జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ కు తగిన గౌరవాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడి ఇవ్వలేకపోయారని పిడిపి నేత, దివంగత నేత కుమార్తె మెహబూబా ముఫ్తి భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ముఫ్తి మహమ్మద్ సయీద్ విగత దేహం ఢిల్లీ ఆసుపత్రిలో ఉండగా సందర్శించడమే కాకుండా ప్రత్యేకంగా శ్రీనగర్ వెళ్ళి మరీ మెహబూబాను ఓదార్చిన నేపధ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రిగా ఉండగా జబ్బు పడి ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చేరినప్పటికీ ఆయనను చూసేందుకు ప్రధాని మోడి ఒక్కసారి కూడా రాకపోవడం పట్ల మెహబూబా ముఫ్తి అసంతృప్తిగా ఉన్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి చెప్పినట్లుగా ది హిందు, ఎన్‌డిటివి లు తెలిపాయి.
సయీద్ మరణించిన వెంటనే సోనియా గాంధీ జనవరి 7 తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. అయితే ఆమె సందర్శించినప్పుడు సయీద్ కుమార్తె మెహబూబా ముఫ్తి ఆసుపత్రిలో లేరు. ఆమె కోసం అడిగిన సోనియా గాంధీ, తన లగేజీ కోసం ఢిల్లీలోని జమ్మూ & కాశ్మీర్ హౌస్ కి వెళ్ళినట్లు తెలియడంతో ఆమె రాక కోసం ఆసుపత్రిలో వేచి చూశారు. మెహబూబా రాకకోసం అరగంట పాటు వేచి చూసిన సోనియా ఆలస్యం కావడంతో వెనక్కి వెళ్ళిపోయారు.
అయితే సోనియా గాంధీ అక్కడితో ఆగిపోలేదు. మెహబూబా ముఫ్తిని కలవలేకపోయినందున జనవరి 10 తేదీన మళ్ళీ ఆమె ప్రత్యేకంగా శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. శ్రీనగర్ విమానాశ్రయం నుండి నేరుగా మెహబూబా ఇంటికి వెళ్ళి ఆమెతో 20 నిమిషాలు గడిపారు సోనియా గాంధీ.
ఈ సందర్శనలు పిడిపి పార్టీలో భారీ చర్చకు దారి తీశాయి. సోనియా గాంధీ చూపిన ఓదార్పు సంకేతాలు బి.జె.పి ప్రధాని నరేంద్ర మోడి స్పందనలతో పోల్చుకోవడానికి దారి తీసాయి. పోలికల ఫలితం అనివార్యంగా నరేంద్ర మోడికి వ్యతిరేకంగా పరిణమించింది.
ఒక రాష్ట్రానికి నేతృత్వం వహించే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతూ ఆసుపత్రిలో మంచంపై ఉన్నప్పటికీ, అది కూడా ఆ నేత తమ పార్టీ భాగస్వామ్యంతో ప్రభుత్వ నేతగా ఉంటున్నప్పటికీ ఆయనకు ఏ మాత్రం సహానుభూతి ప్రధాన మంత్రి నుండి వ్యక్తం కాకపోవడం తమ నేత మెహబూబా ముఫ్తిని అమితంగా బాధిస్తోందని పిడిపి నేతలు పత్రికలతో వ్యాఖ్యానిస్తున్నారు.
“ఈ అంశం మెహబూబాను అమితంగా బాధిస్తోంది. తన తండ్రికి దక్కవలసిన గౌరవం ప్రధాన మంత్రి నుండి అందలేదని ఆమె భావిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి, తన జీవితం కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ ఆయనను చూసేందుకు ఎవరూ రాలేదు” అని పిడిపి నేత ఒకరు అన్నారని ది హిందు తెలిపింది. ఈ వ్యాఖ్యను బట్టి నరేంద్ర మోడితో పాటు ఇతర బి.జె.పి నేతలు కూడా ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించనట్లు తెలుస్తున్నది.
మెహబూబా అసంతృప్తి బహిరంగంగా ఆమె సహచరుల ద్వారా వ్యక్తం అయ్యాకనే బి.జె.పి నేత నితిన్ గడ్కారీ శ్రీనగర్ సందర్శించి మెహబూబా ను కలిసినట్లు తెలుస్తోంది. విగత దేహం శ్రీనగర్ కు తరలిస్తుండగా విమానాశ్రయంలో సందర్శించడానికి ప్రధాని రావడం కూడా సోనియా గాంధీ ఆసుపత్రి సందర్శన అనంతరం అసంతృప్తి వాసనను పసిగట్టిన తర్వాత మాత్రమే జరిగిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
సోనియా గాంధీ ప్రదర్శించిన చొరవ పిడిపి పార్టీలో పదే పదే చర్చ జరగడానికి దారి తీసినట్లు తెలుస్తోంది. సోనియా సందర్శనలను, మోడి నిరాసక్తతను పోల్చుకుని చర్చలు సాగించారు. అయితే మెహబూబా ముఫ్తికి తన తండ్రి తీసుకున్న చివరి రాజకీయ నిర్ణయం (బి.జె.పి తో మైత్రి) తిరగదొడే ఉద్దేశ్యం మాత్రం లేదని ఆమె మంత్రులు స్పష్టం చేయడంతో బిజేపి-పిడిపి మైత్రి చెడిపోవచ్చని, కాంగ్రెస్ తో కలిసి పిడిపి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సూచిస్తూ పెద్ద ఎత్తున చెలరేగిన ఊహాగానాలకు తెరపడింది.
“ఆమెకు తన తండ్రిగారే సర్వస్వం అన్న సంగతి మరువరాదు. మాకు రాజకీయంగా నష్టకరం అయినప్పటికీ ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎన్నడూ వ్యవహరించలేదు” అంటూ పిడిపి నేతలు బి.జె.పితో మైత్రి తెగేది లేదని స్పష్టం చేశారు. “అయితే అంతిమ పరిశీలనలో బిజేపి సయీద్ తో వ్యవహరించిన తీరును మర్చిపోవడం మాకు చాలా కష్టం” అని చెప్పకుండా పిడిపి నేతలు ఊరకుండలేదు.
హిందూ సంప్రదాయాలకు అత్యంత గౌరవం ఇస్తున్నట్లు నటించి బిజేపి నేతలు ఆచరణలో వాటిని అనేకమార్లు తుంగలో తొక్కడం భారత ప్రజలకు చిరపరిచితమే. చనిపోయిన వ్యక్తి మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఆ వ్యక్తికి నివాళులు అందజేయడం హిందూ సాంప్రదాయంలో భాగామా కాదా అన్నది హిందూ సంస్కృతీ పరిరక్షకులే చెప్పవలసి ఉన్నది.
ఢిల్లీలోనే అత్యంత సమీపంలో అనారోగ్యంతో చావు బతుకుల మధ్య ఉన్న ఒక ముఖ్యమంత్రికి, ఆయన మరణానంతరం కూడా దక్కని హిందూ సాంప్రదాయ గౌరవం, సంస్మరణ లేకపోతే మాత్రమేమి? అందుకు ముఫ్తి మహమ్మద్ సయీద్ గారి మతమే ఆటంకం అయితే హిందూ ప్రవక్తలు ప్రవచించే ‘పరమత సహన’ సంప్రదాయం వాస్తవంగా లేనట్లే భావించవలసి వస్తోంది.
నిజానికి పరమత సహనం అన్నది ప్రజల దైనందిన జీవనంలో అంతర్భాగం. దానిని ఒకరు ప్రత్యేకంగా గుర్తించి పొగడ్తలు కురిపించవలసిన అవసరం లేకుండానే ఉనికిలో కొనసాగుతూ వస్తోంది. ఈ సో-కాల్డ్ సంస్కృతీ పరిరక్షకుల హింసాత్మక జోక్యమే భారత సమాజం సాంస్కృతికంగా ఎదుర్కొంటున్న అసలు సమస్య తప్ప మత విభేదాలు ప్రజలను ఎన్నడూ తమంతట తాముగా విడదీసింది లేదు.