మోడి పాస్ పోర్ట్: యశోదాబెన్ ఆర్‌టి‌ఐ దరఖాస్తు


Jashodaben

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన భార్యగా ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న శ్రీమతి యశోదా బెన్ కు తమ పెళ్లి నిజంగానే జరిగిందని రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిపడింది.

శ్రీమతి యశోదా బెన్ ను తన భార్యగా ప్రధాన మంత్రి పేర్కొన్న సంగతి పత్రికల ద్వారా తెలియడమే. అంతే తప్ప వాస్తవంగా పెళ్ళి జరిగిందని రుజువు చేసే రికార్డులు శ్రీమతి యశోదా బెన్ వద్ద లేవని ఆమెకు ఎదురయిన తాజా పరిస్ధితి ద్వారా అర్ధం అవుతున్నది.

బహుశా కనీసం పెళ్ళి నాటి ఫోటోలు కూడా లేకపోయి ఉండాలి.

ప్రధాన మంత్రి భార్య శ్రీమతి యశోదా బెన్ పాస్ పోర్ట్ కోసం అహ్మదాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆమె దరఖాస్తును ప్రాసెస్ చెయ్యడానికి పాస్ పోర్ట్ కార్యాలయం వాళ్ళు తిరస్కరించారు.

తిరస్కరణకు కారణం ఆమె తన భర్తగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని పేర్కొంటూ అందుకు మద్దతుగా తగిన పత్రాలను సమర్పించలేకపోవడం.

నిబంధనల ప్రకారం పాస్ పార్ట్ జారీ చేయడానికి భార్యా భర్తలు తమ పెళ్లిని రుజువు చేసే పత్రాలు సమర్పించాలి. అవి లేకపోతే ఇద్దరు కలిసి ఉమ్మడి అఫిడవిట్ ని అయినా సమర్పించాలి.

ఇవేవీ లేకపోవడంతో యశోదా బెన్ పాస్ పోర్ట్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించామని అహ్మదాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం అధికారి జెడ్ ఏ ఖాన్ చెప్పారని పత్రికలు తెలిపాయి. (ది హిందు, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఐ‌బి‌ఎన్ లైవ్, ఫస్ట్ పోస్ట్)

పి‌టి‌ఐ వెలికి తీసిన ఈ సమాచారాన్ని దాదాపు పత్రికలన్నీ ప్రచురించాయి. కానీ ఈ వార్త ముక్తసరిగా ఉన్నది తప్ప తగిన వివరాలు ఇవ్వలేదు.

Narendra Mముక్తసరి సమాచారం ప్రకారం: యశోదా బెన్ పాస్ పోర్ట్ దరఖాస్తును సంబంధిత అధికారులు తిరస్కరించారు. పెళ్లి జరిగిందని తెలిపే పత్రాలు గానీ, ఉమ్మడి అఫిడవిట్ గానీ ఆమె ఇవ్వకపోవడం తిరస్కరణకు కారణం. దానితో ఆమె ‘అయితే ముఖ్యమంత్రిగా ఉండగా తన భర్త సంపాదించిన పాస్ పోర్ట్ వివరాలు ఇవ్వాలని ఆమె కోరారు.

మోడి మొదటి పాస్ పోర్ట్, రెన్యువల్ చేసిన పాస్ పోర్ట్, ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన పాస్ పోర్ట్… ఈ పత్రాల కాపీలు ఇవ్వాలని ఆమె తన దరఖాస్తులో కోరారు. పాస్ పోర్ట్ కోసం మోడి చేసిన దరఖాస్తులు, వాటితో పాటు ఇచ్చిన మద్దతు పత్రాల కాపీలు కూడా ఇవ్వాలని ఆమె కోరినట్లు ఆమెతో పాటు వచ్చిన బంధువు చెప్పారు. (టి‌ఓ‌ఐ)

ప్రధాని మోడి పాస్ పోర్ట్ వివరాల వల్ల ఆమెకు ఏమిటి ప్రయోజనం?

తనలాగే ప్రధాన మంత్రి మోడీ కూడా. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్ర మోడి పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేశారు. ఆయనకు పాస్ పోర్ట్ ఇచ్చారు కూడా. అప్పుడు ఆయన తనకు పెళ్లి అయిందని చెప్పి ఉండాలి. (కాలేదని కూడా చెప్పి ఉండొచ్చు. ఆ సంగతి తర్వాత చూద్దాం). అలా చెబితే తగిన పత్రాలు సమర్పించి ఉండాలి.

తగిన పత్రాలు అంటే, పైన చెప్పినట్లు తనకు, యశోదా బెన్ కు పెళ్లి జరిగిందని రుజువు చేసే పత్రాలు; లేదా ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఇచ్చే అఫిడవిట్! రెండోది సాధ్యం కాదు. ఎందుకంటే తాను, తన భర్త కలిసి ఉమ్మడి అఫిడవిట్ లాంటిది ఎప్పుడూ ఇవ్వలేదు గనుక. మిగిలింది పెళ్లిని రుజువు చేసే పత్రాలు. వాటిని ఆర్‌టి‌ఐ ద్వారా సంపాదిస్తే తనకూ పాస్ పోర్ట్ వస్తుంది.

పెళ్ళికి సంబంధించి ఏ పత్రాలూ ఇవ్వకపోయినా నరేంద్ర మోడీకి పాస్ పోర్ట్ ఇస్తే? అలా ఇచ్చి ఉంటే అది నిబంధనలకు విరుద్ధం. ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఒంటరిగా ఉన్నా ఆయనకు పాస్ పోర్ట్ దక్కగా లేనిది ఒంటరిగా ఉన్న తనకు ఎందుకు ఇవ్వరు? ఇది శ్రీమతి యశోదా బెన్ పరోక్షంగా వేస్తున్న ప్రశ్నల్లో ఒకటి.

గత సాధారణ ఎన్నికల ముందు వరకు బి‌జే‌పి కార్యకర్తలు ప్రచారం చేసినట్లుగా ‘నాకు పెళ్లి కాలేదు, బ్రహ్మచారిని’ అని అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటే, అందువల్లనే ఆయనకు పాస్ పోర్ట్ దక్కి ఉంటే గనక ఇప్పటి ప్రధాన మంత్రికి గట్టి చిక్కే వచ్చిపడుతుంది.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ‘నాకు పెళ్లి కాలేదు’ అని చెప్పిన నరేంద్ర మోడి ప్రధాన మంత్రి కాబోయే తరుణంలో ‘నాకు పెళ్లి జరిగింది. ఆమె పేరు యశోదా బెన్’ అని పేర్కొనడం జనులకు రుచించని విషయం. ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అబద్ధం చెప్పినట్లు అవుతుంది.

ఈ వ్యవహారంలో అనేక చిక్కులు కనిపిస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి ఏమి చెప్పి ఉంటారన్న అంశంపై ఆధారపడి ఈ చిక్కులు వివిధ రూపాల్లో ముందుకు వస్తున్నాయి.

1. పెళ్లి జరిగిందని చెప్పినా మోడి నుండి తగిన పత్రాలను పాస్ పోర్ట్ అధికారులు అడగకపోతే అది వారి తప్పు కాగలదు. ముఖ్యమంత్రికి ఒక నిబంధన, సామాన్య మహిళకు మరొక నిబంధన అమలు చేసినట్లే.

2. యశోదా బెన్ ఆర్‌టి‌ఐ దరఖాస్తు ఫలితంగా పెళ్లిని రుజువు చేసే పత్రాల నకళ్లు ఆమెకు దక్కితే, అసలవి ఆమెకు అందుబాటులో లేకుండా ఎందుకు పోయాయన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మోడి తన పెళ్లి రోజుల ఆరంభం లోనే దేశ సేవ కోసం ఒంటరిగా వెళ్ళిపోయారు. కనుక ఆయన వద్ద పెళ్ళికి సంబంధించిన జ్ఞాపకాలు, గుర్తులు, పత్రాలు, సాక్షాలు ఏవీ ఉండవు. ఉండకూడదు కూడా. ఎందుకంటే ఆ రుజువులు ఆయన ఇమేజికి భంగం. సంసార జంఝాటం వద్దనుకుని దేశసేవలో మునిగిపోయిన హిందూ జాతీయవాదికి పెళ్లినాటి ప్రమాణాలతో, రుజువులతో ఏమి పని ఉంటుంది గనుక?

3. పెళ్లి రుజువులు ఏమీ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. అంటే,  బ్రహ్మచారి అని చెప్పి ఉండాలి. లేదా పెళ్లి పత్రాల కోసం అధికారులు ఒత్తిడి చేయకపోయి ఉండాలి. ఇది మళ్ళీ 1 పరిస్ధితికి దారి తీస్తుంది. బ్రహ్మచారి అని చెప్పి ఉంటే ఆయన అబద్ధం ఆడినట్లే.

మనలో మాట! ముఖ్యమంత్రి స్ధాయిలోని శక్తివంతమైన వ్యక్తికి తన పెళ్లి రుజువులు సమర్పించడం ఒక లెక్కా చెప్పండి. ఏవో రుజువులు తెచ్చి ఇవ్వడం పెద్ద విషయం కాదు. అవే రుజువులు యశోదా బెన్ కు ఆటోమేటిక్ గా అప్లై చేసి ఉంటే బహుశా ఈ చిక్కులు ఉండేవి కావు.

కారణాలు ఏవైనా అందుకు అధికారులు సిద్ధపడలేదు. నిబంధనల ప్రకారం శ్రీమతి యశోదా బెన్ ను రుజువులు అడిగారు. ఆమె వద్ద అవి లేవు. ఫలితంగా ఆర్‌టి‌ఐ ని ఆమె ఆశ్రయించక తప్పలేదు.

ఆర్‌టి‌ఐ ని ఆశ్రయించడం శ్రీమతి యశోదా బెన్ కు ఇదే మొదటిసారి కాదు. తన భద్రతా వివరాలను తెలుసుకోవడానికి ఆమె ఆర్‌టి‌ఐ ద్వారా మూడుసార్లు ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.

తాను సామాన్యురాలిగా బస్సుల్లో ప్రయాణిస్తుంటే తనకై ఏర్పాటు చేసిన 10 మంది గార్డులు ప్రభుత్వ వాహనాల్లో రావడం ఆమెకు నచ్చలేదు. పైగా సెక్యూరిటీ గార్డులే మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చంపేశారు గనుక ఈ గార్డుల వల్ల తనకు ముప్పు పొంచి ఉందని తాను భయపడుతున్నట్లు ఆమె చెప్పారు.

కానీ ఆమె అడిగిన సమాచారం ఆమెకు ఇవ్వలేదు. ఇంటలిజెన్స్ వివరాలు ఆర్‌టి‌ఐ పరిధిలో రావని చెబుతూ వివరాలు ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. బహుశా ఇప్పుడూ అదే పరిస్ధితి ఎదురవుతుందేమో! రాజు గారు తలచుకుంటే దెబ్బలకు కొదవా చెప్పండి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s