న్యాయం కావాలి -రాధిక వేముల


RADHIKA

అర్ధంతరంగా చనిపోయిన తన కుమారుడి మరణం వృధా కాకూడదని రాధిక వేముల ఆక్రోశిస్తోంది. తన కుమారుడి మరణానికి సంబంధించి తనకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేవరకు తాను పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తమను ఓదార్చడానికి ఢిల్లీ నుండి రెండుసార్లు వచ్చారని కానీ ప్రధాన మంత్రి నుండి ఇంతవరకూ ఎలాంటి స్పందన ఎందుకు లేదని రోహిత్ తల్లి రాధిక వేముల ప్రశ్నించారు. తన కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ రెండుసార్లు వచ్చినా ప్రధాన మంత్రి నుండి కనీస స్పందన లేకపోవడం పట్ల ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

కేరళలోని రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆహ్వానం మేరకు రాధిక, ఆమె కుమారుడు రాజా తిరువనంతపురంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. త్వరలో తాము ఢిల్లీ వెళ్తామని రోహిత్ సోదరుడు రాజా ఈ సందర్భంగా వెల్లడించారు.

మరే ఇతర విద్యార్ధి రాధిక పుత్రుడు ఎదుర్కొన్న పరిస్ధితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన చట్టం చేయాలని ముస్లిం లీగ్ నాయకులు డిమాండ్ చేశారు.

నిర్భయ చట్టం లాగానే ‘రోహిత్ చట్టం’ పేరుతో ఒక చట్టాన్ని రూపొందించాలని విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యా సంస్ధల్లో దళిత విద్యార్ధులకు విద్యకు సంబంధించి తగిన రక్షణను ఈ చట్టం ద్వారా ఇవ్వాలని ఇప్పటికే విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తోంది.

“అనేక మంది నాయకులు వచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రెండు సార్లు వచ్చి మమ్మల్ని ఓదార్చారు. కానీ ప్రధాన మంత్రి నుండి అటువంటి స్పందన లేదు” అని రాధిక వేముల పి‌టి‌ఐతో మాట్లాడుతూ అన్నారు.

“మాకు న్యాయం కావాలి. రోహిత్ చావుకు కారణం అయిన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలి. వాళ్ళు ఎవరో పేరు పెట్టి చెప్పాలని మేము అనుకోవడం లేదు, కానీ వాళ్లెవరో మీ అందరికీ బాగానే తెలుసు” అని రాధిక చెప్పారు.

పాండిచ్చేరి యూనివర్సిటీలో MSc చదువుతున్న రాజా వేముల తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని వెల్లడి చేశారు.

జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ (యూనివర్సిటీ ఆఫ్ హైదారాబాద్) ఆధ్వర్యంలో తాము ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమంలో పాల్గొంటామని రాజా తెలిపారు.

పార్లమెంటుకు దండు వెళ్ళడం ఈ కార్యక్రమం లక్ష్యం అని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని యూనివర్సిటీ క్యాంపస్ లలో ప్రచార ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

తమ ఆందోళనను రాజకీయ పార్టీలు హైజాక్ చేశాయన్న ఆరోపణను రాజా కొట్టిపారేశారు. బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ సంస్ధలు అనుబంధ సంఘాలు ఈ దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆయన తెలిపారు.

మరోవైపు రోహిత్ ఆత్మహతకు బి‌జే‌పి నేతలు విపరీతార్ధాలు తీయడం కొనసాగుతోంది. తాజాగా బి‌జే‌పి దళిత్ మోర్చా పేరుతో కొందరు నేతలు పిచ్చి ప్రేలాపనలతో ముందుకు వచ్చారు.

తాను వామపక్ష రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానన్న పశ్చాత్తాపంతోనే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ సో-కాల్డ్ దళిత నేతలు వాకృచ్చారు. “ఆయన దళితుడు కాదు” అంటూ విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రకటన బహుశా ఈ దళిత నేతలకు సరిగ్గా వర్తించవచ్చు.

“తండ్రీ, వీరేమీ చేయుచున్నారో వీరేరుగరు” అంటూ శిలువపై ఉన్న యేసు క్రీస్తు తనను హేళన చేస్తున్న జనాన్ని ఉద్దేశిస్తూ ఏడు మాటల్లో ఒకటిగా చెప్పినట్లు బైబిల్ చెబుతుంది. బహుశా కులం శిలువపై ఆత్మార్పణం కావించిన రోహిత్ కూడా ఇలాంటి పాపులను తలచుకుని అవే మాటలు అనుకుని ఉండాలి.

కాకుంటే… ‘అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్’ కింద ఆర్గనైజ్ అయిన రోహిత్ వేముల వామపక్ష రాజకీయాల్లో ఉన్నట్లు ఈ దళిత మోర్చా నేతలకు ఎలా తోచింది చెప్మా?!

తమకు నచ్చనిది ప్రతిదీ వామపక్షమే అయి ఉంటుందని బి‌జే‌పి తదితర హిందూత్వ నేతల నిశ్చితాభిప్రాయం కావాల్ను!

దళిత మోర్చా నేతలు కనిపెట్టిన మరో కారణం రోహిత్ అప్పు. అప్పు వలన కూడా తీవ్ర నిర్ణయానికి పాల్పడి ఉండవచ్చని బి‌జే‌పి దళిత నేత గౌతమ్ గారు తాజాగా కనిపెట్టారు.

“ఆయన అప్పుల్లో ఉన్నారు. ఆత్మహత్య లేఖలో ఎవరి పేరు రాయలేదు కదా” అని గౌతమ్ గారి అభిప్రాయం. ఎవరినీ ఆత్మహత్యకు కారణంగా రోహిత్ చెప్పలేదు. పైగా రు. 40,000 అప్పు పడ్డానని రాశారు కూడా. రోహిత్ ఆత్మహత్యకు కారణం ఏమిటో కనుక్కోవడం ఎంత తెలీకో తెలియదా మీకు, శుంఠల్లారా?

“చదువుకోమని కుటుంబం వాళ్ళు పంపిస్తే తాను దారితప్పి వామపక్ష రాజకీయాల్లోకి వచ్చానన్న పశ్చాత్తాపం, తప్పు చేసిన భావనలతోనే ఈ దురదృష్టకర నిర్ణయానికి ఆయన వచ్చి ఉంటారని నా అభిప్రాయం” అని బి‌జే‌పి షెడ్యూల్డ్ క్యాస్ట్ మోర్చా నేత దుష్యంత్ గౌతమ్ ప్రకటించారు.

ఈ దివ్యమైన బోధనలని అర్జెంట్ గా ఏ‌బి‌వి‌పి విద్యార్ధులకు బోధిస్తే పోలా! ఓ పనై పోతుంది. చదువుకొమ్మని పంపిస్తే తోటి విద్యార్ధులని టార్గెట్ చేస్తూ మంత్రులకు ఫిర్యాదులు చేయడం ఏంటని ఏ‌బి‌వి‌పి నేతలకి ఎవరు బోధిస్తారు? రోహిత్ సమస్యని రాజకీయం చేసింది దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు. కాబట్టి ‘ఇది రాజకీయ కుట్ర’ అంటూ రోహిత్ మరణంపై చెలరేగిన ఉద్యమాన్ని ఎత్తి చూపిన గౌతముడు ఆ కుట్ర తన పార్టీయే మొదలు పెట్టిందని గుర్తించాల్సి ఉంది.

గౌతమ్ గారికి ఇంకా అర్ధం కానీ విషయం ఏమిటంటే రోహిత్ చదువుని ఆటంకపరిచింది హిందూత్వ కులశక్తులు కాగా ఆయనకు అసలు చదువు నేర్పింది రాజకీయాలు. ఏ‌ఎస్‌ఏ కింద సమీకృతుడై వివిధ ప్రజా రాజకీయాలను, తత్వ చింతనలను నేర్చుకున్నాకనే అసలు చదువు మొదలైందని రోహిత్ భావించినట్లు ఆయన మిత్రుడు ఇస్మాయిల్ ద్వారా లోకానికి తెలిసింది.

4 thoughts on “న్యాయం కావాలి -రాధిక వేముల

 1. రోహిత్ వేముల విషయంలో దళిత కోణం లేదని వాదించే వారిని చూసి ఆశ్చర్యం కలగటం లేదు. ఎందుకంటే, ఒక విధమైన బ్రైన్ వాష్ కి, ప్రాపగాండాకి అనుగునంగా మైండ్ ట్యూన్ అయిపోతే, ఆ తర్వాత దానికి విరుద్ధమైన వాదనలు ఎన్ని విన్నా, ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, మనసు వాటిని స్వీకరించక, వాటిని వ్యతిరేకిస్తూ ఉంటుంది.

  చిన్నప్పటి నుంచీ దళిత వాడల్లోనే పుట్టి పెరిగి, అక్కడే జీవించిన వ్యక్తి దళిత వివక్షని ఎప్పటికీ అనుభవించకుండా ఉండే అవకాశం ఉంది. దళిత విద్యార్థులు స్కూల్లలోనూ, దళిత ఉద్యోగులు ఆఫీసుల్లోనూ వివక్షని ఫేస్ చేసే అవకాశం ఉంది. కానీ, రోహిత్ విషయంలో అతను వివక్షని తన ఇంట్లోనే(అమ్మమ్మ అనబడే యజమాని ఇంట్లో) అనుభవించాడు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే, తన సొంత తండ్రి నుండే వివక్షని చవిచూశాడు. సాక్షాత్తూ తన జన్మకి కారణమైన వ్యక్తే తనను దూరం నెట్టేశాడంటే, దానికి ఆ పసి హృదయం ఎంతగా గాయపడి ఉంటుందనేది ఊహకు కూడా అందని విషయం. My birth is an Accident, అనే మాటకి మూలం అదే అయ్యుండొచ్చు.
  సహజంగా కుల వివక్షకి సంబంధించిన అంశాల్లో అగ్రకులాల వారు ఉంటారు. కానీ, తాను BC వర్గానికి సంబంధినిచిన వ్యక్తి అయ్యుండి కూడా, ఓ SC మహిళని భార్యగా సహించలేక పోవడం అనేది.. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ స్వరూపస్వభావాల్ని తేట తెల్లం చేస్తుంది. కుల వ్యవస్థ ఈ దేశంలో ఇన్ని వందల ఏళ్ళ పాటు నిరాటంకంగా ఎలా మనగలిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఈ వ్యవస్థ ప్రతి మెట్టు వారికి, తమపై మెట్టు మీద ఉన్న వారిపై ఆక్రోశం , మరియు తమ కింది మెట్టుపై ఉన్న వారిని చూసి, వీరికంటే మనమే బెటర్ అనే ఓ రకమైన కంఫర్ట్నెస్ రెండు ఏకకాలంలో అందిస్తుంది. దానితో, ఏ రెండు వర్గాలూ సంఘటితం కాకుండా, ఎవరి చట్రంలో వారు సర్దుకుపోవడం జరుగుతుంది.

  రోహిత్ కి ఇన్ని మానసిక సంఘర్షనలు, వీటికి తోడు పేదరికం.. ఇన్ని సమస్యల మధ్య కూడా చదువులో రాణించడం అనేది అత్యంత గొప్ప విషయం. ఓ ప్రతిభావంతుడి జీవితాన్ని కేంద్ర ప్రభుత్వం, తమ చవుకబారు రాజకీయాల కారణంగా పొట్టన పెట్టుకుంది.

  Note: Vishekar garu, I am not much familiar with caste related issues. Just sharing my thoughts, though. You may refrain from publishing this comment,if you feel so. I won’t mind.
  -Haneef.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s