ఢిల్లీ ఆటో ఎక్స్ పో -కార్టూన్


Auto expo

ప్రస్తుతం జరుగుతున్న వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాలను రాజకీయ పార్టీల కార్యకలాపాలతో, పార్టీల నాయకుల ధోరణులతోనూ, వారి ప్రకటనల తోనూ పోల్చి సున్నితమైన రాజకీయ వ్యంగ్యం పండించడం కార్టూనిస్టులకు ఇష్టమైన ప్రక్రియ. 

ఈ ప్రక్రియ ద్వారా ఆయా నాయకుల, పార్టీల వ్యవహార శైలి గురించి తేలికగా అర్ధం చేసుకునే అవకాశం పాఠకులకు, లభిస్తుంది. ఒక్క చూపులో బోలెడు అర్ధాన్ని ఈ కార్టూన్ ల ద్వారా గ్రహించవచ్చు.

ఢిల్లీలో నొయిడాలో ఆటో ఎక్స్ పో – 2016 ప్రదర్శన గత మూడు రోజులుగా నడుస్తోంది. ఈ ప్రదర్శన నేపధ్యంలో బీహార్, ఢిల్లీ, మోడి, గాంధీల వ్యవహారాన్ని కార్టూన్ ప్రతిబింబిస్తోంది.

వచ్చిన తర్వాత కాసేపైనా ఉండకుండా వెళ్లిపోతుంటే ‘చెప్పుల్లో కాళ్ళు దూర్చి కూర్చున్నారు’ అంటారు. ప్రధాని నరేంద్ర మోడిగారు ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పటి నుండీ ఒంటికి రెక్కలు తొడుక్కుని ఉన్నారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వీసా ఇవ్వడానికి అమెరికా, ఐరోపా దేశాలు నిరాకరించిన ఫలితమేమో గానీ అదే పనిగా దేశాలు చుట్టి వస్తున్నారు. వెళ్ళిన చోటికే మళ్ళీ వెళ్తున్నారు. దేశంలో మాత్రం ఒక్క ఎన్నికల కోసం తప్ప మరే ఇతర పాలనా కార్యక్రమానికీ ఆయన వస్తున్న ఉదాహరణలు చాలా తక్కువ. ఆర్‌ఎస్‌ఎస్/బి‌జే‌పి ల ‘స్వదేశీ’ నినాదం అర్ధం ఇదేనా? 

ఢిల్లీలో మునిసిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. బి‌జే‌పి నేతృత్వంలో కార్మికులు సమ్మె చేస్తుండడంతో సమ్మెకు రాజకీయ రంగు వచ్చి చేరింది. మూడు నెలలుగా జీతాలు లేవని కార్మికులు చెబుతున్నారు.  మునిసిపాలిటీకి ఇవ్వవలసిన నిధులు ఇప్పటికే పూర్తిగా ఇచ్చామని ఆ డబ్బును బి‌జే‌పి మునిసిపల్ పాలకవర్గం అవినీతితో కాజేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి చెబుతున్నారు.

కార్మికుల వేతనాల కోసం రు. 550 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడానికి ఏ‌ఏ‌పి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆ డబ్బును కేవలం కార్మికులు ఇతర మునిసిపల్ ఉద్యోగుల వేతనాలకే ఖర్చు చేయాలని షరతు విధించింది. ఆ సొమ్ము తీసుకోవడానికి బి‌జే‌పి నేతృత్వంలోని మునిసిపల్ పాలకవర్గం ఎందుకు నిరాకరిస్తోంది?

సమ్మెలో భాగంగా కార్మికులు చెత్త కుప్పలను  తెచ్చి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ల ముందు పోస్తున్నారు. హై వే లపై పోసి ట్రాఫిక్ బంద్ చేస్తున్నారు. వారికి 16,000 మంది మునిసిపల్ టీచర్లు, 7,000 మంది మునిసిపాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు జత కలిశారు. మునిసిపాలిటీ ఆసుపత్రులను ఢిల్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 60,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా రాహుల్ గాంధీ రాజకీయ ప్రయాణం విజయవంతం కావడానికి ఆయన తల్లి సోనియా గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పుత్రుని రాజకీయ ఉద్ధానం బాధ్యత తల్లికి ఎలాగూ తప్పదు కానీ రాహుల్ గాంధీ మరీ అంత పిల్లవాడా!

బీహార్ ఎన్నికల్లో విజయవం ఎవరిదో తెలియకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అని ప్రకటించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆచరణలో అధిక సీట్లు పొందిన ఫలితాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా అనుభవిస్తున్నట్లు కనిపిస్తోంది. తన కుమారుల మంత్రిత్వ శాఖల ఇలాకాల్లో అధికార భోగాన్ని సిగ్గు లేకుండా అనుభవిస్తున్నారాయన. తనపై కేసు మోపినప్పుడు ముఖ్యమంత్రి పదవిలో భార్యను కూర్చుండబెట్టిన లాలూ ప్రసాద్ యాదవ్ పుత్రుల పదవులనుండి దూరంగా ఎలా ఉండగలరు!

ఫలితంగా ముఖ్యమంత్రి నితీశ్, లాలూల మధ్య కోల్డ్ వార్ సాగుతోందని పత్రికలు కూస్తున్నాయి. ఒకరు ఉప్పు ఐతే మరొకరు నిప్పుగా ఉంటున్నారని, లాలూ వ్యవహారం ముఖ్యమంత్రికి బొత్తిగా నచ్చడం లేదని, అధికారం ఆయనకి ముళ్ళ కుర్చీ అయిందని… ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. లాలూ వ్యవహారం ఎవరికి మాత్రం నచ్చుతుంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s