అమెరికా, ఐరోపాలు స్వప్రయోజనాల కోసం సిరియాపై బలవంతంగా రుద్దిన అంతర్యుద్ధం ఆ దేశ పిల్లల పాలిట మరణ మృదంగం వినిపిస్తోంది.
లక్షలాది మంది సిరియన్లు ఇసిస్ ఉగ్ర మూకల చెరలో నుండి తప్పించుకునేందుకు టర్కీ, లెబనాన్, జోర్డాన్ లకు శరణార్ధులుగా తరలి వెళ్తున్నారు.
సిరియా నుండి వెళ్ళే శరణార్ధుల్లో ఎక్కువ మంది టర్కీలో ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత స్ధానం లెబనాన్ ది. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ తన ప్రజలపై అమలు చేస్తున్న నియంతృత్వం పట్ల తెగ ఆందోళన పడిపోయే ఇజ్రాయెల్ ఒక్కరంటే ఒక్క సిరియా శరణార్ధిని కూడా అనుమతించలేదు.
టర్కీ ప్రభుత్వం 20 లక్షల మందికి పైగా సిరియా శరణార్ధులను ఇప్పటివరకు అనుమటించింది. వారంతా టర్కీ భూభాగంలో, సిరియా సరిహద్దులో, ఉన్న శిబిరాలలో అత్యంత దీన పరిస్ధితుల మధ్య బతుకుతున్నారు.
పేరుకు అధిక సంఖ్యలో శరణార్ధులను అనుమతించినప్పటికీ వారందరినీ శరణార్ధులుగా టర్కీ గుర్తించడం లేదు. కేవలం 10 శాతం మందికి మాత్రమే శరణార్ధి గుర్తింపు ఇచ్చింది.
శరణార్ధిగా గుర్తింపు ఇస్తే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం, వారికి గౌరవ ప్రదమైన నివాసం, జీవనం కల్పించే బాధ్యత దేశాలపై ఉంటుంది. అందుకే అతి తక్కువ మందికి టర్కీ శరణార్ధి గుర్తింపు ఇస్తోంది.
మిగిలిన వారందరినీ ఐరోపా, ముఖ్యంగా జర్మనీ, వెళ్లాలని, టర్కీ ప్రధాని చెవినిల్లు కట్టుకుని మరీ బోధిస్తున్నాడు. ఐరోపా పంపే లక్ష్యంతోనే సిరియా శరణార్ధులను ఆయన ఆకర్షిస్తున్నాడు. ఇది అంతర్జాతీయ స్ధాయిలో జరుగుతున్న భారీ కుట్ర.
అమెరికా, రష్యాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు సిరియా ప్రజల చావుకు వచ్చింది. నిజానికి ఆధిపత్య పోరు అన్నది ఖచ్చితమైన పదం కాదు. అమెరికాది పెత్తనం అయితే రష్యాది ఆత్మ రక్షణ.
‘The best defence is, offence’ అని ఆంగ్లంలో ఒక నానుడి ఉంది. సోవియట్ రష్యా పతనం అయిన దగ్గర్నుండి అన్ని రంగాల్లో అమెరికా ఆధిపత్య దాడిని భరిస్తూ వచ్చిన రష్యా ప్రస్తుతం ప్రతి దాడిని ఆత్మరక్షణ వ్యూహంగా అమలు చేస్తున్నది.
రష్యా ప్రతిదాడి రీత్యా రష్యా-ఐరోపాలు ఒకటి కావడం అమెరికాకు ఆధిపత్యానికి ప్రమాదం. కానీ జర్మనీ ఏదో ఒక రోజు రష్యాతో జట్టు కడుతుందని అమెరికా భావిస్తోంది. పెరిగి పోతున్న జర్మనీ ఉత్పత్తులకు వనరులు కావాలి, మార్కెట్లు కావాలి. వనరులు రష్యా దగ్గర పుష్కలం. కనుక రష్యా-జర్మనీ మైత్రి మునుముందు పొంచి ఉన్నదని అమెరికా భావన.
ఈ మైత్రిని నివారించడానికి అమెరికా సిరియా శరణార్ధులను పాచికగా విసురుతోంది. టర్కీ సాయంతో సిరియా శరణార్ధులను ఐరోపాకు, ముఖ్యంగా జర్మనీకి తరుముతోంది. ఈ కార్యక్రమంలో సిఐఏ బిజీగా ఉన్నది. శరణార్ధులు మధ్యధరా సముద్రం మీదుగా గ్రీసు చేరేందుకు పడవలు సమకూర్చడం, ఖర్చులకు సొమ్ములు ఇవ్వడం, యువకులైతే స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేయడం… సిఐఏ బిజీ బిజీ!
“ఈ శరణార్ధుల్లో నాకు కనిపిస్తున్నది అందరూ యువకులే. వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ లు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి. అసలు దేశం వదిలి ఎందుకు వెళ్తున్నారు? (ఇసిస్ నుండి) దేశ రక్షణలో భాగం పంచుకోవాలి కదా!” అని రిపబ్లికన్ పార్టీ తరపున వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఒక అభ్యర్ధిగా ప్రైమరీల్లో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం బట్టి విషయం బోధపడుతుంది.
ఐరోపా వెళ్తున్న శరణార్ధుల్లో ఇసిస్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. శరణార్ధుల ముసుగులో వారిని అమెరికా ఐరోపాలో ప్రవేశపెడుతోంది. ఇటీవల ముంబై దాడుల తరహాలో ప్యారిస్ లో జరిగిన టెర్రరిస్టు హత్యాకాండకు బాధ్యులు ఇలా వెళ్ళిన ఇసిస్ సభ్యులే. ఇదే తరహాలో జర్మనీని రాజకీయంగా, సామాజికంగా అస్తిరం కావించాలని అమెరికా ఎత్తు వేసింది.
ఈ చెలగాటంలో సిరియా ప్రజలు ఎలుకల్లా ప్రాణ సంకటాన్ని అనుభవిస్తున్నారు. అమాయకంగా అంతర్జాతీయ వికృత క్రీడలో పావులుగా మారారు. వారిలో ఒకరు ఐలాన్ కుర్ది కుటుంబం.
ఐలాన్ కుర్ది, అతని అన్నయ్యలను తీసుకుని వారి తల్లి దండ్రులు కెనడా వెళ్ళే ఉద్దేశ్యంతో టర్కీ తీరంలో పడవ ఎక్కారు. ఐలాన్ కుటుంబం సిరియాలో టర్కీ సరిహద్దులో నివసించే కుర్దు జాతికి చెందినది. సిరియాలో కిరాయి తిరుగుబాటు దరిమిలా ఆ కుటుంబం కూడా టర్కీ శిబిరాల్లో తలదాచుకుంటోంది. వారి బంధువు ఒకరు కెనడాలో నివసిస్తున్నారు. ఆమె అండతో కెనడా వెళ్లాలని కుర్ది కుటుంబం ఆశ.
కానీ సముద్రం అల్లకల్లోలంగా మారడంతో బయలుదేరిన కొద్ది సేపటికే వారు ఎక్కిన పడవ తిరగబడింది. ఐలాన్ కుర్ది, అతని 5 సం.ల అన్నయ్య గాలిప్, వారి తల్లి దండ్రులు రెహాన్, అబ్దుల్లాలు నలుగురు కొద్ది నిమిషాలసేపు సముద్రంలో జీవన్మరణ పోరాటం సాగించారు. పోరాటంలో విజయుడయింది కుర్ది తండ్రి ఒక్కరే.
పిల్లలను, భార్యను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి అబ్దులా విఫలం అయ్యాడు. పెద్దవాడ్ని కాపాడదామని వెళ్తే ఆ పిల్లాడు నీళ్ళలో తేలుతూ కనపడ్డాడు. సరే అని చిన్న పిల్లాడ్ని కాపాడదామని పోతే ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళేలోపు మునిగిపోయాడు. పోనీ పెద్దాడ్ని దక్కించుకుందామని వెళ్తే ఆ పిల్లాడూ మునిగిపోతూ కనిపించాడు. దగ్గరికి వెళ్ళేలోపు గాలిప్ కూడా దక్కలేదు. రెహాన్ జాడ అసలే లేదు. చిన్న ఆధారంతో సముద్రంలో తేలుతుంటే 3 గంటల తర్వాత టర్కీ కోస్ట్ గార్డ్ పోలీసులు అతన్ని, మరి కొందరిని ఒడ్డుకు చేర్చారు.
ఆ విధంగా భార్యా పిల్లల్ని కోల్పోయిన అబ్దుల్లా కుర్ది వారిని సమాధి చేసి ఇక జన్మలో వలస వెళ్ళే ప్రయత్నం చేయనని సమాధులపై ప్రమాణం చేశాడు. తానూ వారి పక్కనే సమాధి కావాలన్న ఏకైక కోరిక మాత్రమే అతనికిప్పుడు మిగిలింది.
సముద్రంలో మునిగిపోయిన ఐలాన్ కుర్ది అలల వెంటపడి టర్కీ ఒడ్డుకు కొట్టుకు వచ్చాడు. సముద్రం ఒడ్డున నిద్రపోతున్నట్లుగానే శవమై పడి ఉన్న ఐలాన్ ను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఇంటర్నెట్ లో విద్యుత్ ప్రవాహంలా పాకిపోయింది.
ఐలాన్ దీన పరిస్ధితుల్లో చనిపోయిన విధానానికి ప్రపంచవ్యాపితంగా అనేక మంది సృజనశీలురు స్పందించారు. కార్టూన్ ల రూపంలో, ఇలస్ట్రేటెడ్ ఆర్ట్ రూపంలో, నినాదాల రూపంలో, సైకత శిల్పాల రూపంలో, అచ్చం ఐలాన్ లానే సముద్రం ఒడ్డున పడుకున్న నిరసనల రూపంలో…
ఆ స్పందనలే కింద ఉన్న చిత్రాలు.
i kept google map in another window and tried to understand the political scenario. good analysis.heart touching