రోహిత్ నిరసనకు దారి తీసిన DU ఘటన -వీడియో


రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్ధితుల్లో మొదటిది ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఒక ఘటన అని పత్రికలు, ఛానెళ్ల ద్వారా తెలిసిన విషయం. ఆ ఘటనకు సంబంధించిన వీడియోయే ఇది.

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజీలో గత ముజఫర్ నగర్ మత కొట్లాటలపై ఒక డాక్యుమెంటరీ (ముజఫర్ నగర్ బాకీ హై) ప్రదర్శిస్తుండగా ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సంఘం వాళ్ళు దాడి చేసి ప్రదర్శన నిలిపివేయించారు. ఆ డాక్యుమెంటరీ ‘యాంటీ నేషనల్’ అన్న ఆరోపణతో వారా పని చేశారట.

ముజఫర్ నగర్ అల్లర్లు 2013 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగాయి. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఒక రోడ్డు ప్రమాదం విషయంలో తగాదా జరిగింది. ప్రమాదంలో ఉన్న ముస్లిం యువకుడిని హత్య చేసేవరకు ఆ ఘర్షణ వెళ్లింది. ఇద్దరు యువకులు అతని ఇంటికి వెళ్ళి బైటికి పిలిచి పొడిచారు. అది గమనించి చుట్టూ ఉన్న ఇళ్లవారు గుమి కూడారు. వారు తప్పించుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా వెంటపడి వారిని బాగా కొట్టారు. ఆ ముగ్గురూ చనిపోయారు.

ఇక హిందూత్వకు బోలెడు మేత దొరికింది. అవకాశం కోసం చూస్తున్నవారికి చిన్నదాన్ని పెద్ద అంశంగా మార్చడం పెద్ద పని కాదు. అది మతాలతో పనైతే ఇంకా తేలిక.

వాస్తవంగా జరిగింది చిన్న ట్రాఫిక్ గొడవ. కానీ హిందూ యువకుల చెల్లిని ఆ ముస్లిం యువకుడు వేధించాడని అందుకే అతన్ని ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళని చంపేశారని హిందూత్వ సంస్ధలు ప్రచారం చేశాయి. ఇద్దరు యువకులు జాట్ లు. దానితో జాట్ లు ఎక్కువగా నివసించే పశ్చిమ ‘ఉత్తర ప్రదేశ్’ జిల్లాలు ఉడికిపోయాయి.

ఎన్‌డి‌టి‌వి పరిశోధనలో తేలింది ఏమిటంటే అసలు ఆ చెల్లెలుకు ఆ యువకుడు ఎవరో తెలియదు. ఆమె వేధింపులకు గురయిందని చెప్పిన గ్రామానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. వాస్తవాలు ఎవరికి కావాలి?

మూడు, నాలుగు వారాల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. 62 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం 42 మంది ముస్లింలు చనిపోగా 20 మంది హిందువులు చనిపోయారు. వారంతా అమాయకులే.

అంతవరకూ ఆ జిల్లాలు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ నాయకుడు అజిత్ సింగ్ కు పెట్టని కోట. ఎమర్జెన్సీ అనంతరం ఇందిర పై గెలిచిన జనతా నాయకుల్లో పేరెన్నిక గన్న చౌదరీ చరణ్ సింగ్ కొడుకే అజిత్ సింగ్. జాట్ లకు తిరుగులేని నాయకులుగా చరణ్ సింగ్ కుటుంబం వెలుగొందుతోంది.

ఈ గొడవల సందర్భంగా బి‌జే‌పి నాయకులు తీవ్రస్ధాయిలో భావోద్వేగాలు రెచ్చగొట్టారు. వారిపై కేసులు నడుస్తున్నాయి. కాంగ్రెస్, బి‌ఎస్‌పి, ఎస్‌పి లు కూడా యధాశక్తి తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నాలు సాగించారు. అంతిమంగా హిందువుల కోసం(?) పని చేస్తున్న బి‌జే‌పి జాట్ లకు అనుకూల పార్టీగా అవతరించింది. ఆ ప్రభావం రాష్ట్రం అంతా పడిపోయింది. పక్కనే ఉన్న బీహార్ పైన కూడా ఆ ప్రభావం పడింది.

ఎన్నికల ప్రచారంలో “ఓట్ల ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలి” అని బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా బహిరంగంగానే పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు వల్ల ఆయనను ఎన్నికల ప్రచారం నుండి నిషేధించింది ఎన్నికల కమిషన్. మళ్ళీ ఏ మంత్రాంగం నడిచిందో తెలియదు, నిషేధం ఎత్తివేశారు.

ఫలితం మనకు తెలుసు 80 ఎం‌పి సీట్లలో 71 సీట్లు బి‌జే‌పి కి దక్కాయి. బీహార్ లో 40 కి గాను 22 బి‌జే‌పి కి దక్కాయి (ఎన్‌డి‌ఏ కి 28). ఈ రెండు రాష్ట్రాలే 2014 లోక్ సభ ఎన్నికలను శాసించాయి.

అల్లర్లను నిరోధించలేకపోయినందుకు సుప్రీం కోర్టు యు.పి ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. కానీ యు.పి సి.ఎం చెప్పిన మాట మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది: “ముజఫర్ నగర్ లో ఎం జరిగిందో అదంతా చాలా కాలా క్రితమే మొదలయింది. అనేక ఘటనలు జరిగాయి. మీరు సమీపం నుండి పరిశీలిస్తే కొందరు చాలా జాగ్రత్తగా ఈ హింసకు పధక రచన చేశారని అర్ధం చేసుకుంటారు”.

ఆ కొందరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ముజఫర్ నగర్ అల్లర్లపై రూపొందించిన డాక్యుమెంటరీ ఏ‌బి‌వి‌పి కి ఎందుకు అభ్యంతరం కావాలి? మన దేశంలో మన ప్రజల మధ్య జరిగిన గొడవ ‘జాతీయ వ్యతిరేకం’ ఎలా అవుతాయి? ఆ గొడవలు జరగడానికి, ఉత్తర ప్రదేశ్ సి.ఎం చెప్పినట్లు, జాగ్రత్తగా పధక రచన చేసినవారిలో మీరూ ఉంటే తప్ప!

ఇలాంటి శక్తులను ప్రతిఘటించడమే ప్రజాస్వామికవాదం.

కత్తి గాయాన్ని చేస్తుంది. గాయం నుండి ధారగా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ రక్తాన్ని తాగిన కత్తికి కూడా రక్తం అంటుతుంది.

గాయం మొర పెడుతుంది తనకు రక్తం కారుతోంది అని. కత్తి కూడా వాదిస్తుంది ‘నాకు కారడం లేదా రక్తం’ అని.

ఇద్దరూ వాదిస్తున్నారు కదాని కత్తినీ, గాయాన్నీ ఒకే గాటన కడదామా? కత్తి వాదనా, గాయం వాదనా రెంటినీ సమానంగా స్వీకరించడమేనా ప్రజాస్వామికం?

కాదు కదా. గాయానికి కారణం కత్తి. కనుక కత్తి దోషిగా నిర్దారిస్తాం. అలా కాకుండా కత్తికి కూడా రక్తం కారింది కనుక ఎవరిదీ తప్పు లేదని వదిలేద్దామా? లేక కత్తి, గాయానికి ఇద్దరికీ శిక్ష వేద్దామా? ఏది న్యాయం, ఏది అన్యాయం? ఏది ప్రజాస్వామికం?

‘ఈ ఘర్షణ’ లో ఏ‌బి‌వి‌పి, ఏ‌ఎస్‌ఏ ల చర్యలను సమానంగా చూడడం అంటే కత్తినీ, గాయాన్నీ ఒకే గాటన కట్టడం!

[వీడియోని పూర్తిగా చూడండి. చూడాలని నా విజ్ఞప్తి. పూర్తిగా చూస్తే అసలు ఆ డాక్యుమెంటరీలో ఏముందో కూడా తెలియని వాళ్ళు రౌడీయిజంతో ప్రదర్శనను ఎలా నిలిపేశారో, అక్కడ ఉన్న విద్యార్ధులు అందరూ డాక్యుమెంటరీ చూడ్డానికి ఇష్టంగా ఉన్నా, చూడాల్సిందే అని గట్టిగా కోరినా, వాళ్ళ నోరు మూపించి ప్రదర్శన నిలిపేసిన సంగతి తెలుస్తుంది.]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s