అవినీతిపై విసిగిపోయిన బోంబే హై కోర్టు న్యాయమూర్తి ఒకరు ‘అవినీతిని నిర్మూలించేవరకు పౌరులు పన్నులు కట్టడం మానేయాలి’ అంటూ ఆగ్రహం ప్రకటించారు. పన్నులు కట్టొద్దని దాదాపు పిలుపు ఇచ్చినంత పని చేశారు.
మహారాష్ట్ర బిజేపి ఎంఎల్‌ఏ ఒకరు కేంద్ర బిందువుగా వెల్లడి అయిన అవినీతి కుంభకోణం విచారణకు వచ్చిన సందర్భంగా బోంబే హై కోర్టు జడ్జి ఈ వ్యాఖ్య చేశారు. గత రెండు దశాబ్దాలుగా అవినీతి కుంభకోణాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ చౌదరి (అబ్బే కాదు, ఎన్‌టిఆర్ కాదు) వ్యాఖ్యానించడం విశేషం.
లోక్ షహిర్ అన్నాభవు సాధే వికాస్ మహామండల్ (Lokshahir Annabhau Sathe Development Corporation) సంస్ధలో 385 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అవినీతి నాయకులు, అధికారులు అక్రమంగా భోంచేసిన కుంభకోణం మహారాష్ట్రలో గత సంవత్సరం వెలుగు చూసింది.
లోక్ షహిర్ అన్నాభవు సాధే వికాస్ మహామండల్ సంస్ధను మహారాష్ట్ర లోని మాతంగ (షెడ్యూల్డ్ కులాల్లో ఒకటి) కులానికి చెందిన ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. అన్నాభవు లోక్ సాధే మహారాష్ట్రలో పేరు పొందిన దళిత కుల రచయిత, సంస్కరణవేత్త.
అన్నాభవు ప్రధానంగా కమ్యూనిస్టు. కుల అణచివేతకు సంబంధించినంతవరకు అంబేద్కర్ బోధనలను ఆయన స్వీకరించారు. ఆయనను కమ్యూనిస్టుగా కంటే దళితవాదిగా మాత్రమే గుర్తించడం పాలకులకు ఇష్టం, ఓట్లు రాలే అవకాశం ఉంది గనక. ఆయన పేరుతో సంక్షేమ సంస్ధను ఏర్పాటు చేయడం అందులో ఒక భాగం.
ఈ సంస్ధకు కేటాయించిన నిధుల్లో 385 కోట్ల రూపాయలను కాజేశారని బిజేపి ఎంఎల్‌ఏ రమేశ్ కదం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ చౌదరి ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కార్పొరేషన్ పైనా విచారణ చేసి నిందితులపై కేసులు పెట్టాలి’ అని పోలీసులను ఆదేశించారని ది హిందు తెలిపింది.
ఆ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
“ఇదే తరహాలో లూటీ కొనసాగితే పన్ను చెల్లింపుదారులు ‘సహాయ నిరాకరణ ఉద్యమం’ చేపట్టి పన్నులు చెల్లించడానికి నిరాకరించవచ్చు” అని జస్టిస్ బొంబే హై కోర్ట్ నాగపూర్ బెంచి న్యాయపూర్తి ఏ బి చౌదరి వ్యాఖ్యానించారు.
“ఇలాంటి విన్యాసాల కోసమేనా పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నది? ఈ అవినీతి పుండును, ఈ హైడ్రా తలల రాక్షసిని రూపుమాపడానికి పౌరులు ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చింది. వారంతా ఈ అవినీతి దుర్గంధం ఇక చాల్లెమ్మని తమ ప్రభుత్వాలకు చాటి చెప్పాల్సిన సమయం వచ్చింది” అని హై కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.
“గత రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు పడుతున్న యమ యాతనను, అనుభవిస్తున్న ఆవేదనను అధికార కారిడార్లలో తిరుగాడే మాంత్రికులు, ప్రభుత్వం కూడా అనుభవించాలి” అని జస్టిస్ చౌదరి తన పిలుపుకు ఏ ఫలితం రావాలో కూడా నిర్దేశించారు.
న్యాయపూర్తి శాపాలు అధికార కారిడార్లలో తిరుగాడే మాయగాళ్లకు తగులుతాయో లేదో తెలియదు. ఆయన పిలుపులకు స్పందించి మహారాష్ట్ర ప్రజలు పన్నులు కట్టడం మానేస్తారో లేదో చూడాలి. కానీ ఆయన ఇస్తున్న తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలకు మేలు చేయడం సంగతేమో గానీ కీడు చేయడం మాత్రం కనిపిస్తోంది.
ఉదాహరణకి గత డిసెంబర్ నెలలో అరుంధతి రాయ్ పైన కోర్టు ధిక్కార నేరం మోపాలని ఆదేశాలు జారీ చేసేశారు. ఆమె చేసిన నేరమల్లా ఔట్ లుక్ పత్రికకు ఒక వ్యాసం రాయడం. మావోయిస్టు అంటూ ఆరోపించి మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా కు ఆమె మద్దతు ప్రకటించారు. 90 శాతం వికలాంగుడైన సాయిబాబాపై కేవలం ఆయన రాజకీయ భావాల రీత్యా రాజ్యం కత్తి కట్టిందని వివరించారు.

Prof. G N Saibaba
ఈ ఆర్టికల్ రాసింది ఆగస్టు 2015లో. అప్పటికి సాయిబాబా కు ఆరోగ్య కారణాలతో మూడు నెలల బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తర్వాత అప్పీలు చేయడంతో డిసెంబర్ 31 వరకు పొడిగించారు. బెయిల్ గడువు సమీపిస్తున్న నేపధ్యంలో రెగ్యులర్ గడువు కోసం సాయిబాబా బొంబే హై కోర్టును ఆశ్రయించారు.
ఈ దరఖాస్తును జస్టిస్ చౌదరి తిరస్కరిస్తూ, ఆయనకు ఇచ్చిన బెయిల్ ను సైతం వెంటనే రద్దు చేస్తూ 48 గంటల లోపు హాజరు కావాలని సాయిబాబాను ఆదేశించారు. అదే సమయంలో ఒక లాయర్ తన దృష్టికి తెచ్చిన అరుంధతీ రాయ్ ఆర్టికల్ పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆమెపైన కోర్టు ధిక్కారం కేసు మోపాలని ఆదేశించారు.
ఈ చర్య పలువురు న్యాయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. నివ్వెరపరిచింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కట్జు లాంటి వారు బహిరంగంగానే సాయిబాబాకు మద్దతుగా, కోర్టు ఆదేశాలకు నిరసనగా ఆందోళన ప్రకటించారు.
ఇప్పుడు అదే న్యాయమూర్తి ఏకంగా ‘అధికార కారిడార్ల లోని మాయగాళ్ల అవినీతిని రూపుమాపేవరకు పన్నులు కట్టవద్దని’ బోధిస్తున్నారు.
‘అవినీతి నిర్మూలించేవారకూ పన్నులు కట్టొద్దు’ అనడం వింటానికి బాగానే ఉంది కానీ, అది న్యాయమూర్తి ఎలా చెప్పగలరు అన్నది ప్రశ్న.
న్యాయ వ్యవస్ధ, పార్లమెంటు, బ్యూరోక్రసీ, పత్రికలు ఈ నాలుగు ఎస్టేట్ లూ (ప్రజాస్వామ్యం మూల స్తంబాలు) ప్రజల చేతుల్లో ఉన్నప్పుడే అవి ప్రజలకు అక్కరకు వస్తాయి. మరో మాటల్లో చెప్పుకుంటే అవి ఎవరి చేతుల్లో ఉంటే వారికి మాత్రమే అక్కరకు వస్తాయి. కనుక జస్టిస్ చౌదరి అధికారం ఎవరికి ఉపయోగపడుతుందో అరుంధతి రాయ్ పై కేసు చెప్పడం లేదా?
[సవరణ/వివరణ: రమేశ్ కదం బిజేపి ఎంఎల్‌ఏ అనీ, మాతంగ కులం ఎస్‌సి అనీ ది హిందు పత్రిక చెప్పగా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక రమేశ్ ఎన్‌సిపి ఎంఎల్‌ఏ అనీ, మాతంగ ఓబిసి జాబితా లోని కులం అనీ చెప్పింది. ఏది సరైనదో మరి!]