ఏది దేశ ద్రోహం? ఏది దేశభక్తి?
నిత్యం భావ సంఘర్షణలు జరిగే సమాజంలో ఉక్కు ద్రావకాన్ని పోత పోసి ఆరబెట్టినట్లుగా దేశభక్తి, దేశద్రోహం ఉండగలవా? ఉనికిలో ఉన్న మనుషులు అందరికీ ఒకటే దేశ భక్తి, ఒకటే దేశ ద్రోహం ఉండగలవా?
మనిషి మెదడు వేనవేల ఆలోచనలకు నిలయం. మనిషి సామాజిక ఆచరణ ఎన్ని పోకడలు పోతుందో అన్ని పోకడలూ పొందగల వేలాది సంభావ్యతలు (probabilities) మనిషి మెదడులో వీరంగం ఆడుతుంటాయి.
సమూహంలోని మనుషుల సామాజిక ఆచరణలో ఉమ్మడితనం అనేది ఒకటి ఉంటుంది కనుక వివిధ వ్యక్తుల మెదళ్లపై పడే సామాజిక ఆచరణల ప్రతిబింబాలలో (ఆలోచనలు) కూడా దండలో దారంలో వలే ఒక ఉమ్మడితనం ఉంటుంది.
ఈ ఉమ్మడితనాన్ని ఆర్ధిక వర్గ జీవనం రెండుగా, అంతకంటే ఎక్కువగా కూడా విడదీసింది. సమాజంలో ఎన్ని ఆర్ధిక వర్గ సమూహాలు ఉండగలవో అన్ని ఆర్ధిక వర్గ చీలికలూ అనివార్యంగా నెలకొని ఉన్నాయి. కానీ ఈ చీలికలన్నీ తమలో తాము వైరుధ్యాలు కలిగిన రెండు శత్రు సమూహాల మిత్ర సమూహాలుగా అంతిమ పరిశీలనలో తేలుతాయి.
అనగా ఆర్ధిక పరాన్న భుక్తులు (శ్రమ చేయకుండా ఇతరుల శ్రమను దోచుకుని బతికేవారు) గా బతికే ఆర్ధిక వర్గాలు ఒక సమూహంగానూ, నిజంగా శ్రమ చేస్తూ కూడా ఆ శ్రమ ఫలితాన్ని సొంతం చేసుకోలేని ఆర్ధిక వర్గాలు మరొక సమూహంగానూ ఏర్పడ్డారు.
ఈ రెండు శత్రు శిబిరాలు ఒకటి ఉత్తరం ఐతే మరొకటి దక్షిణం. ఉత్తరం వైపు చూసేవన్నీ దక్షిణానికి వ్యతిరేకంగా చూస్తూ ఉంటాయి. దక్షిణం వైపు చూసేవన్నీ ఉత్తరానికి వ్యతిరేకంగా చూస్తూ ఉంటాయి. ఒకదానికి ప్రయోజనం అయినది మరొకడానికి ప్రయోజన విరుద్ధం.
దేశద్రోహం, దేశ భక్తి కూడా అంతే. రెండు సమూహాల్లో ఒక దానికి దేశ భక్తి అయినది మరొకడానికి దేశ ద్రోహం. ఒకదానికి దేశ ద్రోహం అయినది మరొకదానికి దేశభక్తి. కానీ ఈ రెండింటిలో సరైనది తప్పనిసరిగా ఒక్కటే అవుతుంది.
ఏది సరైనది? దేశం అంటే ప్రజలు. కనుక అశేష దేశ ప్రజానీకానికి ఏది ప్రయోజనకరమో అదే దేశభక్తి. అశేష ప్రజలకు ఏది హానికరమో అది దేశ ద్రోహం.
చిన్న ఉదాహరణ! ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలు అత్యంత సంపన్నులు. వారి నివాసాల కింద తరాలకు సరిపోయిన సంపదలు ఖనిజాల రూపంలో, వనరుల రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సంపదలను దేశ ప్రయోజనాలకు వినియోగించడమే -అందులోనూ మొదట ఆదివాసీలకు ఉపయోగపెట్టి ఆ తర్వాత ఇతర ప్రజలకు ఉపయోగపెట్టడం- నిజమైన దేశభక్తి.
అలా కాకుండా బ్రిటన్ లాంటి సామ్రాజ్యవాద రాజ్యాల నుండి నుండి వేదాంత లాంటి బహుళజాతి కంపెనీల్ని ‘రండి, రండి’ అంటూ బొట్టు పెట్టి పిలుచుకొచ్చి, ఆదివాసీల భూముల్ని, అడవుల్నీ, వనరులనీ తవ్వుకొమ్మని లక్షలాది ఎకరాలు రాసిచ్చి, ఆ భూముల నుండి ఆదివాసీలను తన్ని తగలేస్తే అది దేశద్రోహం.
మొన్నటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం, నిన్నటి నుండి మోడి ప్రభుత్వం ఈ ద్రోహానికి నిస్సిగ్గుగా పాల్పడుతున్నారు. విశాఖ మన్యం భూముల్ని వాల్ స్ట్రీట్ పెట్టుబడుల ఆదేశాలను పాటించే జిందాల్ దళారీకి అప్పజెప్పి బాక్సైట్ ఖనిజాల్ని తవ్వుకు పొమ్మని రాసిస్తే అది దేశ ద్రోహం. ఆ ద్రోహానికి టిడిపి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అదే ఆదివాసులతో కలిసి బతుకుతూ, వారి ప్రయోజనాలే లక్ష్యంగా వారి భూమి సంపదలు వారికి దక్కడమే ధ్యేయంగా పని చేస్తే అది దేశ భక్తి. గిరిజనుల సంపద ఐన బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుకుపోకుండా, వేదాంత-జిందాల్ లపై గిరిజనుల తరపున యుద్ధం చేస్తే అది నిఖార్సయిన దేశభక్తి.
మాటల్లో దేశభక్తి కురిపిస్తూ చేతల్లో, విధానాల రూపంలో దేశ సంపదలను విదేశీ కంపెనీల ఆరగింపుకు వడ్డించడం అచ్చమైన దేశ ద్రోహం.
“నక్సలైట్లే నిజమైన దేశ భక్తులు!” ఈ మాట అన్నది గిరిజనులు మాత్రమే కాదు. భూమి లేని పేద జనులు మాత్రమే కాదు. ఇది మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పాపులర్ నినాదం. అప్పుడప్పుడూ పై వర్గాలు తమ అవసరాల కోసం ఇలాంటి వాస్తవాల్ని ఏమరుపాటుగా అంగీకరిస్తూ ఉంటారు.
అలాంటి దేశభక్తులు జేఎన్‌యూ, UoH విద్యార్ధి ఉద్యమాల్లో చొరబడ్డారని కేంద్రం ఆరోపిస్తున్నది. వారికి నక్సలైట్లు అని ఎప్పుడో పేరు పెట్టేశారు.
రాజ్ నాధ్ సింగ్, ఏబివిపి, బండారు దత్తాత్రేయ, సుబ్రమణ్య స్వామి, ఆర్‌ఎస్‌ఎస్, మేడమ్ (మను)స్మృతి ఇరానీ (జేఎన్‌యూ విద్యార్ధులు ఈ బిరుదును ప్రచారంలోకి తెచ్చారు), వెంకయ్య నాయుడు ఇత్యాదిగా గల వ్యక్తులు సంస్ధలు చెబుతున్న దేశభక్తి ఏమిటో ఈ పాటికి అర్ధమై ఉండాలి.
కన్హైయా మాట్లాడింది దేశ ద్రోహం అని కేంద్ర ప్రభుత్వం అనడం ఈ కోవలోనిదే. సాక్షాత్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ గారే దేశ ద్రోహం ఆరోపణ చేశారు. ఢిల్లీ పోలీసులను ఆదేశించి జేఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడిపైన దేశద్రోహం కేసు మోపి అరెస్టు చేయించారు.
జేఎన్‌యూ లో అఫ్జల్ గురు సంస్మరణలో వామపక్ష విద్యార్ధి సంఘాలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ‘దేశ ద్రోహం’, ‘జాతీయ-వ్యతిరేకం’, ‘ఉగ్రవాదం’ లేబుళ్లను తగిలించడం వల్ల కేంద్రంలోని మోడి ప్రభుత్వానికి (వారి ద్వారా భారతీయ బడా పెట్టుబడుదారులకు, బడా భూస్వాములకూ ఈ రెండు వర్గాల యజమానులైన విదేశీ సామ్రాజ్యవాదులకు) రెండు ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకటి: మోడి విఫల వాగ్దానాలు చర్చలోకి రాకుండా ప్రజల దృష్టిని మళ్లించడం.
***స్టాక్ మార్కెట్లు మోడి అధికారంలో వచ్చిన నాటికంటే తక్కువ స్ధాయికి పడిపోయాయి. మోడి అధికారం చేపట్టేనాటికి 25,000 పాయింట్లకు దగ్గరలో ఉన్న సెన్సెక్స్ సూచీ ఒక దశలో 29,000 పాయింట్ల వరకు పెరిగింది. ఈ పెరుగుదల మోడీ చలవే అంటూ కీర్తనలు పాడారు.
ఇంతలోనే మార్కెట్లు దభేల్ మని కూలిపోయాయి. ఈ కూలిపోత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బిఎస్‌ఈ సెన్సెక్స్ 23,500 వద్ద బిక్కు బిక్కు మంటోంది. బహుశా కొద్ది నెలల్లో 20,000 దిగువకు పడిపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ కూలుడు ఎవరి చలవో చెప్పుకోలేని పరిస్ధితిలో మోడి ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది.
***కంపెనీల కోసం మోడి తెస్తానన్న సంస్కరణలు దరి చేరే దారి కానరావడం లేదు. కాంగ్రెస్ సహాయ నిరాకరణ వల్ల జిఎస్‌టి బిల్లు మూలనే ఉండిపోయింది. పశ్చిమ పెట్టుబడిదారులకు నమ్మకంగా వాగ్దానాలు ఇచ్చిన మోడి తన వాగ్దానాలు గట్టు దాటించే బలం రాజ్యసభలో లేకపోవడంతో గొంతు పెగలకుండా పోయింది.
***గ్యాస్ సబ్సిడీ తగ్గించేశారు. రేషన్ కార్డులు తగ్గించే చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. సీజన్ కూరగాయల ధరలు కూడా విపరీత స్ధాయిలో ఉంటున్నాయి. పప్పులు, ఉల్లి లాంటి నిత్యావసరాల ధరలు అందుబాటులో లేని పరిస్ధితి.
***జిడిపి వృద్ధి రేటును ఆకాశ వీధిలో విహరింపజేస్తాననీ మోడీ హామీ ఇచ్చారు. ఏం చేసినా చెయ్యకపోయినా జిడిపి అంకెల్ని పెరిగేలా చేస్తే ఆ అభివృద్ధి ఆటోమేటిక్ గా ప్రజలకు చేరుతుందని అరచేతిలో స్వర్గం చూపారు. అసలు ఇప్పటికే జిడిపి వృద్ధి రేటు మేఘాలపై ప్రయాణం చేస్తోందనీ, చైనాను మించిపోయిందని, ప్రపంచం అంతా మాంద్యం ఎదుర్కుంటుంటే ఇండియా మాత్రమే అతి వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన ఈ మాటలు చెప్పారు.
కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నది. జిడిపి వృద్ధి రేటు పెంచడానికి ఎవరూ సాహసించని చర్యను ప్రధాని మోడీ తీసుకున్నారు. దానివల్ల జిడిపి నిజంగా పెరగకుండానే కాగితాలపై 2 నుండి 3 పాయింట్ల వరకు పెంచి చూపే అవకాశం దక్కించుకున్నారు. జిడిపి వృద్ధి శాతాన్ని కొలిచే ఆధార సంవత్సరాన్ని 1990 ల ధరల నుండి 2000 సం. ధరలకు ముందుకు జరపడంతో జిడిపి వృద్ధి రేటు అమాంతం కృత్రిమంగా పెరుగుదల నమోదు చేసింది. వాస్తవానికి ఇండియా ఆర్ధిక వ్యవస్ధ రిసెషన్ (ఆర్ధిక మాంద్యం) లో జారిపోయిందని ఆర్ధిక పరిశీలకులు భావిస్తున్నారు.
***అమెరికా, ఐరోపా రాజ్యాలలో ఆర్ధిక సంక్షోభం ఏ మాత్రం తెరిపిడి పడకపోవడం వల్ల అక్కడకు వెళ్ళే మన ఎగుమతులకు మార్కెట్ బాగా పడిపోయింది. దానితో ఇండియా ఉత్పత్తి సైతం పడిపోతోంది. అనగా జిడిపి క్షీణిస్తోంది. క్షీణిస్తున్న జిడిపిని ఎలాగో తిప్పలు పడి పెరుగుతున్నట్లు చూపుతున్నారు. అంత చేస్తున్నా విదేశాల్లోని పరిస్ధితుల వలన అది కూడా చాలడం లేదు.
***స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఇప్పుడు తలచుకున్నవారు లేరు. ఫోటో సెషన్ల వరకే పరిమితం అయిన ఈ నినాదం ఒట్టి ఖాళీ నినాదమేనన్న సంగతి జనానికి అర్ధం అయింది.
***మేక్ ఇన్ ఇండియా కు స్పందన లేదు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అనడమే గానీ వచ్చిన దాఖలాలు లేవు. కార్మిక చట్టాల్ని కాలరాసినా ఎఫ్‌డిఐలు కనికరం చూపడం లేదు. స్టార్టప్ ల కోసం 10,000 కోట్లు తీసి పక్కన పెడుతున్నామని చెప్పినా విదేశీ ఔత్సాహికులు ఆ వైపు చూడడం లేదు. బెంగుళూరులో భారతీయ ఔత్సాహికుల స్టార్టప్ లు కొత్తవి కాదు. మోడి స్టార్టప్ పధకానికి ముందు నుండీ అవి ఉన్నవే.
ఈ నేపధ్యంలో మన ఆర్ధిక బలహీనత మరింతగా బైటపడిపోతోంది. జనానికి తెలిసిపోయే విధంగా ఆర్ధిక బలహీన పరిస్ధితులు వెల్లడి అవుతున్నాయి. ఈ కారణాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా మోడీ పాలనపై పెట్టుకున్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. భ్రమలు తొలగిపోతున్న పరిస్ధితిని ఢిల్లీ, బీహార్ ల ఓటమి బహిరంగంగా ధృవపరిచాయి.
మోడి అట్టహాసంగా చేసిన వాగ్దానాలు కేవలం వాగ్దానాలు మాత్రమేనని ఈ కారణాలు రుజువు చేస్తున్నాయి. రైతులు, కూలీలు, కార్మికులు, ఉద్యోగులు… ఇలా ఏ రంగం తీసుకున్నా ఆదాయాలు పడిపోయి దానివల్ల వినియోగం పడిపోయి ఉత్పత్తి పడిపోతున్నది.
మోడి ప్రభుత్వ వైఫల్యాల వల్ల త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతికూల ఫలితం దాదాపు రాసి పెట్టబడింది. కనుక మోడి వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించాలి.
ప్రధాన సమస్యల నుండి దృష్టి మరల్చేందుకు వారి ఎదుట సరికొత్త సమస్యలు తెచ్చి నిలపడం అనాదిగా పాలకవర్గాలు ఆడుతున్న వికృత క్రీడ. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ సాగించిన ఈ క్రీడను బిజేపి అందిపుచ్చుకుంది.
దారి మళ్లింపులో ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. పాలకపక్షం తెచ్చి పడేస్తున్న సమస్యలలో ఈదుతూ ఓట్లు సంపాదించుకునే మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఓట్ల వికేంద్రీకరణలో (polarisation) భాగం పంచుకుంటున్నాయి.
పాలనపై దృష్టి పెట్టేవారు రోహిత్, జేఎన్‌యూ లాంటి తేనెతుట్టె సమస్యలను తెలిసి తెలిసి కెలకరు, దానివల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటే తప్ప. రోహిత్ ఆత్మహత్య ద్వారా తలెత్తిన సమస్య అత్యంత సున్నితమైనది. ఏ పాలక పార్టీ కెలకడానికి సాహసం చేయలేని సమస్య.
అలాంటి సమస్యను రేపడానికి కూడా బిజేపి సిద్ధపడింది. అంతే కాకుండా రోహిత్ సమస్య ఎదురైన కొద్ది రోజుల్లోనే తిరిగి అదే తరహా సమస్యను కేంద్ర మంత్రులే స్వయంగా జేఎన్‌యూ లో రేపారు.
ఇలాంటి తెంపరితనానికి పాల్పడేందుకు తగిన భూమికను బిజేపికి దాని సైద్ధాంతిక అవగాహనయే సమకూర్చుతోంది. మితవాద, మతఛాందసవాద శక్తులకు మరో నమ్మకమైన ఓట్ల సంపాదన మార్గం లేదు. వాజ్ పేయి వలే మధ్యేవాద పొజిషన్ ను తీసుకునే అవకాశం మోడి నడిచి వచ్చిన దారి అంత తేలికగా ఇవ్వదు. ఆ ప్రయత్నం చేసి విఫలం అయిన ఎల్ కె అద్వానీ ఒక గుణపాఠంగా ఎలాగూ కళ్లెదుట ఉన్నారు.
రెండు: హిందూత్వ జాతీయవాదం సారాంశంగా కలిగిన మిత-అతివాదం నుండి తొలగిపోలేదని రుజువు చేసుకునే ప్రయోజనాన్ని ‘దేశ ద్రోహం’ కేసు ద్వారా పొందడం.
యూనివర్సిటీలో కన్హైయా స్పీచ్ ఇచ్చారని, అందులో పాక్ కి అనుకూలంగా ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారని ఆయనకి రాజ్ నాధ్ సింగ్ కు ఎలా తెలిసింది? బిజేపి ఎంపి ఒకరు ఫిర్యాదు చేయగా తెలిసింది. బిజేపి అనుబంధ విద్యార్ధి సంఘం ఏబివిపి సభ్యులు చెప్పగా తెలిసింది.
బహుశా JNU స్టూడెంట్స్ యూనియన్ నేతకు ఆపాదించబడిన నినాదాల వీడియో ఇంటర్నెట్ లో వేగంగా వ్యాప్తి చెందడం వల్ల కూడా తెలిసి ఉండవచ్చు. ఒక వీడియో సృష్టించి ఇంటర్నెట్ లో ప్రచారంలో పెట్టడం ఇప్పుడు అంత కష్టం కాదు. అలాంటి వీడియోను నమ్మి పేరు పొందిన యూనివర్సిటీ విధార్ధి సంఘం అధ్యక్షుడిని ‘దేశద్రోహి’ అని ముద్ర వేయడం ఒక దేశ ప్రభుత్వానికి అంత తేలిక కావడం నిజంగా దురదృష్టకరం.
ఆ మరుసటి రోజే ఏబివిపి విద్యార్ధులే పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఇస్తున్న వీడియో ఇంటర్నెట్ లో పోస్ట్ అయింది. ఆ వీడియోను జీ టివి వార్తా సంస్ధ కూడా ప్రచారం చేసింది. ఈ వీడియోలోని వ్యక్తులు ‘దేశ ద్రోహులు’ కాదా మరి? ఆ వీడియో ఫేక్ అని ఏబివిపి ప్రకటించింది కనుక అరెస్టులు జరగలేదా? అయితే తాము నినాదాలు ఇవ్వలేదని స్టూడెంట్స్ యూనియన్ కూడా ప్రకటించింది కదా? కన్నయ్యను నమ్మని కేంద్రం ఏబివిపి ని ఎలా నమ్ముతుంది?
బిజేపి ఎంపి ఫిర్యాదు, రాజ్ నాధ్ సింగ్ ఆరోపణ, ఆరోపణకు ఆయన ఇచ్చుకున్న సమర్ధన… ఇవన్నీ నిజమే అన్నట్లుగా ఆంగ్ల, హిందీ ఛానెళ్లు మెజారిటీ కన్హైయా ప్రసంగంలో కొంత భాగాన్ని -కేంద్ర ప్రభుత్వ ఆరోపణలకు తగ్గట్టుగా- కొద్ది భాగాన్ని కత్తిరించి ప్రదర్శించాయి. లేదా ప్రసారం చేశాయి.
బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వ అవసరాలకు తగినట్లుగానే కొన్ని పత్రికలు, ఛానెళ్లు ఈ విధంగా కత్తిరించిన, కావలసిన అర్ధం వచ్చే వీడియోలను ప్రసారం చేశాయి. అనగా కేంద్ర ప్రభుత్వ పార్టీ అవసరాలను అవి తీర్చాయి. వాస్తవాలను ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్ చేయాల్సిన పత్రికలు వివిధ పార్టీలకు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్న దయనీయ స్ధితికి ఇది తార్కాణం. వారి ప్రచారం వల్ల విద్యార్ధుల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిసినా వారికి అనవసరం.
ఈ ప్రచారం అంతా బిజేపి మిత-అతివాద ముద్రను బలీయం చేయడానికి ఉద్దేశించినది. జేఎన్‌యూ వీడియోపై కేంద్ర హోమ్ మంత్రి ‘సహించం’ అంటూ ప్రకటన చేయడం తోనే ‘ముద్ర బలీయం’ కార్యక్రమం మొదలైపోయింది.
హిందూత్వ జాతీయవాదం పరిధిలో భారత దేశంలో ఒక సుస్ధీరమైన ఓటు బ్యాంకు ఏర్పడి ఉన్నది. ప్రధానంగా అగ్రకులాల ప్రజలు ఈ ఓటు బ్యాంకులో ఉన్నారు. ఎఫ్‌డిఐలను బహిరంగంగా చట్టాలు చేసి మరీ ఆహ్వానించడం వల్ల ఈ ఓటు బ్యాంకుకు చిల్లి పడవచ్చు.
చివరికి ఆర్‌ఎస్‌ఎస్ సైతం విదేశీ పెట్టుబడులకు మద్దతు ప్రకటించిన నేపధ్యంలో హిందూత్వ స్వదేశీ నినాదంలో పస లేదని, అది ఆచరణ కోసం ఇచ్చిన నినాదం కాదనీ ఈ హిందూత్వ ఓటు బ్యాంకుకు కూడా తెలిసి వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మల్లెనే ఓట్ల కోసం జాతీయవాద సెంటిమెంట్లు ప్రకటిస్తూ విధానాల అమలులో అందుకు విరుద్ధంగా పాలించడానికి బిజేపి కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని వారికి తెలుస్తున్నది.
అసలు సంగతి తెలిసిపోతే ఎలా? హిందూత్వ ఓటు బ్యాంకు చెదిరి పోతుంది. కాబట్టి తాము హిందూత్వను వదిలిపెట్టలేదని హిందూత్వ ఓటు బ్యాంకుకు మరోసారి బల్ల గుద్ది చెప్పాలి. రాబోయే రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ అవసరం ఇంకా తరుముకుని వచ్చింది. సారం లేకపోయినా సరే, ‘దేశభక్తి’ సెంటిమెంట్లు రెచ్చగొట్టడం కంటే మించిన ‘బల్ల గుద్దుడు’ మరేం ఉండగలదు?
అసలు సెడిషన్ కేసు పెట్టడమే అన్యాయం అని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో తప్పు పడుతుంటే ఆ కేసు విచారణకు వచ్చిన కోర్టు ఆవరణలోనే నల్ల కోట్లు తగిలించుకున్న హిందూత్వ గూండాలు విద్యార్ధులు, విలేఖరులపై భౌతిక దాడికి తెగబడడం ఎలా సాధ్యం అవుతుంది? అదీ కొద్ది రోజుల్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉండగా!
లాయర్ దుండగులు తమ కళ్లెదుటే వీరంగం వేస్తున్నా ఢిల్లీ పోలీసులు చోద్యం చూస్తూ నిలబడిపోవడం, అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం వెనుక చీకటి ఆదేశాలు లేకపోతేనే ఆశ్చర్యం! సారం ఏ మాత్రం లేని దేశభక్తి-దేశద్రోహం చర్చను రగల్చడానికి ఒక పద్ధతి ప్రకారం కృషి చేస్తుంటే తప్ప ఇలాంటి ఘటనలు వరుసగా జరగవు. ఈ రగడ ప్రధానంగా బిజేపి రాజకీయ ప్రయోజనాలనే నెరవేర్చబోతున్నది.
ఇలాంటి వ్యూహానికి జేఎన్‌యూ విద్యార్ధులు తమకు తెలియకుండానే పావులు అయ్యారు. అఫ్జల్ గురు ఉరితీత ను సంస్మరించడం కంటే మించిన అత్యవసరమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణల పైన ఏ రూపం లోనైనా విద్యార్ధులను, తద్వారా దేశ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను వారు చేపట్టి ఉండవచ్చు.
కానీ AISF, SFI సంఘాలు ఆ పని చేయలేవు. పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలు ఓడిపోయిన కారణం సిపిఐ, సిపిఎం పార్టీలు అనుసరించిన అదే తరహా విధానాలే. కనుక ఆ వైపుగా వారి చూపు వెంటనే ప్రసరించదు. సంస్కరణల ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్ధులో చైతన్యాన్ని రగిల్చితే అది రేపు బెంగాల్ ఎన్నికల్లో తమకే ఎదురు తిరగడం ఖాయం.
అఫ్జల్ గురు ఉరితీతపై నిరసన చేయడంలో ఎంతమాత్రం తప్పు లేదు. కానీ దానికి మించిన సమస్యలు దేశ ప్రజలని పీడిస్తూ ఉండగా వాటిని వదిలి తక్షణ సమస్య కానటువంటి, పైగా బిజేపికి లాభించేటటువంటి సమస్యపై జేఎన్‌యూ విద్యార్ధులు తమ శక్తులను వృధా చేసుకోవలసిన అవసరం లేదు.
కానీ సమస్య మొదలైపోయింది. ఇప్పుడు వెనక్కి మళ్లే పరిస్ధితి కాదు. భావ ప్రకటన హక్కు తక్షణ సమస్యగా ముందుకు వచ్చింది కనుక విద్యార్ధుల పోరాటం కొనసాగాల్సిందే.
ఐతే జరిగింది ఏమిటో రేపైనా సమీక్ష చేసుకోవాలి: అఫ్జల్ గురు కార్యక్రమం దరిమిలా జేఎన్‌యూ విద్యార్ధులు కేంద్రంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న చర్చ విజయవంతంగా ప్రజల సమస్యలపై నుండి దృష్టిని మరల్చింది. రానున్న ఎన్నికల్లో ఇక ఆర్ధిక విధానాలు, వాటి ఫలితాలపై చర్చ ఉండదు. మోడి వైఫల్యాలపై చర్చ ఉండదు. ఒకవేళ ఉన్నా అప్రధానంగానే ఉంటుంది. తక్షణం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టగల ‘దేశ భక్తి-దేశ ద్రోహం’ చుట్టూనే చర్చ తిరుగుతుంది.
ఈ చర్చ ఒకవైపు బిజేపి ఓటు బ్యాంకును మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకును సుదృఢం చేసేందుకు మాత్రమే దోహద పడుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న దరిద్రం, నిరుద్యోగం, ప్రయివేటీకరణ, విదేశీ కంపెనీల దోపిడీ… ఇవేవీ చర్చకు రాకుండానే రాజకీయ పార్టీలు తప్పుకునేందుకు ఒక బీజం జేఎన్‌యూ లో పడిపోయింది.
జిడిపి, ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, ధరలు… ఈ అంశాల చుట్టూనే నరేంద్ర మోడి గత ఎన్నికల ప్రచారం సాగింది. ఈ అంశాలపైనే ఆయన ప్రధానంగా వాగ్దానాలు చేశారు. కానీ ఆ వాగ్దానాల అమలు చర్చకు రాకుండానే మరో ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించుకునే అవకాశాన్ని బిజేపి, మోడిలకు అఫ్జల్ గురు రగడ ఇచ్చింది.
నూటికి నూరు పాళ్ళూ నిజం
ఈ వ్యాసం నెల విడిచి సాము చేసింది… సంక్షిప్తత , స్పష్టత ఉండుంటే బాగుండేది వి.శేకర్ గారు .
శివమురళి గారూ, మీ వ్యాఖ్యలో రెండో భాగం అర్ధం అయింది. దృష్టిలో ఉంచుకుంటాను. కానీ మొదటి భాగం సరిగ్గా అర్ధం కాలేదు. మీ అభిప్రాయాన్ని కాస్త వివరించండి.
you took a correct turn in analysing the situation, unlike Nara Rohit issue analysis. I fed up the way you analysed and supported the issue. this analysis tried to unearth the issues behind the curtain. some facts we came to know that Govt changed base year, stock exchanges sensex is at 23500 and some other points, dont you feel that stock exchange fluctuate with other international issues.
Hi Gopinadh,
I didn’t analyze any Nara Rohith issue. You must mean Rohith Vemula.
Correctness of my analysis depends on facts and socio-economic conditions around the incident. It doesn’t depend upon whether you agree with it or not.
I have no doubt that Rohith Vemula issue is a dalit issue. His death was an institutional murder perpetrated by Hindutva state. I stand by my reasons and analysis.
You have to understand that I stand with JNU students also. My only concern is that there are other burning issues than Afzal Guru. My support is with them when they express protest against death sentence brought upon Guru without any material evidence (as per judgement).
Afzal was sentenced ‘to satisfy the collective conscience of the nation’ but not because of the material evidence. As per several judgements given by the Supreme Court, circumstantial evidences do not suffice for conviction, that too for death sentence, unless they are supported by material evidences.
I wrote this already and you people chose to look the other side. You have some prejudices and you people expect me to follow your prejudices. I can’t do that, you know! I follow facts but not anybody. You may like it or dislike it. That is up to you. You people have your right to express your opinion after all! But you cannot teach me what to write, what way to analyze… and all that. Kindly be advised.
“మోడి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణల పైన ఏ రూపం లోనైనా విద్యార్ధులను, తద్వారా దేశ ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను వారు చేపట్టి ఉండవచ్చు.
కానీ AISF, SFI సంఘాలు ఆ పని చేయలేవు. పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలు ఓడిపోయిన కారణం సిపిఐ, సిపిఎం పార్టీలు అనుసరించిన అదే తరహా విధానాలే. కనుక ఆ వైపుగా వారి చూపు వెంటనే ప్రసరించదు. సంస్కరణల ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్ధులో చైతన్యాన్ని రగిల్చితే అది రేపు బెంగాల్ ఎన్నికల్లో తమకే ఎదురు తిరగడం ఖాయం.”
ఇంతకంటే విషాదం ఇంకేం ఉంది? కాంగ్రెస్, బీజేపీలు సరేసరి… వామపక్షాలు కూడా … వోట్ల పోలరైజేషన్ కోసమే పని చేస్తుంటే…ఎవరి వైపు మనం ఆశగా చూడాలి?
శేఖర్ గారు,
మీ మీద చాలా అభిమానంలా ఉంది సంఘ్ పరివారానికి -మీ బ్లాగ్ ను వారే ఎక్కువ చూస్తున్నారు కాబోలు. నేను చాలా రోజులనుండి ఫాలో అవుతున్నాను. ఒక్క సారన్నా వారికి అనుకూలంగా రాస్తారేమోనని వారు ప్రాదేయపడుతున్నారు. పాపం వారి ఆశను అడియాస చేస్తున్నారు మీరు. రోహిత్ వేముల మీద విదేశాల్లోనుండి కూడా విరుచుకపడినారు.
What about anti-India slogans they made. You did not even mention about them.
JNU లో అసలు సభ నిర్వహించింది ప్రో మావోఇస్టు విద్యార్థి సంఘం DSU. కాగా మీరు AISF, SFI లను బాధ్యులుగా చేయడం ఏవిధంగా సరియైనది?
అశోక్ గారూ, అవును, సభ నిర్వహించింది DSU. AISF, SFI లు సభ జరిపినట్లుగా అర్ధం స్ఫురిస్తే అది కరెక్ట్ కాదని ఈ వ్యాఖ్య ద్వారా చెబుతున్నాను.
విద్యార్ధి సంఘం ఎన్నికల్లో గెలిచిన SFI, AISF లకు కేంద్ర ఆర్ధిక విధానాలపై పోరాడగల రాజకీయాలు లేవన్నది మాత్రం నిజం.
నాకు తెలిసినంత వరకు మావోయిస్టు రాజకీయాలు కూడా ‘పాకిస్తాన్ జిందాబాద్’, ‘భారత్ ని ముక్కలు చేస్తాం’ అన్న నినాదాల్ని అంగీకరించవు. కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కుని వారి రాజకీయాలు గుర్తిస్తాయి కానీ దేశాన్ని ముక్కలు చేయాలనడం వారి రాజకీయాలు కాదనుకుంటాను.
ఒక్క మావోయిస్టులే ఏం ఖర్మ, ఐక్య రాజ్య సమితి కూడా జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తిస్తుంది. అంతెందుకు! మన ప్రధమ ప్రధాని నెహ్రూ కూడా గుర్తించారు. కనుకనే ఫ్లెబిసైట్ వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని ఆయన అమలు చేయకపోవడం వేరే విషయం.
పై నినాదాలు ఉద్దేశ్యపూర్వకంగా ఇచ్చినవి. అక్కడ జరిగిన కార్యక్రమానికి దేశ వ్యతిరేక రంగు పులమడానికి తద్వారా విశ్వ విద్యాలయాల్లో హిందూత్వ అనుకూల వాతావరణం ఏర్పడేలా చేయడానికి ఒక డిజైన్ తో ఇచ్చిన నినాదాలవి.
SFI కేంద్ర ఆర్థిక విధానాలతో పోరాడటం లేదనడాన్ని నేను ఒప్పుకోలేక పోతున్నాను. మేం మొదటినుండి ఈ విధానాలను మాకు సాధ్యమైనంత వరకు వ్యతిరేకిస్తూ వస్తున్నాం అని అనుకుంటున్నాను.