దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!


Rahul

ది హిందు సంపాదకీయం చివరలో పేర్కొన్న ‘నిరాకరణ నేరం’ అప్పుడే జరిగిపోయింది కూడా. విద్యార్ధుల ఆత్మహత్యకు తన లేఖలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పత్రికలు, ఛానెళ్ల సాక్షిగా నిరాకరణ జారీ చేసేశారు. 

ఒక్క బండారు మాత్రమే కాదు, బి‌జే‌పి జనరల్ సెక్రటరీ పి మురళీధర్ రావు ట్విట్టర్ లో రాహుల్ గాంధీ యూనివర్సిటీ సందర్శనను ఖండిస్తూ పనిలో పనిగా “రోహిత్ దళితుడు కావడానికీ, అతనిని సస్పెండ్ చేయడానికి ఎలాంటి సంబంధమూ లేదు” అని ప్రకటించాడు. అంతేనా! అసలు రోహిత్ ని హాస్టల్ లో ప్రవేశించడానికి ‘మాత్రమే’ నిరాకరిస్తూ, చదువు కొనసాగించడానికి అనుమతిస్తూ విశ్వ విద్యాలయం అధికారులు “చాలా గొప్ప మనసుతో వ్యవహరించారు” అని కూడా ఆయన ప్రకటించేశారు.

ఈ నేత గారికి రోహిత్ లేఖ కనీసంగానైనా అర్ధమైతే ఇలా నడమంత్రంగా ట్విట్టర్ లో కూయబోరు. “ఆ ఐదుగురు విద్యార్ధులు కలిసి విశ్వ విద్యాలయం ఆవరణలో, కూడళ్లలో, పాలనా భవనంలో కనిపించకూడదు” అంటూ విశ్వ విద్యాలయం అధికారులు ఆదేశించడం కూడా “గొప్ప మనసు” తోనే జరిగిందా అని భాజపా నేతగారు చెప్పవలసి ఉంది.

ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్ధిగా ఉన్న వ్యక్తి ఆ విశ్వ విద్యాలయంలోని ఆవరణలో, కూడలిలో, పాలనా భవనంలో కనిపించకుండా ఎలా పరిశోధన చేయగలడో కాషాయ నేత వివరించాలి. కలిసి వెళ్లకూడదు అని ఐదుగురు దళిత విద్యార్ధులను అది కూడా ‘అంబేద్కర్ విద్యార్ధి సంఘం’ గా పని చేస్తున్న వారిని ఆదేశించడం వెనుక అంతరార్ధం ఏమిటి?

అంబేద్కరిస్టులుగా విశ్వ విద్యాలయంలో వారి ఉనికిని రద్దు చేయడం కాదా? వారి ఉనికిని భరించలేకపోతున్న కాషాయ విద్యార్ధి సంస్ధకు ప్రోత్సాహం అందించడానికి కాదా?

ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా, కాషాయం అన్నది ఈ దేశంలో వేల యేళ్లుగా వేళ్లూనుకున్న హైందవ కుల వైషమ్యానికి ప్రతీక.

అంబేద్కర్ అన్నది కేవలం ఒక పేరు లేదా పదమే కాదు. అది ఒక ఆలోచన, ఒక భావం, ఒక భావజాల వ్యవస్ధ, హైందవ కుల సంస్కృతిని సంస్కరించబూని విఫలుడై తిరస్కార కత్తి దూసిన శక్తికి ప్రతీక.

ఈ రెండింటిలో ఒకరి పక్షం వహించి మరొక పక్షం ఉనికినే నిర్జించాలన్న లక్ష్యంతో ప్రజలు ఇచ్చిన అధికారాలను ప్రయోగించడం ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిన ‘దళిత వ్యతిరేకత’ కాకుండా ఎలా పోతుంది?

విశ్వ విద్యాలయం అధికారులు గొప్ప మనసుతో హాస్టల్ లో ‘మాత్రమే’ ప్రవేశం నిషేదించారట. సిగ్గు లేకపోతే సరి! కళ్ళు మూసుకపోతే సరి! బుద్ధి పని చేయకపోతే సరి! జ్ఞానం వికసించకపోతే సరి!

పి. మురళీధర్ రావు గారికి తెలుసో లేదో గాని మన దేశం ప్రజాస్వామ్య-సామ్యవాద-లౌకికవాద-రిపబ్లిక్ గా రాజ్యాంగంలో ఘనంగా ప్రకటించుకున్న భారత దేశం. సైంటిఫిక్-టెంపర్ ను కలిగి ఉండాలని రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాల్లో ప్రకటించుకున్న భారత దేశం.

దళితుడి హృదయ వేదన పట్ల కనీస పరిగణన లేకపోతే లేకపోవచ్చు గాక! కనీసం ఒక రాజకీయ పార్టీ నేతలుగా, ప్రజలను సర్వ సమానంగా పాలించవలసిన మంత్రులుగా, రాజ్యాంగ రక్షకులుగా కనీసం రాజ్యాంగ పీఠికలోని నాలుగు పదాలకు సరైన అర్ధం తెలిసి ఉంటారని భావించడంలో తప్పు లేదు; అతి అత్యాశ ఏమీ కాదు.

ఒక దేశ సర్వోన్నత విద్యాలయాన్ని “విశ్వ” విద్యాలయంగా ఎందుకు పేర్కొంటాము? విశ్వం సకల వైవిధ్య మానవులకు నిలయం. ఆ వైవిధ్యాలన్నీ విశ్వంలో తమ ఉనికిని భద్రపరుచుకోవడం విశ్వానికి ఉన్న ఒక తప్పనిసరి షరతు.

అలాంటి “విశ్వ” విద్యాలయంలో ముజఫర్ నగర్ మత కల్లోలం పైనా, అక్కడ జరిగిన హత్యాకాండ పైనా ఒక ‘మనిషి’గా స్పందించి ఒక డాక్యుమెంటరీ ప్రదర్శనకు పూనుకోవడం ఒక సహజ, స్వాభావిక పరిణామం అవుతుంది. అలా కాకపోతే అది “విశ్వ” విద్యాలయం కాదు. మహా అయితే ‘సరస్వతీ శిశు మందిర్’ అవుతుందంతే!

కానీ UoH శిశు మందిర్ కాదే మరి! భారత దేశపు అత్యున్నత పాలనాధికారాన్ని చేబూనిన కేంద్ర ప్రభుత్వం నడిపే కేంద్ర విశ్వ విద్యాలయం. అలాంటి చోట భారత దేశ సకల వైవిధ్యాలకూ, సకల భావజాలాలకు, సకల భావ సంఘర్షణలకు చోటు ఉండి తీరాలి.

కనుకనే ముజఫర్ నగర్ హత్యాకాండ పై నిరసనను ఎలాంటి చర్చాపూర్వక రూపంలో నైనా ప్రకటించే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ ఉందన్న నమ్మకంతోనే ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు డాక్యుమెంటరీ ప్రదర్శించారు.

ఒక డాక్యుమెంటరీ ప్రదర్శన అసలు ఒక విద్యార్ధి సంఘానికి ఎందుకు ఇష్టం లేకుండా పోవాలి? ఆ ప్రదర్శన తమ ఉనికికి ప్రమాదం అని తలిస్తే తప్ప! ముజఫర్ నగర్ హత్యాకాండకు, ఆ విద్యా సంస్ధకు ఏదో ఒక సంబంధం లేకుండా పోలేదని పరిశీలకులు భావిస్తే తప్పే కాదు.

ఆ సంబంధం ఉన్నది గనుకనే ఏ‌బి‌వి‌పి ఫేస్ బుక్ లో గేలి చేస్తూ, పరిహసిస్తూ స్పందించింది.

బాల్ ధాకరే దహన సంస్కారాల సందర్భంగా ముంబైని బంద్ చేయడం పట్ల మాట మాత్రంగా నిరసన పోస్ట్ చేసినందుకు ఇద్దరు ఆడ కూతుర్లపై కఠినమైన, ఆ తర్వాత సుప్రీ కొట్టిపారేసిన, ఐ.టి చట్టం సెక్షన్ – 66 బనాయిస్తిరే మీరు!

ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఫేస్ బుక్ లో ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులను హేళన చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేయవలసి ఉండగా, అలా చేయకుండా క్షమాపణ కొరడమే ఏ‌ఎస్‌ఏ విద్యార్ధులు ఐదుగురు చేసిన తప్పిదంగా ఈ కేంద్ర ప్రభుత్వ సచివులు పరిగణించారు.

ఏ‌బి‌వి‌పి కి మద్దతుగా ఆగమేఘాలపై ఉత్తరాల మీద ఉత్తరాలను కార్మిక ఉపాధి మంత్రి రాస్తే, ఆ ఉత్తరాలను ఉల్లేఖిస్తూ మానవ వనరుల మంత్రి లేఖలపై లేఖలపై హెచ్చరికలుగా “విశ్వ” విద్యాలయం అధికారులకు జారీ చేస్తే… వారు ఉరుకులు పరుగులతో ఆ ఐదుగురిని అత్యున్నత విద్యాలయంలోనే అధికారికంగా ‘సాంఘిక బహిష్కరణ’కు గురి చేస్తే… రోహిత్ వేముల కు తనకు తానే ఖాళీయై కనిపించి ఆ ఖాళీ ఉండీ వ్యర్ధం అనుకుని చాలించుకున్నాడు.

అధికారం నిర్వహిస్తున్న సంఘ్ పరివార్ రాజకీయ పార్టీ ప్రభుత్వమే రక్షగా సంఘ్ పరివార్ సంస్ధలు దాదాపు గత రెండేళ్లుగా సాగిస్తున్న అరాచకాలలో ఒకటి మాత్రమే ఆ ఐదుగురు విద్యాలయ సంఘ బహిష్కరణ.

ఈ సంబంధాన్ని చూడడం అధికార పార్టీ నేతలకు ఇష్టం లేకపోతే పోవచ్చు. కానీ ప్రతిపక్ష పార్టీ నేతగా, అది ఓట్ల కోసమైనా సరే, రాజకీయాల కోసమైనా సరే, రాహుల్ గాంధీ తన బాధ్యత తాను నిర్వర్తించాడు. దానిని ఆహ్వానిస్తున్నాం; ఇతర సంగతులు తర్వాత!

ఆయన సందర్శన ఆ ఐదుగురు విద్యార్ధులకు విశృంఖల హిందూత్వ నర్తనల మధ్య ఒక గడ్డిపోచ మాత్రమే! అయినా అది ఇప్పటికి అవసరమే.

కాంగ్రెస్ వ్యతిరేకతలోనే ఇన్ని దశాబ్దాలూ ఉనికిని కొనసాగించిన ప్రజాస్వామ్య వాదులు, లౌకిక వాదులు, భూస్వామ్య-పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద వ్యతిరేక మొలకలు రాహుల్ సందర్శనను కనీసం ‘గడ్డిపోచ’ గా భావించక తప్పని పరిస్ధితి కంటే మించిన విషాదం ఉండగలదా?!

2 thoughts on “దళిత నిరాకరణ నేరంలో సచివులు, నేతలు!

  1. కలిసివచ్చే శక్తులన్నిటినీ కలుపుకుపుకుని, మనువాద, మతతత్వ విష సర్పాన్ని నేలకూల్చాల్సిన తరుణం.మరింత మంది రోహిత్ లను పొగోట్టుకోకూడదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s