ఏఎస్‌ఏ విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదనీ, వారు తప్పు చేశారని చెప్పేందుకు ఎలాంటి సాక్షాలూ లేవని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ధారించింది. అయినప్పటికీ ఆ అయిదుగురినీ యూనివర్సిటీ కౌన్సిల్ ఎందుకు సస్పెండ్ చేసింది?
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పి అప్పారావు నియమితులు కావడానికి ముందు నియమించబడిన కమిటీ దళిత విద్యార్ధులది ఎలాంటి తప్పూ లేదని తేల్చింది. దానితో వారిపై ఎలాంటి చర్యకూ ఆస్కారం లేదు. కనుక సస్పెన్షన్ నన్ను రద్దు చేశారు.
కానీ ఆ తర్వాతే అసలు వ్యవహారం నడిచింది.
కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రికి ఏబివిపి విద్యార్ధి సంఘం నేతలు వెళ్ళి మొర పెట్టుకున్నారు. దానితో దత్తాత్రేయ వెంటనే మానవ వనరుల శాఖ మంత్రికి లేఖలు రాశారు.
తన లేఖలో దత్తాత్రేయ హైదారాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం “కుల శక్తులకు(?!)”, “జాతీయ వ్యతిరేక శక్తులకు” నిలయంగా మారిపోయిందని నిందిస్తూ మానవ వనరుల శాఖకు లేఖ రాశారు.
మంత్రి లేఖను యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తూ స్పందించవలసిందిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యూనివర్సిటీ వి.సికి పదే పదే -కనీసం 5- రాశారు.
ఇవి మామూలుగా రాసినవేనని స్మృతి ఇరానీ ఇప్పుడు చెబుతున్నారు. మామూలుగా రాస్తే ఒకే విషయం పై ఐదు సార్లు రాస్తారా అన్నది సమాధానం దొరకని ప్రశ్న.
ఈ లేఖలు మామూలుగా వచ్చినవేనని, పక్కన పెట్టేశామని వి.సి ఇప్పుడు చెబుతున్నారు. పరిణామాలు వి.సి మాటలకు సరిగ్గా విరుద్ధంగా ఉన్నాయి.
వి.సిగా అప్పారావు నియమితులు కాగానే ఆగ మేఘాలపై తప్పు లేదని నిర్ధారించబడిన ఐదుగురు విద్యార్ధులను మళ్ళీ సస్పెండ్ చేస్తూ వి.సి ఆదేశాలు జారీ చేసేశారు. సస్పెన్షన్ వెనుక ఎవరి ఒత్తిడీ లేదని ఎన్.డి.టి.వి తో మాట్లాడుతూ వి.సి చెప్పారు.
కానీ పాత వి.సి వేసిన కమిటీ దళిత విద్యార్ధులు ఏ తప్పూ చేయలేదని నిర్ధారించినప్పటికీ కొత్త వి.సి రాగానే వారు తప్పు చేసినవారిగా ఎలా మారిపోయారు?
ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కొత్త వి.సి “సస్పెన్షన్ ఎత్తివేత షరతులతో కూడినది” అని చెప్పారు. “ఏ షరతుల ప్రకారం?” వారు తప్పు చేసినవారుగా మారిపోయారు?” అని ప్రశ్నిస్తే ఆయన నుండి సమాధానం లేదు.
కనుక కేంద్ర ప్రభుత్వం నుండి, కేంద్ర మంత్రుల నుండి వైస్ ఛాన్సలర్ నుండి రాజకీయ ఒత్తిడి ఉందన్నది స్పష్టమై పోయింది.
తప్పు లేదని నిర్ధారించి సస్పెన్షన్ రద్దు చేశాక దత్తాత్రేయ లేఖతోనూ, మానవ వనరుల మంత్రి రాసిన మరిన్ని లేఖలతోనూ వి.సి పై ఒత్తిడి తేబడింది.
ఫలితమే ఏ తప్పు చేయలేదని నిర్ధారించబడ్డ విద్యార్ధులపై మళ్ళీ సస్పెన్షన్ వేటు వేశారు. అది కూడా కడు హీనమైన, ఏ విశ్వ విద్యాలయంలోనైనా జరుగుతుందని ఊహించని సంఘ బహిష్కార సమానమైన దండనా చర్యలతో!