ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం.
Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది.
ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం ఫేస్ బుక్ కంపెనీ రు 100 కోట్ల రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతోంది. హోర్డింగ్ లు, వీడియో అడ్వర్టైజ్ మెంట్లు తదితర సాధనాలతో ప్రచారం చేస్తోంది.
ఫ్రీ బేసిక్స్ ను ఇండియాలో ప్రవేశపెట్టకుండా టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాత్కాలిక నిషేధం విధించింది. ఈ అంశంపై కన్సల్టేషన్ పేపర్ విడుదల చేస్తూ ఆ పేపర్ పై చర్చ పూర్తయి ఒక నిర్ణయానికి వచ్చేవరకూ ఫ్రీ బేసిక్స్ ఇండియాలో (ఇంటర్నెట్ ద్వారా) అడుగు పెట్టకూడదని ఆదేశించింది.
కానీ ట్రాయ్ ఆదేశాలు ఫేస్ బుక్ లెక్క చేయడం లేదు. యధేచ్ఛగా తన వేదిక గురించి ప్రచారం చేస్తోంది. ఆయన ఇండియా వస్తే మన నేతలు ఉరుకులు పరుగులు పెడుతూ ఆయన ఆశీర్వాదం కోసం పాకులాడుతున్నారు గానీ ఫ్రీ బేసిక్స్ పేరుతో ఆయన గారు తలపెట్టిన ‘అంతర్జాతీయ మోసం’ గురించి జనానికి చెప్పాలన్న బుద్ధి లేకపోయింది.
ఫ్రీ బేసిక్స్ ద్వారా విద్యా సౌకర్యం ఉచితంగా అందిస్తాడట మార్క్ జూకర్ బర్గ్! ఎలా? పాఠశాలకు వెళ్ళి పంతులు గారి దగ్గర అక్షరాభ్యాసం చెయ్యకుండా, పాఠాలు విని పుస్తకాలు చదవకుండా ఫ్రీ బేసిక్స్ లో చేరిపోతే అంతా వచ్చేస్తుందా? వచ్చేస్తుందన్న మాయాజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు మార్క్ జుకర్ బర్గ్!
డాక్టర్ గారు నాడి పట్టి చూసి, తగిన పరీక్షలు చేయకుండా పేద ప్రజలకు వైద్యం చేసేసేస్తాడట మన ముఖ పుస్తకాధీశుడు! ఎలా? “ఫ్రీ బేసిక్స్ వేదికలో చేరితే చాలు నమ్మండి” ఈ యాక్సిడెంటల్ బిలియనీర్!
ఫ్రీ బేసిక్స్ అంటే మౌలిక (బేసిక్) సౌకర్యాలను ఉచితంగా అందించడం అని విడమరిచి చెబుతోంది ఫేస్ బుక్ ఇంక్!
ఇది ఒట్టి అబద్ధం. రొంబ మోసం! 1.2 బిలియన్ల భారత ప్రజల సమస్త వివరాలను (డేటా) సేకరించి నిలవ చేసుకుని, అమ్ముకుని సొమ్ము చేసుకునే ఘరానా మోసపూరిత ఎత్తుగడే ఫ్రీ బేసిక్స్!
ఈ పనిని ఫ్రీ బేసిక్స్ తో పాటు గూగుల్ (యాండ్రాయిడ్ తో సహా), మైక్రోసాఫ్ట్, యాహూ, యాపిల్ తదితర లక్షల కోట్ల రూపాయల కంపెనీలు ఇప్పటికే చాటుగా చేస్తున్నాయి. చెప్పకుండా చేస్తున్నాయి. ఉచిత సర్వీసుల మాటున చేస్తున్నాయి. ఇంటర్నెట్ గురించిన సరైన అవగాహన విద్యావంతుల్లో కూడా కొరవడడడంతో ఈ ఘరానా బందిపోటు కంపెనీలు యధేచ్ఛగా ప్రజల సమాచారాన్ని దొంగిలించి నిలవ చేస్తున్నాయి.
సమాచార యుగంలో ‘సమాచారం’ నూతన కరెన్సీగా అవతరించింది. కరెన్సీ ఎంత ఎక్కువ అంటే అంత ధనవంతుడు. సమాచారం అనే కరెన్సీ ఎంత ఎక్కువ సేకరించి పెట్టుకుంటే అంత డబ్బు ముందుగానే రిజర్వ్ చేసిపెట్టుకున్నట్లే.
పక్కనే కొత్తగా బైపాస్ రోడ్డు పడితే ఎందుకూ పనికిరాని భూములు కూడా సరికొత్త విలువను సంపాదించుకుంటాయి. మొన్నటివరకూ లక్షల్లో ఉన్న తుళ్ళూరు భూములు ఇప్పుడు పదుల కోట్లలోకి వెళ్లిపోయింది. త్వరలో వందల, వేల కోట్లలోకి వెళ్లిపోతుంది.
ఇప్పుడు ఎందుకూ పనికిరాదనుకున్న బేసిక్ డేటా కూడా రానున్న రోజుల్లో అత్యంత విలువైన సమాచారంగా అవతరిస్తుంది. ప్రజల డేటా (వారి పేర్లు, అడ్రస్ లు, లొకేషన్ లు, ఫోన్ నంబర్లు -మీవి, మీ కుటుంబ సభ్యులవి, మీ మిత్రులవి కూడా- కొనుగోలు అలవాట్లు, వ్యాపకాలు, చదివే అలవాట్లు, సినిమా రుచులు, వంటకాల రుచులు… ఇలా సమస్తం) ను ఎంత ఎక్కువ సేకరించి పెట్టుకుంటే ఇంటర్నెట్ కంపెనీలకు అంత ఎక్కువ ప్రకటనల ఆదాయం వస్తుంది. అదే సమయంలో ప్రజల వ్యక్తిగత ఏకాంతం హరించుకుపోతుంది. మన ఏకాంతం కాస్తా బహిరంగం అయి కూర్చుంటుంది.
కావాలంటే ఫేస్ బుక్ ఏమంటోందో చూడండి!
Free Basics makes the internet accessible to more people by providing them access to a range of free basic services like news, maternal health, travel, local jobs, sports, communication, and local government information.
To date, we’ve been able to offer these services to a billion people across Asia, Africa and Latin America. By introducing people to the benefits of the internet through these services, we hope to bring more people online and help improve their lives.
ఫ్రీ బేసిక్స్ వల్ల ఒనగూరే మరో వైపరీత్యం ‘నెట్ న్యూట్రాలిటీ’ ఆవిరైపోవడం. ప్రజల ఆర్ధిక స్తోమతతో పని లేకుండా దాదాపు ఇంటర్నెట్ సమాచారం మొత్తం ఇప్పుడు ఉచితంగా అందుబాటులో ఉంటున్నది. ఫ్రీ బేసిక్ వేదికలో వివిధ ఇంటర్నెట్ వెబ్ సైట్లు, డవలపర్లు, ఫ్లిప్ కార్ట్ లాంటి అనేకానేక కమర్షియల్ కంపెనీలు చేరాలని ఫేస్ బుక్ ఆకర్షిస్తున్నందున ఇక ముందు ప్రజలందరికీ సమాన సేవలు దూరం అవడం ఖాయం.
ఉదాహరణకి ఫేస్ బుక్ నే తీసుకోండి. ఫ్రీ బేసిక్ వేదికలో అందుబాటులో ఉన్న ఫేస్ బుక్ వర్షన్ పూర్తి స్ధాయి ఫేస్ బుక్ సేవలను ఇవ్వదు. పరిమిత సేవలను మాత్రమే ఇస్తుంది. దానికి బైట ఉన్నవారికి ధర నిర్ణయించి సేవలను అందివ్వబోతున్నారు. అనగా ఫ్రీ బేసిక్ పేరుతో ఉచిత సేవలను బాగా పరిమితం చేసి, విస్తృత సేవలకు ధర నిర్ణయించబోతున్నాడు మార్క్ జుకర్ బర్గ్.
ఫేస్ బుక్ కొనుగోలు చేసిన వాట్సప్ ఇప్పటికే ‘త్వరలో డబ్బు కట్టాలి’ అని నోటీసులు ఇస్తోంది. ఫేస్ బుక్ కూడా త్వరలో అలాగే తయారవుతుంది. ఉచిత సేవల మాటున డేటా దొంగిలిస్తూ కూడా సేవలను పరిమితం చేసే కుటిల ఎత్తుగడ ఫేస్ బుక్ కంపెనీ అమలు చేస్తుంది.
అసలు ఫేస్ బుక్ లేకపోతే ఏమిటి? అన్న ప్రశ్న వేసుకుని దాని నుండి ఎంత త్వరగా బైటపడితే అంత మంచిది. ముఖ్యంగా విచ్చలవిడిగా, విచక్షణ లేకుండా సొంత ఫోటోలు, అలవాట్లు, బంధు సంబంధాలు అన్నింటినీ ఫేస్ బుక్ మీదికి ఎక్కించడం మానుకోవాలి.
మీ సమాచారం రహస్యంగా ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ ఆ సమాచారం బహిరంగం చేసి సొమ్ము చేసుకోవడమే గూగుల్, ఫేస్ బుక్… తదితర కంపెనీలు సాగిస్తున్న బృహత్ సేవ!
‘అంతేగా’ అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ‘అమ్మో, ఇంత ఘోరమా!’ అని కళ్ళు తెరిచిన రోజున మనం అప్పటికే ఫేస్ బుక్ గుప్పెట్లో ఉండిపోతాం. అప్పుడిక బైటపడినా వృధా!
తస్మాత్ జాగ్రత్త!
(మరిన్ని వివరాలు మరో ఆర్టికల్ లో)
nice article