రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!


rohith vemula

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆమె ఇచ్చిన వివరణ విద్యార్ధుల భావోద్వేగాలను చల్లార్చడానికి బదులు మరింత రెచ్చగొట్టినట్లుగానే వెలువడింది.

“ఇది దళితులు-దళితేతరుల మధ్య సమస్యకు సంబంధించినది కాదు. రెండు విద్యార్ధి సంఘాలకు మధ్య ఘర్షణకు సంబంధించిన సమస్య. దళిత్ పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దు” అని ఆమె ప్రకటించారు.

అదే నోటితో ఆమె “వైస్ ఛాన్సలర్ ఆదేశాలను (ఆర్డర్ ను) విద్యార్ధులకు స్వయంగా అందించిన వ్యక్తికూడా దళితుడే” అంటూ తాను కూడా దళితుడి భుజం మీదనే తుపాకి ఉంచి దళిత విద్యార్ధులపై గురి పెట్టారు.

మానవ వనరుల శాఖ మంత్రి హాస్టల్ చీఫ్ వార్డెన్ ను ఉద్దేశిస్తూ పై వ్యాఖ్య చేశారు. వైస్ ఛాన్సలర్ ఆదేశాలను చేతపట్టుకుని విద్యార్ధులకు అందించాల్సిన వ్యక్తి చీఫ్ వార్డెన్. ఆయన యాదృచ్ఛికంగా దళితులయ్యారు. ఆదేశాలు ఇచ్చింది కూడా దళితుడే కనుక దళితులు – దళితేతరులకు మధ్య జరిగిన గొడవ కాదని రుజువు కావడం లేదా అన్నది మంత్రిగారి డిఫెన్స్.

గూగుల్, ఫేస్ బుక్ లాంటి సంస్ధల అధినేతలను యాక్సిడెంటల్ బిలియనీర్స్ అంటుంటాయి పశ్చిమ పత్రికలు అప్పుడప్పుడూ. దాని ఉద్దేశం ఐ.టి నిపుణులు అమాంతం బిలియనీర్స్ అయిపోవడం అనూహ్యం అని. తాము మొదలు పెట్టిన ఐ.టి సేవ బిలియన్లు కురిపిస్తుందన్న సంగతి వారికే తెలియదు. కానీ వాళ్ళు బిలియనీర్లు అయిపోయారు. అందుకే ‘ప్రమాదవశాత్తూ అయిన బిలియనీర్లు’ అన్నారు.

ఇప్పటి మన మంత్రులను కూడా అలాగే అనాలా అన్న ప్రశ్న మానవ వనరుల మంత్రి రేకెత్తిస్తున్నారు.

కాకపోతే ఒక పక్క దళిత-దళితేతర సమస్య కాదు అంటూ మళ్ళీ అదే దళిత చీఫ్ వార్డెన్ వెనక దాక్కోవడం ఏమిటి? దళిత-దళితేతర సమస్య కాకపోతే దళిత చీఫ్ వార్డెన్ అన్న డిఫెన్స్ ఎందుకు? పోనీ దళిత చీఫ్ వార్దెనే అవసరం అయితే “దళిత-దళితేతర సమస్య కాదు” అంటూ అడ్డంగా నిరాకరించడం ఎలా సాధ్యం?

స్మృతి గారి రెండు నాల్కలను ఖండిస్తూ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఒక ప్రెస్ నోట్ జారీ చేసింది. చీఫ్ వార్డెన్ యాదృచ్ఛికంగా దళితులు అయినంత మాత్రాన దళితుడే దళితులను సస్పెండ్/బహిష్కరణ చేసినట్లు చెబుతూ వాస్తవాన్ని వక్రీకరించడం సరికాదని వారు ఆమెను తప్పు పట్టారు.

విచిత్రంగా వారి ప్రకటన ఆంగ్ల టి.వి చానెళ్ల వారు పట్టించుకోలేదు. ఈ సంగతి విద్యార్ధులే వేలెత్తి చూపారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా బి.జె.పి పార్టీని సమర్ధిస్తున్న ఛానెళ్లు ఈ వివక్ష పాటిస్తున్నాయని వారు ఎన్.డి.టి.వి లో కనపడి ప్రశ్నించారు.

విద్యార్ధులను సస్పెండ్ చేస్తూ జారీ అయిన ఆదేశాలను విద్యార్ధులకు అందించింది కూడా దళితుడే అని ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దళితులకూ దళితులకూ మధ్య వైరం పెట్టడానికి హీన ప్రయత్నం చేసింది. తమకు ఆదేశాలు ఇచ్చింది దళితుడే కాబట్టి ఆ విద్యార్ధులు తమలో తాము కొట్లాడాలా? లేక దత్తాత్రేయ, వి.సి లను వదిలి దళిత చీఫ్ వార్డెన్ పైకి వెళ్లాలా ఇక?!

పోనీ మంత్రి గారి లాజిక్ నే అనుసరిద్దాం. వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ తో చెప్పినట్లుగా సస్పెన్షన్ నిర్ణయం తన ఒక్కరిది కాదు; యూనివర్సిటీది. నిర్దిష్టంగా చెప్పాలంటే ప్రాక్టోరియల్ బోర్డు, ఆ బోర్డు నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ది.

చీఫ్ వార్డెన్ గారు కేవలం ఒక ఆదేశాన్ని విద్యార్ధుల చేతికి ఇచ్చారంతే. అయినా ఇచ్చారు కాబట్టి, ఆయనా భాగస్వామే (అనుకుందాం, మంత్రిగారి లాజిక్ ని అనుసరిస్తున్నాం గనుక). మరి సస్పెన్షన్ నిర్ణయం చేసిన వారిని ఎందుకు వదలడం? వారూ బాధ్యులే కదా.

ఆ కౌన్సిల్ లో కేవలం నోషనల్ గా ఒక దళిత సభ్యుడిని తీసుకుని, దళితుడు కూడా కమిటీ సభ్యుడుగా ఉన్నాడు అనిపించుకుని, నిర్ణయం తీసుకున్నారు. ఇతరులందరూ దళితేతరులే. కాబట్టి దళితులు-దళితేతరుల సమస్య కూడా ఉందక్కడ! మంత్రి గారీ లాజిక్ ఆమెకే ఎదురు తిరుగుతుంది. యాక్సిడెంటల్ గా మంత్రి అయ్యారా మరి!

**********

కానీ “దళిత విద్యార్ధులపై చర్యలు” అన్నది అందుకేనా? కాదు.

సస్పెండ్ అయిన ఐదుగురు దళిత విద్యార్ధులను ‘జాతీయ వ్యతిరేకులు’గానూ, ‘ఉగ్రవాదులు’ గానూ అతి తేలికగా ముద్ర వేయడం కేంద్ర మంత్రికి ఎలా సాధ్యపడింది?

వారు బలహీనురు కనుక, వారికి ఎవరూ మద్దతు రారని అంచనా వేశారు కనుక. వారి బలం ఇలా పెరుగుతూ పోతే భవిష్యత్తులో హిందూత్వ అధికార సోపానానికి ప్రమాదం అన్న శంకతో వారి నాయకత్వాన్ని బహిష్కరించి, బలహీనపరిచి, తమ విద్యార్ధి సంఘానికి ఎదురు లేకుండా చేయాలని భావించారు కనుక.

ముఖ్యంగా హిందూత్వ రాజకీయాలు దేశంపై రుద్దాలని తపిస్తున్న ‘బ్రాహ్మణీయ వాదాన్ని’ ఎదుర్కొంటున్న వారిని క్యాంపస్ లో లేకుండా చేయాలని లక్ష్యం చేసుకున్నారు గనక. తల నరికెస్తే శరీరం ఇక కదలదు. నాయకులపై వేటు వేస్తే కార్యకర్తలు నోరు మూసుకుంటారు.

లేదంటే ఏ‌బి‌వి‌పి విద్యార్ధి సుశీల్ కుమార్ అపెండిసైటీస్ ఆపరేషన్, రోహిత్ తదితర ఏ‌ఎస్‌ఏ విద్యార్ధుల దాడి ఫలితమే అనడానికి ఎలాంటి సాక్షాలు లేవని యూనివర్సిటీ మెడికల్ అధికారి స్పష్టంగా చెప్పినా దళితులు దాడి చేసి కొట్టారని రెండో విచారణ కమిటీ ఎలా నిర్ధారిస్తుంది?

‘దళిత-దళితేతర సమస్య కాదు’ అనడం అసలు సమస్యను పక్కదారి పట్టించడమే. ఇది విద్యార్ధుల మధ్య గొడవగా చూడడమే వక్రీకరణ. ఈ వక్రీకరణ చూపు నుంచే దళిత-దళితేతర సమస్య అని అంగీకరించడమో, తిరస్కరించడమో జరుగుతుంది. అసలా లైన్ లో ప్రవేశించడమే వక్రీకరణ!

ఇక్కడ విద్యార్ధులు దళిత-దళితేతరగా విడిపోయి లేరు. తమ తమ కులాలకు అతీతంగా UoH విద్యార్ధులు ఉమ్మడిగా, ఐక్యంగా విశ్వ విద్యాలయం పాలక వ్యవస్ధపై పోరాడుతున్నారు. కనుక వారి మధ్య దళిత-దళితేతర తేడాలు లేవు. వారి ఆక్రందన “మాపై దళితేతర విద్యార్ధులు దాడి చేస్తున్నారు” అని కాదు. “మాపై యూనివర్సిటీ దళితేతర పాలక వ్యవస్ధ కత్తిగట్టి బాధితులుగా మార్చింది” అని.

హిందూత్వ భావజాలాన్ని ప్రజల్లో నాటడానికి విస్తరింపజేయడానికి కంకణం కట్టుకున్న బి.జె.పి ప్రభుత్వం అందుకోసం విశ్వ విద్యాలయాలను, విద్యార్ధుల సిలబస్ లను ఒక సాధనంగా వినియోగిస్తోంది. దానికి దళిత విద్యార్ధి సంఘం ఆటంకం అయింది. తమ రాజకీయ విస్తరణ వ్యూహాలకు ఆటంకం అయిన ఆ సంఘం బలపడుతోంది. దానిని ఎదగనివ్వకుండా అడ్డుకోవాలి. ఆ వైపుగా పడిన అడుగే బండారు దత్తాత్రేయ లేఖ.

హిందూత్వ భావజాలాన్ని విస్తరించన్న ఏ‌బి‌వి‌పి లక్ష్యం, హిందూత్వ వ్యతిరేక కుల నిర్మూలన భావజాలాన్ని బలీయం చేయాలన్న ఏ‌ఎస్‌ఏ లక్ష్యం ఒకదానినొకటి ఎదుర్కొన్నాయి. ఫలితంగా దళిత విద్యార్ధులు ఒకవైపు దళితేతర యూనివర్సిటీ పాలక వ్యవస్ధ మరొక వైపు నిలబడి తలపడ్డాయి.

యూనివర్సిటీ పాలక వ్యవస్ధ ఒంటరిది కాదు. దానికి రాజ్యం అండ ఉంది. అసలు యూనివర్సిటీ తీసుకున్న చర్యలే రాజ్యం కోసం కనుక రాజ్యం అండ లేకుండా పోదు. కనుక దళిత విద్యార్ధులు ఏకంగా హిందూత్వ చేతుల్లో ఉన్న రాజ్యం అనే మత్తగజంతో తలపడ్డారు. కనుక వారి ఓటమి ముందే రాసిపెట్టబడింది. ఈ నిజం రోహిత్ ను చలింపజేసింది.

***********

ఇరానీ లాజిక్ తో మరో అంశాన్ని చూద్దాం.

బి.జె.పి కి చెందిన దళిత ఎం.పి లు స్మృతి ఇరానీ వాదనతో విభేదిస్తూ ముందుకు వస్తే అది దళిత-దళితేతర సమస్య అవుతుందా లేక మరొక సమస్య అవుతుందా?

ఉదాహరణకి బి.జె.పి జాతీయ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ ఇలా హెచ్చరించారు “అధికార రాజకీయాల్లో భాగం ఉన్నవారంతా రోహిత్ వేముల ఎపిసోడ్ నుంచి తీవ్ర పాఠాలు నేర్వాలి, లేదా క్రోధం, పగ, తిరుగుబాటు, ప్రతిస్పందనలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి” అని హెచ్చరించారు. సి.బి.ఐ విచారణ కూడా ఆయన డిమాండ్ చేశారు.

లాతూర్ కి చెందిన బి.జె.పి ఎం.పి సునీల్ గయక్వాడ్ ఇలా అన్నారు, “యాకూబ్ మెమన్ ఉరితీతకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నంత మాత్రాన ఆయనను “జాతీయ వ్యతిరేకి”గా ముద్రవేయలేం. ఇది ప్రజాస్వామ్య దేశం. సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం పౌరుల ప్రాధమిక హక్కు” అని వక్కాణించారు.

బీజాపూర్ ఎం.పి రమేశ్ చందప్ప మాట్లాడుతూ “జరిగింది చాలా విచారకరం. దానికి జాతీయ-వ్యతిరేక రంగు పులమడం ఇంకా విచారకరం. అతన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకునేలా (కేంద్ర) ప్రభుత్వం చూడాలి” అని వ్యాఖ్యానించారు.

ఈ ముగ్గురూ దళిత నాయకులే. అయినా మంత్రి ప్రకటనను, ఆమె డిఫెన్స్ నూ, వక్రీకరణలను వారు తప్పు పట్టారు. ఇప్పుడది దళిత (ముగ్గురు ఎం.పిలు) – దళితేతర (స్మృతి ఇరానీ) సమస్య అయినట్లే కాదా?

ఏ విధంగా చూసినా ఇది దళిత-దళితేతర సమస్యే. ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు, వారి భావజాలం మరియు ఏ‌బి‌వి‌పి విద్యార్ధులు, వారి హిందూత్వ భావజాలం మధ్య జరిగిన సంఘర్షణ కనుక అది దళిత-దళితేతర సమస్య!

స్మృతి ఇరానీ లాజిక్ ప్రకారం చూసినా పైన చెప్పిన పలు దారుల్లో అది దళిత-దళితేటర సమస్య.

మరొకసారి స్పష్టంగా చెప్పుకోవాలి.

ఇది దళిత విద్యార్ధులకు – క్యాంపస్ లోని దళితేతర విద్యార్ధులకు మధ్య సమస్య కనుక దళిత – దళితేతర సమస్యగా అవతరించలేదు.

ఇది ఏ‌ఎస్‌ఏ కింద సమీకృతమైన దళిత విద్యార్ధులు హిందూత్వ భావజాలాన్ని ఆవాహన చేసుకున్నా రాజ్యంతో తలపడినందుకు ఉత్పన్నమైన దళిత-దళితేతర సమస్య!

స్మృతి ఇరానీ లేవనెత్తిన కోణం వెంటబడి వెళ్లిపోతే మనమూ దళిత-దళితేతర విద్యార్ధుల సమస్య అవునా కాదా అన్న సుడిగుండంలో పడి తిరుగుతూ ఉండిపోతాం. ఆ ఉచ్చు నుండి బైటికి వచ్చి ఇందులో రాజ్యం పాత్రని గుర్తించాలి. ఆ రాజ్యం హిందూత్వను ఆవహించిన సత్యాన్ని గుర్తించాలి. ఆ ఆవాహన వల్లనే రాజ్యం దళిత విద్యార్ధులపై కత్తి కట్టిందని గుర్తించాలి. ఇందులో దళితేతర విద్యార్ధులకు ఎలాంటి పాత్ర లేదు. ఉంటే వారు ఈ పోరాటంలోకి సమీకృతులు కాలేరు.

One thought on “రోహిత్: దళిత విద్యార్ధులు Vs హిందూత్వ రాజ్యం!

  1. 1.125 crores population lo 80 crores hindus antaru lekka nijamena?
    2.sc vallu caste certificate lo hindu ani untadi kani vinnanu nijamena- christian ante antha reservation radu ani idi enthavaraku nijam
    3.democracy ani opppukunnam lessaize faire follow audam ani anukunnam
    ante motham vyaparame kada? diversity anedi sristi lo unnade so prati vadiki vadi pratyekata untadi? mana pratyekata ni manam entha telviga migta andariki ammukuntamo aade modern bisiness – business cheskne vadu vaisyudite modern times lo andaru vysyule kada – lekapote memory ane quality ni nammukuni danni ammukuntunna valla ni consider cheste modern day lo software engineers scientists teachcers andaru brahmins a kada? army lo vallu kshatriyu le kada !
    profession = caste
    4.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s