధ్యంలో అనుమతించబడిన విలేఖరులు, లాయర్లను తప్ప ఎవ్వరినీ లోనికి పంపవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలు అక్షరాలా విఫలం అయ్యాయి. హిందూత్వకు చెందిన నల్లకోటు గూండాలు వీరంగం ఆడుతుంటే నిన్న ఢిల్లీ పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. వారి ధోరణిపై విమర్శలు వెల్లువెత్తాయి. లాయర్ గూండాల దాడి విషయమై తమ ముందుకు వచ్చిన పిటిషన్ ను అర్జెంటుగా విచారించడానికి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అంగీకరించారు.

పిటిషన్ ను విచారిస్తూ చీఫ్ జస్టిస్ కేహార్ నేతృత్వం లోని ధర్మాసనం ఢిల్లీ పోలీసులకు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది. అందరినీ కోర్టు హాలులోకి అనుమతించవద్దని చెప్పింది. కన్హైయా తరపు లాయర్లు, కేసులో ఉన్న ప్రభుత్వ లాయర్లు, కన్హైయా మిత్రులు బంధువులు, విలేఖరులు అందరికి ప్రాతినిధ్యం వహించే ఇద్దరు/ఐదుగురు విలేఖరులు… వీరు మాత్రమే కోర్టులో ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

కానీ కన్హైయాను హాజరుపరచడానికి ముందే నల్ల కోట్లు తగిలించుకున్న హిందూత్వ గూండాలు -తమను తామే నిఖార్సైన దేశభక్తులుగా చెప్పుకుని గోప్పైపోతూ- మళ్ళీ వీరంగం మొదలు పెట్టారు. ఒక విలేఖరిని, ఒక విద్యార్ధిని పైనబడి కొట్టారు. కన్హైయా తరపున మాట్లాడుతున్న లాయర్లనూ వదలకుండా కొట్టారు.

లాయర్లలో కొందరు కోర్టు బైటికి వస్తుంటే లోపలికి లాగి మరీ (లేక లోపలికి వెళ్తుంటే బైటికి లాగుతూనో) కొట్టారు. గేటు అవతలి నుండి ఇవతల ఉన్న విలేఖరులతో వాగ్వివాదానికి దిగారు. “మేమే దేశభక్తులం” అని గాండ్రించారు. “దేశ ద్రోహులను మీరు వెనకేసుకు వస్తున్నారు” అని తీర్మానించారు. ఒకరి తర్వాత ఒకరుగా విలేఖరులతో గాండ్రింపులు, పెడబొబ్బలు పెడుతూనే ఉన్నారు.

ఈ లోగా కన్హైయా కుమార్ ని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య కారులో నుండి దింపి తెచ్చారు. ఎన్ని వలయాలు ఉన్నా కోర్టు ఆవరణలోకి రాగానే హిందూత్వ గూండాలు ఉరఫ్ లాయర్లు కన్హైయా కుమార్ ని కొట్టారని పత్రికలు తెలిపాయి. కన్హైయా కుమార్ సైతం కోర్టులో జడ్జికి అదే చెప్పారు. పోలీసులు తనను కాపాడ్డానికి ఎంతగా ప్రయత్నించినా తనను కొట్టారని జడ్జికి చెప్పారు. దానితో కన్హైయాకు మరో రెండు వారాలు రిమాండ్ విధిస్తూ ఆయనకు గట్టి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు.

కన్హైయా కుమార్ ని కొట్టిన ఆనందాన్ని హిందూత్వ గూండాలు దాచుకోలేదు. కన్హైయాని కొట్టిన సంగతి దాచి పెట్టడం అంటే దేశద్రోహమే అని బహుశా వారు భావించి ఉండాలి. విలేఖరుల ముందుకు వచ్చి “మా పని మేము చేసేశాము” అని చాటుకున్నారు. “వాడి చెంపపై కొట్టాను” అని ఒక లాయర్ గొప్పగా చెప్పారని పత్రికల సమాచారం.

హిందూత్వ పాఠశాలల్లో ‘దేశద్రోహం’ అని ముద్రవేసి తమ వ్యతిరేకులను (వామపక్షీయులు, ముస్లింలు, దళితులు, తలవంచుకోని స్త్రీలు, రామందిర వ్యతిరేకులు, బాబ్రీ మసీదు విధ్వంసక వ్యతిరేకులు, లిబరల్స్… అబ్బో ఈ జాబితా చాలా పెద్దది)  భౌతికంగా కొట్టడం అత్యున్నతమైన దేశభక్తియుత చర్య అని బోధిస్తున్నారేమోనని ఈ లాయర్ల చర్య ద్వారా తెలుస్తున్నది. లేదంటే ‘నేరారోపణ జరిగిన వారిపై భౌతిక దాడి చేయడం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం’ అన్న సూక్తి తెలిసి ఉండి కూడా ‘మేము కొట్టాం’ అని నేరుగా వెళ్ళి విలేఖరులకే చెప్పడం జరుగుతుందా?

చివరికి పరిస్ధితి ఎలా తయారైంది అంటే “మేము మాత్రం ఏం చేయగలం” అంటూ సుప్రీం ధర్మాసనం కూడా వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ముందు రోజే తన వద్దకు వచ్చిన పిటిషన్ ను విచారించిందాయే. తగిన ఆదేశాలను ఇచ్చిందాయే. ఆదేశాలు ఇచ్చేశామ్ కనుక అంతా సర్దుకుంటుంది అని ధర్మాసనం భావించింది.

అయితే సుప్రీం ఒకటి తలచిన హిందూత్వ లాయర్లు మరొకటి తలచెను. ఈ లాయర్ల దృష్టిలో జే‌ఎన్‌యూ అంటేనే దేశ వ్యతిరేక యూనివర్సిటీ. జే‌ఎన్‌యూ దేశద్రోహులను తయారు చేస్తోందని ఆరోపిస్తూ యూనివర్సిటీని మూసివేయాలని బి‌జే‌పి ఢిల్లీ ఎం‌ఎల్‌ఏ ఓం ప్రకాష్ శర్మ డిమాండ్ చేశారు కూడాను.

నిన్న ఒక ఏ‌ఎస్‌ఐ‌ఎఫ్ విద్యార్ధిని కొట్టడంలో ఈ ఢిల్లీ “చట్ట”సభ సభ్యుడు చాలా చురుకుగా వ్యవహరించారు. ఆయన విద్యార్ధిని కింద పడేసి కాలితో తన్నుతున్న వీడియోని అందరు చూశారాని తెలిసి కూడా “నన్ను కొడితే స్పందించాను, అంతే. చుట్టూ దట్టమైన అడవి. ఓ క్రూర మృగం హఠాత్తుగా దాడి చేసింది. అప్పుడు చట్టం ఏం చెబుతోంది అని ఆలోచించాలా లేక నన్ను నేను కాపాడుకోవాలా?” అని ప్రశ్నించిన ఘనుడు ఓ పి శర్మ గారు. హిందూత్వ లాయర్లకు దగ్గరుండి హితబోధ చేసి విద్యార్ధులు, విలేఖరుల పైకి ఉసిగోల్పింది ఎవరో శర్మ గారి వీరంగం, ఆనక ఆయన సమర్ధన చెబుతున్నాయి. (గుజరాత్ అల్లర్లు గుర్తుకు వస్తే అది మీ తప్పు కాదు.)

పాటియాలా కోర్టులో మళ్ళీ లాయర్లు వీరంగం వేస్తున్న సంగతి తెలుసుకున్న సుప్రీం ధర్మాసనం వెంటనే ఆరుగురు లాయర్లతో కూడిన బృందాన్ని పాటియాలా కోర్టుకు పంపింది. బృందంలో సభ్యులుగా కపిల్ సిబాల్ కూడా ఉన్నారు. ఆయన మొదట “ఇదంతా రాజకీయాలు” అంటూ నిరాకరించారు. “కోర్టు అధికారిగా మీరు వెళ్ళండి” అని ధర్మాసనం కోరడంతో ఆయన సమ్మతించారు.

తమ వద్ద ఉన్న ఢిల్లీ పోలీసు ప్రతినిధిని వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి పరిస్ధితి అదుపు చేయమని చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అలాగే చేశారు. లాయర్లు కన్హైయా ను కొట్టారన్న కబురు రావడంతో ధర్మాసనం దాదాపు చేతులు ఎత్తేసినంత పని చేసింది. లాయర్ల వీరంగం కొనసాగుతోందన్న కబురూ అందింది. “ఇక మేమేం చేయగలం” అంటూ ధర్మాసనం నిస్సహాయత ప్రకటించిందని ది హిందు సమాచారం. కన్హైయా లాయర్లు, కొందరు విద్యార్ధులు, విలేఖరులు లాయర్ల వీరంగం నుండి కాపాడుకోవడం కోసం లోపలి నుండి తలుపు వేసుకున్నారని మరో కబురు అందింది. కోర్టు ఆవరణ నుండి లాయర్లను పంపేసి లోపల ఉన్నవారిని క్షేమంగా తరలించాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది.

ఇంతా జరిగాక ఢిల్లీ పోలీస్ కమిషనర్ “కన్హైయాను ఎవరూ కొట్టలేదు” అని ప్రకటించేశారు. “కాకపోతే తోపులాట జరిగి ఉండవచ్చు. ఇలాంటి కేసులో అలాంటివి జరగడం మామూలు విషయం” అని ప్రకటించారు.

“పాటియాలా హౌస్ కోర్టులో తోపులాట గురించి నేను విన్నాను. తగిన చట్టబద్ధ చర్య తీసుకోవాలని నేను మా అధికారులను కోరాను. మేము రెండు కేసులు నమోదు చేశాము. ఒకటి విలేఖరులపై జరిగిన దాడి గురించి. మరొకటి కోర్టు బయట జరిగిన హింసకు సంబంధించి” అని కమిషనర్ బి ఎస్ బస్సీ ప్రకటించారు.

కానీ సి‌పి‌ఐ/ఏ‌ఐ‌ఎస్‌ఎఫ్ కార్యకర్త (అమీక్ జామై)పై దాడి చేసి కొట్టిన ఓ పి శర్మ ఈ రెండు కేసుల్లో లేడు. ఆయన వీరంగంకు సంబంధించిన వీడియో సాక్ష్యం ఢిల్లీ పోలీసులకు సరిపోలేదు. శర్మ చేతుల్లో దెబ్బలు తిన్న అమీక్ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. పైగా వీడియో సాక్ష్యం ఉన్నది. అవేవీ ఢిల్లీ పోలీసులకు సరిపోలేదు.

ఎం‌ఎల్‌ఏ పైన కేసు ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు ఆయన నుండి ఊహించిన సమాధానమే వచ్చింది. “ఆయనే తనపై దాడి జరిగిందని చెబుతున్నారు” అన్నారు కమిషనర్. “నన్ను కొడితే ఎవర్నైనా షూట్ చేసి పారేస్తా” అన్న శర్మ హెచ్చరిక కూడా కమిషనర్ కు వినపడలేదు. లేక వినపడిందో మరి!

పోలీసు వ్యవస్ధ, కోర్టులు ఎలా పని చేస్తాయో ఈ ఘటనలు, పోలీసుల స్పందనలు, సుప్రీం కోర్టు నిస్సహాయత స్పష్టంగా విప్పి చూపుతున్నాయి. చట్టాల్లో, కాగితాలపై ఎన్ని ఆదర్శాలు వల్లించినా అవన్నీ అధికారం ముందు, ఆ అధికారం చేబూనిన వర్గాల ముందు ఎందుకూ కొరగావు. రాజకీయ అధికారం, రాజ్యాధికారం ఎవరి పంచన ఉంటుందో వారు చెప్పేదే న్యాయం. వారు దోషి అంటే దోషి, నిర్దోషి అంటే నిర్దోషి. న్యాయం అంటే న్యాయం, లేదంటే అన్యాయం. వారు దేశ ద్రోహం అంటే దేశ ద్రోహం, లేదంటే దేశ భక్తి.

పోలిష్ కమిషనర్ బి ఎస్ బస్సీ మరొక ముఖ్యమైన సంగతి చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉండి కూడా రెండో రోజు కూడా విచక్షణారహితంగా జరుగుతున్న దాడిని ఎందుకు ఆపలేదు అన్న ప్రశ్నకు ఆయన “రెండు విరుద్ధ సిద్ధాంతాలను నమ్ముతున్న సమూహాలు ఉద్వేగపూరిత వాతావరణంలో పరస్పరం తలపడుతున్నారు” అన్నారు. అలాంటి దాడుల్లో పోలీసులు చేసేది ఏమీ ఉండదు అని ఆయన చెప్పడం.

అదే దృష్టి కన్హైయా కుమార్ అరెస్టు విషయంలో కమిషనర్ కు ఎందుకు కొరవడినట్లు? వదిలిపెట్టెయ్యవలసి వస్తే అందుకు ఒక వివరణ పోలీసుల వద్ద సిద్ధంగా ఉంటుంది. కేసు పెట్టి అరెస్ట్ చెయ్యాలి అనుకుంటే అందుకు కూడా తగిన వివరణ వారి వద్ద సిద్ధంగా ఉంటుంది. అనగా పోలీసులు ఇక్కడ న్యాయం కోసం, చట్టం అమలు కోసం, ప్రజల క్షేమం కోసం పని చేయడం లేదని కమిషనర్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పారు.

నిజం చెప్పాలంటే కమిషనర్ గారు చెప్పేది వాస్తవం. జే‌ఎన్‌యూ నిలయంగా మారిందని చెబుతున్న వామపక్ష రాజకీయాల తాత్విక చింతన కూడా అదే చెబుతుంది. రెండు విరుద్ధ అంశాలు ఘర్షణ పడుతున్న సమయంలో చట్టాలు, న్యాయ సూత్రాలు పని చేయవు. పని చేయకపోవడం ద్వారా మరో విధంగా పని చేస్తుంటాయవి.

ఉదాహరణకి అమీక్ ను కొడుతున్నా ‘ఇది రెండు చింతనలు నమ్మే సమూహాల మధ్య ఘర్షణ’ అని చెప్పి పోలీసులు చర్యలు తీసుకోరు. కానీ అదే పోలీసులు ‘కన్హైయా ప్రసంగం దేశ ద్రోహం’ అంటూ తమకు అధికారం లేని యూనివర్సిటీలో చొరబడి మరీ విద్యార్ధుల్ని లాక్కెళ్లి కేసులు పెట్టేస్తారు.

ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసులు ఒకవైపే ఉన్నారు. కానీ వారు వాస్తవంగా ఉండవలసిన చోట -బాధితుల పక్షాన- లేరు. అమీక్ బాధితుడు కానీ పాలకవర్గం కాదు. కనుక పాలకవర్గం అయిన ఎం‌ఎల్‌ఏ పక్షాన పోలీసులు నిలబడ్డారు. కన్హైయా వాస్తవానికి దేశద్రోహం నేరానికి పాల్పడకపోగా నిజమైన దేశభక్తియుత చైతన్యాన్ని ప్రదర్శించాడు. కానీ ఆయన పాలకవర్గంలో లేడు. కనుక పోలీసులు మళ్ళీ పాలకవర్గం వైపే నిలబడ్డారు.

కనుక రాజ్యాంగ యంత్రం లోని వివిధ అంగాలు ఎల్లప్పుడూ పాలకవర్గాల వైపే నిలబడి ఉంటారు. పాలకవర్గాలు తమలో తాము ఘర్షణ పడుతున్న సమయంలో ఈ అంగాలు కాస్త ప్రగతిశీలంగా కనిపించవచ్చు. కానీ అది తాత్కాలికమే. పాలకవర్గంపై సామాన్యులు తలపడినప్పుడు తప్పు పాలకులదే అయినా రాజ్యాంగ అంగాలు పాలకుల పక్షానే వహిస్తాయి. లేదంటే ఓ పక్క పాటియాలా హౌస్ కోర్టులో హిందూత్వ లాయర్లు వీరంగం ఆడుతుంటే ‘మేము ఏం చేయాలి?’ అని ప్రశ్నిస్తుందా సుప్రీం ధర్మాసనం?!

4 thoughts on “ఢిల్లీ కోర్టులో సుప్రీం కోర్టు ఆదేశాలకు దిక్కు లేదు!

 1. CIC-chief Information commission పోస్టు నియామకం త్వరలో జరగబోతుంది. ప్రస్తుత డిల్లీ పోలీసు కమీషనర్ బస్సీ, ఈ నెలాఖరుకు రిటైర్ అవుతాడు. తరువాత ఈ మహానుభావున్ని CIC పదవిలో కూర్చోబెట్ట డానికి రంగం సిద్ధం అయింది. He is one of the short listed members. ప్రభుత్వంలో జరిగే గూడుపుఠానీల్ని బయటికి తీయడంలో RTI చట్టం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో, ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ తనకు తాను బొందపెట్టుకుని డెమో ఇచ్చింది. పైగా మోడి గారు వదిలించుకున్న భార్య గారు, RTI అప్లికేషన్ల మీద అప్లికేషన్లు వేస్తున్నారాయె. ఇలాంటి పరిస్తితుల్లో CIC ఎంత కీలక పదవో చెప్పనవసరం లేదు. మరి అలాంటి పదవికి తాను ఎలా సూట్ అవుతాడో నిరూపించుకోవాల్సిన బాధ్యత బస్సీ మీద ఉంది కదా.( అఫ్కోర్స్ ఇప్పటికే ఆయన అనేక సార్లు నిరూపించుకున్నారనుకోండి, కాకపోతే అక్కడ కాంపిటీషన్ అలా ఉంది మరి).
  ఇక జడ్జి గారంటారా.. చక్కగా పనిచేస్తే, పదవీవిరమణ తర్వాత హాయిగా ఏ కేరళకో గవర్నర్ గా వెల్లి కాలక్షేపం చేయొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి.
  ఇవన్నీ చూస్తుంటే, భారత దేశానికి స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తూ, అప్పట్లో విన్స్టంట్ చర్చిల్ చెప్పిన మాటలు గుర్తుకువస్తున్నాయి. ఆహా, ఎంత కరెక్ట్ గా గెస్ చేశాడు అని. ఎంతైనా బ్రిటీషోడు బ్రిటీషోడే.
  ఇదంతా కేవలం బిగిన్నింగ్ మాత్రమే, ముందు ముందు ఇంకా చాలా చూడాల్సి ఉంటుంది.
  భారత్ మాతాకి జై.. భారత్ మాతాకి జై.. (మీరు కూడా ప్రతి పోస్టు కిందా ఇది రాస్తుండండి. ఎవరికి తెలుసు.. ఎవరో ఒక దేశభక్తుడు మన దత్తన్నకి ఫోన్ చేసినా చేస్తాడు. )

 2. ఆంజనేయులు గారు హిందూత్వ అంటే హిందూమతం అని నా ఉద్దేశం కాదు. హిందూత్వ అన్నది మన దేశంలో ఒక రాజకీయ భావజాలం. మైనారిటీలకు వ్యతిరేకంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి హిందూ మతావలంబకుల మత భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం వల్ల దేశంలో అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. ఆ అనర్ధాలకు కారణం అవుతున్న రాజకీయ భావజాలం హిందూత్వగా వాడుకలోకి వచ్చింది. వారిని మాత్రమే నేను ఉద్దేశిస్తున్నాను. హిందూ మతాన్ని కాదు.

  మతం పేరుతో జరిగే అరాచకం ఏదైనా ఖండనార్హమే. మైనారిటీ మతం అయినా సరే. మైనారిటీ మతం పేరుతో జరిగిన అరాచకాలపై కూడా విశ్లేషణలు రాశాను. మీరు చూసి ఉండకపోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s