[Death of a Dalit scholar శీర్షికన జనవరి 19 తేదీన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్]
*********
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీసర్చ్ స్కాలర్ గా పని చేస్తున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య, ప్రతిభా సంపన్నులతో నిండినవన్న భ్రాంతిని కలుగజేయడంలో పేరెన్నిక గన్న భారతీయ ఉన్నత విద్యా సంస్ధలు భూస్వామ్య దురహంకార గుణాల చేత వేధింపులకు గురవుతున్నాయనడానికి మరో విషాదకర సాక్షం. (యూనివర్సిటీ) పాలకులు సస్పెండ్ చేసిన ఐదుగురు దళిత విద్యార్ధులలో -అందరూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్‌ఏ) కు చెందినవారు- వేముల ఒకరు.
సస్పెన్షన్ ఆదేశాలు వారు యూనివర్సిటీలో తమ విద్యను కొనసాగించేందుకు అనుమతించినప్పటికీ హాస్టళ్లలో, పాలనా భవనంలో, ఇతర ఉమ్మడి స్ధలాల్లోకి సమూహంగా ప్రవేశించడాన్ని నిషేదించాయి. సామాజికంగా అవకాశాలు లేని సమూహాల (కులాల) కు చెందిన విద్యార్ధులను లక్ష్యంగా చేసుకున్న ఈ సామాజిక బహిష్కరణ ఇటువంటి దండనా చర్యల కంటే మించి పచ్చిగా వ్యక్తం కాగల పరిస్ధితి ఊహించశక్యం కానిది. అది కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీ పాలకోన్నతుల నుండి వెలువడడం మరింత భీతి గొలుపుతోంది.
వేములతో పాటుగా ఇతర నలుగురు విద్యార్ధుల సస్పెన్షన్ కు ప్రత్యక్ష కారణం ఏఎస్‌ఏ మరియు సంఘ్ పరివార్ అనుబంధిత మితవాద ఏబివిపి లకు చెందిన విద్యార్ధుల మధ్య చోటు చేసుకుందని చెప్పబడుతున్న ఒక ఘర్షణ. యూనివర్సిటీ నిర్వహించిన విచారణ ఫలితంగా సస్పెన్షన్ ఆదేశం వెలువడింది. ఇలాంటి దండనా చర్యకు వ్యతిరేకంగానే వారు నిరసన తెలియజేస్తున్నారు. ఆదివారం రోజు తన నిరసన, తన జీవితం రెండింటినీ అర్ధాంతరంగా ముగించాలని ఆ యువ స్కాలర్ నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన అతని ఆత్మహత్య లేఖ తన చర్యకు ఏ ఒక్కరూ బాధ్యులు కారని స్పష్టంగా పేర్కొన్నది. ఈ ప్రకటనను ఉన్న అర్ధంలో తీసుకోవలసిన అగత్యం లేదు గాక లేదు.
ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను, ఎస్‌సి మరియు ఎస్‌టి (వేధింపుల నివారణ) చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ పి అప్పారావు, ఇద్దరు ఏబివిపి కార్యకర్తలు.. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఏ ను “తీవ్రవాద”, “జాతీయ-వ్యతిరేక” సంస్ధగా ఆరోపిస్తూ దత్తాత్రేయ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాయడంతోనే వేముల మరణానికి దారితీసిన పరిస్ధితులు ఏర్పడ్డాయని కార్యకర్తలు చెబుతున్నారు.
ఆత్మహత్య ద్వారా చావును ఆహ్వానిస్తూ చైతన్య ప్రకటన చేసేందుకు సాగే ప్రయత్నం ఒక అసాధ్యమైన, తరచుగా విఫలమయ్యే ప్రక్రియ. కానీ వేముల చావు సరిగ్గా దానినే డిమాండ్ చేస్తున్నది; అది (బహిష్కరణ) జాతీయ స్ధాయి సిగ్గుమాలినతనం కనుక. సామాజిక చెడుగులైన కులం మరియు కుల వివక్షలను పరిష్కరించడంలో తమ ఘోర వైఫల్యాన్ని ఎదురు బొదురుగా ఎదుర్కోవలసిన పరిస్ధితిని వేముల చావు తెచ్చింది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ధ (ఎయిమ్స్) ఒక్క దానిలోనే ఎస్‌సి/ఎస్‌టి విద్యార్ధులు ఎదుర్కొంటున్న వివక్షాపూరిత పరిస్ధితులను పరిశోధించడానికి కొన్నేళ్ళ క్రితం ఏర్పాటయిన థోరట్ కమిటీ దళిత విద్యార్ధుల పట్ల కొనసాగుతున్న వ్యవహార సరళి పట్ల తీవ్ర అధిక్షేపణతో ముందుకు వచ్చింది.
హాస్టల్ లో వెలివాడ తరహాలో బలవంతపు నెట్టివేత, ఉపాధ్యాయుల వివక్ష, ఆటలు సాంస్కృతిక కార్యకలాపాల్లో ప్రవేశం నిరాకరణ లతో ఎస్‌సి/ఎస్‌టి విద్యార్ధులు భారత దేశపు ప్రసిద్ధ విద్యా సంస్ధల్లోకి విషపూరిత శత్రు వాతావరణం మధ్య ప్రవేశిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం, ఇలాంటి కుల దురహంకార మరియు సామాజిక వెలివేతల నిలయాల్లో పోరాటం కొనసాగిస్తూ నిలబడడం కంటే జీవితాలను ముగించడమే మేలని గత నాలుగేళ్లలో 18 మంది దళిత విద్యార్ధులు ఎంచుకున్నారంటే ఆశ్చర్యం లేదు. కులం కుళ్లును కడిగివేసే వైపుగా తీసుకోవలసిన మొదటి చర్య అది ఉన్నదని అంగీకరించడం -వేముల విచారకర మరణం తర్వాత కూడా అందుకు నిరాకరించడమే నేరం కాగలదు.