కేరళ కాంగ్రెస్ నాయకుడు, ఐక్యరాజ్య సమితి మాజీ ఉప ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి శశి ధరూర్ మరోసారి తప్పుడు కారణాలతో వార్తలకు ఎక్కారు. వార్త పాతది కాకపోయినా వార్త చదివిన గొంతు కొత్తది. శశి ధరూర్ భార్య మరణం సహజమైనది కాదని అమెరికా ఫెడరల్ పోలీసు పరిశోధనా సంస్ధ ఎఫ్.బి.ఐ నివేదిక తాజాగా స్పష్టం చేసింది.
తాజా అంటే మరీ తాజా కాదు. ఢిల్లీ పోలీసులకి ఎఫ్.బి.ఐ నివేదిక అంది రెండు నెలలైంది. కానీ ఆ నివేదికలో ఉన్నదేమిటో వారికి పూర్తిగా అవగాహన కాకపోవడంతో నివేదికను పరిశీలించి చెప్పాలంటూ ఎయిమ్స్ (ఢిల్లీ) ఆసుపత్రి మెడికల్ బోర్డును కోరారు.
మెడికల్ బోర్డు ఎఫ్.బి.ఐ ఇచ్చిన నివేదికను పరిశీలించి, ఆపోసన పట్టి అందులో ఏముందో వివరిస్తూ మరో నివేదికను తయారు చేసి ఢిల్లీ పోలీసులకు సమర్పించారు. మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా కొన్ని విషయాలను పోలీసులు పత్రికలకు వెల్లడించారు. అయితే పూర్తి వివరాలను మాత్రం వాళ్ళు చెప్పడం లేదు.
“ఒక సంగతి మాత్రం స్పష్టం అయింది. ఆమె మరణం సహజంగా జరగలేదు. ఇప్పటివరకు మేము సాగించిన పరిశోధన బట్టీ, సేకరించిన సాక్షాలను బట్టీ ఆమె మరణం అసహజ కారణాలతో సంభవించింది. ఆ విషయం మాత్రం నేను నిర్ధారణగా చెప్పగలను” అని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సి చెప్పారని పత్రికలు తెలిపాయి.
సునంద మరణానికి కారణం విష ప్రయోగమేనని పత్రికలు ఊహాగానాలు చేశాయి. ఈ మేరకు తగిన కారణాలను ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ల బృందమే గతంలో అందజేసింది. విష ప్రయోగం జరిగి ఉండవచ్చని డాక్టర్ల బృందం వెల్లడించింది. రేడియో ధార్మిక పదార్ధం పోలోనియంను ఆమె శరీరంలో ప్రవేశపెట్టినందునే ఆమె చనిపోయిందని వివిధ పత్రికలు విశ్లేషణలు చేశాయి.
అయితే పోలోనియం ప్రయోగం జరిగిందన్న అనుమానాలను ఎఫ్.బి.ఐ నివేదిక కొట్టివేసింది. ఆమె శరీరంలో అనుమతించబడిన స్ధాయిలోనే రేడియో ధార్మిక ఐసోటోపులు ఉన్నాయని, మరణానికి కారణం అయ్యే స్ధాయిలో లేవని ఎఫ్.బి.ఐ నివేదిక వెల్లడించింది. ఈ సంగతి గత నవంబర్ లో ఎఫ్.బి.ఐ నివేదిక అందినప్పుడే ఢిల్లీ పోలీసులు చెప్పారు.
పోలోనియం ప్రయోగాన్ని కొట్టివేసిన ఎఫ్.బి.ఐ అదే సమయంలో ఆమె మరణం దేనివల్ల సంభవించిందో కూడా తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. కానీ ఆ కారణం ఏమిటో వెల్లడి చేయడానికి పోలీసులు సుముఖంగా లేరు. ఎఫ్.బి.ఐ చెప్పిన ఇతర కారణాలు అర్ధం చేసుకునేందుకే పోలీసులు ఎయిమ్స్ మెడికల్ బోర్డు సహాయం కోరారు.
“మెడికల్ బోర్డు 11 పేజీల నివేదికను అందజేసింది. నివేదికకు జతగా 32 పేజీల అనుబంధాలను కూడా అందజేసింది. వీనిని పరిశీలించవలసి ఉంది. నిర్దిష్ట నిర్ధారణలను కొన్నింటిని నివేదికలో పొందుపరిచారు. వాటిపై మేము దర్యాప్తు కొనసాగించవలసి ఉంది” అని బస్సి విలేఖరులకు తెలిపారు.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం జనవరి 17, 2014 తేదీన సునంద బస చేస్తున్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ సూట్ లో చనిపోయి కనిపించింది. ఆమె భర్త శశి ధరూర్ తాను రాత్రి బాగా పొద్దు పోయాక హోటల్ కి వెళ్ళగా ఆమె చనిపోయి ఉన్నదని ఆ వెంటనే పోలీసులకు చెప్పానని అప్పట్లో చెప్పారు.
ఆ తర్వాత సునంద శరీరంపై పోస్ట్ మార్టం జరిపాక దేహంపై గాయాలు ఉన్నట్లుగా డాక్టర్లు వెల్లడి చేశారు. దానితో అనుమానాలు, ఊహాగానాలు బయలుదేరాయి. అంతకు కొద్ది రోజుల మునుపే ఆమె శశి ధరూర్ కు పాకిస్తాన్ కు చెందిన విలేఖరి మెహర్ తరర్ కూ సంబంధం ఉందని ఆరోపిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ లో పోస్ట్ చేశారు. మెహర్ తరర్ ఐ.ఎస్.ఐ ఏజెంటు అనీ, తన భర్త వెంట పడుతోందని సునంద ట్వీట్ ల ద్వారా ఆరోపించారు. దానితో సునంద మరణంపై తీవ్ర అనుమానాలు రేకెత్తాయి. అప్పటి ప్రతిపక్ష బి.జె.పి శశి ధరూర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
బి.జె.పి అధికారంలోకి వచ్చాక శశి ధరూర్ కొన్ని వింత పోకడలు పోయారు. బి.జె.పి నేత, ప్రధాని నరేంద్ర మోడిని పొగుడుతూ ఆయన పలు మార్లు పత్రికలతో మాట్లాడారు. ట్విట్టర్ లో పోస్టులు రాశారు. దానితో శశి ధరూర్ పై అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే కొందరు నిపుణులు మాత్రం సునంద మరణం ప్రమాదవశాత్తూ, మందుల ఓవర్ డోస్ వల్ల సంబంధించింది మాత్రమేనని అప్పట్లో తేల్చేశారు. రాజీవ్ గాంధీ మరణంలో పోస్టు మార్టం నిర్వహించిన ఎయిమ్స్ మాజీ నిపుణుడు ఒకరు ఈ మేరకు పత్రికలతో వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఎఫ్.బి.ఐ నుండి అందుకు పూర్తిగా భిన్నమైన పరిశీలన వ్యక్తం అయింది. తప్పు చేయడం వల్ల బైటపడేందుకు శశి ధరూర్ ప్రధానిపై అన్నిసార్లు పొగడ్తలు కురిపించారా లేక శశి ధరూర్ ఆరోపించినట్లు ఆయన్ను ఇరికించేందుకు బి.జె.పి ప్రభుత్వం ఢిల్లీ పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నదా అన్నది ప్రస్తుతం అంతు దొరకని ప్రశ్నలుగా మిగిలాయి.
“ఎఫ్.బి.ఐ నివేదికలో ప్రమాదకర రసాయనం ప్రస్తావన ఉందన్న విషయమై నాకు అవగాహన లేదు. తమకు అందిన ఏ నమూనా లోనూ రేడియో ధార్మిక పదార్ధం లేదని ఎఫ్.బి.ఐ నివేదికలో ఉన్నది. రేడియో ధార్మిక పదార్ధం లేదని మాత్రం నేను నిర్ధారించగలను. కానీ దానితో పాటు కొన్ని ఇతర నిర్దిష్ట అంశాలు కూడా నివేదికలో ఉన్నాయి. మేము పూర్తి నివేదికను మెడికల్ బోర్డుకు ఇచ్చాము. వారు పరిశీలించి మాకు ఒక నివేదిక ఇచ్చారు.
“…కొన్ని ఇతర రసాయన పదార్ధాలు ఉన్నాయని ఎఫ్.బి.ఐ ప్రయోగశాల తెలిపింది. (దాని ఆధారంగా) మెడికల్ బోర్డు నిర్దిష్ట నిర్ధారణలను మాకు అందజేసింది. ఆ అంశాలపై మేము దర్యాప్తు చేస్తాము” అని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సి తెలిపారు.
మొత్తం మీద ఎఫ్.బి.ఐ నివేదిక అందాక కూడా ఊహాగానాలకు తెరదించడానికి వీలు లేకుండా పోయింది. పైగా ఉన్న అనుమానాలు రూఢి అయ్యేందుకు ఆ నివేదిక, పోలీసుల దాపరికం దోహదం చేస్తున్నాయి. సునంద మరణం ఒక నేరమా లేక ప్రమాదమా అని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకోగల ఉపకరణంగా మారినట్లు కనిపిస్తోంది.
మధ్యలో ఎఫ్.బి.ఐ ఎలా వచ్చింది?ఎందుకు వచ్చింది?ఎప్పుడు వచ్చింది? దీనిగురించి రేఖామాత్రమైనా ఎక్కడా వివరించలేదు!