
Assange in Ecuador embassy in London
వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది.
స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను ‘నేరస్ధుల అప్పగింత’ ఒప్పందం కింద స్వీడన్ కు అప్పగించడానికి లండన్ పోలీసులు పొంచి ఉన్నారు. స్వీడన్ కు వెళ్ళినట్లయితే తనను అక్కడ నుండి అమెరికాకు అప్పగించడం ఖాయం అని ఆసాంజే భావిస్తున్నాడు. ఆసాంజే అనుమానాన్ని అమెరికా అధికారులు అనేకమార్లు తమ మాటలు, చేతల ద్వారా నిర్ధారించారు కూడా.
వికీలీక్స్ చీఫ్ ఎడిటర్ గా ఆసాంజే లక్షలాది అమెరికా రహస్య పత్రాలను తమ వెబ్ సైట్ లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సాగించిన వేలాది పౌర హత్యలూ, విదేశాల్లోని తమ ఎంబసీలను ఆయా దేశాలపై గూఢచర్యం సాగించడానికీ వినియోగించుకుంటున్న తీరూ, గూఢచర్య సమాచారాన్ని ఎంబసీల నుండి కేబుళ్ల ద్వారా అమెరికాకు చేరవేసిన విధమూ.. మొ.న సమాచారాన్ని వికీలీక్స్ ప్రచురించడంతో అమెరికా పరువు అట్లాంటిక్ లో మునిగిపోయింది. దరిమిలా అమెరికా ఆసాంజేపై కత్తి గట్టింది.
ఈ నేపధ్యంలో ఆసాంజేపై తాము మోపిన 4 కేసుల్లో మూడింటిని ఉపసంహరించుకుంటున్నామని గత ఆగస్టు నెలలో స్వీడన్ ప్రకటించింది. లైంగిక దాడి, లైంగికంగా వేధించడం, చట్ట విరుద్ధంగా బలవంతపెట్టడం… ఈ మూడు నేరారోపణల విషయమై చార్జి షీటు దాఖలు చేయడంలో స్వీడన్ విఫలం అయింది. దానితో ఆగస్టు 18, 2015 తేదీన స్వీడన్ చట్టాల ప్రకారం మూడు ఆరోపణలు రద్దయ్యాయి.
ఆసాంజేపై మరో నేరారోపణ -అత్యాచారం చేశాడని (rape)- మాత్రం కొనసాగుతుంది. స్వీడన్ చట్టాల ప్రకారం ఈ నేరారోపణ విషయంలో చార్జి షీటు దాఖలు చేయడానికి 2020 వరకు గడువు ఉంటుంది.
ప్రస్తుతం 44 యేళ్ళ వయసులో ఉన్న ఆసాంజే జూన్ 2012 నుండి లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నాడు. ఆయన బైటికి అడుగు పెడితే అరెస్టు చేద్దామని లండన్ పోలీసులు పొంచి ఉన్నారు. తనను స్వీడన్ కు అప్పగించవద్దని లండన్ కోర్టులను ఆసాంజే కోరినప్పటికీ అవి విరుద్ధంగా తీర్పు ఇచ్చాయి. తనను అమెరికాకు పంపడానికే స్వీడన్ లో తప్పుడు కేసులు మోపారని విజ్ఞప్తి చేసినప్పటికీ లండన్ కోర్టులు పెడచెవిన పెట్టాయి. అప్పటి నుండి ఈక్వడార్ ఎంబసీ లోని ఓ చిన్న గదిలో ఎండ, వానా, నేలా అన్నింటికీ దూరమై బతుకుతున్నాడు.
ఆస్ట్రేలియా దేశీయుడైన ఆసాంజేను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఎలాంటి ఆసక్తి చూపలేదు. చివరికి లాటిన్ అమెరికాలోని చిన్న దేశం ఈక్వడార్ ముందుకు వచ్చి ఆయనకు రాజకీయ ఆశ్రయం (political asylum) ప్రకటించింది. అప్పటి నుండి ఈక్వడార్, బ్రిటన్ ల మధ్య ఆసాంజే విషయంలో రాయబార చర్చలు సాగుతున్నాయి.
ఈ నేపధ్యంలో జులియన్ ఆసాంజే చివరి ప్రయత్నంగా ఐరాస కమిటీకి విన్నవించాడు. U.N. Working Group on Arbitrary Detention – నిరంకుశ నిర్బంధాలపై ఐరాస కమిటీ ఆసాంజే విన్నపాన్ని పరిశీలించింది. ఈ కమిటీ నిర్ణయాలను అమలు చేసి తీరాలన్న నియమం ఏమీ దేశాలపై లేదు. అయినప్పటికీ ఆసాంజేను ఇన్నాళ్లూ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా నిర్బంధించారన్న వాస్తవం ప్రపంచానికి నిర్ధారణగా తెలుస్తుంది. అదే ఒక విజయం.
ఆసాంజే ఎంబసీ నుండి బైటికి వస్తే వెంటనే అరెస్టు చేస్తామని లండన్ పోలీసులు ప్రకటించారు. తమ ఉద్దేశంలో మార్పులేమీ లేవని వారు తెలిపారు.
బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రతినిధి కూడా ఈ విషయమే పునరుద్ఖాటించాడు. ఐరాస కమిటీ నిర్ణయం పాటించాల్సిన నియమం లేనందున ఆయన ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు వారంట్ అమలు చేస్తామని స్పష్టం చేశాడు.
ఐరాస కమిటీ తనకు ప్రతికూలంగా తీర్పు ప్రకటిస్తే తాను శుక్రవారం ఎంబసీ నుండి బైటికి వచ్చి అరెస్ట్ అవుతానని ఆసాంజే స్పష్టం చేశాడు. ఐరాస కమిటీ కూడా తనకు వ్యతిరేకంగా ఉంటే తాను ఎంబసీలో ఉండడంలో అర్ధం ఉండదని ఆయన అభిప్రాయపడ్డాడు. తనకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తే గనక తన హక్కులను గుర్తించవలసిన అగత్యం బ్రిటన్ కు కలుగుతుందని ఆయన చెప్పారు.
“నా విజ్ఞప్తి ఆమోదం పొందితే, వివిధ రాజ్యాలు -ఈయూ, స్వీడన్, బ్రిటన్- చట్ట విరుద్ధంగా తన పట్ల వ్యవహరిస్తున్నాయని స్పష్టం అవుతుంది. అలాంటప్పుడు నా పాస్ పోర్ట్ నాకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలను ఇక కట్టిపెట్టాల్సి ఉంటుంది.” అని ఆసాంజే అన్నారని రాయిటర్స్ తెలిపింది.
తనను వెంటాడి వేధిస్తున్నారని, అమెరికా నిర్దేశాల మేరకు సాగుతున్న వేటకు తాను బాధితుడిననీ ఆసాంజే ఐరాస కమిటీకి మొర పెట్టుకున్నాడు. తన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉల్లంఘనకు గురవుతోందని, తన ప్రాధమిక స్వేచ్చా హక్కులైన సూర్యరశ్మి పొందే హక్కు, తాజా గాలి పీల్చే హక్కు, సముచిత వైద్య సౌకర్యాలు పొందే హక్కు, చట్టబద్ధమైన మరియు పాలనాపరమైన భద్రతకు నోచుకునే హక్కు.. ఏవీ పొందలేక పోతున్నానని తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఆసాంజే వాదనతో ఐరాస కమిటీ ఏకీభవించిందని రాయిటర్స్ వార్త ద్వారా తెలుస్తున్నది. ఈ నిర్ణయం అధికారికంగా ప్రచురించబడినాక బ్రిటన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ప్రజాస్వామ్య భావాలకు పుట్టినిల్లుగా చాటుకునే బ్రిటిష్ రాజ్యం ఆసాంజే కనీస పౌర, మానవ హక్కులను గౌరవిస్తుందో, ఉల్లంఘించడం కొనసాగించడం ద్వారా తన ‘ప్రజాస్వామ్య కబుర్లు’ గాలి మూటలేనని నిర్ధారించుకుంటుందో చూడాలి.