బేసి-సరి అమలు: ఒక పరిశీలన


Odd Even scheme

కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకం వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా లేదా అన్నది కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే. కావాలంటే దానికీ సమాధానం చెప్పుకుందాం, ఉందో లేదో అని!

ఢిల్లీ ప్రభుత్వం స్వల్పంగా కాలుష్యం తగ్గింది అని చెబుతోంది. కాదు.., స్వల్పంగా కూడా తగ్గలేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రభుత్వం భావిస్తున్నంతగా తగ్గలేదు కావచ్చు కూడా. ఎందుకంటే…

2013లో కాన్పూర్ ఐ‌ఐ‌టి వారు ఢిల్లీలో సర్వే మరియు పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ గాలిలో నిండిపోయిన అతి సూక్ష్మ పదార్ధాలు ఎక్కడినుండి వస్తున్నాయో పరిశీలించారు. వారు తయారు చేసిన ముసాయిదా నివేదిక ప్రకారం ఢిల్లీలో గాలిలోని అతిసూక్ష్మ రేణువులలో (particulate matter) 20 శాతం వాహనాల నుండి వెలువడుతున్నాయని తేలింది.

వాహనాలలో కూడా 80 శాతం రేణువులు ద్విచక్ర వాహనాలు, ట్రక్కుల నుండే వస్తున్నట్లు తేలింది. మిగిలిన 20 శాతం సూక్ష్మ రేణువులు కార్ల నుండి వెలువడుతున్నాయి. అనగా మొత్తం మీద చూస్తే ఢిల్లీ గాలిలోని సూక్ష్మ రేణువుల్లో 2 శాతం మాత్రమే కార్ల నుండి వెలువడుతున్నాయి. మిగిలిన కారణం ఫ్యాక్టరీల పొగ, వ్యర్ధాలు తగలబెట్టడం, రోడ్లపై పెరుకుపోయే దుమ్ము వగైరా, వగైరా.

అందువల్లనే రోజులో తిరిగే కార్లను సగానికి తగ్గించడం వల్ల స్వల్పంగా మాత్రమే తేడా వచ్చింది.

అయితే బేసి-సరి పధకం అమలు ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు కాలుష్యం తగ్గిందా లేదా అన్న ప్రశ్నకు (సమాధానానికీ) మించినవి.

“అబ్బా! ఈ జనం ఉన్నారు చూసారూ, వీళ్ళు గొర్రెలు. గొర్రెల మంద! ముందు గొర్రె ఎటు పోతే వెనకాల ఉన్న గొర్రెలు అటే బడి పోతుంటాయి” అంటూ జనాన్ని ఫ్యాషనబుల్ గా ఈసడించుకునే అధమ దద్దమ్మలకు బేసి-సరి పధకం అమలు చెంప చెళ్లుమనిపించింది.

కాకుంటే ఒక ప్రభుత్వ నేతలు తలపెట్టిన కార్యాన్ని ఆ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్న జనం చిత్తశుద్ధితో ఆచరించిన ఉదాహరణ భారత దేశంలో ఎప్పుడన్నా కన్నామా, ఒక్క జాతీయోద్యమంలో తప్ప!

బేసి-సరి పధకం అమలు ప్రారంభం కాకముందే పెదవులు విరగదీసుకున్న మేధో పుంగవులకు కొరవలేదు దేశంలో. బి.జె.పి నేతలు కొందరైతే ‘ఇది విఫలం అయి తీరుతుంది’ అని శాపనార్ధాలు పెట్టారు కూడా.

అయినా సరే ఢిల్లీ జనం నమ్మారు. తనకు మినహాయింపు ఉన్నప్పటికీ దానిని రద్దు చేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్ పూలింగ్ పద్ధతిని పాటించారు. ఇతర మంత్రులు ఆయన్ను అనుసరించారు. ఉప ముఖ్యమంత్రి సైకిల్ పై వెళ్లారు. రవాణా మంత్రి జనంతో కలిసి బస్సుల్లో తిరిగారు. ఆటోల్లో తిరిగారు.

జనం వారిని అనుసరించారు. తమ ప్రభుత్వ నేతలను నమ్మి, ఆమోదించి, అనుసరించారు.

చట్టాన్ని ప్రవేశపెట్టిన నేతలు ఆ చట్టాల నుండి అధికారికంగానూ, అనధికారికంగానూ కూడా మినహాయించుకునే నేతలనే వారు ఇంతవరకూ చూశారు తప్ప ఉన్న మినహాయింపులను రద్దు చేసుకుని చట్టాన్ని పాటించిన మంత్రులను, నేతలను చూడడం ఇదే మొదటిసారి కనుక వారు నమ్మి అనుసరించారు, పాటించారు. ఫలితం సంగతి తర్వాత!

ఢిల్లీ ముఖ్యమంత్రి చట్టం/రూల్/నిబంధన చేసిపారేసి గమ్మున కూర్చోలేదు. దాని గురించి చాలా ముందునుంచే ప్రచారం చేశారు. జనం కలిసిరాకుండా చట్టాలు పనిచేయవని నమ్మబలికారు. జనం కోసం చేసే చట్టాలు జనం ఎలా పాటించాలో వివరంగా చెప్పారు. తానూ చట్టాన్ని పాటిస్తానని చెబుతూ పాటించి చూపించారు.

ఢిల్లీ కాలుష్యం ఇప్పటి వార్త కాదు. ఢిల్లీ సగం రాష్ట్రంగా ఏర్పడక ముందునుంచే వార్తల్లో నానుతోంది. కాలుష్యాన్ని నిర్మూలించాలని గతంలో కాంగ్రెస్ నేతలు, బి.జె.పి నేతలు కూడా ప్రసంగాలు దంచారు. నిర్మూలిస్తామని వాగ్దానాలు కూడా చేశారు. కానీ వారెవరూ జనం పాత్రని గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా జనం పాత్రం వహించేలా చేయగల దమ్ము, చిత్తశుద్ధి, ఓపిక వారి లేదు.

ఒకరిద్దరు ముఖ్యమంత్రులు వివిధ ప్రయత్నాలు కూడా చేశారు. కాన్పూర్ ఐఐటి పరిశీలన, పరిశోధన షీలా దీక్షిత్ కాలంలో జరిగినదే. కానీ దానికి అనుసరణగా ఆమె చేసిందేమీ లేదు.

పరిశోధన జనంలో చేసినదే. కానీ ఆ పరిశోధన ఫలితాలను జనానికి వివరించి తదనుగుణంగా ఏమి చేయవచ్చో చెప్పింది ఏ‌ఏ‌పి ప్రభుత్వం మాత్రమే.

బేసి-సరి పధకం అమలు చేయడానికి ముందు ఏ‌ఏ‌పి ఎదుర్కోవలసిన ఎన్నికలేమీ లేవు. ఓట్ల కోసం అమలు చేసిన పధకం కాదది. పైగా పధకం అమలుకు ముందు దానివల్ల ఓట్లు కోల్పోయే వాతావరణమే నెలకొని ఉంది తప్ప ఓట్లు పోగయ్యే వాతావరణం ఏమీ లేదు. పధకం గురించి వ్యతిరేకంగా రాసిన, కూసిన, ఎగిరిన పత్రికలు, ఛానెళ్లే ఎక్కువ! ఒకటి, రెండు పత్రికలు కాస్త సానుకూల వ్యాఖ్యలు చేసినప్పటికీ వ్యతిరేక రొద ముందు అవేమీ వినపడలేదు.

కానీ కేజ్రీవాల్ లేదా ఏ‌ఏ‌పి తాము నమ్మింది జనానికి మేలు చేస్తుందని నమ్మారు గనుక దానిని జనమూ నమ్ముతారని నమ్మారు. అందుకే అమలుకు ఏ మాత్రం జంకలేదు. వారు ఊహించినట్లే జనం పధకాన్ని ఆచరించారు. ఐదు వేల చిల్లర మంది పధకాన్ని ఉల్లంఘించి పెనాల్టీ కట్టవచ్చు గాక! వారికంటే వేల రెట్లుమంది పాటించడమే అసలు వార్త!

పధకం గురించి కేజ్రీవాల్ కొద్ది మాటల్లో వివరించడానికి, నచ్చజెప్పడానికి మాత్రమే ప్ర్యత్నించాడు తప్ప గంటల కొద్దీ గంభీర ఉపన్యాసాలు దంచలేదు. ‘మన్ కీ బాత్’ అంటూ పోచుకోలు కబుర్లు చెప్పలేదు. పధకాన్ని ప్రజలు ఆచరించేలా చేయడానికి మార్గాలు వెతుకుతూ పోయాడు. వేలమంది స్వచ్ఛంద కార్యకర్తల్ని పోగు చేశాడు. నిన్నటివరకూ ఉప్పు-నిప్పుగా ఉన్న ఢిల్లీ పోలీసుల మద్దతు తీసుకున్నాడు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సైతం “పధకం ఉద్దేశ్యం మంచిదే” అని అనకుండా ఉండలేకపోయాడంటే కేజ్రీవాల్, ఏ‌ఏ‌పి పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మేల్యేలు చేసిన కృషి అలాంటిది.

ప్రధాని నరేంద్ర మోడి కూడా ఇలాంటి పధకమే ప్రకటించారు ‘స్వచ్ఛ్ భారత్’ అంటూ. కానీ వారు చేసిన ఆచరణ ఏమిటి? హడావుడిగా నాలుగు చీపుర్లు, మరో నాలుగు తట్టలు బుట్టలు పట్టుకోవడం ఒకే చోట పదిమందీ కలిసి ఊడుస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఆనక పత్తా లేకుండా పోవడం.

నరేంద్ర మోడి ప్రకటించిన పధకం ఫోటోలకూ, ఏదో చేసేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ఉద్దేశించింది మాత్రమేనని గ్రహించడానికి జనానికి అట్టే రోజులు పట్టలేదు. మోడి అంటే జనానికి ఎక్కడో దూరంగా వేదికపై నిలబడి, పెద్ద పెద్ద తెరలపై మాత్రమే సమీపంగా కనిపిస్తూ గంభీరోపన్యాసాలు దంచి చప్పట్లు కొట్టించుకోగల నేత మాత్రమే.

కానీ కేజ్రీవాల్ అలా కాదు. రాజకీయం అంటే ఆచరణ అనీ, ప్రభుత్వం అన్నా ఆచరణ అనీ రేఖా మాత్రంగానైనా జనానికి చూపినవాడు కేజ్రీవాల్. ముందే చెప్పినట్లు పధకం గురించి ఆయన గంభీర ఉపన్యాసాలు ఇవ్వలేదు. కేవలం ఆచరించడం పైనే ప్రధానంగా దృష్టి సారించాడు.

ఇవన్నీ సాధ్యం అయింది కేవలం జనం వల్లనే, కేజ్రీవాల్ గానీ, ఏ‌ఏ‌పి గానీ కేవలం సాధనాలు మాత్రమే. అసలు పాత్రధారులు జనం. వాళ్ళు కాలుష్యం తమ సమస్యే అని గుర్తించడమే కాకుండా దాని నిర్మూలన కోసం చేసే చర్యల్లో తామూ పాల్గొనాలన్న మర్మాన్ని మొదటిసారి ఒక ఉద్యమ సమానంగా గుర్తించారు.

ఈ జనాచరణకు కేజ్రీవాల్, ఏ‌ఏ‌పి లు శక్తివంతమైన ఉత్ప్రేరకాలు. నిజానికి వ్యక్తులు, పార్టీలు ఎప్పటికీ ఉత్ప్రేరకాలు గానే ఉండగలరు/వు తప్ప వారే అన్నీ చేసెయ్యరు. అసలు చేయవలసింది జనమే.

ఈ సత్యాన్ని గుర్తించగలిగితే “ఈ జనం ఉన్నారు చూసారూ….” అన్న వెర్రిమొర్రి తత్వాలు పుట్టవు.

One thought on “బేసి-సరి అమలు: ఒక పరిశీలన

  1. when you are talking about odd even rule, why are you criticizing Narendr modi for Swach Bharat, Remember that Swach bharat has changed minds of indians……
    YOU DONT HAVE RIGHT TO TALK ABOUT NARENDRA MODI IN THIS MATTER,,HE EVEN SUPPORTED ODD EVEN RULE

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s