
Protest in Nagpur
మొదటి భాగం తరువాత………………..
–
రాధిక ఎదుర్కొంటున్న హింసను చూసి ఆమెను ‘దత్తత’ తెచ్చుకున్న అంజని, బహుశా, తన తప్పు సవరించుకునే పనిలో పడ్డారు. మణి నుండి తన కూతురు, మనవళ్లను రక్షించుకున్నానని ఆమె చెప్పారు. “వాళ్ళు మణిని వదిలిపెట్టి వచ్చేశారు. 1990లో వాళ్ళను మళ్ళీ మా ఇంట్లోకి ఆహ్వానించాను” అని అంజని చెప్పారు.
అయితే రాధిక చెప్పింది అది కాదు. ఈ విషయాలు హిందూస్తాన్ విలేఖరికి చెబుతున్నప్పుడు రాధిక, అంజని పక్కనే ఉన్నారు. అంజని స్పష్టమైన ఆంగ్లంలో అలవోకగా మాట్లాడారని విలేఖరి చెప్పారు. కానీ రాధికకు ఆంగ్లం తెలియదు. ఆమె హిందూ విలేఖరికి చెప్పినదాని ప్రకారం మణి కుమారే తన భార్యా బిడ్డలను విడిచిపెట్టారు. అనగా వారిని తనకిక వద్దనుకున్నారు.
అంజని మాటల ప్రకారం మణికుమార్, వెంకటేశ్వర్లుల నిర్ణయానికి, రాధిక ఎదుర్కొంటున్న దెబ్బల హింస వల్ల, ఆమె ఆమోదం తెలిపి ఉండాలి. రోజూ హింస పడడం కంటే తన వద్దనే రాధిక ఉండడం మంచిదని ఆమె భావించి ఉండవచ్చు. కొడుకు కోడలు విడాకులు తానే దగ్గరుండి జరిపించానని వెంకటేశ్వర్లు చెప్పారు గనుక ఈ అభిప్రాయానికి రావడం.
రోహిత్ తాత వెంకటేశ్వర్లు అంజనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. తమకు అబద్ధం చెప్పి మాల పిల్లను అంటగట్టారని ఆయన కోపం. కానీ అంజని చెప్పిన తప్పూ ఏమీ లేదు. వెంకటేశ్వర్లు నాన్నగారికి ఆమె అంతా చెప్పారు. చెప్పకుండా ఊరుకుంటే తెలియదులే అని వాళ్ళు నమ్మారు. కానీ రాధిక ‘మాలతనం’ ను దాయడం కుదరదని భారత దేశ కుల వ్యవస్ధ మరోసారి గర్జించింది. ఫలితంగా రాధిక జీవితం నరకం అయింది. ఆమె పిల్లల భవిష్యత్తులో సామాజిక అంధకారం కమ్ముకుంది.
రాధికను ఆమె పెంపుడు తల్లి అంజని కూతురులా చూసుకుందో, పని పిల్లగా చూసిందో రోహిత్ ప్రాణ మిత్రుడు రియాజ్ ని అడిగితే చెబుతారు. రోహిత్ చేసిన మొదటి, చివరి రచనలో ఎంతో లోతైన అర్ధంతో రాసిన మాటలకు అర్ధం ఏమిటో చదవగానే అర్ధం చేసుకున్నది బహుశా రియాజ్ ఒక్కరే అయి ఉండవచ్చు. తన చిన్నప్పటి ఒంటరి తనం గురించీ రోహిత్ రాసిన మాటలకు అర్ధం ఏమిటో రియాజ్ చెప్పారు.
“రాధిక ఆంటీ, తన పిల్లలు ఆమె తల్లి ఇంట్లో పని మనుషుల్లాగే జీవించారు. ఇతరులంతా తీరిగ్గా కూర్చొని ఉంటే ఇంట్లో పనంతా రాధికా, ఆమె పిల్లలు చేసేవారు. రాధిక ఆంటీ తాను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండీ పని చేస్తూనే ఉన్నారు” అని రియాజ్ వెల్లడించారు. 1970ల్లో రాధిక ఆమె తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడింది. చైల్డ్ లేబర్ యాక్ట్ ఆనాడు ఉన్నట్లయితే రాధిక తల్లిగా చెప్పబడుతున్న అంజనిపై నేరారోపణ జరిగి ఉండేదని హిందూస్తాన్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
చిన్న పిల్లగా పని పిల్లగా రావడమే కాదు. చిన్న పిల్లగానే పెళ్లి కూతురు అయ్యారు రాధిక. 1985లో ఆమెకు 14 సం.ల వయసులో పెళ్లి చేసేశారు. అనగా 1971లో రాధికను అంజని తన ఇంటికి తెచ్చుకున్నట్లు. తాను మాల అని, దత్తత తెచ్చుకోబడ్డానని రాధికకు తెలిసింది ఆమెకు 12/13 సం.ల వయసప్పుడే. అప్పటి వరకు ఆమె అంజనియే తన తల్లి అని భావించింది.
తన తల్లి అనుకున్న తల్లి వాస్తవంగా తల్లి కాదని తెలిసినప్పుడు ఆ పసి మనసు ఎంత తీవ్రంగా గాయపడి ఉంటుందో మాటల్లో చెప్పగలమా? చెప్పడానికి రాధికకు అప్పటికి లోకం తెలియదు. చదువూ రాదు. అసలు వడ్డెర కాలనీలోని వాళ్ళందరూ రాధికను అంజని ఇంట్లో పనిపిల్లగానే పరిగణించారు తప్ప, దత్తత తెచ్చుకున్న కూతురుగా ఎప్పుడూ అనుకోలేదు. పొద్దున లేచింది మొదలు ఇంటెడు చాకిరీ చేస్తున్న రాధిక ‘పని పిల్ల’ అవుతుంది గానీ ‘కూతురు పిల్ల’ ఎలా అవుతుంది మరి!
“అప్పట్లో అంజని తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఓ సారి రాధికను బాగా తిట్టింది, కొట్టింది. ఆ దెబ్బలకు ఏడుస్తూ మా ఇంటి దగ్గర నిలబడి ఉంటే ఏమయిందని అడిగాను. తాను ఇంట్లో పని చేయనందుకు తన అమ్మమ్మ తనను ‘మాల లం_’ అని తిట్టిందని, తనను ఇంట్లోకి తెచ్చి పెట్టినందుకు అంజని అమ్మను కూడా తిట్టిందని చెప్పింది” అని దళిత కాలనీలో నివసించే వృద్ధురాలు ఉప్పలపాటి దనమ్మ చెప్పారు.
దనమ్మ వయసు ఇప్పుడు 67 సం.లు. రోహిత్ తల్లి రాధిక చిన్నప్పటి నుండి ఎరిగిన పెద్దామె. దనమ్మ మాజీ మునిసిపల్ కౌన్సిలర్ కూడా. ఆమె ఇల్లు మాల కాలనీ, వడ్డెర కాలనీల సరిహద్దులో ఉంటుంది.
హిందూస్తాన్ టైమ్స్ విలేఖరి వడ్డెర, మాల కాలనీల్లో ఇంకా అనేకమందిని అడిగి వివరాలు రాబట్టారు. వారందరి దృష్టిలో రాధిక, అంజని ఇంట్లో పని పిల్ల మాత్రమే. ఒక వడ్డెర కాలనీ నివాసి అయితే అంజని పేరు వినగానే కోపంగా మొఖం పెట్టాడట. రాధికను ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా మణి కుమార్ ని ఆమె మోసం చేసిందని ఆయన నిశ్చితాభిప్రాయం. ఒక్క మణికుమార్ ని మాత్రమే కాదు మొత్తం వడ్డెర కాలనీనే ఆమె మోసం చేసిందని ఆయన కోపం వ్యక్తం చేశాడు.
మరి కాదా! ఒక మాల పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఒక తప్పయితే, ఆమెను తోటి వడ్డెర కుటుంబంలోకి ‘వడ్డెర’ అని చెప్పి మరీ పెళ్లి చేసి పంపిందాయే. పెళ్లి చేయడం ద్వారా మణి కుమార్ ని మోసం చేస్తే, తన ఇంట్లో పెట్టి పెంచడం ద్వారా మొత్తం కాలనీకే చెడ్డ పేరు తెచ్చి పెట్టింది.
రాధిక అందరిలా కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవులు, రక్త మాంసాలు ఉన్న మనిషేనా? మరీ ముఖ్యంగా ఆలోచించే మెదడూ, అనుభవాలు తెచ్చుకునే మనసూ కలిగిన మనిషేనా? ఏమో! కావచ్చు, కాకపోవచ్చు. ఇంటెడు చాకిరీ చేస్తున్నది కనుక మనిషే. మాల లం_ కనుక కాకపోవచ్చు. అలాంటి తల్లికి పుట్టిన కొడుకు రోహిత్ వేముల!
రోహిత్ ఒంటరితనానికి అర్ధం ఇదే.
“ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడంలో, ఇన్నేళ్లుగానూ, బహుశా నేను తప్పు కావచ్చు. ప్రేమ, బాధ, చావు.. వీటన్నింటిని అర్ధం చేసుకోవడంలో నేను తప్పు కావచ్చు” అనుకున్న ఆత్మన్యూనత లోకి రోహిత్ శరీరాన్ని, మనసును, వయసును, ఎదుగుదలనూ, ఆలోచనలనూ నెట్టివేసిన ఒంటరితనం ఇదే. ఈ ఒంటరితనాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్ధం చేసుకోవడానికి బహుశా మాలగా, మాదిగగా పుట్టి అనుభవిస్తేనే సాధ్యం అవుతుందేమో.
లేకపోతే “ఎవరికీ చెప్పకుండా, చట్టాన్ని ఉల్లంఘించి ఆ గదిలోకి వెళ్ళాడు. విగత జీవియై తిరిగొచ్చాడు” అంటూ ఒక్క ముక్కలో రోహిత్ అనుభవించిన ఏడేడు సముద్రాల బాధ లోతులనూ, ఎవరెస్టు సైతం సాటిరాని వ్యక్తిత్వాన్నీ దులపరించి పారేయడం ఎలా సాధ్యపడుతుంది? బ్రాహ్మణీయ హైందవం వేల ఏళ్ల తరబడిన కులాధిపత్య దురహంకారాన్ని అణువణువూ నింపుకున్నాక మాలోడి చావుకి కాసింత సానుభూతి పొందేందుకు సైతం అర్హత లేదు గాక లేదు.
‘బాబూ మేమూ మనుషులమే. మాకూ వసతులు కల్పిస్తే ప్రతిభ నిరూపించుకుంటాం. మమ్మలి తొక్కేయవద్దు. అంటరానివారుగా చూడవద్దు. తరతరాల అణచివేత నుండి బైటపడేందుకు కాసింత చోటు ఇవ్వండి’ అని బతిమాలితే, అడిగితే, ఉద్యమిస్తే అది సాటి మనుషులకు కర్ణ శోష! రాజ్యానికి ‘కులతత్వం’, ‘ఉగ్రవాదం’, ‘జాతీయ-వ్యతిరేకం.’
నోరెత్తి నినదిస్తే ‘కులతత్వం’ అని నిందిస్తుంటిరి, ఒంటరిగా మిగలరా! పిడికిలి బిగించి డిమాండ్ చేస్తుంటే ‘ఉగ్రవాదం’, ‘నక్సలిజం’ అంటూ ఉక్కు పాదం మోపుతుంటిరి, ఒంటరులు అయిపోరా!! ఫేస్ బుక్ దూషణకు క్షమాపణలు కోరినందుకు హాస్టల్ నుండి రస్టికెట్ చేసేస్తిరి, దళితులు ఒంటరులు కాక ఏమవుతారు? దళిత జన (వి)దూషకులకు దేశభక్తి బిరుదులూ, దూషణలను నిలదీసినందుకు ‘జాతి వ్యతిరేక’ ముద్రలూనా! అన్యాయం సుమా.
తన మాల పుట్టుకను ఎరిగిన రోహిత్ ఒంటరితనం ఎదుర్కొకుండా ఏ చట్టమూ ఆదుకోలేదు. బాల కార్మిక నిరోధ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం, అందరూ సమానులేనన్న సామ్యవాద-లౌకికవాద-సర్వస్వతంత్ర-గణతంత్ర రాజ్యాంగం.., ఏవీ పని చేయలేదు.
“తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అంటేనే రోహిత్ ద్వేషించేవాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ప్రతిసారీ అతని తల్లి పని మనిషిగా పని చేయడం మొదలు పెట్టేది. రాధిక ఆంటీ లేకపోతే ఆమె పిల్లలు ఆ పనిని అందుకోవాల్సి వచ్చేది. వాళ్ళు కిలో మీటర్ దూరంలోని తమ సొంత ఒక-గది ఇంటికి మారాక కూడా ఇలా రోహిత్ కుటుంబం మొత్తాన్ని అక్కడ పనికి పిలవనంపే కార్యక్రమం కొనసాగుతూ పోయింది” అని రియాజ్ తెలిపారు.
గుంటూరు లో BSc చదివిన మూడేళ్లూ రోహిత్ తన ఇంటికి వెళ్ళిన ఘటనలు చాలా తక్కువ అని రియాజ్ చెప్పారు. రియాజ్ మరో ఇద్దరు కుర్రాళ్ళతొ కలిసి రోహిత్ ఓ చిన్న గదిలో నివసించేవారు. తన అవసరాలు గడుపుకోవడానికి రోహిత్ తల్లిని ఇబ్బంది పెట్టలేదు. నిర్మాణ కూలీగా పని చేసి డబ్బులు తెచ్చుకునేవాడు. కేటరింగ్ బాయ్ గా పని చేసేవాడు. వ్యాపార సంస్ధల పాంప్లెట్లు పంచిపెట్టి డబ్బులు మిగిల్చేవాడు. వివిధ ఎగ్జిబిషన్ లలో కూలీగా కూడా పని చేశాడు.
అమ్మమ్మ అంజనికి పుట్టిన పిల్లల వివరాలను హిందూస్తాన్ టైమ్స్ సంపాదించి ప్రచురించింది. పత్రిక ప్రకారం ఆమెకు నలుగురు పిల్లలు. ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలు. ఒక కొడుకు ఇంజనీర్, మరొక కొడుకు సివిల్ కాంట్రాక్టర్. ఒక కూతురు BSc-BEd పూర్తి చేయగా మరో కూతురు BCom-BEd చదివారు. గుంటూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ సివిల్ కాంట్రాక్టర్ పేరు బాగా తెలిసిందేనట. టిడిపి ఎంపి, మాజీ ఏపి మాజీ సిఎం అయిన ఎన్‌టిఆర్ జ్యేష్ట పుత్రుడు ఎన్ హరికృష్ణతొ ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయట.
అంజని కూతుళ్లలో ఒకరు గుంటూరులో పేరు మోసిన క్రిమినల్ లాయర్ భార్య. కాగా అంజని దేవి గారు తన కూతుళ్ల కంటే కూడా ఉన్నత విద్యావంతురాలు. ఆమె MA-MEd చదివారు. గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణలోని హై స్కూల్ కు హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారామె. ఆమె భర్త ఒక ప్రభుత్వ శాఖలో చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ పని చేశారు. వారి ఇల్లు ప్రకాష్ నగర్ లో అతి పాత, అతి పెద్ద ఇల్లు ట!
………………….ఇంకా ఉంది