ప్రశ్న: స్టార్టప్ కంపెనీ అంటే?


Startup India

జి అమర్ నాధ్:

ఈ మధ్య ‘స్టార్టప్ కంపెనీ’ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. కాస్త ఐడియా ఉన్నట్లు అనిపిస్తున్నా పత్రికల్లో కనిపిస్తున్న పదాలు (ఉదా: ఇంక్యుబేటర్) కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. కాస్త వివరించి చెప్పగలరా?

సమాధానం:

సరైన సమయంలో వేసిన ప్రశ్న. గత సంవత్సరం ఆగస్టు 15 తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి గారు ‘స్టార్టప్ ఇండియా; స్టాండప్ ఇండియా’ పేరుతో ఓ పధకాన్ని ‘మన్ కీ బాత్’ రేడియా ప్రసంగంలో ప్రకటించారు.

పధకం అయితే ప్రకటించారు గానీ అందుకు తలపెట్టిన విధివిధానాలు ఏమిటో ప్రకటించలేదు. జనవరి 16, 2016 తేదీన ‘స్టార్టప్ ఇండియా; స్టాండప్ ఇండియా’ పధకం పూర్తి వివరాలు (స్టార్టప్ నిర్వచనం, మద్దతు చర్యలు, పాలనా నిర్మాణాలు వగైరా) వెల్లడి చేస్తామని ఆరోజు ప్రధాని చెప్పారు.

ఈ సమాధానం రాస్తుండగానే ప్రధాని తన పధకం వివరాలు వెల్లడిస్తున్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే అవి ఇంకా ప్రసంగం దశలోనే ఉన్నాయి. పధకం వివరాల కోసం ఒక అప్లికేషన్ (యాప్) ను రూపొందిస్తున్నామని అది త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రధాని చెబుతున్నారు.

ఇప్పుడు మీ ప్రశ్న విషయానికి వస్తే…

పేరే చెబుతున్నట్లుగా స్టార్టప్ అన్నది ఒక కంపెనీ పెట్టాలన్న ఐడియా ప్రారంభ దశలో ఉన్నట్లు సూచిస్తుంది. ఐడియా అంటే కేవలం ‘ఒక కంపెనీ పెడదాం’ అని మాత్రమే కాదు. దానికి సాధ్యత ఉండాలి. సరికొత్తగా ఉండాలి. క్లిక్ అవుతుంది అనిపించాలి. వ్యాపారపరంగా లాభదాయకం కావాలి.

స్టార్టప్ అన్న పదం ఇంటర్నెట్ యుగంలో అది కూడా క్లౌడ్ ఆధారిత సేవలను ఇంటర్నెట్ కంపెనీలు ప్రారంభించిన తర్వాతనే పుట్టింది. అంతకు ముందు కూడా అది ఇతర పేర్లతో ఉన్నదే.

పారిశ్రామిక భాషలో చెప్పాలంటే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పేరుతో గతంలో ఉన్నదే ఇప్పటి స్టార్టప్ అని చెప్పవచ్చు. ఆరంభదశలో తలపెట్టిన కంపెనీ అనే కార్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి పడుతూ లేస్తూ నడుస్తున్న కంపెనీలే స్టార్టప్ కంపెనీలు. ఇవి క్లిక్ అయితే కొనసాగి, పెట్టుబడులు ఆకర్షించి, వృద్ధి చెంది, మరిన్ని పెట్టుబడులను మరింత మంది ఉద్యోగార్ధులను ఆకర్షిస్తాయి.

ఆర్ధిక-ద్రవ్య-పారిశ్రామిక భాషలో చెప్పుకుంటే ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న యౌవన ప్రాయపు కంపెనీయే ‘స్టార్టప్ కంపెనీ.’ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ నినాదం ద్వారా భారత దేశంలో మిలియన్ల కొద్దీ ఉన్న యువ విద్యావంతులను, కాలేజీ విద్యార్ధులను, వృత్తి విద్యలు పూర్తి చేసినవారిని సఫలవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని పధకం ఉద్దేశంగా చెబుతున్నారు.

ప్రారంభంలో ఒకరు గానీ కొద్ది మంది గానీ తగిన ఆర్ధిక వనరులను సమకూర్చుకుని వీలయితే అవసరం ఐతే మరి కొంతమంది ఉద్యోగార్ధులను కలుపుకుని ఒక ఉత్పత్తి తీయడానికి కృషి మొదలు పెడతారు. అవి స్టార్టప్ కంపెనీలుగా ఉంటాయి. ఉత్పత్తి అంటే ఒక భౌతిక ఉత్పత్తి కావచ్చు లేదా ఒక సేవ అందించడం కావచ్చు.

ఇప్పుడు వివిధ యాప్ లను సృష్టించడం ద్వారా భౌతిక ఉత్పత్తుల వినియోగాన్ని సులభతరంగా వ్నియోగదారుల్లో పెంచెందుకు ఐ.టి నిపుణులు దోహదపడుతున్నారు. ఇవి మాత్రమే స్టార్టప్ కంపెనీలన్న అవగాహన కలిగితే తప్పు లేదు, ఇప్పుడున్న వాతావరణం అలానే ఉన్నది కనుక. కానీ అది పూర్తి నిజం కాదు.

యాండ్రాయిడ్, iOS, విండోస్ తదితర ఆపరేటింగ్ సిస్టంలలో బహుళ ప్రజాదరణ పొందిన ఒక యాప్ ని సృష్టించడమే ఒక కలగా అనేకమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బతుకుతున్నారు. విజయవంతం అయిన ఇంజనీర్లకు, విద్యార్ధులకు పత్రికలు కూడా నీరాజనాలు పడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. అలాంటి యాప్ లు గూగుల్/మైక్రోసాఫ్ట్/యాపిల్ లాంటి పెద్ద కంపెనీలను ఆకర్షించి కొనుగోలుకు సిద్ధపడితే గనక అదో పెద్ద ఘనకార్యంగా స్ధిరపడి ఉన్నది.

ఉదాహరణకి ఉబర్ (UBER) పేరుతో ఒక యాప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇది టాక్సీ సేవలు అందజేసే యాప్. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న వినియోగదారుడు టాక్సీ కోసం తన అవసరాన్ని (ఎక్కడి నుండి ఎక్కడకి, ఏ సమయానికి వివరాలు) యాప్ లో సబ్మిట్ చేస్తాడు. సమీపంలో అందుబాటులో ఉన్న ఉబర్ డ్రైవర్లు వెంటనే ఆ అవసరాన్ని తీరుస్తారు. ఇదే ఉబర్ అందించే ‘సేవ.’

తర్వాత కాలంలో ఇతర సౌకర్యాలను ఉబర్ ప్రవేశపెట్టింది. వాటిల్లో బాగా సక్సెస్ అయిన ఫీచర్ కార్ పూలింగ్. ఒకే రూట్ లో ప్రయాణిస్తున్న వివిధ ప్రయాణీకులను మార్గమధ్యంలో ఎక్కించుకుంటూ దించేయడం. ప్రయాణీకులు ఒకరినొకరు తెలియనవసరం లేదు. తెలిసినవారు కూడా వివిధ రేట్లు చెల్లించి లబ్ది పొందే వెసులుబాటు ఉంటుంది.

2009లో రూపుదిద్దుకున్న ఒక ఐడియా 2010లో శాన్ ఫ్రాన్ సిస్కో నగరంలో సేవలు ప్రారంభించి ఆ తర్వాత అమెరికాలోని నగరాలన్నింటికీ విస్తరించింది. ఇప్పుడు దాదాపు 60 దేశాల్లోని నగరాల్లో సేవలు అందిస్తోంది.

0.2 మిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్ తో ప్రారంభం అయిన ‘ఉబర్ క్యాబ్’ తర్వాత ‘ఉబర్’ గా పేరు మార్చుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ విలువ 62.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. అందుకే స్టార్టప్ కంపెనీలంటే పెద్ద పెద్ద కంపెనీలతో పాటు దేశాల ప్రభుత్వాలూ పడి చస్తున్నాయి. ఏమో ఏ మూల ఏ ఐడియా క్లిక్ అవుతుందో మరి!

విదేశీ పెట్టుబడుల కోసం పరితపిస్తూ ఏ ప్రధానీ వెళ్లనన్ని దేశాలను సుడిగాలిలా నరేంద్ర మోడీ చుట్టి రావడంలో ఆశ్చర్యం లేదు మరి!

కానీ స్టార్టప్ కంపెనీలు కొత్తగా ఉత్పత్తి తీయగలిగితేనే మెచ్చుకోవాలి తప్ప ఉన్న ఉత్పత్తులను, ఉత్పత్తిదారులను వెనక్కి నెట్టి వారి వ్యాపారాన్ని వశం చేసుకుంటే గనక అది వినాశనకరంగా పరిణమిస్తుంది.

ఎందుకంటే ఉదాహరణకి మళ్ళీ ఉబర్ నే తీసుకుందాం. ఉబర్ డ్రైవర్లు అంటూ ముందుకు వస్తున్నవారంతా నిజానికి చట్టబద్ధంగా లైసెన్స్ ఉన్నవాళ్ళు కాదు. ఒక కారు ఉంటే ఉబర్ లో డ్రైవర్ గా రిజిస్టర్ చేసుకుని ప్రయాణీకుల్ని చేరవేయవచ్చు. దానివల్ల వృత్తి డ్రైవర్లుగా రిజిస్టర్ అయినవాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు.

టాక్సీ డ్రైవర్ గా (ఆటో డ్రైవర్ గా) రిజ్జిస్టర్ కావడం ఇప్పుడు అంత చిన్న విషయం ఏమీ కాదు. వారు రోడ్ & ట్రాన్స్ పోర్ట్ విభాగం నుండి మొదట లైసెన్స్ సంపాదించాలి. డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వాహన రిజిస్ట్రేషన్, పర్యావరణ సర్టిఫికేట్ లు నిత్యం వెంటబెట్టుకుని తిరుగుతూ ఉండాలి. నిర్దేశించిన యూనిఫారం ధరించాలి. వాహనానికి మీటర్ ఉండాలి. మనకు తెలియనివి ఇంకా ఉండవచ్చు కూడా.

ఉబర్ లో రిజిస్టర్ కావడానికి ఇవి అవసరం లేదు. ఒక కారు ఉండాలి. కారు అవసరమైన వినియోగదారుడు ఉంటే చాలు. ఇలా రిజిస్టర్ కానీ, లైసెన్స్ లేని కార్ల వల్ల రిజిస్టర్ అయి అదే వృత్తిగా బతుకుతున్న టాక్సీ డ్రైవర్ల కడుపు మాడుతోంది.

ఉబర్ చేసింది/చేస్తున్నది కొత్త సేవ (ఉత్పత్తి) తీయడం కాదు. ఆ సేవలో ఇప్పటికే ప్రపంచ వ్యాపితంగా కోట్లాది కుటుంబాలు బతుకుతున్నాయి. వారి సేవల మార్కెట్ ను కాజేసి తాను లాక్కోవడమే ఉబర్ చేసిన పని. అనగా వ్యక్తులుగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్న కోట్లాది మంది పనిని ఉబర్ కార్పొరేటీకరించి మొత్తం పని ఒకే సంస్ధలో కేంద్రీకరణ అయ్యేలా చేసింది.

ఉబర్ లో టాక్సీ డ్రైవర్లు కూడా రిజిస్టర్ కావచ్చు కదా అనవచ్చు. కావచ్చు; కానీ గతంలో వాళ్ళు తమ సంపాదన అంతా తామే తినేవాళ్లు. ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని ఉబర్ కి పంచుతున్నారు. పైగా ఉన్న మార్కెట్ ని కోల్పోతున్నారు. అనగా ఒక సేవ అందించడం ద్వారా లక్షలు, కోట్ల మంది ఇంతవరకు ఉపాధి పొందగా ఇప్పుడు ఆ సేవా శ్రమ ద్వారా ఏర్పడుతున్న సంపదలో గణనీయ మొత్తం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది.

1000 ఎకరాల భూమిని 1000 మంది రైతులకు పంచితే 1000 కుటుంబాలు స్వతంత్రంగా పొట్ట నింపుకుంటాయి. అదే ఆ 1000 ఎకరాలు ఒక భూస్వామి చేతుల్లో ఉంటే? 999 మంది రైతులు భూస్వామి పొలంలో పని చేసి కూలి బతుకు బతుకుతారు. ఉబర్ కీ వృత్తిగత టాక్సీ డ్రైవర్ల వ్యవస్ధకీ తేడా ఇదే.

సరిగ్గా ఇలాంటి స్టార్టప్ లనే పెద్ద పెద్ద కంపెనీలు ఎగబడి కొంటాయి. విభజించబడి ఉన్న శ్రమ ఫలితాన్ని కేంద్రీకరించగల వ్యాపార ఐడియాలే బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు కావాలి.

వాట్సప్ యాప్ కూడా ఇలా స్టార్టప్ గా ప్రారంభం అయిందే. యాహూలో ఉద్యోగం పోగొట్టుకుని, ఫేస్ బుక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించబడిన ఇద్దరు అమెరికన్లు 2009లో దీనిని ప్రారంభించారు. ఆరంభంలో పదే పదే క్రాష్ అవుతుండడంతో యాప్ ని ఉపసంహరించుకుందామని అనుకుని కూడా ‘కొన్ని నెలలు చూద్దాం’ అనుకుని కొనసాగించారు.

మొదట యాపిల్ యాప్ స్టోర్ లో ఆ తర్వాత బ్లాక్ బెర్రీ ఓ.ఎస్ లో సేవలు అందించిన వాట్సప్ అనంతరం యాండ్రాయిడ్ లోనూ ప్రవేశించి బహుళప్రజాదరణ పొందింది. కొన్ని వేల వినియోగదారులతో మొదలై ఇప్పుడు 80 కోట్ల మందితో వర్ధిల్లుతోంది.

భారీ వినియోగదారులను కలిగి ఉన్న వాట్సప్ కోసం గూగుల్, ఫేస్ బుక్ లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి 19 బిలియన్ డాలర్ల (రు 1.25 లక్షల కోట్లకు పైనే) చిల్లర చెల్లించి ఫేస్ బుక్ దాన్ని సొంతం చేసుకుంది.

ఎందుకంటే గత ఆర్టికల్ లో చెప్పినట్లుగా సమాచార సాంకేతిక యుగంలో సమాచారమే విలువైన కరెన్సీ. ఎంతమంది ఎక్కువ యూజర్ బేస్ కలిగి ఉంటే అంత ఎక్కువ విలువ. నిజానికి అంత విలువ చేయగల ఉత్పత్తి దేనినీ వాట్సప్ సృష్టించలేదు. కానీ 80 కోట్లమంది వ్యక్తిగత వివరాలను తమ సర్వర్లలో భద్రం చేసుకోవడం అంటే దాని మూలధనం విలువ అంకెల్లో చెప్పగలిగేది కాదు. అది దశాబ్దాలు గడిచినా తరగని పెట్టుబడి. అందుకే అంత డబ్బు వెచ్చించి వాట్సప్ కొనుగోలు చేయడం.

ఫేస్ బుక్ వశం అయ్యాక ఇప్పుడు వాట్సప్ అనేక కుట్రలకు పాల్పడుతోంది. ఇతర చిన్న స్ధాయి స్ధానిక మెసేజింగ్ అప్లికేషన్స్ ఉనికిలో లేకుండా చేయడానికి చేయాల్సిందల్లా చేస్తోంది.

ఉదాహరణకి టెలిగ్రాం పేరుతో మరో మెసేజింగ్ అప్లికేషన్ ఉనికిలో ఉంది. ఇందులో వ్యక్తిగత వివరాలు సాపేక్షికంగా భద్రంగా ఉంటాయి. సాధారణంగా మెసేజింగ్ అప్లికేషన్లు ఒకదానినొకటి కాంప్లిమెంట్ చేసుకుంటాయి. పరస్పరం మెసేజ్ లు మార్చుకునే సౌలభ్యం కలిగి ఉంటాయి. ఆ మేరకు సోర్స్ కోడ్ లోనే ఏర్పాటు ఉంటుంది.

కానీ టెలిగ్రాం అన్న పేరు గల ఏ మెసేజ్ నీ ముందుకు వెళ్లకుండా వాట్సప్ అడ్డుకుంటోందని ఇంటర్నెట్ పరిశోధకులు వెల్లడి చేశారు. అనగా తనకు పోటీ రాగల మెసేజింగ్ కంపెనీ వృద్ధి లోకి రాకుండా అడ్డుకుంటోంది. ఇది ఏ దేశ చట్టాల ప్రకారం చూసినా (ముఖ్యంగా డబల్యూ‌టి‌ఓ చట్టాల ప్రకారం) చట్ట విరుద్ధం. నేరం కూడా. అయినా ఫేస్ బుక్ ఆగడాలను అడ్డుకోలేని పరిస్ధితి.

ఇటువంటి వాతావరణంలో భారతీయ స్టార్టప్ లు బతికి బట్టకట్టడం అసాధ్యం. అవి వృద్ధి చెందితే గనక మహా అయితే ఏ గూగుల్ కౌగిలిలోకో ఫేస్ బుక్ విష పరిష్వంగంలోకో వెళ్లిపోతాయి తప్ప పోటీ పడి దేశీయ వినియోగదారులకు సరసమైన సేవలు అందించడం కల్ల.

భారత ప్రభుత్వం తలపెట్టిన స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పధకం చివరికి స్టార్టప్ MNCs, స్టాండప్ MNCs గా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అనగా భారత ప్రభుత్వం సమకూర్చిన పెట్టుబడులను వినియోగించుకుని అభివృద్ధి చెందిన స్టార్టప్ కంపెనీలు అంతిమంగా విదేశీ బహుళజాతి కార్పొరేషన్ లకు దేశీయ మార్కెట్లను దోచిపెట్టే సాధనంగా అవతరించవచ్చు. ఇప్పటి వ్యవస్ధలో చివరికి జరిగేది అదే.

ప్రధాని మోడి ఈ రోజు ప్రకటించిన ‘యాక్షన్ ప్లాన్’ వివరాల ప్రకారం భారత దేశంలో స్ధాపించే స్టార్టప్ లకు మొదటి 3 సం.లలో పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. స్టార్టప్ లకు మద్దతు కోసం 10,000 కోట్ల కార్పస్ నిధిని ఏర్పాటు చేస్తారు.

స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే వెంచర్ కేపిటల్ పెట్టుబడులకు పెట్టుబడి లాభాల పన్ను (capital gains tax) నుంచి మినహాయింపు ఇస్తారు. పేటెంట్ రిజిస్ట్రేషన్ రుసుములో 80 శాతం తగ్గించేస్తారు. మొదలు పెట్టిన 90 రోజులకే పెట్టే బేడా సర్ధుకుని వెళ్లిపోయే సౌలభ్యం ఇస్తారు. దేశవ్యాపితంగా స్ధాపించి స్టార్టప్ లలో గానీ చిన్న తరహా కంపెనీల్లో గానీ ప్రభుత్వం నుండి ఎలాంటి తనిఖీలు మూడేళ్ళ పాటు ఉండవు.

వీటన్నిటితో పాటు 10 లక్షల మంది పిల్ల విద్యార్ధులు లక్ష్యంగా 5 లక్షల పాఠశాలలు స్ధాపిస్తారట. ఇదేమిటో అర్ధం కావడం లేదు. ఇద్దరు విద్యార్ధులకు ఒక పాఠశాల లక్ష్యంగా చేయడం ఏమిటి? ఒక పక్క రేషనలైజేషన్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న బడుల్ని మూసేస్తుంటే ఇద్దరు విద్యార్ధులకు ఒక పాఠశాల పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది?

పరిశీలించి చూస్తే ప్రధాని ప్రకటించిన తాయిలాలన్నీ విదేశీ పెట్టుబడులకే అనుకూలంగా ఉన్నట్లు గమనించవచ్చు. 10,000 కోట్ల కార్పస్ ఫండ్ సొమ్ము కాజేయడానికి స్టార్టప్ కంపెనీ పెట్టినట్లు పెట్టి 90 రోజుల లోపు మూసేసుకుని పోతే అడిగే నాధుడు ఎవరు? తనిఖీలు కూడా ఉండవని చెప్పినాక!

స్టార్టప్ ల పేరుతో నూతన ఆర్ధిక విధానాల సంస్కరణలను దొడ్డి దారిన ప్రధాని మోడి తీవ్రతరం చేస్తున్నారు.

స్టార్టప్ ఇండియా పధకం ధనవంతులు కాని, ఐడియాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను (entrepreneurs) సృష్టించి ప్రోత్సహించేదిగా ఉండాలి. ప్రకటిత లక్ష్యం కూడా అదే.

చిన్న చిన్న కంపెనీలు ఎన్ని ఎక్కువ ఉంటే సంపద అంతగా వికేంద్రీకృతం అవుతుంది. సరసమైన ధరలకు సరుకులు, సేవలు అందుబాటులోకి వస్తాయి. కానీ పెట్టుబడిదారీ వ్యవస్ధ చిన్న కంపెనీలను అనుమతించదు. పోటీని అసలే ఒప్పుకోదు. ఆ క్రమంలో తిమింగలంలా చిన్న కంపెనీలను మింగుతూ పోతుంది. పోటీని నామమాత్రం చేస్తుంది. ధరలు తగ్గకపోగా ఇష్టానుసారం పెరగడమే చివరికి జరుగుతుంది.

ఈ మధ్య కాలంలో టాటా లాంటి వాళ్ళు స్టార్టప్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. వ్యక్తిగత ఆసక్తి పేరుతో టాటా, రిలయన్స్, ప్రేమ్ జీ తదితర పారిశ్రామికవేత్తలు లు స్టార్టప్ లకు సీడ్ క్యాపిటల్ సమకూర్చుతున్నారు. అనగా స్టార్టప్ లు ఆచరణలో మళ్ళీ బడా పారిశ్రామికవేత్తల కనుసన్నల కిందికే చేరిపోతున్నాయి. మోడి ప్రకటించిన స్టార్టప్-స్టాండప్ తాయిలాలు సంపదల వికేంద్రీకరణకు బదులు కేంద్రీకరణకే దోహదం చేయనున్నాయి.

వడ్డించేవాడు మనోడు అయినప్పుడు బంతిలో ఎక్కడ కూర్చున్నా అండాల్సినవి అందుతాయి. అలాగే టాటా, అంబానీ, ప్రేమ్ జీ… ఇత్యాది పారిశ్రామికవేత్తలు ఇప్పుడు స్టార్టప్ పారిశ్రామికవేత్తలుగా మారి బంతిలో కూర్చుని ఉన్నారు. వారి భోజననానికి 10,000 కోట్ల కార్పస్ ఫండ్ వంటకం సిద్ధం చేయబడింది.

చేర్పు:

ప్రశ్నలో ‘ఇంక్యుబేటర్’ భాగం మరిచాను.

9 నెలలో కడుపులో ఉండబట్టలేక కొంతమంది ముందే పుట్టేస్తారు. అలాంటివారి మిగిలిన నిర్మాణం పూర్తి కావడానికి డాక్టర్లు స్త్రీ గర్భాశయం లాంటి వాతావరణాన్ని కలిగి ఉన్న కృత్రిమ సాధనాల్లో ఉంచి సాకుతారు. ఆ సాధనాన్ని ‘ఇంక్యుబేటర్’ అంటారని బహుశా మీకు తెలిసే ఉంటుంది.

ఆ అర్ధం తోనే స్టార్టప్ లు పెరిగి పెద్దవి కావడానికి తగిన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక వ్యవస్ధను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటినే ఇంక్యుబేటర్లు అంటున్నారు.

ఆ మధ్య, కొద్ది నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం టి-హబ్ పేరుతో ఒక వ్యవస్ధను నెలకొల్పింది. దానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన భవనాన్ని రు. 40 కోట్లతో నిర్మించింది. దానిని ‘ఇంక్యుబేటర్ ఆఫ్ ఇంక్యుబేటర్స్’ అని కూడా ప్రభుత్వం చెప్పుకుంది.

స్టార్టప్ లు వృద్ధి చెందడానికి ఏం కావాలి? సీడ్ కాపిటల్ కావాలి. ఒకవేళ ఐడియా విఫలమై నష్టం వచ్చినా గట్టి దెబ్బ తగలకూడదు (అని ప్రభుత్వాల భావన). అందుకోసం పెద్దగా బరువు బాధ్యతలు (దేశ సంక్షేమం, ప్రజల డబ్బు, టాక్స్ పేయర్స్ మనీ వగైరా కాకరకాయ సెంటిమెంట్లు) లేకుండా చూడాలి. వృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో మరింత అభివృద్ధి చెందడానికీ, స్ధిరపడడానికి వెంచర్ కేపిటల్ కావాలి. ప్రోత్సాహం కోసం పన్నులు తక్కువ ఉండాలి; అసలు పన్నులు లేకపోతే ఇంకా మంచిది.

ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేకమైన విండో/వ్యవస్ధ ఏర్పాటు చేస్తే అదే ఇంక్యుబేటర్. ప్రధాని ఈ రోజు (జనవరి 16) కురిపించిన వరాల జల్లు ఆ ధోరణిలోనే ఉండడం గమనించవచ్చు. టి-హబ్ కూడా సరిగ్గా అదే. IIIT-హైద్రాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ యూనివర్సిటీలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ విజయవంతం కావడానికి శాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలు కీలక పాత్ర పోషించినట్లే ఈ మూడు సంస్ధలు టీ-హబ్ విజయవంతం అయెందుకు కీలకం కావాలని సి.ఎం కె.సి.ఆర్ గారి ఆశ! ముఖ్యమైన సంగతి ప్రాజెక్ట్ కి వెంచర్ కేపిటల్ సమకూర్చడానికి బుక్ చేసుకున్నవారిలో రతన్ టాటా ఒకరు.

టి-హబ్ ఆరంభం అయ్యీ కాకముందే ఒక వార్త అయింది. అందులో అందుబాటులో ఉంచిన అన్ని గదులూ/విభాగాలు పూర్తిగా బుక్ అయ్యాయని తెలుస్తోంది. దాదాపు 400 కు పైగా దరఖాస్తులు వచ్చాయని టి-హబ్ అధికారులు చెప్పడం బట్టి అది ప్రస్తుతానికి క్లిక్ అయినట్లు చెప్పుకున్నా అసలు సంగతి ఇంకా మునుముందు తెలియాల్సి ఉంది.

3 thoughts on “ప్రశ్న: స్టార్టప్ కంపెనీ అంటే?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s