రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!


Protest in Guwahati

Protest in Guwahati

“మొదట దళిత సమస్య, ఆ తర్వాతే విద్యార్ధి సమస్య” శీర్షిక గల ఆర్టికల్ కింద వ్యాఖ్యాతల అభిప్రాయాలకు సమాధానం ఈ టపా.

*********

మీ ప్రశ్నల రీత్యా నేను చెప్పవలసినవీ, అడగవలసినవి కొన్ని ఉన్నాయి.

విషయం మొత్తాన్ని ‘చట్టం పాటించడం లేదా అతిక్రమించడం’ లోకి మీరు కుదించివేశారు. ఆ పరిధి వరకే మీ దృష్టి ఉన్నట్లయితే అది మీ యిష్టం. కానీ ఈ అంశం కేవలం చట్టం అనుసరణ/ అతిక్రమణ వరకే పరిమితం అయిందని నేను భావించడం లేదు.

పేరు పొందిన ఒక యూనివర్సిటీలో దళిత విద్యార్ధులు ఒక సంఘంగా ఏర్పడి తమ హక్కుల కోసం పని చేస్తున్నారు. భారత దేశంలో వేళ్లూనికుని ఉన్న కుల వ్యవస్ధ వారు దళిత విద్యార్ధి సంఘంగా ఏర్పడవలసిన అగత్యం కల్పించింది.

ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘం హిందూత్వ భావజాలం కలిగిన సంఘం. హిందూత్వ కుల వ్యవస్ధను ఉన్నతంగా పరిగణిస్తుంది. కనుక హిందూత్వకు చెందిన ఏ‌బి‌వి‌పి, పైకి ఎన్ని చెప్పినా, భావజాల పరంగానే కుల వ్యవస్ధకు మద్దతు వస్తుంది. అనగా దళితుల అణచివేత వారికి సమస్య కాకపోగా దళితులు సంఘంగా ఆర్గనైజ్ కావడమే సమస్యగా చూస్తారు.

ఆ విధంగా ఏ‌ఎస్‌ఏ ది ప్రతిఘటన, ఏ‌బి‌వి‌పి ది అదికారం. కేంద్ర ప్రభుత్వం అండ ఉందన్న ఆధిపత్యం. మంత్రులు, ఎం‌ఎల్‌సి, పాలక పార్టీ, యూనివర్సిటీ పాలకవర్గం అందరూ ఏ‌బి‌వి‌పి పక్షం వహించిన ఈ ఘటన సందర్భంలో ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు బాధితులు.

కర్ర ఎత్తి కొట్టబోతే ఆ దెబ్బ కాచుకోడానికి చేయి అడ్డం పెడతాం. అలా చేయి అడ్డం పెట్టుకోవడం కూడా చట్టం రీత్యా నేరం అంటున్నారు మీరు.  బలమైన ప్రత్యర్ధి తన చేతుల్తో బంధిస్తే, ఆ బంధం నుండి  తప్పించుకోడానికి పెనుగులాడతాం. ఆ పెనుగులాటలో మన చేయి ప్రత్యర్ధి ఒంటిమీద చీరుడు గాయం చెయ్యొచ్చు. ఆలా గాయం చేయడం కూడా చట్టం ఉల్లంఘన అంటున్నారు మీరు.

చట్టాన్ని ఆశ్రయించి న్యాయం పొందే పరిస్ధితి లేదు ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులకి. చట్టం ఇప్పుడు ఎన్‌డి‌ఏ చేతుల్లో ఉంది. యూనివర్సిటీ పాలకవర్గమే ఏ‌బి‌వి‌పి కి వత్తాసు వచ్చింది. ఆ పరిస్ధితుల్లో వారు చట్టాన్ని ఎలా ఆశ్రయించగలరు? ఒకవేళ చట్టం ఆదుకునే పరిస్ధితి ఉన్నా ఈ లోపు బలహీనుడు తమను తాము నిలబెట్టుకునేందుకు తోచిన ప్రతిఘటన ఇస్తాడు.

దాడి జరిగిన దాఖలా గానీ, కొట్టిన దాఖలా గానీ లేవని కమిటీ నివేదిక తేల్చింది. కొట్టడం వల్ల తగిలిన గాయం లేదని డాక్టర్లు చెప్పారు. బ్లంట్ ఆబ్జెక్ట్ వల్ల అపెండిసైటీస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్న సుశీల్ ప్రకటన నిజం కాదని ఆయనకు ఆపరేషన్ నిర్వహించిన ఆసుపత్రి ప్రకటించింది. అయినా మీరు చట్టం వెనుక నిలబడుతున్నారు.

గుంపుగా వెళ్తే ఏమి? హస్టల్స్ లో, కాలేజీల్లో విద్యార్ధులు గుంపుగానే ఉంటారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్ధితుల్లో మరింత జాగ్రత్త కోసం మామూలుగా కంటే ఎక్కువగా గుంపుగా వెళ్తారు. అందులో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు.

ఒకరు Vs 30 మంది అని మీరు అంటున్నారు. కానీ వాస్తవ పరిస్ధితి ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు Vs ఏ‌బి‌వి‌పి + యూనివర్సిటీ పాలకవర్గం + ఎం‌ఎల్‌సి + కేంద్ర ప్రభుత్వం గా ఉన్నది. ఈ పరిస్ధితిలో చట్టాల ప్రసక్తి తేవడం వ్యర్ధ ప్రస్తావన. బాధితుల్ని మరింతగా విలన్లు చేయడానికే ఈ పరిశీలన పనికి వస్తుంది తప్ప వారికి న్యాయం జరగడానికి కాదు.

చట్టం అన్ని కులాలకీ ఒకే రకంగా వర్తిస్తే ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల (నిరోధక) చట్టం అవసరం రాదు మేడం!

చట్టం అందరినీ ఒకే రీతిలో చూడడం లేదు. (చివరికి ఈ అట్రాసిటీస్ చట్టం కూడా.) చట్టం అనేది వ్యక్తులో, సమూహమో కాదు. అది ఒక సాధనం మాత్రమే. అది ఎవరి చేతుల్లో ఉంటే వారికి అనుకూలంగా పని చేస్తుంది. ఎవరు ధనవంతులు, బలవంతులు అయితే వారి కోసం పని చేస్తుంది. ఈ సంగతి నేను కాదు, రాజకీయ నాయకులు మంత్రులు, ప్రధానులు కూడా అనేకసార్లు అంగీకరించారు.

మీ వ్యాఖలో ఇలా పేర్కొన్నారు.

ఇక కులం ముఖ్యమా ముఖ్యమా అని అంథలా వాదిస్తున్నారే, మరి అసలు ఇంతలా దళిత విధ్యార్ధి దళిత విద్యార్ధి అని పది రోజులుగా అంతటా హోరెత్తించేసారే? సరే ఇదంతే ఏదో మాకు ఈ కర్ణశోష తప్పదు అనుకొని మేము భరించేస్తాము.

నేను ఇలా రాశాను.

“ఒక వేళ అంతిమంగా రోహిత్ వడ్డెర అయ్యారని భావిద్దాం, వాదనకు. అయితే దళితుడు కాదా? అసలు ‘దళిత సమస్య’ అంత ముఖ్యమా? “

“పోనీ వడ్డెర అనుకుందాం. అయితే దళితుడు కాదా?”

వాదనకు రోహిత్ వడ్డెర అనుకున్నా, ఆయన దళితుడే అని చెప్పడానికి పై వాక్యాలతో మొదలు పెట్టాను. ‘దళితుడేనా’ అన్నదే సమస్య అయితే వడ్డెర కూడా దళిత కులమే అని చెప్పేందుకు ప్రయత్నించాను.

రోహిత్ ‘కులం’ లేదా ‘దళితతనం’ అంత ముఖ్యమా అన్నది మీరు అర్ధం చేసుకున్నట్లుగా నేను చెప్పలేదు. రోహిత్ మాల అయినా, వడ్డెర అయినా దళితుడే కదా ఇక సమస్య ఎక్కడిది అని చెప్పడానికి ‘అంత ముఖ్యమా’ అన్నాను. ఏ‌ఎస్‌ఏ కింద స్వయంగా ఆర్గనైజ్ అయిన రోహిత్ దళితుడే అని చెప్పాను. 

ఆత్మహత్యకు సంబంధించి పెట్టిన ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీస్ కేసుల గురించి బొత్తిగా మాట్లాడరే అన్న ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని మిగిల్చింది. బహుశా రోహిత్ వడ్డెర అని మీరు భావిస్తున్నట్లుంది. (ఒకవేళ అదే మీ భావన అయితే) ‘వాదనకు’ అన్నాను తప్ప ఆయన వడ్డెర అని నెర్నూ నిర్ధారించలేదు.  రోహిత్ మాల కులానికి చెందిన వ్యక్తే. అందులో అనుమానం లేదు. ఆ సంగతి రోహిత్ తల్లిగారు చెబుతున్న వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈ అంశం గురించి వివరాలు మరో టపాలో చెబుతాను.

ఇక్కడ ఎస్‌సి/ఎస్‌టి అట్రాసిటీస్ చట్టాన్ని ఆయుధంగా చేసుకోవడం అలా ఉంచండి. ఆ చట్టాన్నే ఇక్కడ ప్రయోగించాలి. నేను ముందరి ఆర్టికల్స్ లో చెప్పినట్లుగా వారు దళితులు కనుకనే సస్పెన్షన్ కు గురయ్యారు. సుశీల్ పైన జరిగిందిగా చెప్పిన దాడి ఒక వంక మాత్రమే. ఆ వంకతో ఏ‌ఎస్‌ఏ ను యూనివర్సిటీలో లేకుండా చేయడం యూనివర్సిటీ పాలకవర్గం, మంత్రులు, ఏ‌బి‌వి‌పి లక్ష్యం.  కాకపోతే ఏ‌బి‌వి‌పి ముందు నిలబడితే మిగిలినవారు వెనక ఉన్నారు. ఈ చర్యల పర్యవసానమే ఆత్మహత్య. కనుక ఆత్మహత్యను ప్రేరేపించినవారిపై ఎస్‌సి/ఎస్‌టి చట్టాన్ని ప్రయోగించడం సరైనది. చట్టాల ఉల్లంఘన గురించి బాధపడుతూ సరైన చట్టాన్ని ప్రయోగించడాన్ని తప్పు పట్టడం భావ్యం కాదు.

అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసర్ స్ధాయి అధికారి ఎందుకు వెళ్ళి దర్యాప్తు చేయాల్సి వచ్చిందని నేను అన్నట్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఆ స్ధాయి అధికారి వెళ్లారంటే అధికార వ్యవస్ధ తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్ధితిని అర్ధం చేసుకోవాలని, సాధారణ కానిస్టేబుల్ పట్టింపుకు సైతం నోచుకుని అట్రాసిటీస్ చట్టం ఈ కేసులో ఉన్నత స్ధాయి అధికారి స్వయంగా పని చేస్తున్నారు అని చెబుతూ ఇది రోహిత్ దళితుడు కాదు అని రుజువు చేసేందుకే అయినట్లు కనిపిస్తోంది అన్న అనుమానం వ్యక్తం చేశాను. దానిని మీరు మరో విధంగా అర్ధం చేసుకున్నారు. ఎందుకు అని నేను అడగలేదు. ఒక పరిస్ధితిని చెప్పాను.

అవును. అసిస్టెంట్ కమిషనరే కాదు, కమిషనర్ గారు వెళ్ళినా తప్పు పట్టాల్సిన పని లేదు (నేను తప్పు పట్టలేదు).  విద్యార్ధి ఉద్యమం ఆ పరిస్ధితి కల్పించిందని మీరు సరిగ్గా గుర్తించారు.

అసలు రోహిత్ పార్ధివ దేహాన్ని మేము పోస్టు మార్టెం కి ఇవ్వం అనే హక్కు విద్యార్ధి నాయకులకి ఎవరిచ్చారు? అది మరి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా?

బాధితుల ఆందోళనలను కూడా మీరు ఈ విధంగా అర్ధం చేసుకోవడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పాలకవర్గం ఐదుగురు దళిత విద్యార్ధులను అన్యాయంగా వారి తప్పు లేకుండా, ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, సస్పెండ్ చేశారు. తమకు న్యాయం దక్కెందుకు బాధితులు వివిధ రకాల ఆందోళనా రూపాలలో నిరసన చేస్తారు. దానిని కూడా చట్టం కళ్ళతో చూడడం…. ప్చ్!

కాబట్టి ఈ కల్లబొల్లి మాటలతో కాలం వృధా చేసుకోక, ఎదైనా రోహిత్ కుటుంబానికి పనికి వచ్చే పని చేస్తే మీకూ వారికీ ఈ సమాజానికి చట్టానికి అందరికీ మంచిది.

దీని అర్ధం ఏమిటో నాకు బోధపడడం లేదు. కల్లబొల్లి మాటలు అయేపనైతే చర్చలో  చేరి కాలం వృధా చేసుకోవడం ఎందుకు? మొత్తం చర్చనంతటినీ మీ చేతుల్లోకి తీసుకోవడమే కాదా ఇది? చర్చలో ఉన్నవారంతా సమానులే. ఒకరు ఎక్కువా మరొకరు తక్కువా కాదు.

మరో వ్యాఖ్యాత శాంభవి/రామ్ గారు ఒక చిన్న facebook పోస్ట్ అన్నారు గానీ నా అవగాహన అది కాదు. ఆ పోస్ట్ లో ఉన్నది కొన్ని అక్షరాలే అయినా వాటి వెనుక ఒక భావజాలం ఉన్నది. ఆ భావజాలం ఒక సెక్షన్ ప్రజానీకం ఎల్లవేళలా, యుగాంతాల వరకూ కిందనే సేవలు చేస్తూ బతకాలని శాసించిన భావజాలం. దానిని ఇప్పుడు పాలకులు (రెండు వైపులా) ఆయుధంగా చేబూనారు. దాన్ని ప్రశ్నించడం అంటే అణచివేతను ప్రతిఘటించడం. అణచివేతకు ప్రతిఘటన ఏ రాజ్యాంగమూ వద్దనలేదు. వద్దంటే అది ప్రజాస్వామిక రాజ్యాంగం కాజాలదు.

అమ్మల పుస్తెలు అమ్ముకుని చదువుకోవాల్సి రావడం అత్యంత బాధాకరం. రోహిత్ వేముల సరిగ్గా ఈ పరిస్ధితిలోనే ఉన్నాడు. అతనికి ఇంటినుండి కూడా డబ్బు రాదు. ఇతనే తన స్కాలర్ షిప్ లో కొంత భాగాన్ని ఇంటికి పంపాలి.

కొంతమందికి మాత్రమే స్కాలర్ షిప్ ఇచ్చి మిగతా పేదవారికి ఇవ్వకపోవడం మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం. ‘విభజించు పాలించు’ అన్న తెల్లవాడి సూత్రాన్ని మన పాలకులు పుణికి పుచ్చుకున్నారు. పేదలందరికీ చదువుకునేందుకు స్కాలర్ షిప్ లు ఇవ్వాలని విద్యార్ధి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. స్కాలర్ షిప్ లు రానివాళ్లు వస్తున్న వాళ్ళని సాంఘిక వివక్షతో చూడడం అందుకు పరిష్కారం కాదు.

కాంగ్రెస్, బి‌జే‌పి లు రెండూ అనుసరిస్తున్న విధానాలు పేదలను కులం ప్రాతిపదికన వేరు చేస్తాయి. పైగా ప్రజల ధనాన్ని అవి మరింతగా ధనికులకు దోచి పెడతాయి. ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్ళు ఎన్ని ఉంటే ప్రజలకు అంత ఉపయోగం. ప్రభుత్వ రంగ కంపెనీలు ఎన్ని ఉంటే అంత ఉపాధి విద్య పూర్తి చేసుకున్నవారికి దక్కుతుంది.

దానికి బదులుగా ఈ పార్టీల విధానాలు ప్రవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రవేటు కాలేజీలు, స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారు. విదేశీ యూనివర్శిటీలకు స్వాగతం పలుకుతున్నారు. విద్యను పూర్తిగా అమ్మకం సరుకుగా మార్చివేశారు. సరుకుగా మార్చిన ఫలితమే ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. ఈ ప్రైవేటు వ్యాపారాలకి సొంతదారులు ప్రభుత్వాలను నడుపుతున్నవాళ్లే. వాళ్ళు ప్రజాధనంతో తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటూ పేదలను గాలికి వదిలేస్తున్నారు. పేదలు, నిరుద్యోగులు ఎంత ఎక్కువమంది ఉంటే వారికి అంత తక్కువకు ఉద్యోగులు, పనివాళ్లు దొరుకుతారు.

కనుక స్కాలర్ షిప్ లలో తేడాకు దళిత విద్యార్ధులు కారణం కాదు. వారు పేదలు కనుక స్కాలర్ షేప్ లు కావాలి. ఇతర కులాల్లో పేదలకు కూడా స్కాలర్ షిప్ లు ఇవ్వాలని అందరూ కలిసి పోరాడాలి. అలా కలిసి పోరాడతారనే కులాల కార్చిచ్చును విద్యార్ధులతోనే పాలకులు రగిలిస్తున్నారు. కనుక విద్యార్ధులు ఐక్యంగా పాలకుల విధానాలపై పోరాడాలి.

దళిత విద్యార్ధులది కులతత్వం కాదు, కులతత్వానికి ప్రతిఘటన. వారికోసం చేసిన చట్టాలను వారు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటేనే ఆ చట్టాల ప్రయోజనం నెరవేరుతుంది. రోహిత్ ఆత్మహత్య, ఐదుగురు దళిత విద్యార్ధుల సస్పెన్షన్ విషయంలో అలాంటి న్యాయమే జరగాలి.

3 thoughts on “రోహిత్: చట్టం ఉల్లంఘన కాదు, అణచివేతకు ప్రతిఘటన!

  1. సర్,ఈ విధ్యార్ధి సంఘాలగూర్చి వివరిస్తారా?అందరిదీ ఒకటే లక్ష్యం(విధ్యార్జన) అయితే ఈ సంఘాలమధ్య ఈ గొడవలేంటి? ఈ సంఘాలు తమ లక్ష్యాలనుండి పక్కకుపోయి ఆధిపత్యవర్గాలకి ఎలా ఊడిగం చేస్తున్నాయో వీలైతే తెలపండి.

    దేశవిదేశాలలో ఎంతోమంది నాయకులు ఇటువంటి సంఘాలనుండి వచ్చినవారేకదా!
    అటువంటివారు అణగద్రొక్కబడవారికి అండగా నిలవాల్సినదిపోయి ఆధిపత్యవర్గాలకు కొమ్ముకాస్తుండడం ఏమిటి?విధ్యాలయాల ఈ వైఫల్యం ఏమిటి?

    నాకుతెలియనివిషయాలను,నా ఆవేదనను కలగలిపి అడుగుతున్నాను.వీలైతేవివరించండి.

  2. ఒహొ!………..ఈ దండోరా మూలంగా చెప్పడం ఏమంటే,

    దళితులు ఇకపై దౌర్జన్యాలకూ, అత్యాచారాలకూ, దాడులకు గురయితే వారి దళిత కులం రద్దు చేయడం జరుగుతుంది. కాని, వారికి జరిగే అవమానాల నుండి విముక్తి మాత్రం కాదు. చుండూరు, కారంచేడుల్లో చనిపోయినవారు దలితులు కారు. వారు ఎవరయినా అయివుండొచ్చు. 😁

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s