ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకానికి భారత దేశ అత్యున్నత న్యాయస్ధానం నుండి మద్దతు లభించింది. పధకానికి వ్యతిరేకంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పిటిషన్ దారులను తీవ్రంగా మందలించింది. ప్రచారం కోసం పిచ్చి వేషాలు వేస్తే భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
“కాలుష్యంతో జనం చచ్చిపోతున్నారు. మేము కూడా కార్-పూలింగ్ పాటిస్తున్నాం. మీరేమో ఆ పధకాన్ని సవాలు చేస్తారా?” అని చీఫ్ జస్టిస్ టి ఎస్ ఠాకూర్ పిటిషనర్లను సూటిగా ప్రశ్నించారు.
పిటిషనర్లు అప్పటికే ఢిల్లీ హై కోర్టులో ఓడిపోయి ఉన్నారు. బేసి-సరి పధకం ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నదని, పధకాన్ని మరింతకాలం పొడిగించే ఉద్దేశ్యం ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్నదనీ ఇంకా ఏవేవో కారణాలు చూపుతూ పధకం అమలును వెంటనే నిలిపేయాలని కోరారు.
పిటిషన్ కు స్పందిస్తూ ఢిల్లీ హై కోర్టు పధకాన్ని జనవరి 8 తేదీతోనే ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలంటూ జనవరి 4 తేదీనే ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. కేజ్రీవాల్ ప్రభుత్వం పధకం వల్ల అప్పటివరకూ ఒనగూరిన ఫలితాలను శాస్త్రీయ సాక్షాల రూపంలో, కాలుష్యం డేటాలతో ఢిల్లీ హై కోర్టుకు చూపింది.
కొందరు ఆరోపిస్తున్నట్లుగా పధకాన్ని పొడిగించే ఉద్దేశం తమకేది లేదని హై కోర్టుకు తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం. కాలుష్య పరీక్షలను బట్టి పధకం వల్ల కాలుష్యం స్వల్పంగా తగ్గిందని పరీక్షల గణాంకాలతో వివరించింది. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని చెప్పింది.
ఇరు పక్షాల వాదనను సావధానంగానూ యుద్ధ ప్రాతిపదికనూ విన్న హై కోర్టు మొదట తీర్పును రిజర్వ్ లో ఉంచుకుంది. తర్వాత రెండు రోజులకే తీర్పును ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ తీర్పు చెప్పింది.
తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే పధకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నందున కోర్టులు జోక్యం చేసుకునే అవసరం లేదని చెప్పింది. అదీ కాక ప్రభుత్వం ఒక విధాన నిర్ణయంతో అమలు చేస్తున్న పధకాన్ని అడ్డుకోవడం అంటే కోర్టు తనకు అప్పగించిన అధికారాలకు మించి వ్యవహరించడమే అని స్పష్టం చేసింది.
ఇంత జరిగిన తర్వాత కూడా ఆ పిటిషనర్లు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. మరో రోజులో పధకం అమలు ముగిసిపోతున్న పరిస్ధితుల్లో తమ పిటిషన్ ను అర్జెంట్ గా వినాలంటూ సర్వోన్నత న్యాయ స్ధానాన్ని అర్ధించారు.
హై కోర్టు అంత సావధానంగా విని, వివరంగా రాజ్యాంగ సూత్రాలను వల్లించి పిటిషన్ ను వెనక్కి కొట్టినప్పటికీ మళ్ళీ అవే వాదనలతో వారు తమ వద్దకు రావడం సుప్రీం కోర్టు పెద్దలకు మండింది (కావాల్ను).
ఢిల్లీ ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం పరిధిలోనే చేసిన నిర్ణయాన్ని అప్పటికే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం ఆచరిస్తున్నారు. వాస్తవానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులను బేసి-సరి పధకం నుండి ప్రభుత్వం మినహాయించింది. అయినప్పటికీ ఒక సదుద్దేశంతో చేసిన నిర్ణయం అన్న తెలివిడితో వారు చట్టాన్ని తాము కూడా ఆచరించడానికే నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసినట్లే సుప్రీం న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ సైతం కార్ పూలింగ్ (సొంత కార్లకు బదులు ఆ రోజుకు అనుమతించబడిన కార్లలో ప్రయాణించడం) ద్వారా కోర్టులకు వెళ్లారు.
ఈ నేపధ్యంలో పిటిషనర్లు చెవులు కోసిన మేకల్లా ‘అన్యాయం’ అని అరుస్తూ, కాళ్ళు గాలిన పిల్లుల్లా కోర్టుల చుట్టూ తిరగడం మానుకోలేదు. ఏకంగా సర్వోన్నత న్యాయస్ధానానికే ఏతెంచారు. ఢిల్లీ హై కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వేసిన తమ అప్పీలును వేంఠనే వినాలని కోరారు.
దానితో సహనం నశించిన సుప్రీం కోర్టు గట్టిగా చీవాట్లు పెట్టింది. పిటిషనర్ల అప్పీలును “పబ్లిసిటీ స్టంట్” గా కొట్టిపారేసింది. ఢిల్లీ జనం కాలుష్యంతో వేగలేక చస్తుంటే మీకు పబ్లిసిటీ కావాలా అని చురక తగిలించింది. మళ్ళీ మాట్లాడితే భారీ మొత్తంలో పెనాల్టీ వేస్తామని తేల్చిపారేసింది. దానితో పిటిషనర్లు కుక్కిన పేనుల్లా తోక ముడవబోయి పేనుకు తోక ఉండదు గనుక కిక్కురుమనకుండా వెనుదిరిగారు (అని భావిద్దాం).