పఠాన్ కోట్ దాడి: మెచ్చుకున్నోళ్లు ఒక్కరూ లేరు!


Photo: New Indian Express

Photo: New Indian Express

పఠాన్ కోట్ దాడి పట్ల కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు స్పందించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత స్ధాయి శిక్షణ పొందిన ఏడుగురు  భద్రతా సిబ్బందిని పోగొట్టుకుని కూడా నాలుగు రోజుల పాటు ఆపరేషన్ కొనసాగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఉగ్రవాదుల దాడి మొదలుకుని భద్రతా బలగాలను తరలించిన తీరు, ఆపరేషన్ కొనసాగుతుండగా మంత్రులు, నేతలు చేసిన ప్రకటనలు, ఏం జరుగుతున్నదో సాక్షాత్తు హోమ్ మంత్రికి కూడా తెలియని అయోమయం, మరణాల సంఖ్య, ఉగ్రవాదుల సంఖ్య చెప్పడంలో ఎప్పటికప్పుడు మారుతూ పోయిన అంకెలు… ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతగానితనం బయటపెడుతున్నాయని పరిశీలకులు, విశ్లేషకులు విమర్శిస్తున్నాయి.

ఆపరేషన్ ముగిశాక ఎవరు సక్సెస్ అయ్యారు అని ప్రశ్నించుకుంటే ‘ఉగ్రవాదులే’ అన్న సమాధానం వేగంగా వచ్చేస్తోంది. కేవలం అరడజను మంది టెర్రరిస్టులను వారిది కాని నేలపై, వారికి తెలియని ఆనుపానుల మధ్య, నేరుగా సైనిక స్ధావరం పైనే దాడి జరిగినా కూడా దానిని తిప్పి కొట్టడానికి 4 రోజులు పట్టడం ఏమిటని ప్రశ్నించనివారు లేరు.

ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం సాధ్యమైనంత ఎక్కువ నష్టాన్ని కలగ జేయడం, తద్వారా భారతదేశ పరువు గంగలో కలిపేయడం. ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేస్తే, పైగా దాడి గురించి ముందస్తు సమాచారం ఉన్నా కూడా, అక్కడే ఉన్న ఆర్మీని వదిలి ఇతర బలగాల కోసం వెతుకులాడడం ఏమిటని పరిశీలకులే కాదు ఆర్మీ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నారు.

పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ వైమానిక స్ధావరంపై ఉగ్రవాదులు దాడి చేస్తే వారిని ఎదుర్కోవడానికి ఢిల్లీ నుండి విమానాల్లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) బలగాలను కేంద్ర ప్రభుత్వం పంపింది. ఆనక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలను దింపింది. పక్కనే ఉన్న సైనిక (ఆర్మీ) బలగాలకు తీరిగ్గా ఆదేశాలిచ్చారు. వాళ్ళు కాక పోలీసులు!

ఇన్ని బలగాలను నిర్వహించే సెంట్రల్ కమాండ్ ను అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలన్న ఆలోచనే కేంద్రం పెద్దలకు రాకపోవడంతో ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరించి తలా ఒక మాటతో పత్రికలను, తద్వారా ప్రజలను అయోమయంలోకి నెట్టేశారు. ఇదమిద్ధమైన వ్యూహం, ఆలోచన లేకుండా ఇన్ని బలగాలను ఒకే ఆపరేషన్ లో దించితే వారిని కమాండ్ చేసే ఒకే ఆధారిటీ ఎవరు? అని ఆర్మీ అధికారులే ప్రశ్నించడం విశేషం.

అసలు ఇలాంటి ఆపరేషన్ కు ఎన్‌ఎస్‌జి బలగాలను దింపడమే తప్పు అని ఆర్మీ అధికారులు నిర్మొహమాటంగా చెబుతున్నారు. పఠాన్ కోట్ దాడి జరిగిన చాలా సమయం వరకు పక్కనే ఉన్న ఆర్మీకి ఎలాంటి ఆదేశాలు అందలేదు. వెలకొద్దీ సైన్యం ఉంచుకుని ఎక్కడినుండో సంబంధం లేని బలగాలను దింపి విలువైన సమయాన్ని వృధా చేశారని ఆర్మీ అధికారులు కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

అది గరుడ్, డి‌ఎస్‌సి కమాండోల పని కాదు

“వాళ్ళు చేసిందాన్ని మాలో ఎవరం నమ్మలేకున్నాము. అక్కడికి దగ్గర్లోనే రెండు ఇన్ఫాంట్రీ డివిజన్లు, మరో రెండు ఆర్మర్డ్ బ్రిగేడ్ల రూపంలో మేము ఉన్నాము. ఒకటి రెండు గంటల దూరంలో కనీసం మూడు కార్ప్స్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయి. నార్త్రన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా దగ్గరలోనే ఉంది. ఈ బలగాలన్నీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లను నిర్వహించడంలో శిక్షణ పొంది ఉన్నవారే. వారికి బదులు కొన్ని డజన్ల మంది ఎన్‌ఎస్‌జి కమాండోలను పంపి సమయాన్ని వృధా చేశారు” అని పఠాన్ కోట్ దగ్గరలోని స్ధావరంలో బ్రిగేడియర్ స్ధాయి అధికారి ఒకరు ది హిందు తో మాట్లాడుతూ అన్నారు.

“ఒక నిర్దిష్ట టార్గెట్ ఉన్నప్పుడే ఎన్‌ఎస్‌జి ని దించుతారు. ఒక విస్తార ప్రాంతంలో టార్గెట్ విస్తరించి ఉన్నప్పుడు దానితో వ్యవహరించడం ఎన్‌ఎస్‌జి కి చేతకాదు. పఠాన్ కోట్ వైమానిక స్ధావరం లాంటి చోట్ల మొదట వలయాకార భద్రత చేపట్టాలి. ఆ తర్వాత టెర్రరిస్టులను వేటాడే కూంబింగ్ ఆపరేషన్ ను ప్రారంభించాలి” అని ప్రత్యేక బలగాల ఆపరేషన్ లలో నిపుణుడైన లెఫ్టినెంట్-జనరల్ (రిటైర్డ్) ప్రకాష్ కటోచ్ వివరించారు.

“ఎన్‌ఎస్‌జి ని దింపడం వల్ల నష్టం లేదు. కానీ అలాంటప్పుడు స్పష్టమైన ఉమ్మడి కమాండ్ అండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలి. బి‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జి, సైన్యం… ఇలా అందరినీ దూసి ఈ రకంగా తోలడం సరైంది కాదు. అసలు అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ ఉందా, లేదా?” అని ప్రకాష్ కటోచ్ అనుమానం వ్యక్తం చేశారు.

ఆర్మీ మాజీ చీఫ్ వి.పి.మాలిక్ ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. “ఎన్‌ఎస్‌జి (ఇలాంటి బాధ్యతలకు) సరైనదో కాదో నాకు అనుమానం. వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారు. ఇక్కడి ప్రాంతాన్ని బాగా ఎరిగి ఉన్న స్ధానిక ఏజన్సీకి (ఆర్మీ బలగాలకు) బాధ్యత ఇచ్చి ఉండాల్సింది” అని ఆయన అన్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలి హెచ్ మేజర్ కూడా ఇలానే అభిప్రాయం వ్యక్తం చేశారు. “ప్రత్యేకమైన ఎయిర్ ఫోర్స్ కర్తవ్యాల కోసం, భిన్నమైన మ్యాండేట్ ల కోసం గరుడ్ బలగాలను తయారు చేశారు తప్ప టెర్రరిస్టు వ్యతిరేక ఆపరేషన్ ల కోసం కాదు. డి‌ఎస్‌సి బలగాలు ప్రాధమికంగా (రిటైర్ ఐన వారికి) పునరుపాధి కల్పించబడ్డవాళ్ళు మాత్రమే” అని ఆయన చెప్పారు.

రక్షణ శాఖకు చెందిన వివిధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, కార్యాలయాలు తదితరాల చోట్ల భద్రతా ఏర్పాట్లు చూసేందుకు గాను రిటైర్ అయిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వ్యక్తులను తిరిగి తీసుకుని శిక్షణ ఇచ్చిన వారే డి‌ఎస్‌సి (డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్) బలగాలు. వారు పఠాన్ కోట్ టెర్రరిస్టు దాడిని తిప్పికొట్టేందుకు తగరు అని ఈ అధికారుల అభిప్రాయం. గరుడ్ కమాండో ఫోర్స్ కర్తవ్యాల్లో టెర్రరిస్టు దాడులను ఎదుర్కోవడం కూడా ఒకటి అయినప్పటికీ పరిమిత లక్ష్య ఛేదనకే తప్ప పఠాన్ కోట్ లాంటి విస్తార ప్రాంతంలో దాడికి తగరని ఫాలి మేజర్ మాటల ద్వారా అర్ధం అవుతోంది.

“ఇలాంటి ఆపరేషన్ ల కోసం మేము అన్ని వేళల్లో ప్రాక్టీస్ చేస్తుంటాం. మాకు బదులుగా రాత్రి పూట ఎన్‌ఎస్‌జి కమాండోలను పంపించారు. 24 చదరపు కి.మీటర్ల విస్తార ప్రాంతంలోని బేస్ ను 160 కమాండోల దళం కాపాడగలదని ఎలా భావించారు?” అని బాధ్యతల్లో ఉన్న అధికారి ఒకరు వ్యాఖ్యానించారని ది హిందు తెలిపింది. రెండు గంటల దూరంలో తమ ప్రత్యేక బలగాల యూనిట్లు ఉన్నాయని ఉధంపూర్ లో ఒక యూనిట్ ఉన్నా వారి సేవలు తీసుకోలేదని ఆయన ఆక్షేపించాడు.

“అది ఎన్‌ఎస్‌జి గానీ లేదా గరుడ్స్ గానీ చేయగల పని కాదు. అది ఇన్ఫాంట్రీ బలగాలు చేయాల్సిన పని. స్ధానిక ఆర్మీ యూనిట్ క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు వైమానిక స్ధావరం మొత్తం రెక్కీ నిర్వహిస్తుంది. కానీ తీరా అవసరం వచ్చాక వారిని అసలు లోపలికే రానివ్వలేదు” అని ఒక సీనియర్ ఆర్మీ అధికారి చెప్పడం విశేషం. ఇంకా అనేకమంది భద్రతా బలగాల అధికారులు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తూ పఠాన్ కోట్ దాడికి స్పందించిన తీరును దుయ్యబట్టారు.

పరికర్ సమర్ధన

అయితే రక్షణ మంత్రి మనోహర పరికర్ కేంద్ర ప్రభుత్వ స్పందనను గట్టిగా సమర్ధించారు. తాము సరైన వ్యూహాన్నే అనుసరించామని ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో బలగాలు విజయవంతం అయ్యాయని కీర్తించారు. స్ధావరం లోపల 3 వేల మందికి పైగా పౌరులు ఉన్నారని, అటువంటి చోట్ల ఆర్మీని ప్రవేశపెట్టడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల ఆర్మీ సేవలను వినియోగించుకోవడంలో విఫలం అయ్యామనడం సరికాదని చెప్పారు.

“ఆర్మీ పౌర విధులను నిర్వహించడం సాధ్యం కాదు. రోడ్లను కాపలా కాయడం ఆర్మీ పని కాదు. స్ధావరంలో పౌరులు కూడా నివసిస్తున్నారు. అందువల్లనే ఎన్‌ఎస్‌జి నైపుణ్యం అవసరమైంది” అని పరికర్ వివరించారు. అయితే విమర్శకులు చెబుతున్నది ఆర్మీ పౌర విధులను నిర్వహించాలని కాదన్నది స్పష్టమే. విస్తారమైన ప్రాంతంలో టెర్రరిస్టులపై ప్రతిదాడికి గరుడ్, డి‌ఎస్‌సి లకు బదులు ఇన్ఫాంట్రీ ఆర్మీని దించాలనే వారి అభిప్రాయం. ఎవరి కోణంలో వారు చెప్పుకుంటూ పోవడం తప్ప పారదర్శకమైన ఆత్మ విమర్శ – సమీక్ష ను పాలకులనుండి ఆశించలేమా?

“కొన్ని తప్పులు జరిగింది నిజమే” అన్న ఒక్క మాట మాత్రం రక్షణ మంత్రి అనగలిగారు.

బి.జె.పి సీనియర్ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందన పట్ల అసంతృప్తిగా ఉన్నారని అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి. మొత్తం ఆపరేషన్ నిర్వహణపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సంతృప్తి ప్రకటించడాన్ని బి.జె.పి నేతలు కొందరు తప్పు పట్టారు.

“ఉగ్రవాద దాడుల గురించి మనకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ ఆరుగురు తీవ్రవాదులను నాలుగు రోజుల గడిచినా కట్టడి చేయలేకపోయినా సంతృప్తి ఎలా ప్రకటిస్తారు?” అని బి.జె.పి సీనియర్ నాయకుడు ప్రశ్నించారని తెలుస్తోంది.

“ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం, వివిధ సంఘ్ సంస్ధల నేతలు 20 నుండి 25 మంది వరకు జలగావ్ లో సమావేశం అవనున్నాము. అక్కడ ఈ విషయం చర్చిస్తాము. ఇప్పటివరకు ఉన్న పరిస్ధితిని బట్టి చూస్తే ప్రభుత్వానికి భిన్నమైన అభిప్రాయం పార్టీకి ఉండజాలదు. కానీ ఈ (పఠాన్ కోట్) తరహా నిర్వహణ మళ్ళీ జరగాలని మాత్రం కోరుకోవడం లేదు” అని బి.జె.పి నేత అన్నారని ది హిందు తెలిపింది.

మళ్ళీ జరగకూడదని కోరుకునే తరహాలో కేంద్ర ప్రభుత్వం పఠాన్ కోట్ దాడిని ఎదుర్కొందని బి.జె.పి నేత చెప్పకనే చెప్పారు. కాకపోతే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పార్టీయే ప్రభుత్వానికి భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పకూడదు కనుక ఆయన నోరు కట్టేసుకున్నారు. నోరు కట్టేసుకుని కూడా చెప్పదలుచుకున్నది చెప్పేశారు.

బాధ్యత మోడీదే -ఒమర్

జమ్ము & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్‌డి‌టి‌వి వెబ్ సైట్ లో ఒక రైటప్ రాస్తూ మోడి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఒకవైపు పఠాన్ కోట్ దాడిని ఎదుర్కొంటూ దేశం మొత్తం ఉగ్గబట్టుకుని చూస్తుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి యోగాసనాల వల్ల ప్రయోజనాల గురించి ప్రసంగాలు చేయడం ఏమిటని ఆయన నిలదీశారు. 

పఠాన్ కోట్ వైఫల్యానికి బాధ్యత తీసుకోకుండా మోడీ తప్పించుకోజాలరని స్పష్టం చేశారు. ఉన్న ఫళాన పాక్ లో దిగి ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలుసుకుని చర్చల వాతావరణం ఏర్పాటుకు దోహదం చేసిన క్రెడిట్ మోడీ తీసుకున్నారని అలాగే పఠాన్ కోట్ వైఫల్యానికి కూడా బాధ్యత తీసుకోవాలన్నారు.

తన రైటప్ లో ఒమర్ ఎత్తిచూపిన కొన్ని అంశాలు ఎంచదగినవి:

“వారు ప్రతిపక్షంలో ఉండగా ఇలాంటి పరిస్ధుతులే ఎదురైనప్పుడు వారు రాజకీయాలు చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. ఇప్పుడే అదే వారికి ఎదురైతే మాత్రం తొండి అని అరిచి గోల చేస్తున్నారు. ‘ఒక భారతీయ తలకు పది పాకిస్తానీ తలలు’ అన్న వారి హుంకారాలు ఎలా మరువగలం? సరిహద్దుకి అవతలి నుండి దాడి జరిగినప్పుడల్లా పాకిస్తాన్ ను నిర్మూలించనందుకు ‘బలహీన ప్రధాని’ అంటూ డా. మన్మోహన్ సింగ్ ను పరిహసించడం ఎలా మాసిపోతుంది?

“వాళ్ళు సగర్వంగా మళ్ళీ మళ్ళీ చెప్పుకునే ‘ఉగ్రవాదం చర్చలు భుజం భుజం కలిపి నడవలేవు’ అన్న సూత్రావళి ఎక్కడికి పోయినట్లు? ప్రధాని మోడి, విదేశీ మంత్రి స్వరాజ్ లు ఆ రోజుల్లో విడుదల చేసిన ట్వీట్ లను జనం తవ్వి తీసి ‘అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా ఏమిటి?’ అని తప్పకుండా నిలదీస్తారు.

“ఆ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ వైమానిక స్ధావరంలోకి వాళ్ళు ఎలా ప్రవేశించగలిగారు? ఎన్‌ఎస్‌జి, ఆర్మీ యూనిట్లను స్ధావరం వద్దకు తరలిస్తే వెటరన్ బలగాలైన డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ (డి‌ఎస్‌సి) మొదటగా ఎందుకు స్పందించాల్సి వచ్చింది? చూడబోతే మిలిటెంట్ లను స్ధావరంలోకి వెళ్లకముందే ఎదుర్కోని నిలువరించడానికి బదులు వారిని లోపలికి వెళ్లనిచ్చి ఎదుర్కోవాలని మనవాళ్లు భావించినట్లు కనిపిస్తోంది.

“కేంద్ర హోమ్ మంత్రికి సమాచారం ఇస్తున్నది ఎవరు? ఆపరేషన్ ముగియక ముందే ముగిసిందని ఆయన ఎలా చెబుతారు? ఆపరేషన్ ముగిసిందని హోమ్ మంత్రి చెప్పాక కూడా 2 రోజుల పాటు కొనసాగడం ఏమిటి? ప్రభుత్వ మీడియా స్పందనను ఎవరు నిర్దేశిస్తున్నారు. భద్రతా బలగాలు తక్కువమంది చనిపోయారని నచ్చజెప్పడం లోనే ప్రభుత్వం తంటాలు పడింది. ఇలాంటి సందర్భాల్లో యోగా వల్ల లాభాల గురించి ప్రసంగాలు ఇవ్వమని ప్రధానికి సలహాలు ఇచ్చింది ఎవరు?”

ఒమర్ ప్రశ్నలు ఆయనవి మాత్రమే కాదు. దాడి వార్తలను కాస్త దగ్గరిగా పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికీ వచ్చిన అనుమానాలే ఇవి.

కాంగ్రెస్ నాయకుల నుండి వచ్చిన స్పందన నిజానికి చాలా చాలా తక్కువ. ప్రతిపక్షంలో ఉన్నది మరొకరైతే ప్రధాని మోడి ప్రతిపక్షంలో ఉండగా చేసిన వ్యాఖ్యలన్నీ ఏకరువు పెట్టకుండా ఊరుకోరు. కానీ ఏవో ఒకటీ అరా తప్ప కాంగ్రెస్ నుండి పెద్దగా విమర్శలు లేవనే చెప్పాలి. కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షం ఉన్నందుకు ప్రభుత్వ పక్షం సంతోషిస్తూ ఉండాలి.

జరుగుతున్నది టెర్రరిస్టు దాడి కనుక దేశం అంతా ఒకే మాటపై నడవాలి అన్న అవగాహనను కొందరు కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేశారు. కానీ అదే తరహా అవగాహన ప్రతిపక్షంలో ఉండగా బి.జె.పి కి ఎందుకు లేదు అని ప్రజలు ప్రశ్నించాలి.

అందుకే పఠాన్ కోట్ దాడి పట్ల ప్రభుత్వ స్పందనను మెచ్చుకున్నవారు ఒక్కరూ లేరు!

One thought on “పఠాన్ కోట్ దాడి: మెచ్చుకున్నోళ్లు ఒక్కరూ లేరు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s