రోహిత్, రాధిక: అచ్చమైన దళిత కధ! -3


Still doubts?

Still doubts?

MA MEd చదివిన ఉపాధ్యాయురాలు తన ఆడ పిల్లలను BSc-BEd, BCom-BEd లు చదివించుకుంది. అందులో తప్పు పట్టాల్సింది ఏ కోశానా లేదు. కానీ ‘నా సొంత కూతురు లాంటిది’ అని చెప్పిన రాధికకు మాత్రం అత్తెసరు చదువుతో ముగించేయడం ఎలా అర్ధం చేసుకోవాలి, ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా!

అదీ కాక, తన ‘సొంత కూతురుతో సమానం’ అయినప్పుడు 14 సంవత్సరాలకే పెళ్లి చేసి పంపేయడం ఎలా సాధ్యం! బాల్య వివాహాలు చట్ట విరుద్ధం అన్న సంగతి ఆమెకు తెలియకుండా ఉండదు కదా. తన కూతుళ్లకు ఉన్నత చదువు రిజర్వ్ చేసిన టీచర్ గారు, ‘మాల’ కూతురును మాత్రం ‘పని పిల్ల’ గా రిజర్వ్ చేసుకున్నారు!

ఆర్ధికంగా, సాంఘికంగా రోహిత్ ఎలాంటి గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నాడో అర్ధం చేసుకునేందుకు అతని తమ్ముడు రాజా అనుభవాలు తెలుసుకుంటే సరిపోతుంది. రాధిక నేపధ్యం గురించిన వాస్తవాలను ప్రచురించడానికి హిందూస్తాన్ టైమ్స్ పత్రిక రాజా వేముల అనుమతి కోరింది. పత్రిక అడిగేవరకూ రాధిక, రాజాలు తమ వాస్తవ నేపధ్యం ఎవరికి చెప్పలేదు. తాను మాల అని రాధిక చెప్పారు గానీ, పసి వయసులోనే దత్తత వెళ్ళిన సంగతి ఆమె వెల్లడి చేయలేదు.

రాజా వేముల మాటల్లో..

హిందూస్తాన్ టైమ్స్ విలేఖరి తమ తల్లి గతాన్ని తెలుసుకున్నామని దానిని ప్రచురిస్తామని చెప్పినపుడు రాజా ఆశ్చర్యపోయారు. ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది మీకు అంటూ ఆరా తీశారు. తాము గుంటూరు వెళ్ళి ఎవరెవరితో మాట్లాడిందీ అంతా చెప్పాక రాజాను దుఃఖం కమ్మింది.

“అవును, మా వెనుక ఉన్న నిజం ఇదే. మా అన్న నేను ఈ నిజాన్ని దాచి పెట్టడానికి ప్రయత్నించాము. మేము ‘అమ్మమ్మ’ అని పిలిచే వ్యక్తి వాస్తవంలో మాకు యజమాని అని చెప్పుకునేందుకు మేము సిగ్గు పడ్డాము” అని రాజా తెలిపారు.

రోహిత్, రాజాలు తమ నేపధ్యాన్ని దాచి పెట్టడానికి కారణం వారి తల్లి అసలు కులం కాదు, వారి సో-కాల్డ్ అమ్మమ్మ వద్ద తాము పని మనుషులుగా బతికామన్న నిజమే వారిని దాపరికానికి ప్రోద్బలించింది. UoHలో రోహిత్ తన నేపధ్యం ఎవరికి చెప్పేవాడు కాదు. అక్కడే ఆయన MSc పూర్తి చేసి అనంతరం PhD కు అర్హత పొందారు.

రోహిత్ కు 40 వేలు ఇచ్చి ఆదుకున్న అతని నమ్మకమైన మిత్రుడు రాంజీకి కూడా పూర్తి వివరాలు తెలియవు. అవసరాలు గడుపుకోవడానికి ఎవరూ చేయని పనులు చేశాడని తెలుసు గానీ అమ్మమ్మ ధనికురాలు అన్న సంగతి మాత్రం ఆయనకూ తెలియదు. కులం విషయానికి వస్తే తనను తాను దళితుడుగానే రోహిత్ చెప్పుకున్నాడు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో పని చేయడమే అతని దృక్పధం ఏమిటో తెలుపుతుంది. 

హిందూస్ధాన్ టైమ్స్ తనను సంప్రదించిన సందర్భంలో తన అనుభవాలను కూడా కొన్నింటిని రాజా వివరించారు.

ఆంధ్ర యూనివర్సిటీ MSc ప్రవేశ పరీక్షలో రాజాకు 11వ ర్యాంకు రావడంతో అక్కడ చేరాడు. రెండు నెలలు గడిచాక పాండిచ్చేరీ యూనివర్సిటీ ఫలితాలు వచ్చాయి. అక్కడా సీటు వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ కంటే పాండిచ్చేరి యూనివర్సిటీ మంచిదని భావించిన రాజా టి.సి ఇమ్మని ఏ‌యూ అధికారులను కోరాడు.

“టి.సి కోసం రు 6,000 చెల్లించాలని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. నా దగ్గర డబ్బు లేదు. మా అమ్మమ్మ కుటుంబం వాళ్ళు ఏ సహాయమూ చేయలేదు. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో నా మిత్రులను అడగడం తప్ప వేరే మార్గం లేకపోయింది. వారిలో కొందరు రు, 5/-, 10/- ఇచ్చారు. 2011లో ఇది జరిగింది. అప్పుడే మొదటిసారిగా నాది విలువలేని ముష్టి బతుకు అన్నది అనుభూతిలోకి వచ్చింది” అని రాజా వివరించారు.

రాజా పాండిచ్చేరిలో చేరడానికి వెళ్లినప్పుడు అనాధ ఎయిడ్స్ రోగుల కోసం నెలకొల్పిన ఆశ్రమంలో 20 రోజుల పాటు నివసించాడు. “ఆ తర్వాత ఒక సీనియర్ నన్ను ఆదుకున్నాడు. క్యాంపస్ బైట ఆయన తనకోసం ఇల్లు తీసుకుని నివసించేవాడు. అక్కడ ఇంట్లో సహాయం చేయడానికి (పని మనిషి అని వేరే చెప్పనవసరం లేదు) నన్ను ఉండనిచ్చాడు. నేను ఇంటి పని చేసిపెట్టినందుకు నన్ను తన ఇంట్లో పడుకోవడానికి చోటిచ్చాడు” అని రాజా కష్టభూయిష్టమైన తన యూనివర్సిటీ చదువు గురించి చెప్పారు.

“కాలేజీలో నా తోటి వాళ్ళంతా ఆర్ధికంగా స్ధితిమంతులు. క్యాంపస్ బైటి నుండి పిజ్జాలు, బర్గర్ లు తెచ్చుకుని తినేవాళ్లు. నేను బలహీనంగా ఎందుకు ఉన్నానని వారు కనీసం అడిగేవారు కూడా కాదు. నేను ఆకలితో ఉన్నానన్న సంగతి అక్కడ అందరికీ తెలుసు” అని రాజా చెప్పారు. ఆకలికి మాడుతూనే రాజా MSc మొదటి సం.లో 65%, రెండో సం.లో 70% మార్కులు తెచ్చుకున్నాడు. “(ఆకలితో మాడుతున్నా) మీ అమ్మమ్మ మీకు ఎందుకు సాయం చేయలేదు?” అన్న ప్రశ్నకు “అది ఆమెనే అడగండి” అని రాజా బదులిచ్చారు.

రియాజ్ మాటల్లో…

రోహిత్ గురించిన వివరాలు ఎక్కువగా పదిలంగా ఉన్నది అతని ప్రాణ స్నేహితుడు రియాజ్ వద్దనే. రియాజ్ చెప్పిన వివరాలు తమ్ముడు రాజా, తల్లి రాధికలు కూడా చెప్పలేదు. రాధిక గురించిన మరిన్ని వివరాలు కూడా రియాజ్ చెప్పారు.

“రాధిక ఆంటీకి చదువు అంటే వల్లమాలిన ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆమె తన పిల్లల ద్వారా తిరిగి చదువు కొనసాగించేందుకు పూనుకున్నారు. పిల్లలకు వారి సబ్జెక్ట్ లు బోధించడం కోసం వారి పుస్తకాలను ముందు ఆమె చదివేవారు. తాను చదివి అర్ధం చేసుకుని దానిని పిల్లలకు చెప్పేవారు” అని రియాజ్ తెలిపారు.

“రోహిత్ BSc ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు రాధిక ఆంటీ BA సెకండ్ ఇయర్ లో ఉన్నారు. రాజా యేమో BSc ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు. మొదట రోహిత్ డిగ్రీ పాస్ అయ్యాడు. ఆ తర్వాత సం.ము ఆంటీ పాస్ అయితే ఆ మరుసటి సం.ము రాజా పాస్ అయ్యాడు. కొన్నిసార్లు మేమంతా కలిసి చదువుకునేవాళ్ళం. ఒక్కోసారైతే ఒకే రోజు మాకందరికీ (రోహిత్, రియాజ్, రాధిక, రాజా) పరీక్షలు ఉండేవి” అని రియాజ్ తెలిపారు.

రోహిత్ కు అత్యంత ఆనందకరమైన రోజులు రియాజ్ తో ఉన్నప్పుడే గడిచాయని హిదూస్తాన్ టైమ్స్ తెలిపింది. రోహిత్, రియాజ్ లు ఇద్దరూ గడిపే ఇష్టమైన చోట్లకు పత్రిక విలేఖరిని రియాజ్ తీసుకెళ్లి చూపించాడు. పార్టీలు, యుక్తవయసు క్రష్ లు, అమ్మాయిల కోసం కొట్లాటలు, సినిమాలు, సంగీతం, ఫుట్ బాల్ ఆటగాళ్ల హెయిర్ స్టైళ్ళు… దాదాపు గుంటూరు వీధులన్నీ రోహిత్-రియాజ్ ల కధలతో నిండాయని పత్రిక తెలిపింది.

ఎప్పుడూ రోహిత్ హీరో అయితే తాను పక్క పాత్రధారిని అని రియాజ్ చెప్పుకున్నాడు. “ఒకసారయితే టీచర్ గారు రోహిత్ ని క్లాస్ నుండి బైటికి గెంటేశారు. ఎందుకంటే రోహిత్ మరీ ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నాడని టీచర్ కి కోపం వచ్చింది. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఆ సందర్భంలో రోహిత్ తెలివితేటల గురించి తెలిసిన ప్రిన్సిపాల్ గారు రోహిత్ తరపున జోక్యం చేసుకుని టీచర్ ని పాఠం చెప్పేముందు సరిగ్గా ప్రిపేర్ అయి రావాలని హెచ్చరించారు” అని రియాజ్ తెలిపారు. గుంటూరు లోని హిందూ కాలేజీ సంగతి ఇది. హిందూ కాలేజ్ లో ఏ మాత్రం కులం గొడవ ఉండేది కాదని రియాజ్ తెలిపారు.

“ఎన్ని ఆటంకాలు వచ్చినా రోహిత్ ఎక్కువగా రెండు అంశాలను తన జీవితంగా చెప్పేవాడు. పార్ట్-టైమ్ ఉద్యోగాలు వెతుక్కోవడం, ఇంటర్నెట్ పైన సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపడం. ఆయన జులియన్ ఆసాంజేకు పెద్ద అభిమాని. వికీ లీక్స్ ఫైళ్ళను చదివేందుకు ఎక్కువ సమయాన్ని గడిపేవాడు.

రోహిత్ కు PhD అంటే కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు. సాంఘిక శాస్త్రాలు, టెక్నాలజీ అంశాన్ని పరిశోధన కోసం స్వీకరించిన రోహిత్ తాను సంపాదించిన జ్ఞానాన్ని పరిశోధనలో వినియోగించేందుకు పూనుకున్నాడు. సాంఘిక శాస్త్రాలలో రోహిత్ సంపాదించిన జ్ఞానంలో ఎక్కువ భాగం ఏ‌ఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘాలతో కలిసి తిరగడం ద్వారా నేర్చుకున్నదేనని రియాజ్ చెప్పారు. రాజకీయ సిద్ధాంతాలను అధ్యయనం చేయడానికి ఈ సంఘాలు ప్రాముఖ్యత ఇస్తాయని అది రోహిత్ కు బాగా ఉపయోగపడిందని రియాజ్ చెప్పారు.

తాను చనిపోవడానికి వారం ముందు రోహిత్, రియాజ్ కు ఫోన్ చేసి మాట్లాడాడు. “తాను తన PhD ని వదిలిపెట్టాల్సి వస్తుందేమోనని భయంగా ఉందని రోహిత్ అన్నాడు. ఎం‌పిలు, ఎం‌ఎల్‌ఏలు, మంత్రులతో పాటు యూనివర్సిటీ యాజమాన్యం మద్దతు కూడా ఉండడం వల్ల అవతలి పక్షం ఏ‌బి‌వి‌పి బాగా బలంగా ఉన్నదని చెప్పాడు. (సస్పెన్షన్ వ్యతిరేక పోరాటంలో) విజయం సిద్ధిస్తుందన్న నమ్మకం అతను అప్పటికే కోల్పోయాడు” అని రియాజ్ చెప్పారు.

అయితే ఆ రోజు ఫోన్ లో చాలాసేపు మాట్లాడుకున్నాక రోహిత్ మామూలు మూడ్ లోకి వచ్చాడని రియాజ్ చెప్పారు. “మనం త్వరలోనే వ్యాపారం మొదలు పెట్టి గుంటూరును ఏలుతాం” అని కూడా అన్నాడని చెప్పారు. రియాజ్ ప్రకారం రోహిత్ కు PhD పూర్తి చేయడం చాలా ముఖ్యం. అయితే అది కెరీర్ కోసం కాదు. తన పరిశోధన తాను కొత్త అంశాన్ని కనుగొనేందుకు బాటలు వేస్తుందని రోహిత్ నమ్మినందుకు.

“అతని కుటుంబ గాధ రోహిత్ ను తన జీవితం అంతా వెంటాడింది. అతను తాను పెరిగిన ఇంట్లోనే కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ వివక్షకు లొంగడానికి బదులు రోహిత్ పొరాడి బైటికి వచ్చే ప్రయత్నం చేశాడు. తన అంతిమ ప్రయాణం PhD కి వెళ్ళేముందు అనేక ఆటంకాలను బద్దలు కొట్టాడు. తాను ఇక ఎంతమాత్రం ముందుకు వెళ్లలేనని గ్రహింపుకు రావడంతో తన ప్రయత్నాల్ని వదిలేశాడు” అని రియాజ్, రోహిత్ ఆత్మహత్యకు కారణం ఏమిటో వివరించాడు. 

…జీవితమే ఒక శాపం. నా పుట్టుకే ఒక ప్రాణాంతకమైన ప్రమాదం. నా బాల్యపు ఒంటరితనం నుండి నేను ఎన్నడూ బైటికి రాలేకపోయాను. (నేను) నా గతం నుండి (విసిరివేయబడ్డ) ఒక ప్రశంసార్హత లేని (పరిగణించ బడడానికి అర్హత లేని) బిడ్డడిని.

అని రోహిత్ ఎందుకు రాశాడో ఇప్పుడు అర్ధం చేసుకోవచ్చు. అతని ఒంటరితనానికి కారణం ఏమిటో స్పష్టంగా గ్రహించవచ్చు.

మన భావాలు వాడిపారేసినవి (second handed). మన ప్రేమ (ముందే అనుకుని) నిర్మించుకున్నది. మన నమ్మకాలు రంగులు అద్దినవి. మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినవి. గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది.

ఒక మనిషి విలువ అతని తక్షణ ఐడెంటిటీగానూ, సమీప అవకాశం (ఒకరికి అత్యంత దగ్గరగా దేనిని చూస్తే దానితో అతనిని/ఆమెను కొలవడం) గానూ దిగజారిపోయింది. ఒక వోటుగా; ఒక అంకెగా; ఒక వస్తువు (thing) గా. ఒక మనిషి ఎప్పుడూ ఒక (ఆలోచించగల) మెదడుగా చూడబడలేదు; నక్షత్ర ధూళితో నిర్మితమైన ప్రసిద్ధమైనదిగా (ఎప్పుడూ చూడబడలేదు); ప్రతి రంగంలో… చదువులో, వీధుల్లో, రాజకీయాల్లో, చావులో, ఉనికిలోనూ.

ఈ మాటలకు/రాతకు అర్ధం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. తన మనో చేతన చిన్నప్పటి నుండీ లోతుగా గాయపడుతూ వచ్చిన అనుభవం రీత్యా లోతైన అర్ధంతో రోహిత్ రాసిన మాటలకు ఇతరులు తమకు తోచిన అర్ధాలను తీసుకున్నారు. తమకు నచ్చిన, అనుకూలంగా ఉన్న, తాము నమ్మిన అర్ధాలను మాత్రమే వారు తీసుకున్నారు. రోహిత్ వ్యక్తం చేసిన వాస్తవ అర్ధాన్ని మాత్రం వారు తీసుకోలేకపోయారు.

ఎందుకంటే రోహిత్ చెప్పినట్లుగా మనిషి భావాలు వాడిపారేసినవి. కులం కళ్ళతో మనుషుల్ని చూడ్డానికి అలవాటు పడిన గుంపులన్నీ చేరి తాము ముందే నిర్మించుకున్న కులం రంగులను రోహిత్ రాతలకు అద్ది అర్ధం చేసుకున్నారు. రోహిత్ తనను చిన్నతనం నుండీ, తనది అనుకున్న తన ఇంట్లోనే ఎదుర్కొన్న కుల వివక్షను చీత్కరిస్తూ చివరి రచన చేస్తే అందులో కూడా రోహిత్ దళితరాహిత్యాన్ని వెతికారు. ఇప్పుడూ వెతుకుతున్నారు. ప్రకటిస్తున్నారు కూడా.

భారత దేశంలో మనుషుల భావాలు కుల వ్యవస్ధ వాడిపారేసిన భావాలు మాత్రమేనని రోహిత్ తన లేఖలో స్పష్టం చేశారు. యూనివర్సిటీలో రోహిత్ తెలివితేటలు ఎవరికీ అక్కర్లేదు. విద్యార్ధుల తెలివితేటల్ని ప్రోత్సహించి సానపట్టే బాధ్యత అప్పగించబడిన అగ్రకుల ప్రొఫెసర్ లకు అసలే అవసరం లేదు. వారికి అప్పటికే సమాజం నిర్మించి ఇచ్చిన రోహిత్ కులం మాత్రమే కావాలి. రాజకీయాధికారాన్ని చేపట్టిన హిందూత్వ అనుబంధ సంస్ధ ఏ‌బి‌వి‌పికి కష్టం కలిగిస్తే వారు ఎవరైనా యూనివర్సిటీలో ఉండకూడదు. ఫలితమే రోహిత్ ఆత్మహత్య. కొత్త సంగతి ఏదో ఒకటి కనిపెడతానని నమ్మిన రోహిత్ అందుకు దారులు మూసుకున్నాక అతనికి ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు.

రోహిత్ కులం గురించి ఇప్పటికీ పేలుతున్న సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, షానవాజ్ హుస్సేన్, మురళీధర్ రావు… ఇలాంటివారందరికీ ఈ సంగతులు తెలియవా? తెలియకుండా ఉండడం ఎలా సాధ్యం? అందుకు అవకాశం లేదు. కానీ వాళ్ళకి కావలసింది స్వార్ధ ప్రయోజనాలే తప్ప రోహిత్, అతని లాంటి అనేక మంది బాధాసర్పదృష్టులను విముక్తి చేయడం కాదు.

ఈ అన్యాయాల్ని ఒక్క దళితులే కాదు, దళితేతరులు కూడా గుర్తించాలి. గుర్తించి కుల అణచివేతకు వ్యతిరేకంగా వారూ ఉద్యమించాలి. లేకుంటే మరో రోహిత్ లోకాన్ని వీడిపోడన్న గ్యారంటీ ఏమీ లేదు.

……………….అయిపోయింది.

ఈ కధనం ఆంగ్ల వర్షన్ కోసం కింది లంకె లోకి వెళ్లగలరు.

Rohit Vemula – an unfinished portrait | Hindustan Times

2 thoughts on “రోహిత్, రాధిక: అచ్చమైన దళిత కధ! -3

  1. రోహిత్ దీన గాధ యొక్క ఒక్కొక్క విషయం తెలిసేకొద్దీ, మనసు బాధతో నిండిపోతుంది. రోహిత్, మరియు ఆ కుటుంబం ఇలాంటి ఎన్ని అవమానాలని,బాధల్ని తమలో నింపుకుని ఉన్నారో. ఇన్ని సమస్యల మధ్య కూడా ఆ అన్నదమ్ములు చదువులో రాణించడం చాలా గొప్ప విషయం. పిల్లలతో పాటు,వారి అమ్మగారు కూడా కలిసి చదివి గ్రాడ్యుఏషన్ పూర్తి చేయడం అద్భుతం.

    డేవిడ్ గోలియత్ ల కథలో, చివరికి డేవిడే గెలుస్తాడని సంబరపడటం కేవలం మిధ్య. నిజ జీవితంలో ఎందరో డేవిడ్లు, గోలియత్ల రాక్షసత్వానికి బలవుతూనే ఉన్నారు. కానీ, మరణం జీవితానికి శాశ్వత ముగింపు కాదు. ప్రళయదినం నాడు, రోహిత్ లాంటి, ‘మంచి ‘ తరపున పోరాడే డేవిడ్ లందరికీ తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. లేకపోతే ‘మంచి ‘ అనే మాటకే అర్థం లేదు.
    అప్పటి దాకా రోహిత్ ఆత్మకు శాంతి కలగాలనీ, వారి కుటుంబానికి, ఆటుపోట్లని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు చేకూరాలనీ ప్రార్థిద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s