జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం


Kejriwal A

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపించబడుతున్న డి‌డి‌సి‌ఏ కుంభకోణంపై విచారణ చట్ట విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ‘సలహా ఇవ్వండి’ అంటూ లేఖ రాయించుకుని ఆనక ‘ఆ విచారణ చట్టబద్ధం కాదు’ అని బి.జె.పి ప్రభుత్వం ప్రకటించేసింది.

‘అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ చట్ట విరుద్ధం’ అని నిర్ధారించిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం ఘనతను మూటగట్టుకుంది. ‘అవినీతిని అంతం చేసేస్తాం’ అంటూ వీరాలాపాలు పలికిన నరేంద్ర మోడి తదితర బి.జె.పి నాయకుల హామీలు ఒట్టి ఓటి మోతలేనని తాజా నిర్ధారణతో రుజువైపోయింది.

14 సం.లు డి‌డి‌సి‌ఏ అధ్యక్షుడుగా అరుణ్ జైట్లీ పదవీ బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో అలవిమాలిన అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు ఇప్పటివి కావు. బి.జె.పి ఎం.పి కీర్తి ఆజాద్ ఎప్పటినుండో డి‌డి‌సి‌ఏ వ్యవహారంపై పత్రికలకు ఎక్కుతూ వచ్చారు.

కోట్లాది నిధులు అక్రమ కార్యకలాపాలకు తరలించి సొమ్ము చేసుకోవడమే కాకుండా క్రికెట్ ఆటను సైతం గబ్బు పట్టించారని అనేకమంది ఆటగాళ్లు, డి‌డి‌సి‌ఏ అధికారులు గతంలో ఆరోపించి ఉన్నారు. బిషన్ సింగ్ బేడి, సురేందర్ ఖన్నా లాంటి మాజీ ఆటగాళ్లు ఆరోపణలు చేసినవారిలో ఉన్నారు. విచారణ జరగడానికి వీలుగా జైట్లీ రాజీనామా చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు.

ఈ అవినీతిపై విచారణ చేసేందుకు వీలుగా ఏ‌ఏ‌పి ప్రభుత్వం తగిన సమాచారం సేకరిస్తూ ఉండగానే రానున్న ముప్పును కేంద్రంలో పెద్దలు గ్రహించారు. ఏయే సమాచారం సేకరించారో తెలుసుకోవడానికే ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ ని అడ్డం పెట్టుకుని ఢిల్లీ సెక్రటేరియట్ పై సి.బి.ఐ చేత సోదాలు జరిపించారని కేజ్రీవాల్ ఆరోపణల ద్వారా అర్ధం అయింది.

కేజ్రీవాల్ ఆరోపణలు వాస్తవాలేనని రాజేంద్ర కుమార్ ను సి.బి.ఐ అడిగిన ప్రశ్నల ద్వారా స్పష్టం అయింది. డి‌డి‌సి‌ఏ లో ఉంటూ కేజ్రీవాల్ కు సమాచారం ఇస్తున్న, ఇచ్చిన అధికారులు ఎవరో చెప్పాలని సి.బి.ఐ అధికారులు అడిగారని కేజ్రీవాల్ వెల్లడించారు. రాజేంద్ర కుమార్ పై చేసిన విచారణలో ఏ అవినీతి వెల్లడి అయిందో సి.బి.ఐ ఇంతవరకు చెప్పింది లేదు. ‘ప్రశ్నలు వేసి ఏ అవినీతిని వెల్లడి చేయగలిగారో చెప్పాలని’ కేజ్రీవాల్ పదే పదే కోరినా సమాధానం లేదు.

చెప్పినట్లుగానే డి‌డి‌సి‌ఏ అవినీతిపై విచారణకు ఢిల్లీ ప్రభుత్వం కమిషన్ ను నియమించింది. ఏక సభ్య కమిషన్ సభ్యుడుగా మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం అంగీకరించి పని కూడా మొదలు పెట్టారు. తన విచారణ శ్రద్ధగా సాగడానికి సమర్ధవంతమైన పోలీసు అధికారులను సూచించాలని ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కోరారు కూడా. అయితే అనుకున్నట్లే ఆయన అలాంటి సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.

విచారణ పారదర్శకంగా జరగడం కోసం విచారణ కార్యకలాపాలను టి.వి చానెల్ లో లైవ్ గా ప్రసారం చేయాలని గోపాల్ సుబ్రమణ్యం గట్టిగా కోరుతున్నారు.

ఈ నేపధ్యంలో ‘ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిషన్ చెల్లదు’ అంటూ కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు వర్తమానం పంపింది. కమిషన్ వేసిన వెంటనే ఈ అంశంపై సలహా ఇవ్వాలని కోరుతూ నజీబ్ గవర్నర్ కేంద్రానికి రాసిన లేఖకు స్పందనగా ఈ వర్తమానం వచ్చింది.

పైకి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాసినట్లు కనపడినప్పటికీ లేఖ రాయాలన్న ఆదేశాల మేరకే ఆయన ఆ లేఖ రాశారన్నది నిర్వివాదాంశం. ఎఎపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండీ అడుగడుగునా అడ్డు వస్తున్న జంగ్ సొంతగా ఆ పని చేయలేరు. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించడమే ఆయన విధి.

ఆ విధంగా ‘ఢిల్లీ ప్రభుత్వం డి‌డి‌సి‌ఏ అవినీతి కుంభకోణంపై వేసిన విచారణ కమిషన్ చెల్లదు’ అని బి.జె.పి ప్రభుత్వం తేల్చేసింది. అందుకు కేంద్రం చూపిన కారణం ‘ఢిల్లీ పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు కనుక’ అని. ఢిల్లీ ఇంకా కేంద్రం ఆధీనంలో ఉండే ‘సగం రాష్ట్రం’ కనుక కమిషన్ నియమించే అధికారం దానికి లేదు అని కేంద్రం వాదన.

అదే నిజమైతే శుభ్రంగా కేంద్రమే విచారణ కమిషన్ వేయవచ్చు కదా. అవినీతికి పాల్పడనప్పుడు విచారణకు భయమెందుకు? సరిగ్గా ఇదే ప్రశ్నను ఇటీవలే అరుణ్ జైట్లీ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ లకు వేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. గాంధీలకు ఒక నీతి, జైట్లీకి ఒక నీతి ఉండదు కదా!

బి.జె.పి పార్టీ ఎం.పి యే ‘అవినీతి జరిగింది మహా ప్రభో’ అని చెవినిల్లు కట్టుకుని పోరుతుంటే ‘అవినీతి వ్యతిరేక మోడి’ ఆయన మొరను ఆలకించడానికి బదులు ఏకంగా పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసేశారు. శాశ్వతంగా ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు కూడా ఇచ్చారు. అనగా అవినీతి వ్యతిరేకతను బి.జె.పి సహించదనేగా అర్ధం? ఇక కాంగ్రెస్ కీ, బి.జె.పి కీ ఉన్న తేడా ఏమిటిట?

అరుణ్ జైట్లీ, ఆయన వెనుక ఉన్న బి.జె.పి ప్రభుత్వం ఇప్పుడు అవినీతిపై విచారణ సాగకుండా ఉండడానికి ఢిల్లీ రాష్ట్ర పాలనా నియమాలను అరువు తెచ్చుకుంటున్నారు. ఒకటే ప్రశ్న! ఢిల్లీ ప్రభుత్వానికి ఆ అధికారం లేకపోతే ఆ కమిషన్ ఏదో మీరే ఎందుకు వేయరు, కేంద్రం గారూ?

“మా పార్టీ నేతలు ఎవరన్నా ఒక్క కుంభకోణానికైనా పాల్పడ్డారా? ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చాయా? మా మంత్రుల పిల్లలు, బంధువులు అవినీతికి పాల్పడినట్లు ఒక్క ఆరోపణన్నా వచ్చిందా?” అని మొదటి వార్షిక దినాన ప్రధాని మోడి ప్రశ్నించారు.

ఇప్పుడు వచ్చింది. మరి విచారణ చేయకపోగా జరుగుతున్న విచారణను ఎందుకు అడ్డుకుంటున్నట్లు నరేంద్ర మోడి గారూ?

ఏ‌ఏ‌పి ప్రభుత్వం తన అవినీతి వ్యతిరేక వాగ్దానాలను తు.చ తప్పకుండా నిలబెట్టుకుంటోంది. ఆరోపణలు వచ్చిన మంత్రులను పదవుల నుండి తప్పించి విచారణ చేయిస్తోంది. ఆ పని అవినీతి వ్యతిరేక బి.జె.పి ఎందుకు చేయదు?

“కమిషన్ విచారణ కొనసాగి తీరుతుంది. విచారణ ఆగే ప్రశ్నే లేదు. మీకేమన్నా ఇబ్బంది ఉంటే కోర్టుకు వెళ్ళండి. కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప విచారణ ఆగదు” అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు సవాలు విసిరారు.

ఈ దెబ్బతో బి.జె.పి అవినీతి వ్యతిరేక పస ఎంతో తేలుతుందని ఆశించవచ్చేమో! ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టుల పస కూడా తేలవచ్చు గాక!

One thought on “జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం

  1. 1.Pavalaki artharupayaki vote hakkuni(tama swechani swatantranni) ammesukune prajanikaniki sarvajanika votu hakku enthavaraku samanjasam?
    2.Anagarina venukabadina badugu balahina vargala prajala agnanam to vyaparam chestunna unnata vargla telivitetalu nyayama?
    3.Pillavadiki swecha kevalam vadiki swantha nirnayam teeskune pariniti vchinapude kada sahetukam.OKa pilavdiki swecha undi kani parniti ledu vadi samrakshakulu ga undalsina valle vadiki sarva avalakshanlu nerrpi tama swantha unnatiki (simple ga docheskodam) vadeyadam, ee dopidi swamyanni apalema?
    4.Samajam kosam tyagal chese oka taram kavali, thoti janula hitam kosam patu pade prajanikam lenapudu, kevalam evadi swantha prayojanal kosam vadu matrame alochnchkune caitalistic attitude lo nijamina swecha swatantralu ravalante mundu janal gnanavanthulu kavali, vallaki sarva avalakshanalu (liquor,illegal betting) prabhutvame nerputu, idi vishavalayam deenni chedhinchalema?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s