భారత్-పాక్ చర్చలకు అనుకోనివైపు నుండి మద్దతు లభించింది. బ్రిక్స్ కూటమిలో ప్రధాన దేశమైన చైనా పఠాన్ కోట్ దాడిపై స్పందించింది. పఠాన్ కోట్ లోని భారత సైనిక వైమానిక స్ధావరంపై జరిగిన ఉగ్రవాద దాడి పొరుగు దేశాల మధ్య జరగనున్న చర్చలను చెడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చైనా వ్యాఖ్యానించింది.
పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రవాద దాడిని చైనా ప్రభుత్వ ప్రతినిధి హువా చున్ యింగ్ ఖండించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న దశలో జరిగిన ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసినదే అని ఆమె స్పష్టం చేశారు. దాడి జరిగినప్పటికీ ఇరు దేశాలు ముందుగా అనుకున్న చర్చలు కొనసాగించాలని చైనా ప్రభుత్వం తరపున చున్ కోరారు.
“ఈ దాడిని మేము ఖండిస్తున్నాం… (భారత్-పాక్ సంబంధాల మెరుగు దిశగా) నెలకొల్పబడిన కదలికను భగ్నం చేసేందుకు ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగింది. అనేక మీడియా నివేదికలు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేశాయి” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
భారత్-పాక్ ల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని, ఈ వాతావరణాన్ని అందరూ ఆహ్వానించారని చెబుతూ చున్ యింగ్, దాడితో సంబంధం లేకుండా చర్చలు కొనసాగించగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
“దక్షిణాసియాలో ఇండియా, పాకిస్తాన్ లు ముఖ్యమైన దేశాలు. ప్రాంతీయంగా శాంతి, స్ధిరత్వం నెలకొనాలంటే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇలాంటి ఆటంకాలతో సంబంధం లేకుండా ఇండియా, పాకిస్తాన్ లు తమ సహకారాన్ని, చర్చలను కొనసాగించ గలవని చైనా ఆశిస్తోంది” అని చున్ యింగ్ ప్రకటించారు.
“భారత, పాక్ దేశాల నాయకుల మధ్య (ఇటీవల) జరిగిన సమావేశం అత్యంత విజయవంతం అయిందని మీడియా నివేదికలు అభివర్ణించాయి. ఈ సానుకూల వాతావరణాన్ని, కదలికను కొనసాగించడానికి ఇండియా, పాక్ లు కలిసి పని చేయాలని మేము భావిస్తున్నాము. మేము అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తాము. అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అన్ని పక్షాలు సహకారాన్ని, చర్చలను పెంపొందించాల్సి ఉంటుందని మేము నమ్ముతున్నాము” అని చున్ యింగ్ పేర్కొన్నారు.
పఠాన్ కోట్ దాడి పర్యవసానంగా భారత జాతీయ భద్రతా సలహాదారు చైనా సందర్శన వాయిదా పడిన నేపధ్యంలో చైనా విదేశాంగ మంత్రి స్పందన వెలువడింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జనవరి 5, 6 తేదీల్లో చైనా సందర్శించ వలసి ఉండగా పఠాన్ కోట్ దాడి వల్ల అది వాయిదా పడింది.
జాతీయ భద్రతా సలహాదారు పఠాన్ కోట్ దాడి వ్యవహారంలో తలమునకలై ఉండడంతో చైనా సందర్శన వాయిదా వేసుకోక తప్పలేదని భారత ప్రభుత్వాధికారులు చెప్పారు. ఆయన త్వరలోనే చైనా సందర్శిస్తారని వారు తెలిపారు.
చైనా-ఇండియా సరిహద్దు చర్చలకు సంబంధించి అజిత్ దోవల్ భారత దేశం తరపున ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు వివాదంతో పాటు, ఇతర సరిహద్దు అంశాలపై ఆయన చైనా ప్రతినిధి యాంగ్ జీయెచితో చర్చలు జరపవలసి ఉన్నది. జనవరి 6 తేదీన అజిత్ దోవల్ చైనా ప్రధాని లీ కేకియాంగ్ తో కూడా సమావేశం కావలసి ఉంది.
తన చైనా సందర్శన సందర్భంగా అజిత్ దోవల్ వివిధ ఇతర నేతలను కూడా కలవాల్సి ఉన్నది. వివిధ నేతలతో జరిగే సమావేశాల్లో ఆయన చైనా- ఇండియాల సంబంధాలపై “వ్యూహాత్మక చర్చలు” జరపవలసి ఉన్నదని చైనాలో ఇండియా రాయబారి అశోక్ కాంత చెప్పారు.
ఇదిలా ఉండగా పఠాన్ కోట్ దాడిలో ఉగ్రవాదులందరినీ అంతం చేసేశామని కేంద్ర హోమ్ మంత్రి చేసిన ప్రకటనను పరిహసిస్తూ ఆదివారం మధ్యాహ్నం కూడా వైమానిక స్ధావరంలో సైనికులపై కాల్పులు జరిగాయి. దానితో మరింత మంది టెర్రరిస్టులు స్ధావరంలో సజీవంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులు హడావుడిగా ప్రకటించారు.
అయితే ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు సజీవంగా ఉన్నదీ చెప్పడంలో అటు సైన్యాధికారులు, ఇటు ప్రభుత్వాధికారులు తడుముకుంటున్నారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉండవచ్చని సైన్యాధికారులు ఊహిస్తుండగా అంతకంటే ఎక్కువ ఉన్నారేమో చెప్పలేమని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి రాజీవ్ మెహృషి చెప్పారు.
“రెండు విభిన్నమైన చోట్ల నుండి కాల్పులు వస్తున్నాయి గనుక కనీసం ఇద్దరు టెర్రరిస్టులు ఇంకా లోపల ఉన్నారని మేము ఖచ్చితంగా చెప్పగలం. కానీ అంతకంటే ఎక్కువమంది ఉన్నారేమో తెలియదు. ఆపరేషన్ పూర్తయి శవాలను లెక్కించాక మాత్రమే టెర్రరిస్టుల సంఖ్య ఎంతో చెప్పగలం” అని ఆయన చెప్పడం విశేషం. ఆ మాత్రం చెప్పడానికి ముందే అంకెలు చెప్పనవసరం లేదు. ‘ఆపరేషన్ పూర్తయ్యాక పూర్తి వివరాలు చెబుతాం’ అని ఒక్క ముక్కలో చెబితే కాస్త గంభీరంగా అన్నా ఉండేది.
దాడులు జరిపింది జైష్-ఏ-మహమ్మద్ అయి ఉండవచ్చని భారత అధికారులు భావిస్తుండగా, ‘ దాడి చేసింది మేమే’ అంటూ ‘యునైటెడ్ జీహాద్ కౌన్సిల్’ (యూజేసి) ప్రకటించింది. ప్రతిదానికీ పాకిస్తాన్ ను ఆడిపోసుకోవడం మానుకోవాలని చూడబోతే భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ ఫోబియా పట్టుకున్నట్లు ఉందని యూజేసి ప్రతినిధి తన ప్రకటనలో పరిహసించాడు.
“పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై కాశ్మీరీ ముజాహిదీన్లు జరిపిన దాడి ఇండియాకు ఒక సందేశం అందిస్తోంది. ఎటువంటి భద్రత ఏర్పాటు చేసుకున్నా, ఎలాంటి సైనిక స్ధావరాలైనా అవేవీ మిలిటెంట్లకు సాటిరావు. పాకిస్తాన్ ను నిందించే బదులు ఇండియా గోడపై రాసిఉన్న దాన్ని (స్పష్టంగా కనపడుతున్న అంశాన్ని) చదువుకోవాలి. ఇక ఎంతమాత్రం సమయం వృధా చేయకుండా కాశ్మీర్ ప్రజలకు వారి భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలి” అని యూజేసి ప్రతినిధి ప్రకటన పేర్కొంది.
పఠాన్ కోట్ దాడికి పాక్ తో సంబంధం లేదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి మిలిటెంట్లు ఈ దాడి చేశారని చెప్పడమే యూజేసి ప్రతినిధి ఉద్దేశంలా కనిపిస్తోంది. అయితే భారత భద్రతా సంస్ధలు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ లోని తమ ఇంటికి ఫోన్ లో మాట్లాడుతుండగా విన్నదాన్ని బట్టి ఉగ్రవాదులు పాక్ నుండే వచ్చారని భారత భద్రతా సంస్ధలు భావిస్తున్నాయి. “తాను ఒక బృహత్కార్యాన్ని నిర్వర్తించే విషయమై ఇండియా వచ్చానని తనకోసం చూడొద్దని సదరు ఉగ్రవాది తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెబుతుండగా మన వాళ్ళు విన్నట్లుగా పత్రికలు తెలిపాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్తాన్ భూభాగంగా భారత్ పరిగణించదు కనుక పాక్ భూభాగం లోని ప్రాంతానికే ఫోన్ కాల్ వెల్లిందని భద్రతా సంస్ధలు చెబుతున్నందున కాశ్మీరేతర పాకిస్తాన్ నుండే ఉగ్రవాదులు వచ్చి ఉండవచ్చు. అయితే వారు పాక్ ప్రభుత్వంతో కాకుండా చర్చలు ఇష్టం లేని శక్తుల పనుపున వచ్చి ఉండవచ్చని భావించ వచ్చు. భారత అధికారులు, మంత్రుల ప్రకటనలు, చైనా ప్రకటన కూడా ఇదే అంశాన్ని సూచిస్తోంది.
పఠాన్ కోట్ దాడిని తిప్పి కొట్టడంలో భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యాయని పత్రికలు విమర్శిస్తున్నాయి. దాడి గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ఎయిర్ బేస్ వద్ద అప్రమత్తత ఎందుకు పాటించలేదని అవి ప్రశ్నిస్తున్నాయి. ఉగ్రవాదులు సైనికుల దుస్తులు ధరించి స్ధావరం వెనుక అటవీ ప్రాంతం గుండా వచ్చారని చెబుతున్నప్పటికీ దాడి ముగిసిందని చెప్పిన తర్వాత కూడా ఉగ్రవాదులు సజీవంగా ఎలా ఉన్నారని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి.
సమాచారం సేకరించడంలో, అందిన సమాచారాన్ని విశ్లేషించడంలో, దానికి తగినట్లుగా భద్రతా బలగాలను అప్రమత్తం కావించడంలో కేంద్రం విఫలం అయిందని అనేకమంది పరిశీలకులు సైతం విమర్శిస్తున్నారు. ఉగ్రవాదులు దాడికి ముందు ఒక పోలీసును, ఒక సైనికాధికారి వద్ద పని చేసే వ్యక్తిని కిడ్నాప్ చేశారని, వారిని విడుదల చేశాక తమను కిడ్నాప్ చేసింది ఉగ్రవాదులై ఉండవచ్చని చెప్పినప్పటికీ వారి మాటలను నమ్మకుండా తిరిగి వారినే టార్చర్ చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
చూడబోతే ఉగ్రవాదులు పఠాన్ కోట్ సైనిక స్ధావరంపై దాడి చేసేందుకే సైనిక స్ధావరం అధికారులు, ప్రభుత్వాధికారులు ఎదురు చూసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. అటవీ ప్రాంతం నుండి వచ్చారని చెబుతున్నప్పటికీ అందుకు సరిపోయే క్లూలను ఎవరూ చూపలేకపోతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొదట 5గురు ఉగ్రవాదులు చనిపోయారని చెప్పిన కేంద్రం తర్వాత దానిని 4 కు తగ్గించింది. మళ్ళీ సోమవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు ప్రకటించారు. అంతలోనే మరో ఇద్దరు ఉగ్రవాదులు రెండంతస్ధుల భవనంలో ఉన్నారని వారు అన్ని విధాలుగా సిద్ధమై వచ్చారని ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో పరిశీలకుల విశ్లేషణ సరైనదిగా కనిపిస్తోంది.
దాడి చేసింది మేమే’ అంటూ ‘యునైటెడ్ జీహాద్ కౌన్సిల్’ (యూజేసి) ప్రకటించింది.
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై కాశ్మీరీ ముజాహిదీన్లు జరిపిన దాడి ఇండియాకు ఒక సందేశం అందిస్తోంది.
ప్రతిదానికీ పాకిస్తాన్ ను ఆడిపోసుకోవడం మానుకోవాలని చూడబోతే భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ ఫోబియా పట్టుకున్నట్లు ఉందని యూజేసి ప్రతినిధి తన ప్రకటనలో పరిహసించాడు.
ఇటువంటి దేశభక్తి(కాశ్మీర్ భక్తి) ప్రేరేపిత దాడులు ఎక్కువగా ఇండియపైనే ఎక్కువగా జరుగుతుంటాయి,ఆ మాటకొస్తే పాక్ పై దాడులు జరిగినట్లు పెద్దగా చూసి ఉండం.ఎందుకు? వారిభక్తి కాశ్మిర్ కు స్వతంత్రం ప్రకటించాలనా? నాకైతే వేరే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి.వారి ప్రకటనలలో పాక్ పై సానుభూతి ప్రకటిస్తున్నట్లుగా గోచరిస్తుంది.బహుశా వీరిని ముందుపెట్టి వెనుక అతివాదశక్తులు ఆడిస్తున్నాయి కాబోలు!
ఇక ఎంతమాత్రం సమయం వృధా చేయకుండా కాశ్మీర్ ప్రజలకు వారి భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం ఇవ్వాలి” అని యూజేసి ప్రతినిధి ప్రకటన పేర్గొంది.
ఇంతసూటిగా వారినుండి పై ప్రకటనవచ్చిందంటే కాశ్మిర్ ను కేవలం ఇండియా మాత్రమే ఆక్రమించిందనా వారి ఉద్దేశం?
దాడి గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ఎయిర్ బేస్ వద్ద అప్రమత్తత ఎందుకు పాటించలేదని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి.
రోజుకు ఇటువంటి రిపొర్టులు ఎన్నివస్తుంటాయి? ఈ రిపొర్టులను ఆధారంగా చేసుకొని భద్రతను పాటించడంలో అవసరమైన నిఘాసిబ్బంది ఇక్కడ ఉన్నారా?
ఇటువంటిదాడులు జరిగినప్పుడల్లా పత్రికలలో,టి.వి లలో ఇటువంటి చర్చలే తరచుగా కనిపిస్తుంటాయి.