పాకిస్తాన్ లో ఒక హిందు ఆలయంపై దాడి జరిగిన సంగతి వెలుగు చూసింది. ఆలయంలోకి చొచ్చుకు వచ్చిన దుండగులు ఒక దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆలయం సొంతదారును ఉటంకిస్తూ పాక్ పత్రిక డాన్ తెలిపింది. దాడి జరగడంతో భక్తులు ఆలయానికి రావడం మానుకున్నారని పూజాదికాలు నిర్వహిస్తున్న వ్యక్తి చెప్పారు.
పాకిస్తాన్ లో అతి పెద్ద నగరం కరాచీలో ఈ ఘటన జరిగింది. కరాచీ జూలాజికల్ గార్డెన్స్ కి చెందిన 5వ నెంబర్ గేటు వద్ద కొన్ని క్వార్టర్స్ ఉన్నాయని, ఆ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న హిందూ కుటుంబం ఆలయానికి సొంతదారు అని పత్రిక తెలిపింది. హిందూ కుటుంబం ఆలయాన్ని ప్రైవేటుగా నిర్వహిస్తోంది.
జనవరి 21వ తేదీన గెడ్డం పెంచుకుని ఉన్న ముగ్గురు దుండగులు ఆలయంలోకి తోసుకు వచ్చారని ఆలయ నిర్వాహకుడు మహారాజ్ హీరా లాల్ ను ఉటంకిస్తూ డాన్ తెలిపింది. రావడంతోటే పిస్టళ్లు చూపించి బెదిరిస్తూ లోపల ఉన్నవారంతా బైటికి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించారని దానితో అందరూ హడావుడిగా ఒకరినొకరు తోసుకుంటూ బైటికి వెళ్లిపోయారని హీరా లాల్ తెలిపారు.
“సల్వార్ కమీజ్ ధరించి ఉన్న ముగ్గురు గెడ్డపు వ్యక్తులు దూసుకు వచ్చి టిటి పిస్టళ్లు చూపిస్తూ బెదిరించారు. లోపల ఉన్నవాళ్ళంతా పనులు ఆపి బైటికి వెళ్లిపోవాలని ఆదేశించారు. అందరూ వెళ్లిపోతున్న సమయంలో తోపులాట జరిగింది. ఫలితంగా దేవతా విగ్రహాల్లో ఒక విగ్రహం చేయి విరిగిపోయింది. ఆలయం అపవిత్రం అయింది” అని హీరాలాల్ చెప్పారని డాన్ తెలిపింది.
హీరా లాల్ కధనంలో తర్వాత వివరాలు ఏమిటో తెలియలేదు. ఈ కధనాన్ని ఇండియాలో పిటిఐ వార్తా సంస్ధ నివేదించగా ది హిందు పత్రిక ప్రచురించింది. ది హిందులో కూడా వివరాలు లేవు. తోపులాట వల్ల విగ్రహం చేయి విరిగిందా లేక దుండగులు విరగ్గొట్టారా అన్న అనుమానాన్ని ఈ అసంపూర్తి కధనం మిగిల్చింది.
డాన్ కధనం బట్టి చూస్తే తోపులాట వల్లనే చేయి విరిగినట్లుగా ఆలయ నిర్వాహకుడు సూచించినట్లు కనిపిస్తోంది. అదే నిజం అయితే పిస్టల్ చూపించి బెదిరించినవారు ఏం చేశారు? అందరు బైటికి వెళ్ళమని చెప్పాక ఏదో ఒకటి చెయ్యాలి కదా. పిస్టళ్లు చూపించి బెదిరించి ఏమీ చేయకుండా వెళ్లిపోవడం లాజిక్ కు అందని విషయం.
హీరాలాల్ తాతగారు దేశ విభజన తర్వాత ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళి స్ధిరపడ్డారని పత్రికలు రెండూ చెప్పాయి. దేశ విభజన తర్వాత అంబేద్కర్ చేసిన సూచనలను ఆమోదిస్తూ భారత్-పాక్ ప్రభుత్వాలు పరస్పరం జనాభా మార్చుకోవడానికి అంగీకరించాయి. స్వచ్ఛందంగా అవతలి దేశానికి వెళ్లదలుచుకున్నవారు (పాక్ హిందువులు ఇండియాకు, ఇండియా ముస్లింలు పాకిస్తాన్ కి) వెళ్ళే అవకాశం ఇచ్చారు. కానీ హీరాలాల్ తాతగారు ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
“ఆయనకు పిల్లలు లేరు. దానితో 14 సం.ల వయసు గల మోహన్ ను దత్తత తెచ్చుకున్నారు. ఆయన హిందూ అమ్మాయి చంపాబాయిని పెళ్లాడారు. వారు సోల్జర్ బజార్ లో నివాసం ఉన్నారు. నేను మోహన్, చంపాల కుమారుడిని. సీతల్ మాత దయవల్ల మా తల్లిదండ్రులకు 5గురు అమ్మాయిలు, నాతో సహా ఇద్దరు అబ్బాయిలు కలిగారు” అని మహరాజ్ హీరాలాల్ చెప్పారు.
తమ కుటుంబ పూజకోసం ముగ్గురు దేవతా విగ్రహాలను, షీతల్ మాత-సంతోషి మాత-భవానీ మాత నెలకొల్పుకోగా కాల క్రమంలో అక్కడికి హిందూ భక్తులు విరివిగా రావడం మొదలు పెట్టారు. కారణం అక్కడ పూజలు చేస్తే పిల్లలు లేనివారికి సంతానం ప్రాప్తిస్తుందన్న నమ్మకం.
“ఇక్కడ పూజలు చేశాక సంతానం కలిగినట్లు అనేకమంది మహిళలు భావించడంతో ఈ ప్రైవేటు ఆలయం గురించి అందరికి తెలిసింది. 8 సం.ల క్రితం భక్తులు మరో అద్భుతాన్ని ఇక్కడ చూశారు. పవిత్ర కుంకుమతో కాళీ మాత పాద ముద్రలు దేవతా విగ్రహాల పక్కనే అకస్మాత్తుగా ప్రత్యక్షం అయ్యాయి. ఆలయాన్ని రిజిస్టర్ చేయాలని నాకు తెలుసు కానీ అదెలాగో తెలియదు” అని హీరాలాల్ చెప్పారని డాన్ తెలిపింది.
“ఇక్కడ క్వార్టర్స్ లో నాలుగు హిందు కుటుంబాలు ఉన్నాయి. గేట్ నెంబర్ 1 వద్ద మరో 15 హిందు కుటుంబాలు ఉన్నాయి. వారు కాకుండా నగరంలోని ఇతర చోట్ల నుండి కూడా వస్తుంటారు. కానీ బెదిరింపుల తర్వాత వాళ్ళంతా రావడం మానేశారు. మాట వేగంగా విస్తరిస్తుంది కదా. ఇది జరిగాక మేము చాలా అబధ్రతలో ఉన్నాము” అని హీరాలాల్ చెప్పారు.
పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలు. ఇండియాలో మైనారిటీ ముస్లింలు అబద్రతలో ఉన్నట్లే పాకిస్తాన్ లో మైనారిటీ హిందువులు అబధ్రతలో గడుపుతుండడం ఒక వాస్తవం. ఎవరి వ్యక్తిగత విశ్వాసాలు వారివి అన్న నమ్మికతో ఎవరి మానాన వారిని వదిలేస్తే జనం శాంతియుతంగానే జీవితాలు గడిపేస్తారు. స్వార్ధ శక్తులు జమ కూడి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పుడే ప్రజల్లో అనవసరపు భావోద్వేగాలు చెలరేగుతాయి. మహారాజ్ హీరాలాల్ భయాందోళనలే అందుకు సాక్షం.